Bathukamma celebrating
-
ఏపీ ఎన్జీవో హోం వద్ద ఉద్రిక్తత
-
ఏపీ ఎన్జీవో హోం వద్ద ఉద్రిక్తత
బతుకమ్మ సంబరాల సాక్షిగా మరోసారి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగుల మధ్య చిచ్చు రేగింది. బతుకమ్మ సంబరాలకి తమను అనుమతించటం లేదంటూ ఏపీ ఎన్జీవో హోం బయట తెలంగాణ ఉద్యోగులు బుధవారం ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో మరోసారి ఏపీ, తెలంగాణ ఉద్యోగుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. తమను బతుకమ్మ సంబరాలకు అనుమతించడం లేదంటూ.. తెలంగాణ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాది కూడా బతుకమ్మ సంబరాల సందర్భంగా ఏపీ, తెలంగాణ ఉద్యోగుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన సంగతి తెలిసిందే. -
సంబరాల వేళ...సమస్యలు లేకుండా
నేడు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు సాయంత్రం 4 నుంచి 11.30 గంటల వరకూ అమలు నాంపల్లి: బతుకమ్మ సంబరాలకు ఇబ్బంది కలుగకుండా నగరంలో గురువారం ట్రాఫిక్ ఆంక్షలు విధించామని ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్ జితేందర్ తెలిపారు. సంబరాలు తిలకిం చేందుకు 5 వేల మంది ప్రముఖులు వస్తున్నారన్నారు. తన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను ఆయన వెల్లడించారు. సాయంత్రం 4 నుంచి రాత్రి 11.30 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. ట్రాఫిక్ ఆంక్షలు ఇలా.. సికింద్రాబాద్ నుంచి ట్యాంక్‌బండ్ పైకి వచ్చే వాహనాలు కర్బల మైదాన్ నుంచి దారి మళ్లి, బైబిల్ హౌస్, కవాడిగూడ, లోయర్ ట్యాంక్ బండ్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. కట్టమైసమ్మ, కవాడి గూడ నుంచి వాహనాలను ట్యాంక్‌బండ్ పైకి అనుమతించరు. వీటిని డీబీఆర్ మిల్స్ నుంచి కవాడిగూడ వైపు మళ్లిస్తారు. ఎక్బాల్‌మినార్ టవర్ నుంచి ట్యాంక్‌బండ్ పైకి వచ్చే వాహనాలను పాత సచివాలయ గేట్ వద్ద దారి మళ్లిస్తారు. ఇవి తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా కట్టమైసమ్మ వైపు వెళ్లాల్సి ఉంటుంది. ఏఆర్ పెట్రోల్ పంప్ జంక్షన్ నుంచి వచ్చే వాహనాలను బీజేఆర్ విగ్రహం జంక్షన్ వైపు అనుమతించరు. ఈ వాహనాలు నాంపల్లి, రవింద్రభారతి వైపు మళ్లిస్తారు. ఆబిడ్స్ నుంచి వ చ్చే వాహనాలను బీజేఆర్ విగ్రహం, బషీర్‌బాగ్ జంక్షన్ వైపు అనుమతించరు. ఈ వాహనాలు గన్‌ఫౌండ్రి నుంచి దారి మళ్లించి చాపల్ రోడ్డు వైపు వెళ్లాల్సి ఉంటుంది. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే వాహనాలను హిమాయత్‌నగర్ వై జంక్షన్ మీదుగా మళ్లిస్తారు. కింగ్‌కోఠి నుంచి భారతీయ విద్యాభవన్ మీదుగా బషీర్‌బాగ్‌కు వచ్చే వాహనాలను కింగ్‌కోఠి చౌరస్తా నుంచి తాజ్‌మహల్ వైపు మళ్లిస్తారు. ఓల్డ్ పీసీఆర్ నుంచి బషీర్‌బాగ్ జంక్షన్‌కు వచ్చే వాహనాలను పీసీఆర్ నుంచి నాంపల్లి రోడ్డు వైపు మళ్లిస్తారు. హిల్ఫ్ఫోర్ట్ నుంచి వాహనాలను బషీర్‌బాగ్ చౌరస్తా వైపు అనుమతించరు. వాటిని నాంపల్లి రోడ్డు వైపు మళ్లిస్తారు. హిమాయత్‌నగర్ వై జంక్షన్ నుంచి లిబర్టీ చౌరస్తాకు వెళ్లే వాహనాలను హిమాయత్‌నగర్ వై జంక్షన్ నుంచి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వైపు మళ్లిస్తారు. పంజగుట్ట, రాజ్‌భవన్ నుంచి ఖైరతాబాద్ ఫ్లైవర్ మీదుగా వచ్చే వాహనాలను ఇందిరాగాంధీ విగ్రహం చౌరస్తా నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు అనుమతించరు. నల్లగుట్ట జంక్షన్ నుంచి బుద్ధభవన్ వరకు వాహనాలను అనుమతించరు. ఎల్బీ స్టేడియం నుంచి బషీర్‌బాగ్, అంబేద్కర్ విగ్రహం మీదుగా ట్యాంక్‌బండ్ వరకు వాహనాలను అనుమతించరు. ఇందిరా గాంధీ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. తెలుగుతల్లి ఫ్లైఓవర్ నుంచి రామకష్ణ మఠం వరకు వాహనాలను అనుమతిస్తారు. బస్సులు నిలిపే స్థలాలు ఉత్తర మండలం నుంచి వచ్చే వారు బీజేఆర్ విగ్రహం వద్ద దిగాల్సి ఉంటుంది. బస్సు ఎన్టీఆర్ స్టేడియంలో పార్క్ చేయాలి. దక్షణ మండలం నుంచి వచ్చే వారు ఏఆర్ పెట్రోల్ పంప్ వద్ద దిగాల్సి ఉంటుంది. బస్సు ఎన్టీఆర్ స్టేడియంలో పార్క్ చేయాలి. పశ్చిమ మండలం నుంచి వచ్చేవారు అయకర్ భవన్ వద్ద బస్సు దిగాలి. బస్సు ఎన్టీఆర్ స్టేడియంలో పార్క్ చేయాలి. మధ్య, తూర్పు మండలాల నుంచి వచ్చే వారు నిజాం కళాశాల వద్ద బస్సు దిగాలి. బస్సు ఎన్టీఆర్ స్టేడియంలో పార్క్ చేయాలి వీరంతా ఎల్బీ స్టేడియంలోకి వెళ్లాలి. ర్యాలీ మార్గం అన్ని మండలాల నుంచి ఎల్బీ స్టేడియంకు చేరుకునే మహిళలు ర్యాలీగా ఎల్బీ స్టేడియం, బషీర్‌బాగ్, లిబర్టీ, అంబేద్కర్ విగ్రహం, అప్పర్ ట్యాంక్‌బండ్ మీదుగా చిల్ట్రన్ పార్క్‌కు చేరుకుంటారు. అక్కడ బతుకమ్మ ఆడిన తరువాత డీబీఆర్ మిల్స్, వార్త లైన్, ధర్నా చౌక్ మీదుగా ఎన్టీఆర్ స్టేడియంకు చేరుకొని, అక్కడ పార్క్ చేసిన బస్సులలో గమ్యస్థానాలకు తిరిగి వెళ్లాలి. అందరూ వారి టీమ్ లీడర్లసెల్నెంబర్లను తమ వద్ద ఉంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. పార్కింగ్ ప్రదేశాలు బస్సులు ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఆగుతాయి. కార్ల కోసం డీబీఆర్ మిల్స్ సమీపంలోని మసీదు దగ్గర, ధోబీఘాట్లను కేటాయించారు. బతుకమ్మ వేడుకలకు హాజరయ్యే వారి కోసం ఎ,బి,సి కారు పాస్‌లను ఇచ్చినట్లు తెలిపారు. పాస్‌పై కేటాయించిన ప్రదేశాల్లో కార్లను పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. -
భువి నిండుగ...విరి పండుగ
