battery capacity
-
ఓలా ఎలక్ట్రిక్ సంచనలం.. దేశంలో మరో భారీ ప్లాంట్ నిర్మాణం!
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ మన దేశంలో మరో భారీ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు సిద్దం అవుతుంది. సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్ మద్దతు గల ఓలా ఎలక్ట్రిక్ భారతదేశంలో బ్యాటరీ సెల్ తయారీ కర్మాగారాన్ని 50 గిగావాట్(జీడబ్ల్యుహెచ్) సామర్థ్యంతో నిర్మించాలని యోచిస్తోంది. 10 మిలియన్ ఎలక్ట్రిక్ స్కూటర్లను ఉత్పత్తి చేయడానికి ఓలాకు 40 జీడబ్ల్యుహెచ్ బ్యాటరీ సామర్థ్యం అవసరం. అలాగే, మిగతా 10 జీడబ్ల్యుహెచ్ బ్యాటరీ సామర్ధ్యాన్ని ఎలక్ట్రిక్ కార్ల తయారీ కోసం వినియోగించుకోవాలని భావిస్తుంది. 2023 నాటికి 1 జీడబ్ల్యుహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ సెల్ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేసి, రాబోయే 3-4 సంవత్సరాల్లో 20 జీడబ్ల్యుహెచ్'కు విస్తరించాలని చూస్తున్నట్లు సమాచారం. అయితే, ఇందుకోసం $1 బిలియన్ వరకు పెట్టుబడి అవసరం. ప్రస్తుతం దక్షిణ కొరియా నుంచి బ్యాటరీ సెల్స్'ను దిగుమతి చేసుకునే ఓలా అధునాతన సెల్ బ్యాటరీ టెక్నాలజీ ఉన్న కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలని యోచిస్తోందని ఒక కంపెనీ అధికారి తెలిపారు. ఇంకా భారతదేశంలో బ్యాటరీ పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ఆ అధికారి పేర్కొన్నారు. టెస్లా ఇంక్(టిఎస్ ఎల్ ఎ) వంటి ప్రధాన గ్లోబల్ ఆటోమేకర్లకు సరఫరా చేసే సీఏటీఎల్, ఎల్ జి ఎనర్జీ సొల్యూషన్స్, పానాసోనిక్ (6752.టి)తో సహా కొన్ని ఆసియా కంపెనీలు ప్రస్తుతం బ్యాటరీ సెల్ తయారీపై ఆధిపత్యం వహిస్తున్నాయి. దేశ చమురు దిగుమతిలను తగ్గించడం, కాలుష్యాన్ని తగ్గించడానికి కంపెనీలు స్థానికంగా గ్రీన్ ఎనర్జీ వాహనాలు, బ్యాటరీలను తయారు చేయలని కేంద్రం కోరుతోంది. ఇందుకోసం 6 బిలియన్ డాలర్ల వరకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఓలా ప్రస్తుతం రోజుకు సుమారు 1,000 స్కూటర్లను ఉత్పత్తి చేస్తోంది. (చదవండి: ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లోకి హోండా ఈవీ స్కూటర్ వచ్చేది అప్పుడే..!) -
డుగ్గు డుగ్గు బండి కాదండి.. కానీ భలేగా ఉందండి !
సాక్షి,జనగామ(వరంగల్): రోజురోజుకూ పెరుగుతున్న పెట్రో భారానికి తోడు ట్రాఫిక్ ఇబ్బందులను అదిగమించేందుకు యువత సైకిళ్లపై ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్లో వివిధ మోడళ్లు అందుబాటులో ఉండగా.. బ్యాటరీతో నడిచే చార్జింగ్ సైకిళ్లు ఆకట్టుకుంటున్నాయి. వీటితో పొల్యూషన్ బాధ లేకపోవగా.. నిత్యం వ్యాయామం చేసినట్లవుతుంది. పట్టణానికి చెందిన సుధీర్ కార్తీక్ చార్జింగ్ సైకిల్‌ను ఆన్లైన్లో కొనుగోలు చేసి చక్కర్లు కొడుతున్నాడు. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 25 కిలోమీటర్ల వేగంతో 50 కిలోమీటర్లు వెళ్లవచ్చని చెప్పారు. రూ.81,800 ధరకు కొనుగోలు చేసిన ఈ సైకిల్‌కు మూడేళ్ల వరకు ఎలాంటి మెయింటనెన్స్ ఉండదని వివరించాడు. దీనిని ఫోల్డ్ కూడా చేయవచ్చని పేర్కొన్నాడు. చదవండి: 6 నెలల క్రితమే వివాహం.. భార్య పుట్టింటికి వెళ్లిందని.. -
అయిదు నిమిషాల్లోనే బ్యాటరీ చార్జింగ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత ఆటో మొబైల్ రంగంలో ఇప్పుడు ‘ఎలక్ట్రిక్’ హాట్ టాపిక్‌గా మారింది. ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఉన్న కంపెనీలు అధిక సామర్థ్యమున్న బ్యాటరీల తయారీపై ఫోకస్ చేశాయి. ఈవీ టెక్నాలజీలో ఉన్న సింగపూర్ సంస్థ షాడో గ్రూప్ అనుబంధ కంపెనీ అయిన బెంగళూరుకు చెందిన అదరిన్ ఇంజనీరింగ్ టెక్నాలజీస్ ఓ అడుగు ముందుకేసి అల్ట్రా కెపాసిటర్ బ్యాటరీని అభివృద్ధి చేసింది. అయిదు నిమిషాల్లోనే చార్జింగ్ పూర్తి అవడం దీని ప్రత్యేకత. ఎరిక్ పేరుతో రూపొందించిన త్రిచక్ర వాహనానికై ఈ బ్యాటరీని తయారు చేశారు. బ్యాటరీని ఒకసారి చార్జింగ్ చేస్తే వాహనం 70 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. యూనివర్సిటీ ఆఫ్ మ్యూనిచ్ ఈ టెక్నాలజీని ధ్రువీకరించింది. అంతేకాదు 10 ఏళ్లపాటు మన్నుతుందని స్పష్టం చేసిందని షాడో గ్రూప్ కో–సీఈవో సౌరభ్ మార్కండేయ సాక్షి బిజినెస్ బ్యూరో ప్రతినిధికి వెల్లడించారు. డీజిల్ వాహనంతో పోలిస్తే ఖర్చు 25–30 శాతం తగ్గుతుందని చెప్పారు. గంటకు 50 కిలోమీటర్ల వేగం.. ఎరిక్ బ్రాండ్‌లో ప్యాసింజర్ వేరియంట్‌తోపాటు కార్గో రకం కూడా రూపొందించారు. ప్యాసింజర్ వాహనం గంటకు 50 కిలోమీటర్లు, కార్గో మోడల్ 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. కార్గోలో 550 కిలోల సరుకు రవాణా చేయవచ్చు. రెండు రకాల బ్యాటరీలను అందుబాటులోకి తెచ్చామని సౌరభ్ మార్కండేయ తెలిపారు. ‘అల్ట్రా కెపాసిటర్ బ్యాటరీ జీవిత కాలం 10 ఏళ్లు. ధర రూ.4 లక్షలు. లిథియం అయాన్ బ్యాటరీ జీవిత కాలం రెండున్నరేళ్లు. చార్జింగ్కు 8 గంటలు పడుతుంది. ఒకసారి చార్జింగ్ చేస్తే 80–100 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. ధర రూ. లక్ష ఉంది. అల్ట్రా కెపాసిటర్ అభివృద్ధికి రెండేళ్లు పట్టింది. ఈ మోడల్ వాహనాలు ఇండోనేషియాకు ఎగుమతి చేయనున్నాం. భారత్‌లో క్యాబ్ అగ్రిగేటర్లు, లాజిస్టిక్స్ కంపెనీలతో మాట్లాడుతున్నాం. 2019 అక్టోబరు నుంచి మార్కెట్లో వాహనం అందుబాటులో ఉంటుంది’ అని చెప్పారు. పుణేలో ఉన్న ప్లాంటు కోసం షాడో గ్రూప్ రూ.70 కోట్లు వెచ్చిస్తోంది. సౌరభ్ మార్కండేయ -
ఇక బ్యాటరీ ఖర్చయిపోదు...
స్మార్ట్ఫోన్లు కొనేవారెవరైనా కచ్చితంగా అడిగే ప్రశ్న.. బ్యాటరీ సామర్థ్యం ఎంత? మిసోరీ యూనివర్శిటీ శాస్త్రవేత్త దీపక్ కె.సింగ్ పరిశోధనల కారణంగా సమీప భవిష్యత్తులో ఈ ప్రశ్నకు అర్థమే ఉండదు. ఎందుకంటే సామర్థ్యాన్ని ఏకంగా వంద రెట్లు పెంచడమే కాకుండా.. వేడి కూడా పుట్టని సరికొత్త పదార్థాన్ని ఈయన అభివృద్ధి చేశారు! వినూత్నమైన ఆకారం కలిగి ఉండే ఈ పదార్థం అయస్కాంత ధర్మాల ఆధారంగా పనిచేస్తుందని అంచనా. సిలికాన్, జెర్మేనియం వంటి అర్ధవాహకాలతో ఇప్పటివరకూ సెమీకండక్టర్ డయోడ్లు, ఆంప్లిఫయర్లు తయారు చేస్తూండగా తాము వీటి స్థానంలో అయస్కాంత ఆధారిత పదార్థాలను వాడితే మేలని గుర్తించామని దీపక్ సింగ్ తెలిపారు. ఫలితంగా విద్యుత్తు ప్రవాహ సమయంలో జరిగే నష్టాలను తక్కువస్థాయికి చేర్చామని, దీనివల్ల బ్యాటరీ వంద రెట్లు ఎక్కువ కాలం నడవడంతోపాటు విద్యుత్తు నష్టం వల్ల ఉత్పత్తి అయ్యే వేడిని కూడా లేకుండా చేయగలిగామని ఆయన వివరించారు. డయోడ్లతో పాటు ట్రాన్సిస్టర్లు, యాంప్లిఫయర్ల వంటి వాటిని కూడా అయస్కాంత పదార్థాల ఆధారంగా తయారుచేస్తే కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల సామర్థ్యం మరింత పెరిగే అవకాశముందని చెప్పారు. ఈ కొత్తరకం పరికరాలతో తయారైన స్మార్ట్‌ఫోన్‌ను ఐదు గంటలపాటు ఛార్జ్ చేస్తే 500 గంటలపాటు పనిచేస్తుందని అంచనా. -
ఐఫోన్7 బ్యాటరీ ఎంత పెద్దదో తెలుసా?
