భువి నిండుగ...విరి పండుగ | Ninduga earth ... broken festival | Sakshi
Sakshi News home page

భువి నిండుగ...విరి పండుగ

Published Wed, Oct 1 2014 11:49 PM | Last Updated on Sat, Sep 2 2017 2:14 PM

భువి నిండుగ...విరి పండుగ

భువి నిండుగ...విరి పండుగ

  • బతుకమ్మ సంబరాలకు సన్నాహాలు   
  •  ముస్తాబవుతున్న పూల గోపురాలు
  •  జిల్లాల వైభవాన్ని చాటే శకటాలు సిద్ధం
  •  పది వేల బతుకమ్మల తయారీ
  •  కూకట్‌పల్లిలో కొలువుదీరనున్న 17 అడుగుల బతుకమ్మ
  • భాగ్యనగరి పూలతో సింగారించుకుంటోంది. వీధులన్నీ విరి తోటలవుతున్నాయి. వాడలన్నీ వర్ణరంజితమవుతున్నాయి. ఇళ్ల ముందర బతుకమ్మలు కొలువుదీరుతున్నాయి. బతుకమ్మ ఒడిలో ఒదిగిపోవాలని పూలు పోటీ పడుతున్నాయి. ఆబాలగోపాలం ఆటపాటలలో మునిగి తేలుతున్నారు. తెలంగాణ వైభవానికి దర్పణం పట్టేలా ఈ వేడుక లు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
     
    సాక్షి, సిటీబ్యూరో/కూకట్‌పల్లి: పూల పండుగకు మహానగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. తెలంగాణ బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. తంగేడు, చామంతి, తీరొక్క రంగుల్లో ముంచి పేర్చిన గడ్డిపూలు, మందారాలు, బంతిపూలతో తీర్చిదిద్దే పూల గోపురాలు తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక సౌరభాలను గుభాళించనున్నాయి. బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించేందుకు ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్డు, ఎల్‌బీ స్టేడియం ప్రాంతాలను అందమైన విద్యుద్దీపాలతో  అలంకరించారు. మరికొద్ది గంటల్లో వేలాది బతుకమ్మలతో, లక్షలాది మంది మహిళలతో భాగ్యనగరంలో మహాద్భుతమైన పూల జాతర ఆవిష్కృతం కానుంది. మరోవైపు రాష్ర్టంలోని పది జిల్లాల వైభవాన్ని చాటిచెప్పే శకటాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సద్దుల బతుకమ్మ సంబురాలను కన్నుల పండువగా నిర్వహించేందుకు ప్రభుత్వం సర్వ సన్నద్ధమవుతోంది.
     
    10 వేల పూల గోపురాలు

    బతుకమ్మ వేడుకలకు ఎల్‌బీ స్టేడియం, ఎగ్జిబిషన్ గ్రౌండ్, ట్యాంక్‌బండ్ ప్రాంతాలను అందంగా అలంకరించారు. ట్యాంక్‌బండ్  పైన స్వాగత వేదికలను తీర్చిదిద్దారు. కొన్ని చోట్ల ఉప వేదికలను ఏర్పాటు చేశారు. ఎల్‌బీ స్టేడియంలో భారీ ఎత్తున బతుకమ్మలను  తయారు చేస్తున్నారు. ఇందుకోసం వేలాది మందిని నియమించారు. ఇప్పటికే వేలాది బతుకమ్మల తయారీ పూర్తయింది. 10 వేల బతుకమ్మలను వేడుకల కోసం సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ సంజీవయ్య, తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి రాజీవ్ సాగర్‌లు ఎల్‌బీ స్టేడియంలో బతుకమ్మల తయారీని పర్యవేక్షిస్తున్నారు. బతుకమ్మలకు కావలసిన తంగేడు, గునుగు పూలను శుద్ధి చేసి పేరుస్తున్నారు. మరోవైపు కడియం, బెంగుళూరు నుంచి 35 వేల టన్నుల బంతిపూలను తెప్పించనున్నట్లు అధికారులు తెలిపారు. ఖమ్మం జిల్లా కానుగూరు నుంచి వచ్చిన ఐ.నాగరాజు బృందం, నగరానికి చెందిన అనిత బృందాలు బతుకమ్మల తయారీలో నిమగ్నమయ్యాయి. పండుగ సందర్భంగా హుస్సేన్ సాగర్‌లో అరగంట పాటు లేజర్‌షోను ఏర్పాటు చేయనున్నారు.
     
    శకటాలు సిద్ధం

    మరోవైపు వివిధ జిల్లాల చరిత్ర, సంస్కృతులను చాటే శకటాలను ఎగ్జిషన్ గ్రౌండ్‌లో సిద్ధం చేశారు. ఆ ప్రాంతాల విశిష్టతను తెలిపే ఆకర్షణీయమైన చిత్రాలు, నినాదాలతో శకటాలను రూపొందించారు. బుధవారం సాయంత్రం రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ కార్యదర్శి బీపీ ఆచార్య, సమాచార కమిషనర్ చంద్రవదన్, రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు ఆర్. కవితాప్రసాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్‌ను సందర్శించి, శకటాల తయారీని పరిశీలించారు. ముంబైకి చెందిన విజ్‌క్రాఫ్ట్ ప్రతినిధులు శకటాలకు తుది మెరుగులు దిద్దుతున్నారు.‘ఒక్కొక్క శకటంతో పాటు సుమారు 40 మంది కళాకారుల చొప్పున మొత్తం 2 వేల మంది ప్రదర్శనలిస్తారని’ కవితాప్రసాద్ తెలిపారు. ఎల్‌బీ స్టేడియంలో 25 వేల మంది మహిళలు బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేలా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఇన్‌చార్జ్ జేసీ సంజీవయ్య తెలిపారు.
     
    కూకట్‌పల్లిలో 17 అడుగుల బతుకమ్మ
     
    ఏటా బతుకమ్మ వేడుకలను వైభవంగా నిర్వహిస్తోన్న  కూకట్‌పల్లిలో ఈ ఏడాది కూడా ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ జిల్లాల నుంచి పూలు తెప్పిస్తున్నారు. నిజమాబాద్, మెదక్, సంగారెడ్డి, జహీరాబాద్, సదాశివపేట, నర్సాపూర్ తదితర ప్రాంతాల నుంచి పూలను తరలిస్తున్నారు. ఆడపిల్ల పుట్టడం శుభసూచకంగా భావించే సత్సంప్రదాయానికి బతుకమ్మ వేడుక ప్రతీక. ఆ సంప్రదాయాన్ని గత 17 ఏళ్లుగా పాటిస్తూ, తమ ఇంట్లో పుట్టిన ఆడపిల్లలకు ప్రతీకగా వేడుకలు నిర్వహిస్తోన్న గుండాల చ ంద్రమ్మ కుటుంబం ఈసారి 17 అడుగుల బతుకమ్మను తయారు చేస్తోంది. ‘తమకు ఐదుగురు కుమారులని...అమ్మాయిలు లేరనే బెంగ ఉండేదని.. తమ కొడుక్కి కూతురు పుట్టిన సంతోషంతో బతుకమ్మను అంచెలంచెలుగా పెంచుతున్నటు’్ల చంద్రమ్మ చెప్పారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement