బాసరకు పోటెత్తిన భక్తులు
బాసర : బాసర శ్రీజ్ఞాన సరస్వతీ ఆలయానికి భక్తులు పోటెత్తారు. బుధవారం సప్తమి తిథి, స్వాతి నక్షత్ర మూహుర్తం కలిసి రావడంతో అమ్మవారి దర్శనానికి భారీగా తరలివచ్చారు. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి సైతం భక్తులు తరలిరావడంతో ఆలయం కిటకిటలాడింది. ముందుగా గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి నది తీరాన గల శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారి ఆలయానికి చేరుకున్న భక్తులు 3 గంటల పాటు క్యూలైన్లో వేచి ఉన్నారు. అనంతరం ప్రత్యేక అక్షరాభ్యాస మండపంలో అక్షరస్వీకారం, కుంకుమార్చన పూజలు నిర్వహించి మొక్కు తీర్చుకున్నారు. సుమారు 20వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. ఈ సందర్భంగా రూ.5.50లక్షల ఆదాయం సమకూరిందని పేర్కొన్నారు.
భక్తులకు తప్పని తిప్పలు
ఊహించని రీతిలో భక్తులు ఒకరోజు ముందుగానే ఆలయానికి చేరుకున్నారు. దీంతో భక్తులకు ఆలయంలో సరిపడ అతిథి గృహాలు దొరకకపోవడంతో ఎక్కువ డబ్బులు పెట్టి ప్రైవేటు అతిథి గృహాలను అద్దెకు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అమ్మవారి దర్శనం కోసం చిన్నారులతో సహా వృద్ధులు క్యూలైన్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సిబ్బంది భక్తులకు కనీసం మంచి నీరు కూడా అందించలేకపోయారు.
అమ్మవారి సేవలో ప్రముఖులు
బాసర సరస్వతి అమ్మవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సినీనటుడు ఆర్యన్ రాజేశ్ కుటుంబ సభ్యులు, నాగార్జున యూనివర్సిటీ వైస్ చాన్సలర్ వైఆర్ అరగోపాల్‌రెడ్డి, ఉస్మానియ యూనివర్సిటీ డిపా ర్డుమెంట్ ఆఫ్ లా ప్రొఫెసర్ ప్రతాప్‌రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు.