basket ball tourny
-
విజేత ఎస్సీఎఫ్ బాలికల జట్టు
సాక్షి, హైదరాబాద్: ఎన్బీఏ డ్రీమ్ జూనియర్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో ఆతిథ్య స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ (ఎస్సీఎఫ్) బాలికల జట్టు అండర్–12 విభాగంలో టైటిల్ గెలిచింది. ఫైనల్లో ఎస్సీఎఫ్ 8–0 స్కోరుతో ఆల్ సెయింట్స్ జట్టుపై నెగ్గింది. బాలుర విభాగంలో నిజామ్ కాలేజి అకాడమీ విజేతగా నిలిచింది. ఫైనల్లో నిజామ్ జట్టు 9–7తో ఎస్సీఎఫ్పై గెలిచింది. అండర్–14 బాలికల ఫైనల్లో సెయింట్ పాయిస్ హైస్కూల్ 6–4తో ఎస్.ఎమ్.ఆర్. కమ్యూనిటీ అకాడమీపై విజయం సాధించింది. బాలుర టైటిల్‌ను సీసీఓబీ చేజిక్కించుకుంది. తుదిపోరులో సీసీఓబీ 9–7తో సెయింట్ జోసెఫ్ హైస్కూల్‌ను ఓడించింది. అండర్–16 బాలికల టైటిల్ పోరులో సెయింట్ జోసెఫ్ 12–4తో సెయింట్ ఆన్స్‌పై నెగ్గింది. బాలుర ఈవెంట్లో ఎన్సీసీ 13–9తో సీసీఓబీపై గెలిచి విజేతగా నిలిచింది. -
వీరూ వచ్చిండు
భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ గురువారం నగరంలో సందడి చేశారు. కేవీబీఆర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఆలిండియా వీల్‌చెయిర్ బాస్కెట్ బాల్ టోర్నమెంట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసి అభిమానులను అలరించారు. వీల్‌చెయిర్ బాస్కెట్‌బాల్ ఆకట్టుకుంది: సెహ్వాగ్ జూబ్లీహిల్స్: తన జీవితంలో మొదటిసారిగా చూస్తున్న వీల్‌చెయిర్ బాస్కెట్‌బాల్ క్రీడ తననెంతో ఆకట్టుకుందని భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నారు. యూసుఫ్‌గూడ కేవీబీఆర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఆలిండియా వీల్‌చెయిర్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్‌కు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. గురువారం జరిగిన పురుషుల ఫైనల్లో తమిళనాడుపై మహారాష్ట్ర జట్టు గెలుపొంది విజేతగా నిలిచింది. పంజాబ్ జట్టుకు మూడో స్థానం దక్కింది. మహిళల విభాగంలో తమిళనాడు, కేరళ, కర్ణాటక జట్లు వరుసగా తొలి మూడు స్థానాలను సాధించాయి. ఫైనల్ అనంతరం సెహ్వాగ్ మాట్లాడుతూ సరైన ప్రోత్సాహం అందిస్తే దివ్యాంగులు అద్భుతాలు చేస్తారని అన్నారు. దివ్యాంగులను ప్రతీ ఒక్కరూ ప్రోత్సహించాలని కోరారు. విజేతలకు ట్రోఫీలు అందజేసారు. ఈ కార్యక్రమంలో వీల్‌చెయిర్ బాస్కెట్‌బాల్ ఫెడరేషన్ అధ్యక్షురాలు మాధవీలత, కళ్యాణి రాజారామన్, శాట్స్ ఎండీ దినకర్ బాబు తదితరులు పాల్గొన్నారు. -
బాస్కెట్‌బాల్ చాంప్స్ ఓక్రిడ్జ్, నీరజ్ స్కూల్స్
హైదరాబాద్: రామేందర్ రెడ్డి మెమోరియల్ ఇంటర్ స్కూల్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో నీర జ్ ఇంటర్నేషనల్ స్కూల్, ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ విజేతలుగా నిలిచాయి. ఆదివారం ఉత్కంఠభరితంగా జరిగిన బాలుర ఫైనల్ మ్యాచ్‌లో నీరజ్ ఇంటర్నేషనల్ స్కూల్ 47- 45తో సుచిత్ర అకాడమీపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో నీరజ్ స్కూల్ తరఫున కునాల్ (31), షహబ్ (8)... సుచిత్ర అకాడమీ జట్టులో వాగేశ్ (25), సర్వేశ్ (13) మెరిశారు. బాలికల ఫైనల్లో ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ 15- 11తో నీరజ్ ఇంటర్నేషనల్ స్కూల్‌ను ఓడించి చాంపియన్‌గా నిలిచింది. ఓక్రిడ్జ్ తరఫున స్వాతి 5 పాయింట్లు సాధించగా... నీరజ్ జట్టులో వీణ 7పాయింట్లు, సిమ్రన్ 3పాయింట్లు స్కోర్ చేశారు. అంతకుముందు జరిగిన బాలికల సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో ఓక్రిడ్జ్ స్కూల్ 21-7తో సాధు వశ్వాని ఇంటర్నేషనల్ స్కూల్‌ను ఓడించగా... నీరజ్ ఇంటర్నేషనల్ స్కూల్ 25- 12తో సుచిత్ర అకాడమీపై గెలుపొందింది.