Battery busses
-
తిరుమలకు త్వరలో బ్యాటరీ బస్సులు
తిరుమల: త్వరలోనే తిరుమలకు బ్యాటరీ బస్సులు నడుస్తాయని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఇందుకు సంబంధించి డిపో ఏర్పాటుకు స్థలాలను పరిశీలించినట్టు చెప్పారు. ఆయన సోమవారం తిరుమల ఆర్టీసీ డిపోను పరిశీలించారు. బ్యాటరీ బస్సుల కోసం పలు ప్రాంతాలను ఎంపిక చేశారు. అనంతరం డిపోలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. కార్యక్రమంలో తిరుమల ఆర్టీసీ డీఎం ఎంవీఆర్ రెడ్డి, నెల్లూరు ఈడీ గోపీనాథ్‌రెడ్డి, తిరుపతి ఆర్ఎం చెంగల్‌రెడ్డి తదితరులున్నారు. -
రూ.150 కోట్లు కాంట్రాక్టర్ జేబులోకి!
పండుగలొస్తే చాలు తయారీదారులు ఉత్పత్తులపై డిస్కౌంట్లు ప్రకటిస్తారు. ప్రజలు కూడా జేబుపై భారం పడకుండా డిస్కౌంట్ల కోసం ఎదురుచూసి వాటిని కొనుగోలు చేస్తుంటారు. చిన్నచిన్న వస్తువుల విషయంలో కూడా సగటు వినియోగదారుడు అలాగే ఆలోచిస్తాడు. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టినప్పుడు ఈ ఆఫర్ల కోసం మరింతగా తపిస్తాడు. అలాంటప్పుడు తీవ్ర నష్టాలు, పెరుగుతున్న ఖర్చులు, అంతంత మాత్రంగానే రాబడి ఉండి.. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఆర్టీసీ ఏం చేస్తోందో తెలుసా? కేంద్రం ప్రకటించిన రూ.150 కోట్ల రాయితీని కాలదన్నుకుంటోంది. ఆ లబ్ధిని కాంట్రాక్టర్ చేతిలో పెట్టబోతోంది. బస్సులు సరిపోక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న తరుణంలో, కొత్త బస్సులపై కేంద్రం ప్రకటించిన ఓ అవకాశాన్ని దారి మళ్లించి ప్రైవేటు పరం చేస్తోంది. ఇప్పుడు కొంటే రూ.కోటిన్నర బస్సు రూ.కోటికే అందుతుంది. తర్వాత కొంటే పూర్తి మొత్తం చెల్లించాల్సిందే. – సాక్షి, హైదరాబాద్ ఇదీ సంగతి.. కాలుష్యానికి విరుగుడుగా భావించే బ్యాటరీ బస్సులను ప్రోత్సహించాలని కేంద్రం గతంలో నిర్ణయించింది. ఇందులో భాగంగా ‘ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఫేమ్) పథకం ప్రారంభించింది. ఈ పథకం మలి దశలో తెలంగాణకు 325 బస్సులు మంజూరైన సంగతి తెలిసిందే. ఇవన్నీ నాన్ ఏసీ బ్యాటరీ బస్సులు. తొలి దశలో 40 ఏసీ బస్సులు సమకూర్చుకుని హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి విమానాశ్రయానికి నడుపుతున్నారు. 336 బస్సులు కావాలని ప్రతిపాదించగా, కేంద్రం 325 బస్సులకు ఆమోదం తెలిపింది. వీటిల్లో 300 బస్సులను హైదరాబాద్‌లో సిటీ బస్సులుగా, మిగతా వాటిని వరంగల్‌లో సిటీ బస్సులుగా నడపాలని ప్రాథమికంగా ఆర్టీసీ నిర్ణయించింది. ప్రస్తుతం కొత్తగా సమకూరే బస్సులు 12 మీటర్ల పొడవుండేవి. వీటి ధర దాదాపు రూ.కోటిన్నర. సంవత్సర కాలంలో 5 వేల బస్సులు అందించాలని నిర్ణయించి, ఆర్టీసీలకు భారం కాకుండా ధరలో రాయితీ ప్రకటించింది. 12 మీటర్ల నాన్ ఏసీ బస్సు ధరలో గరిష్టంగా రూ.50 లక్షల రాయితీ ప్రకటించింది. అంటే రూ.కోటిన్నర విలువైన బస్సు దాదాపు రూ.కోటికే అందే అవకాశం ఉంటుంది. 