బతుకమ్మ సంబరాలకు సన్నాహాలు ముస్తాబవుతున్న పూల గోపురాలు జిల్లాల వైభవాన్ని చాటే శకటాలు సిద్ధం పది వేల బతుకమ్మల తయారీ కూకట్‌పల్లిలో కొలువుదీరనున్న 17 అడుగుల బతుకమ్మ భాగ్యనగరి పూలతో సింగారించుకుంటోంది. వీధులన్నీ విరి తోటలవుతున్నాయి. వాడలన్నీ వర్ణరంజితమవుతున్నాయి. ఇళ్ల ముందర బతుకమ్మలు కొలువుదీరుతున్నాయి. బతుకమ్మ ఒడిలో ఒదిగిపోవాలని పూలు పోటీ పడుతున్నాయి. ఆబాలగోపాలం ఆటపాటలలో మునిగి తేలుతున్నారు. తెలంగాణ వైభవానికి దర్పణం పట్టేలా ఈ వేడుక లు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సాక్షి, సిటీబ్యూరో/కూకట్పల్లి: పూల పండుగకు మహానగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. తెలంగాణ బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. తంగేడు, చామంతి, తీరొక్క రంగుల్లో ముంచి పేర్చిన గడ్డిపూలు, మందారాలు, బంతిపూలతో తీర్చిదిద్దే పూల గోపురాలు తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక సౌరభాలను గుభాళించనున్నాయి. బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించేందుకు ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్డు, ఎల్బీ స్టేడియం ప్రాంతాలను అందమైన విద్యుద్దీపాలతో అలంకరించారు. మరికొద్ది గంటల్లో వేలాది బతుకమ్మలతో, లక్షలాది మంది మహిళలతో భాగ్యనగరంలో మహాద్భుతమైన పూల జాతర ఆవిష్కృతం కానుంది. మరోవైపు రాష్ర్టంలోని పది జిల్లాల వైభవాన్ని చాటిచెప్పే శకటాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సద్దుల బతుకమ్మ సంబురాలను కన్నుల పండువగా నిర్వహించేందుకు ప్రభుత్వం సర్వ సన్నద్ధమవుతోంది. 10 వేల పూల గోపురాలు బతుకమ్మ వేడుకలకు ఎల్బీ స్టేడియం, ఎగ్జిబిషన్ గ్రౌండ్, ట్యాంక్‌బండ్ ప్రాంతాలను అందంగా అలంకరించారు. ట్యాంక్‌బండ్ పైన స్వాగత వేదికలను తీర్చిదిద్దారు. కొన్ని చోట్ల ఉప వేదికలను ఏర్పాటు చేశారు. ఎల్బీ స్టేడియంలో భారీ ఎత్తున బతుకమ్మలను తయారు చేస్తున్నారు. ఇందుకోసం వేలాది మందిని నియమించారు. ఇప్పటికే వేలాది బతుకమ్మల తయారీ పూర్తయింది. 10 వేల బతుకమ్మలను వేడుకల కోసం సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ సంజీవయ్య, తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి రాజీవ్ సాగర్లు ఎల్బీ స్టేడియంలో బతుకమ్మల తయారీని పర్యవేక్షిస్తున్నారు. బతుకమ్మలకు కావలసిన తంగేడు, గునుగు పూలను శుద్ధి చేసి పేరుస్తున్నారు. మరోవైపు కడియం, బెంగుళూరు నుంచి 35 వేల టన్నుల బంతిపూలను తెప్పించనున్నట్లు అధికారులు తెలిపారు. ఖమ్మం జిల్లా కానుగూరు నుంచి వచ్చిన ఐ.నాగరాజు బృందం, నగరానికి చెందిన అనిత బృందాలు బతుకమ్మల తయారీలో నిమగ్నమయ్యాయి. పండుగ సందర్భంగా హుస్సేన్ సాగర్‌లో అరగంట పాటు లేజర్‌షోను ఏర్పాటు చేయనున్నారు. శకటాలు సిద్ధం మరోవైపు వివిధ జిల్లాల చరిత్ర, సంస్కృతులను చాటే శకటాలను ఎగ్జిషన్ గ్రౌండ్లో సిద్ధం చేశారు. ఆ ప్రాంతాల విశిష్టతను తెలిపే ఆకర్షణీయమైన చిత్రాలు, నినాదాలతో శకటాలను రూపొందించారు. బుధవారం సాయంత్రం రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ కార్యదర్శి బీపీ ఆచార్య, సమాచార కమిషనర్ చంద్రవదన్, రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు ఆర్. కవితాప్రసాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్‌ను సందర్శించి, శకటాల తయారీని పరిశీలించారు. ముంబైకి చెందిన విజ్‌క్రాఫ్ట్ ప్రతినిధులు శకటాలకు తుది మెరుగులు దిద్దుతున్నారు.