600 బ్యాటరీ బస్సులు కావాలి! | TSRTC To Ask Central Government 600 Battery Busses | Sakshi
Sakshi News home page

600 బ్యాటరీ బస్సులు కావాలి!

Published Mon, Jun 24 2019 3:07 AM | Last Updated on Mon, Jun 24 2019 3:07 AM

TSRTC To Ask Central Government 600 Battery Busses - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చడీచప్పుడు లేకుండా రాజధానిలోని వివిధ ప్రాంతాల నుంచి విమానాశ్రయానికి దూసుకుపోతూ ప్రత్యేకాకర్షణగా నిలిచిన బ్యాటరీ బస్సులు త్వరలో ఇతర పట్టణాలను కూడా పలకరించబోతున్నాయి. హైదరాబాద్‌లో వాటి సంఖ్యను భారీగా పెంచటంతో పాటు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌తో పాటు మరికొన్ని పట్టణాల్లో నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇందుకోసం ఏకంగా 600 బస్సులు కావాలంటూ కేంద్రప్రభుత్వాన్ని కోరబోతోంది. ఈమేరకు ఈ నెలాఖరుకు దరఖాస్తు చేయబోతోంది. వీలైనన్ని ఎక్కువ బస్సులు ఇవ్వాలని అందులో కోరనున్న ఆర్టీసీ, ఒక్క హైదరాబాద్‌లోనే దాదాపు 400 బస్సులు తిప్పాలని భావిస్తోంది. మిగతా 200 బస్సులను నగరం నుంచి ఇతర పట్టణాలకు నడపాలనేది ఆలోచన.  

మూడు కేటగిరీల్లో కొత్త బస్సులు.. 
కాలుష్యానికి విరుగుడుగా భావించే బ్యాటరీ బస్సులను ప్రోత్సహించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా మోదీ ప్రభుత్వం రెండేళ్ల క్రితం ‘ఫాస్టర్‌ అడాప్షన్‌ అండ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ ఆఫ్‌ హైబ్రిడ్‌ అండ్‌ ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌’(ఫేమ్‌) పథకం ప్రారంభించింది. పథకం తొలి దశ కింద తెలంగాణకు 100 బస్సులు మంజూరయ్యాయి. వాటిల్లో 40 బస్సులు విడుదలవ్వగా వాటిని అద్దె ప్రాతిపదికన ప్రైవేటు సంస్థ ద్వారా ఆర్టీసీ ఏర్పాటు చేసుకుని విమానాశ్రయానికి నడుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రెండో విడత కింద దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు 5 వేల బస్సులను మంజూరు చేయాలని నిర్ణయించింది. తొలి దశలో బస్సు విలువలో 33 శాతం మొత్తాన్ని రాయితీగా ప్రకటించింది. హైదరాబాద్‌కు విడుదలైన బస్సుల్లో ఒక్కో దానికి రూ.కోటి చొప్పున సబ్సిడీ వచ్చింది. ఈ సారి సబ్సిడీ మొత్తాన్ని కేంద్రం తగ్గించింది. అప్పట్లో ఒకే కేటగిరీ బస్సులు విడుదలవగా, ఈసారి మూడు కేటగిరీల్లో అవి రానున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో తిరుగుతున్న బస్సులు 12 మీటర్ల పొడవున్నాయి. వీటికి అప్పట్లో రూ.కోటి చొప్పున సబ్సిడీ రాగా, ఈసారి ఆ మొత్తాన్ని రూ.50 లక్షలకు ఖరారు చేశారు. ఇక 9 మీటర్ల పొడవుండే బస్సులకు రూ.40 లక్షలు, 7 మీటర్ల పొడవుండే మినీ బస్సులకు రూ.30 లక్షలు సబ్సిడీగా అందివ్వనుంది. ఈ మూడు కేటగిరీల్లో బస్సులు కావాలంటూ ఆర్టీసీ ప్రతిపాదనలో పేర్కొంటోంది. రోడ్ల వెడల్పును బట్టి ఈ మూడు రకాల బస్సులను హైదరాబాద్‌లో వినియోగించుకోనుంది. 