325 బస్సులకు దాదాపు రూ.162 కోట్ల వరకు అవుతుంది. నిబంధనల ప్రభావం పోను కనిష్టంగా రూ.150 కోట్ల లబ్ధి చేకూరుతుంది. రంగంలోకి నేతలు? కానీ ఈ బస్సులను నేరుగా కొనేందుకు ఆర్టీసీ ముందుకు రాలేదు. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, ఇంతపెద్ద మొత్తం చెల్లించి బస్సులు కొనే స్థోమత లేదన్న కారణంతో ఆ బస్సులను అద్దె ప్రాతిపదికన సమకూర్చుకోవాలని నిర్ణయించింది. అంటే.. కాంట్రాక్టు పొందిన సంస్థ ఆ బస్సులు కొని ఆర్టీసీకి అద్దెకిస్తుంది. వాటిని వాడుకున్నందుకు కిలోమీటరుకు నిర్ధారిత మొత్తాన్ని ఆర్టీసీ తిరిగి ఆ కాంట్రాక్టు సంస్థకు చెల్లిస్తుంది. ఈ కాంట్రాక్టును దక్కించుకునేందుకు కొందరు రాజకీయ నేతలు కూడా రంగంలోకి దిగినట్టు సమాచారం. జీతాల భయంతో.. ఆర్థిక ఇబ్బందులున్న తరుణంలో ఇంతపెద్ద మొత్తం ఆర్టీసీకి బాగా కలిసొచ్చేదే. బ్యాంకు రుణం తీసుకుని ఆ బస్సులు సమకూర్చుకుంటే రాయితీ, లాభం బాగా ఉపయోగపడేదే. కానీ అందుకు ఆర్టీసీ సాహసించట్లేదు. మరోవైపు సొంతంగా ఆ బస్సులు నిర్వహిస్తే వాటికి డ్రైవర్లు, కండక్టర్లను సొంతంగా ఏర్పాటు చేసుకోవాలి. ఆ రూపంలో వారికి జీతాల చెల్లింపు పెద్ద భారంగా మారుతుందని ఆర్టీసీ భయపడుతోంది. ప్రస్తుతం కొత్త బస్సుల కొనుగోలు, ఇతర ఆర్థిక అవసరాలకు ప్రభుత్వం గ్రాంట్లు ఇవ్వకపోతుండటంతో ఆర్టీసీ చేతులెత్తేస్తోంది. రెండు రోజుల కింద టెండరు నోటీసు విడుదల చేసింది. ప్రైవేటు సంస్థకెందుకు బ్యాటరీ బస్సులను తెలంగాణ ఆర్టీసీ సొంతంగా తీసుకుని కేంద్రం ఇచ్చే రాయితీ లబ్ధి పొందాలి. అప్పనంగా ప్రైవేటు సంస్థకు ఒక్కో బస్సుపై రూ.50 లక్షలు కట్టబెట్టడం ఎంతవరకు సమంజసం. – నాగేశ్వర్రావు, ఎన్ఎంయూ టెండర్లను అడ్డుకుంటాం కేంద్రం ఇచ్చే రాయితీ కష్టకాలంలో ఆర్టీసీకి ఎంతో ఉపయోగపడుతుంది. దాన్ని కాలదన్నుకుని ప్రైవేటు సంస్థకు కట్టబెడతామంటే చూస్తూ ఊరుకోం. అద్దె ప్రాతిపదికన తీసుకోవటం వల్ల డ్రైవరు, కండక్టరు, శ్రామిక్ పోస్టులను కూడా ఆర్టీసీ కోల్పోతుంది. నిర్ణయం మార్చుకోకుంటే టెండర్లను అడ్డుకుంటాం. – రాజిరెడ్డి, ఏయూ -
నగరంలోకి ఎలక్ర్టికల్ బస్సులు
సాక్షి కరీంనగర్ : తెలంగాణ ఆర్టీసీ ఇంధన పొదుపు, కాలుష్యానికి విరుగుడుతోపాటు లాభాలు ఆర్జించడంపై దృష్టి సారిస్తోంది. పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తూ ఎలక్ట్రిక్ బస్సులు ఏర్పాటు చేస్తోంది. కాలుష్యాన్ని వెదజల్లకుండా.. చడీచప్పుడు కాకుండా రోడ్లపై పాములా దూసుకుపోతూ మెరుగైన ప్రయాణ సేవలు అందించే ఎలక్ట్రిక్ బస్సులు నడిపించడంపై కసరత్తు చేస్తోంది. ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ సౌకర్యం కల్పించడంతోపాటు ప్రజల ఆదరణతో సంస్థను ఆర్థికంగా అభివృద్ధి పథంలో నడపించేందుకు ఆర్టీసీ అధికారులు కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బస్సులు నడిపించడానికి కావాల్సిన వసతులు, సౌకర్యాలు, రోడ్లు, ప్రజల ఆదరణపై గత నెల అధికారులు సమీక్షించారు. కేంద్ర ప్రభుత్వం రాయితీపై అందించే బ్యాటరీ బస్సులు రాష్ట్రంలో ప్రజలకు అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. స్మార్ట్‌సిటీలో భాగంగా కరీంనగర్‌కు.. జిల్లా అభివృద్ధి చెందడంతోపాటు కరీంనగర్ స్మార్ట్‌సిటీలో భాగంగా కరీంనగర్‌కు ముందస్తుగా 30 బ్యాటరీ బస్సులు ఏర్పాటు చేయనుంది. కేంద్ర ప్రభుత్వం ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యాన్సుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్(ఫేమ్) పథకం ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద అభివృద్ధి చెందుతున్న సిటీలకు రాయితీపై బ్యాటరీ బస్సులు అందిస్తోంది. స్మార్ట్‌సిటీలకు 50వరకు బ్యాటరీ బస్సులు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. ముందస్తుగా కొన్నింటిని ఏర్పాటు చేసి ప్రజాదరణకు అనుగుణంగా మరిన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అద్దె ప్రాతిపదికన.. స్మార్ట్‌సిటీలో భాగంగా కరీంనగర్లో ఆర్టీసీ ఏర్పాటు చేయనున్న బ్యాటరీ బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకోనుంది. ముందుగా కరీంనగర్లో ఎన్ని బస్సులు అవసరం ఉంటుందో ప్రతిపాదనలు సిద్ధం చేసి యాజమాన్యం ప్రభుత్వానికి పంపిస్తుంది. బస్సుల అవసరం మేరకు బ్యాటరీ బస్సులు ఇవ్వడానికి ఆసక్తిగల వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసి వారికి నిబంధనల ప్రకారం బస్సు ధరలో రాయితీపై బ్యాటరీ బస్సులు అందచేస్తుంది. ఇలా కేంద్ర ప్రభుత్వం ఫేమ్ పథకంలో ద్వారా ఇస్తున్న బ్యాటరీ బస్సులను ఆర్టీసీలో అద్దె బస్సులుగా ఏర్పాటు చేస్తుంది. కరీంనగర్లో ఏర్పాటుకు.. స్మార్ట్‌సిటీగా గుర్తించిన కరీంనగర్లో ఆర్టీసీ బ్యాటరీ బస్సులు నడిపించే ఆలోచన చేయడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్లో చుట్టుపక్కల గ్రామాలను కలుపుకొని సిటీబస్సులుగా సేవలు అందించాలా, కరీంనగర్ నుంచి హైదరాబాద్, వరంగల్ వంటి ప్రాంతాలకు బస్సులు అందుబాటులోకి తేవాలా అనే విషయంపై ఇంకా అధికారులు ఆలోచనలోనే ఉన్నారు. ముందుగా బస్సు కండీషన్, బ్యాటరీ సామర్థ్యం ఎంత, ఎంతదూరం ప్రయాణం చేయవచ్చు, అందుబాటులో ఉన్న గ్రామాలు, ఆయా గ్రామాలకు రోడ్డు సౌకర్యం, రోడ్ల పరిస్థితిని ఆలోచించాల్సిన అసవరం ఉంది. వీటితోపాటు బ్యాటరీ బస్సులు ఏర్పాటు చేస్తే కొంతమేరకైనా నిర్వహణ వ్యయం అధికమవుతుందని, దీంతో చార్జీలు పెంచాల్సి ఉంటుందని సమాచారం. ఒక్కసారి చార్జీ చేస్తే 300 కిలోమీటర్లు.. బ్యాటరీ బస్సు ఒక్కసారి చార్జీ చేస్తే 300 కిలోమీటర్లు తిరుగుతుంది. గరిష్టంగా 300 కిలోమీటర్ల పరిధిలోనే బస్సులు నడిపించాల్సి ఉంటుంది. స్మార్ట్‌సిటీలో భాగంగా కరీంనగర్లో కూడా బ్యాటరీ బస్సులు ఏర్పాటు చేస్తే బాగుంటుందని అధికారులు ప్రతిపాదించారు. ఇంకా బస్సుల ఏర్పాటుపై తుది నిర్ణయం కాలేదు. - జీవన్‌ప్రసాద్, రీజినల్ మేనేజర్, కరీంనగర్. -
600 బ్యాటరీ బస్సులు కావాలి!
సాక్షి, హైదరాబాద్: చడీచప్పుడు లేకుండా రాజధానిలోని వివిధ ప్రాంతాల నుంచి విమానాశ్రయానికి దూసుకుపోతూ ప్రత్యేకాకర్షణగా నిలిచిన బ్యాటరీ బస్సులు త్వరలో ఇతర పట్టణాలను కూడా పలకరించబోతున్నాయి. హైదరాబాద్‌లో వాటి సంఖ్యను భారీగా పెంచటంతో పాటు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌తో పాటు మరికొన్ని పట్టణాల్లో నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇందుకోసం ఏకంగా 600 బస్సులు కావాలంటూ కేంద్రప్రభుత్వాన్ని కోరబోతోంది. ఈమేరకు ఈ నెలాఖరుకు దరఖాస్తు చేయబోతోంది. వీలైనన్ని ఎక్కువ బస్సులు ఇవ్వాలని అందులో కోరనున్న ఆర్టీసీ, ఒక్క హైదరాబాద్‌లోనే దాదాపు 400 బస్సులు తిప్పాలని భావిస్తోంది. మిగతా 200 బస్సులను నగరం నుంచి ఇతర పట్టణాలకు నడపాలనేది ఆలోచన. మూడు కేటగిరీల్లో కొత్త బస్సులు.. కాలుష్యానికి విరుగుడుగా భావించే బ్యాటరీ బస్సులను ప్రోత్సహించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా మోదీ ప్రభుత్వం రెండేళ్ల క్రితం ‘ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్’(ఫేమ్) పథకం ప్రారంభించింది. పథకం తొలి దశ కింద తెలంగాణకు 100 బస్సులు మంజూరయ్యాయి. వాటిల్లో 40 బస్సులు విడుదలవ్వగా వాటిని అద్దె ప్రాతిపదికన ప్రైవేటు సంస్థ ద్వారా ఆర్టీసీ ఏర్పాటు చేసుకుని విమానాశ్రయానికి నడుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రెండో విడత కింద దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు 5 వేల బస్సులను మంజూరు చేయాలని నిర్ణయించింది. తొలి దశలో బస్సు విలువలో 33 శాతం మొత్తాన్ని రాయితీగా ప్రకటించింది. హైదరాబాద్‌కు విడుదలైన బస్సుల్లో ఒక్కో దానికి రూ.కోటి చొప్పున సబ్సిడీ వచ్చింది. ఈ సారి సబ్సిడీ మొత్తాన్ని కేంద్రం తగ్గించింది. అప్పట్లో ఒకే కేటగిరీ బస్సులు విడుదలవగా, ఈసారి మూడు కేటగిరీల్లో అవి రానున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో తిరుగుతున్న బస్సులు 12 మీటర్ల పొడవున్నాయి. వీటికి అప్పట్లో రూ.కోటి చొప్పున సబ్సిడీ రాగా, ఈసారి ఆ మొత్తాన్ని రూ.50 లక్షలకు ఖరారు చేశారు. ఇక 9 మీటర్ల పొడవుండే బస్సులకు రూ.40 లక్షలు, 7 మీటర్ల పొడవుండే మినీ బస్సులకు రూ.30 లక్షలు సబ్సిడీగా అందివ్వనుంది. ఈ మూడు కేటగిరీల్లో బస్సులు కావాలంటూ ఆర్టీసీ ప్రతిపాదనలో పేర్కొంటోంది. రోడ్ల వెడల్పును బట్టి ఈ మూడు రకాల బస్సులను హైదరాబాద్‌లో వినియోగించుకోనుంది. వరంగల్, కరీంనగర్‌లకు.... స్మార్ట్ సిటీలుగా కేంద్రం గుర్తించిన వరంగల్, కరీంనగర్‌లకు ఒక్కో పట్టణానికి 50 బస్సుల వరకు పొందే వెసులుబాటుంది. వాటిని ఆ పట్టణాల్లో సిటీ బస్సులుగా, కొన్నింటికి పొరుగున ఉండే ప్రాంతాల మధ్య తిప్పేందుకు వీలుంది. హైదరాబాద్ నుంచి ఇంటర్సిటీ బస్సులుగా 300 కిలోమీటర్ల పరిధిలో ఉ న్న పట్టణాలకు ఈ బస్సులు నడిపే అవకాశాన్ని ‘ఫేమ్’ లో పొందుపరిచింది కేంద్రం. దీంతో హైదరాబాద్ నుంచి మహబూబ్‌నగర్, నిజామాబాద్, సిద్దిపేట తదితర పట్టణాలకు వీటిని నడిపే అవకాశముంది. ఖర్చు ఎక్కువే.. ఈ బస్సుల్లో పెద్దవాటి ధర రూ.2.50 కోట్లుగా ఉంది. ఇందులో 60 శాతం ఖర్చు దాని బ్యాటరీకే అవుతుంది. ప్రస్తుతం దేశంలో బస్సులను తయారు చేస్తున్నా.. బ్యాటరీలను మాత్రం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. గరిష్ట సామర్థ్యమున్న బ్యాటరీ ఒకసారి చార్జ్ చేస్తే 300 కి.