నోట్ 7 పేలుడుకు అసలు కారణమిదే!
సియోల్ : శాంసంగ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన గెలాక్సీ నోట్ 7 ఆ కంపెనీ కొంపమొచ్చింది. బ్యాటరీ పేలుళ్లతో ఒక్కసారిగా దాని పేరు, పత్రిష్ట, మరోవైపు నుంచి లాభాలు తుడిచిపెట్టుకుపోయాయి. రీకాల్ చేసి కొత్త ఫోన్లు మార్కెట్లోకి తీసుకొచ్చినా పేలుళ్ల సమస్య మాత్రం ఆ కంపెనీని వీడలేదు. దీంతో మొత్తానికే గెలాక్సీ నోట్7 అమ్మకాలు, ఉత్పత్తి నిలిపివేసి అసలు కారణమేమిటా? అని శోధించడం ప్రారంభించింది. ఎట్టకేలకు ఈ పేలుళ్ల కారణాన్ని శాంసంగ్ పట్టేసిందట.
గెలాక్సీ నోట్7 ఫోన్లకు సరిపడ పరిమాణంలో లేని బ్యాటరీలను ఫిక్స్ చేయడం వల్లనే అవి ఓవర్‌హీట్ అయి పేలుతున్నాయని వాల్‌స్ట్రీట్ జర్నల్ శుక్రవారం రిపోర్టు చేసింది. సోమవారం రోజు దీనికి సంబంధించిన పూర్తి వివరాలను దక్షిణ కొరియా దిగ్గజం ప్రజల ముందుకు తీసుకురానుంది. ఈ నేపథ్యంలో సంబంధిత వర్గాల సమాచారం మేరకు శాంసంగ్ కనుగొన్న కారణాన్ని వాల్‌స్ట్రీట్ జర్నల్ ప్రచురించేసింది.
కంపెనీకి సమస్య తీసుకొచ్చిన బ్యాటరీల పరిమాణం సరిగ్గా లేదని, దీనివల్ల అవి ఓవర్‌హీట్ అవుతున్నట్టు వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. కంపెనీ తీసుకొచ్చిన ఈ నోట్7 డివైజ్‌లు పేలుళ్ల బారిన పడి, వినియోగదారులకు చిరాకు తెప్పించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌లో కంపెనీ నోట్7 ఫోన్లను రీకాల్ చేయడం ప్రారంభించింది. 2.5 మిలియన్ యూనిట్లను రీకాల్ చేస్తున్నట్టు శాంసంగ్ ప్రకటించింది. రీప్లేస్మెంట్లో కొత్త ఫోన్లను ప్రవేశపెట్టింది. అయినప్పటికీ శాంసంగ్‌ను పేలుళ్ల సమస్య వదలేదు. ఈ నేపథ్యంలో మొత్తానికే నోట్7ను ఆపివేస్తే బాగుంటుందని శాంసంగ్ నిర్ణయించింది.
పేలుళ్ల బ్యాటరీలను కంపెనీకి బ్యాటరీల సప్లయర్‌గా ఉన్న ఓ సంస్థ సరఫరా చేస్తుందని శాంసంగ్ చెబుతోంది. తమ తప్పేమి లేదంటూ వాదిస్తోంది. కానీ ఆ సప్లయర్ పేరును మాత్రం శాంసంగ్ వెల్లడించడం లేదు. అయితే ఆ కంపెనీ ఈ దక్షిణ కొరియా దిగ్గజానికి చెందినదేనని, శాంసంగ్ ఎస్డీఐగా పలువురు పేర్కొంటున్నారు. ఈ కంపెనీ శాంసంగ్‌కు అవసరమైన బ్యాటరీలను రూపొందిస్తోంది. సంస్థకు చెందిన మొత్తం ఉత్పత్తిని పూర్తిగా సంస్కరిస్తుందని, మరో సమస్య తలెత్తకుండా క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్‌ను సంస్కరించనున్నామని శాంసంగ్ వాగ్దానం చేసిన సంగతి తెలిసిందే.