వరంగల్, కరీంనగర్‌లకు.... 
స్మార్ట్‌ సిటీలుగా కేంద్రం గుర్తించిన వరంగల్, కరీంనగర్‌లకు ఒక్కో పట్టణానికి 50 బస్సుల వరకు పొందే వెసులుబాటుంది. వాటిని ఆ పట్టణాల్లో సిటీ బస్సులుగా, కొన్నింటికి పొరుగున ఉండే ప్రాంతాల మధ్య తిప్పేందుకు వీలుంది. హైదరాబాద్‌ నుంచి ఇంటర్‌సిటీ బస్సులుగా 300 కిలోమీటర్ల పరిధిలో ఉ న్న పట్టణాలకు ఈ బస్సులు నడిపే అవకాశాన్ని ‘ఫేమ్‌’ లో పొందుపరిచింది కేంద్రం. దీంతో హైదరాబాద్‌ నుంచి మహబూబ్‌నగర్, నిజామాబాద్, సిద్దిపేట తదితర పట్టణాలకు వీటిని నడిపే అవకాశముంది.  

ఖర్చు ఎక్కువే.. 
ఈ బస్సుల్లో పెద్దవాటి ధర రూ.2.50 కోట్లుగా ఉంది. ఇందులో 60 శాతం ఖర్చు దాని బ్యాటరీకే అవుతుంది. ప్రస్తుతం దేశంలో బస్సులను తయారు చేస్తున్నా.. బ్యాటరీలను మాత్రం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. గరిష్ట సామర్థ్యమున్న బ్యాటరీ ఒకసారి చార్జ్‌ చేస్తే 300 కి.మీ. పనిచేస్తుంది. అందుకే గరిష్టంగా 300 కి.మీ. దూరం ఉన్న పట్టణాల మధ్య ఈ బస్సులు తిప్పొచ్చని నిబంధనలో పొందుపరిచారు. గమ్యం చేరకుండా మధ్యలో బ్యాటరీ చార్జి చేసుకోవాల్సిన పరిస్థితి ఉండొద్దు. ఏయే పట్టణాల మధ్య ఈ బస్సులు తిరుగుతాయో ఆయా పట్టణాల్లో చార్జింగ్‌ పాయింట్లు ఉండాల్సి ఉంటుంది. నగరంలో నడుస్తున్న బస్సులకు కి.మీ.కు రూ.45 ఖర్చవుతోంది. 

కొత్త బస్సులూ అద్దె ప్రాతిపదికనే.. 
ప్రస్తుతం నగరంలో నడుస్తున్న 40 ఎలక్ట్రిక్‌ బస్సులను అద్దె బస్సులుగా వినియోగించుకుంటున్న ఆర్టీసీ, రెండో దశలో వచ్చే బస్సులను కూడా అద్దె ప్రాతిపదికనే తీసుకోనుంది. వాటిని సొంతంగా నిర్వహించాలంటే పెద్ద సంఖ్యలో సిబ్బంది అవసరమవుతా రు, నిర్వహణ వ్యయం భరించాల్సి ఉంటుంది. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి అందుకు సహకరించేలా లేనందున అద్దె బస్సులుగానే వాటిని వాడుకుంటుంది. అప్పుడు వాటి నిర్వహణ, సిబ్బంది ఖర్చులన్నీ ప్రైవేటు సంస్థలే చూసు కుంటాయి. అయితే ఈ విధానాన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.  

ప్రభుత్వ సహకారముంటేనే ఎక్కువ బస్సులు 
ఈ బ్యాటరీ బస్సుల విషయంలో రాష్ట్రప్రభుత్వం ఎలా వ్యవహరిస్తోందన్న అంశాన్ని కేంద్రం పరిశీలించనుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 40 బస్సులను ఎలా నిర్వర్తిస్తున్నారన్న విషయాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేస్తే, రెండో దశలో ఎక్కువ బస్సులు మంజూరవుతాయి. ఎలక్ట్రానిక్‌ వాహనాల విషయంలో రాష్ట్రప్రభుత్వ పాలసీ ఎలా ఉంది, అదనంగా బస్సులొస్తే వాటి నిర్వహణకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం సంసిద్ధత ఎలా ఉందో పరిశీలిస్తుంది. ఈ బస్సులకు కరెంటు చార్జి చేయటానికి 11 కేవీ సబ్‌స్టేషన్‌ అవసరమవుతుంది. దాన్ని ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందా, ప్రైవేటు సంస్థ భరించాల్సి ఉంటుందా.. తదితర వివరాలు చూసి సానుకూల పరిస్థితి ఉందని భావిస్తే ఎక్కువ బస్సులు మంజూరవుతాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement