జోగినులు, బసివినులు.. ఆత్మన్యూనత భావం నుంచి ఆత్మగౌరవం దిశగా..
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఓ వ్యవస్థనే ప్రక్షాళనం చేస్తున్నాయి. తరతరాలుగా ఓ దురాచార చట్రంలో చిక్కుకుపోయిన మహిళామూర్తులకు విముక్తి కలిగించి.. వారికి సరికొత్త జీవన మార్గాన్ని చూపుతున్నాయి. ఊరి ఉమ్మడి ఆస్తిగా ఉన్న వారి అస్తిత్వం.. నేడు ప్రభుత్వ ఆర్థిక సహకారంతో ఆత్మాభిమానాన్ని ప్రోది చేసుకుంటోంది. ఆత్మన్యూనత భావం నుంచి ఆత్మగౌరవం దిశగా అడుగులేస్తున్నారు. ఆధార్, రేషన్‌కార్డులు అందుకున్నారు. వైఎస్సార్ ‘ఆసరా’తో నిలదొక్కుకుంటున్నారు. వారి బిడ్డలు అమ్మ ‘ఒడి’లో ఓనమాలు దిద్దుకుంటూ సరికొత్త సూర్యోదయం దిశగా సాగుతున్నారు.
సాక్షిప్రతినిధి అనంతపురం : ‘ఊళ్లో మీసమొచ్చిన ప్రతి మగాడికీ మా మీదే చూపు. మేమంటే ఊళ్లో మగాళ్లందరికీ ఉమ్మడి ఆస్తి అన్న భావన. మా ఇష్టాయిష్టాలతో పనిలేదు. వయసు తారతమ్యాలు అసలే లేవు. కాదు కూడదు అనడానికి వీల్లేదు. అదేమంటే.. మేము జోగినులం, బసివినులం. ఊరి మగాళ్లందరికీ సొంతమట.. అంటూ మొన్నటిదాకా తాము పడ్డ కష్టాలపై గుర్తు చేసుకుని ఆవేదన వ్యక్తం చేశారు.. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకర్గంలోని జోగినులు, బసివినులు. అయితే ఇప్పుడా పరిస్థితుల్లేవని చెబుతున్నారు. ప్రభుత్వ పథకాల పుణ్యమాని తమ కాళ్ల మీద తాము నిలబడుతూ, ఆత్మగౌరవంతో బతుకుతున్నామని చెబుతున్నారు. బసివిని, జోగిని వ్యవస్థ నుంచి పూర్తిగా బయటపడ్డామంటున్నారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో పాటు.. సామాజిక పింఛన్, ఆసరా, డ్వాక్రా వంటి పథకాలు తమ సామాజిక, ఆర్థిక స్థితిగతుల్ని పూర్తిగా మార్చేశాయని సగర్వంగా చెబుతున్నారు.
చదవండి: కోతకు గురైన నదీ గర్భం అభివృద్ధి.. క్షేత్రస్థాయిలో పరిశీలించాకే
పథకాల పంట:
సచివాలయం, వలంటీర్ వ్యవస్థల కారణంగా ప్రభుత్వ పథకాలు వారి ఇళ్ల ముంగిట్లోకే చేరుతున్నాయి. రాయదుర్గం నియోజకవర్గంలోని జోగినులు, బసివినులందరికీ ఆధార్, రేషన్కార్డులొచ్చాయి. బసివిని లోన్ కింద పలువురికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందింది. 391 మంది జోగినులకు, 151 మంది బసివినులకు ఇప్పటి వరకూ పక్కా గృహాలిచ్చారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో వీరు దాదాపుగా వ్యభిచారం వైపు వెళ్లడం లేదు. మిగతా మహిళల్లానే సమాజంలో హుందాగా బతకాలని కోరుకుంటున్నారు. బసివినులు, జోగినుల కుటుంబాల్లో 1,456 మంది చిన్నారులున్నారు. అయితే వారి పిల్లలను ఈ వ్యవస్థలోకి రానియ్యకుండా ఆపగలిగారు. పెళ్లిళ్లు కూడా చేస్తున్నారు.
చదవండి: సినీ దర్శకులను ఆకర్షిస్తున్న ఉప్పాడ బీచ్‌రోడ్డు
పింఛన్ వస్తోంది..
నాకు పదేళ్లకే దేవుడి దగ్గర పెళ్లి చేశారు. ఆ తర్వాత నేను బసివిని అయ్యాను. పెళ్లి కాకుండానే ఇద్దరు బిడ్డల తల్లినయ్యాను. నా కూతురు చదువుకు వెళితే తండ్రి పేరు చెప్పలేకపోయా. ఇప్పుడు ఒంటరి మహిళ కింద పింఛన్ వస్తోంది. దానికి తోడు కష్టపడి పనిచేసుకుంటున్నా. నా పిల్లలను ఆ దురాచారం నుంచి రక్షించుకున్నా.
– మీనాక్షి, బసివిని, బొమ్మనహాళ్
నన్ను దేవుడికి వదిలేసి జీవితం లేకుండా చేశారు
నన్ను ఎనిమిదేళ్ల వయసులోనే దేవుడికి వదిలేశారు. దేవుడికి వదిలేయడం పేరుకే గానీ, ఊరికి వదిలేయడం అన్న మాట. ఇప్పుడు నేను వృద్ధురాలిని అయ్యాను. పింఛన్ వస్తోంది. పిల్లలకు పెళ్లిళ్లు చేశా.
– సుంకమ్మ, బొమ్మనహాళ్
మహిళాభ్యున్నతే అజెండాగా..
మహిళాభ్యున్నతే ఈ ప్రభుత్వం ప్రధాన అజెండా. జోగిని, బసివిని వ్యవస్థ నుంచి వారు బయటపడేలా ప్రభుత్వ పథకాలన్నీ అందేలా చూస్తున్నాం. మహిళలు నిలదొక్కుకుంటేనే కుటుంబం బావుంటుందనేది సీఎం వైఎస్ జగన్ అభిలాష. వారికి మెరుగైన జీవితాన్నిచ్చేందుకు ప్రభుత్వం తరఫున అన్నీ చేస్తున్నాం. అనంతపురం జిల్లాలో అనాదిగా ఉన్న ఈ దురాచారం త్వరలోనూ పూర్తిగా అంతమవుతుందని ఆశిస్తున్నా.
– బోయ గిరిజమ్మ, జిల్లా పరిషత్ చైర్పర్సన్, అనంతపురం
మండలాల వారీగా జోగినులు, బసివినులు
మండలం
జోగినులు
బసివినులు
బొమ్మనహాళ్
60
67
డి.హీరేహాళ్
27
67
గుమ్మఘట్ట
242
02
కణేకల్లు
37
34
రాయదుర్గం
89
09
మొత్తం
455
179