మీ. పనిచేస్తుంది. అందుకే గరిష్టంగా 300 కి.మీ. దూరం ఉన్న పట్టణాల మధ్య ఈ బస్సులు తిప్పొచ్చని నిబంధనలో పొందుపరిచారు. గమ్యం చేరకుండా మధ్యలో బ్యాటరీ చార్జి చేసుకోవాల్సిన పరిస్థితి ఉండొద్దు. ఏయే పట్టణాల మధ్య ఈ బస్సులు తిరుగుతాయో ఆయా పట్టణాల్లో చార్జింగ్ పాయింట్లు ఉండాల్సి ఉంటుంది. నగరంలో నడుస్తున్న బస్సులకు కి.మీ.కు రూ.45 ఖర్చవుతోంది. కొత్త బస్సులూ అద్దె ప్రాతిపదికనే.. ప్రస్తుతం నగరంలో నడుస్తున్న 40 ఎలక్ట్రిక్ బస్సులను అద్దె బస్సులుగా వినియోగించుకుంటున్న ఆర్టీసీ, రెండో దశలో వచ్చే బస్సులను కూడా అద్దె ప్రాతిపదికనే తీసుకోనుంది. వాటిని సొంతంగా నిర్వహించాలంటే పెద్ద సంఖ్యలో సిబ్బంది అవసరమవుతా రు, నిర్వహణ వ్యయం భరించాల్సి ఉంటుంది. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి అందుకు సహకరించేలా లేనందున అద్దె బస్సులుగానే వాటిని వాడుకుంటుంది. అప్పుడు వాటి నిర్వహణ, సిబ్బంది ఖర్చులన్నీ ప్రైవేటు సంస్థలే చూసు కుంటాయి. అయితే ఈ విధానాన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వ సహకారముంటేనే ఎక్కువ బస్సులు ఈ బ్యాటరీ బస్సుల విషయంలో రాష్ట్రప్రభుత్వం ఎలా వ్యవహరిస్తోందన్న అంశాన్ని కేంద్రం పరిశీలించనుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 40 బస్సులను ఎలా నిర్వర్తిస్తున్నారన్న విషయాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేస్తే, రెండో దశలో ఎక్కువ బస్సులు మంజూరవుతాయి. ఎలక్ట్రానిక్ వాహనాల విషయంలో రాష్ట్రప్రభుత్వ పాలసీ ఎలా ఉంది, అదనంగా బస్సులొస్తే వాటి నిర్వహణకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం సంసిద్ధత ఎలా ఉందో పరిశీలిస్తుంది. ఈ బస్సులకు కరెంటు చార్జి చేయటానికి 11 కేవీ సబ్‌స్టేషన్ అవసరమవుతుంది. దాన్ని ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందా, ప్రైవేటు సంస్థ భరించాల్సి ఉంటుందా.. తదితర వివరాలు చూసి సానుకూల పరిస్థితి ఉందని భావిస్తే ఎక్కువ బస్సులు మంజూరవుతాయి. -
తిరుమలలో బ్యాటరీ బస్సులు
తిరుపతి అర్బన్: తిరుమల పుణ్యక్షేత్రాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు త్వరలో బ్యాటరీ ద్వారా నడిచే బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు వెల్లడించారు. తిరుపతిలోని టీటీడీ రవాణా విభాగంలో గురువారం నిర్వహించిన పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. టీటీడీ రవాణాశాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే తిరుమల, తిరుపతిలో యాత్రికుల సౌకర్యార్థం ఉచిత బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు. అయితే తిరుమలను పూర్తి కాలుష్య రహితంగా మార్చే క్రమంలో రెండు బ్యాటరీ(ఎలక్ట్రికల్ ఆధారిత) బస్సులను ప్రయోగాత్మకంగా నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. టీటీడీ డ్రైవర్లు కూడా తమ నైపుణ్యం, అనుభవంతో తిరుమల ఘాట్‌రోడ్డును ప్రమాదరహితంగా మార్పుచేసి అందరి మన్ననలు పొందుతున్నారని ప్రశంసించారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఆయన డ్రైవర్లకు సూచించారు.