‘ఒక్కొక్క శకటంతో పాటు సుమారు 40 మంది కళాకారుల చొప్పున మొత్తం 2 వేల మంది ప్రదర్శనలిస్తారని’ కవితాప్రసాద్ తెలిపారు. ఎల్బీ స్టేడియంలో 25 వేల మంది మహిళలు బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేలా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఇన్చార్జ్ జేసీ సంజీవయ్య తెలిపారు. కూకట్‌పల్లిలో 17 అడుగుల బతుకమ్మ ఏటా బతుకమ్మ వేడుకలను వైభవంగా నిర్వహిస్తోన్న కూకట్‌పల్లిలో ఈ ఏడాది కూడా ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ జిల్లాల నుంచి పూలు తెప్పిస్తున్నారు. నిజమాబాద్, మెదక్, సంగారెడ్డి, జహీరాబాద్, సదాశివపేట, నర్సాపూర్ తదితర ప్రాంతాల నుంచి పూలను తరలిస్తున్నారు. ఆడపిల్ల పుట్టడం శుభసూచకంగా భావించే సత్సంప్రదాయానికి బతుకమ్మ వేడుక ప్రతీక. ఆ సంప్రదాయాన్ని గత 17 ఏళ్లుగా పాటిస్తూ, తమ ఇంట్లో పుట్టిన ఆడపిల్లలకు ప్రతీకగా వేడుకలు నిర్వహిస్తోన్న గుండాల చ ంద్రమ్మ కుటుంబం ఈసారి 17 అడుగుల బతుకమ్మను తయారు చేస్తోంది. ‘తమకు ఐదుగురు కుమారులని...అమ్మాయిలు లేరనే బెంగ ఉండేదని.. తమ కొడుక్కి కూతురు పుట్టిన సంతోషంతో బతుకమ్మను అంచెలంచెలుగా పెంచుతున్నటు’్ల చంద్రమ్మ చెప్పారు. -
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..
షోలాపూర్, న్యూస్‌లైన్: పట్టణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. సంప్రదాయ దుస్తులతో అందమైన బతుకమ్మలతో బాలికలు, మహిళలు, యువతులు పాటలతో వాడ వాడల సందడి చేస్తున్నారు. విభిన్న నృత్యాలు, పాటలు, పలకరింపులు, ఆనందోత్సాహాలతో ఆకట్టుకుంటున్నారు. సోమవారం సాయంత్రం బిట్లా పాఠశాలలో జరిగిన బతుకమ్మ వేడుకలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పద్మశాలి శిక్షణ సంస్థ ట్రస్టు సులోచన గుండు, సంగీతా ఇందాపూరే, శ్రీనివాస్ కటుకూర్, హరీష్ కొండా, శ్రీధర్ చిట్యాల్, రమేష్ విడప్లు హాజరయ్యారు. అలాగే బిట్లా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లక్ష్మణ్ నోరా, టీచర్లు శారద గోరంట్యాల్, అనిల్ గంజి, గీతా సాదులు, మధుకర్ మరగనేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శారదా గోరంట్యాల్ బతుకు పాట బతుకమ్మ ఆటగా వివరించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను తెలిపే ప్రతి పండుగను ఘనంగా జరుపుకొంటూ మన గొప్పతనాన్ని చాటి చెప్పాలన్నారు. అలాగే గొంగడి బస్తి, దత్తు నగర్, సాకర్ పేట్, ఆంధ్రబద్రావతి పేట్, నీలం నగర్, విడప్ నగర్, కొత్త, పాత గురుకుల ఏరియాలలో రోజువారీగా, వాడవాడల్లో అలాగే శరన్నవరాత్రుల కోసం ఏర్పాటు చేసిన దేవి మండపాల ముందు బతుకమ్మ ఆటలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.