శాన్ఫ్రాన్సిస్కోలోని బిల్ గ్రాహం సివిక్ ఆడిటోరియం వేదికగా ఎంతో ప్రతిష్టాత్మకంగా లాంచ్ అయిన ఐఫోన్7, ఐఫోన్7 ప్లస్ స్మార్ట్ఫోన్ల బ్యాటరీ సామర్థ్యమెంతా అంటే అందరికీ సందేహమే. ఎందుకంటే ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయాలను పాటిస్తూ.. యాపిల్ ఈతరం ఫోన్లకూ ర్యామ్, బ్యాటరీ సైజులను ముందుగా రివీల్ చేయలేదు. కానీ ప్రస్తుతం తీసుకొస్తున్న ఈ ఫోన్ల బ్యాటరీ సామర్థ్యాలు ముందు వాటికంటే ఎక్కువ కెపాసిటీలను కలిగి ఉంటాయని మాత్రం యాపిల్ ఆవిష్కరణ ఈవెంట్లోనే పేర్కొంది. ప్రస్తుతం ఈ రెండు హ్యాండ్ సెట్లు చైనీస్ సర్టిఫికేషన్ వెబ్సైట్ టీనాలో లిస్టు అయ్యాయట. దీంతో ఈ ఫోన్ల బ్యాటరీ సైజులు బయటి పొక్కేశాయి. ఈ వెబ్సైట్ లిస్టింగ్ ప్రకారం ఐఫోన్7 ప్లస్ 2,900 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉందట. ఐఫోన్ 6ఎస్ ప్లస్ కంటే ఈ బ్యాటరీ కొంచెం పెద్దదని వెల్లడైంది. చిన్న ఫోన్ ఐఫోన్7 బ్యాటరీ సామర్థ్యం 1,960 ఎంఏహెచ్ మాత్రమేనట. ఇది కూడా ఐఫోన్ 6ఎస్ కంటే పెద్దదిగానే ఉందని తెలుస్తోంది. 3జీ ఇంటర్నెట్ వాడితే 12 గంటల వరకు పనిచేయనుందని టీనా సర్టిఫికేషన్ తెలిపింది. ముందుతరం ఐఫోన్ల కంటే ఈ బ్యాటరీలు 14 శాతం పెద్దవిగా ఉన్నాయని టీనా సర్టిఫికేషన్ వెల్లడిస్తోంది. కానీ యాపిల్ ఇప్పటివరకు బ్యాటరీ సామర్థ్యాలపై అధికారికంగా ప్రకటించలేదు. సిల్వర్, గోల్డ్, రోజ్ గోల్డ్, జెట్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్లను యాపిల్ ఆవిష్కరించింది. 32జీబీ, 128జీబీ, 256జీబీ స్టోరేజ్ వేరియంట్లగా వినియోగదారుల ముందుకు వచ్చాయి. ఇండియాలో ఈ ఫోన్ల విక్రయాలు అక్టోబర్ 7 నుంచి చేపట్టనున్నారు. ప్రారంభధర రూ.60వేలు. ఆండ్రాయిడ్ ఫోన్లతో పోలిస్తే ఈ బ్యాటరీ సామర్థ్యాలేమీ ఆశించదగ్గ రీతిలో లేవని టెక్ విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. చాలా ఆండ్రాయిడ్ ఫోన్లు ఇప్పటికే 3,000ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీతో వినియోగదారులను అలరిస్తున్నాయి. కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్లు పవర్ బ్యాంకును కూడా ఆఫర్ చేస్తున్నాయి. అయితే చిన్న బ్యాటరీ, పూర్ బ్యాటరీ లైఫ్‌ను కలిగి ఉంటుందనడంలో ఎలాంటి రుజువు లేదంటున్నారు మరికొంతమంది విశ్లేషకులు. తక్కువ వనరులతోనే ఎక్కువ సేపు పనిచేసేలా చేయొచ్చని చెబుతున్నారు. ర్యామ్ కెపాసిటీని కూడా యాపిల్ రివీల్ చేయలేదు. బెంచ్ మార్కింగ్ వెబ్సైట్ గీక్‌బెంచ్, సర్టిఫికేషన్ పోర్టల్ టీనాలు ఐఫోన్ 7 ప్లస్ 3జీబీ ర్యామ్‌ను కలిగి ఉంటుందని అంచనావేస్తున్నాయి. -
విప్లవాత్మక ఫీచర్లతో ఐఫోన్ 7!
కాలిఫోర్నియా: ఎప్పటికప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఐఫోన్, ఐపాడ్ సిరీస్‌ను తీసుకొస్తూ ఎలక్ట్రానిక్స్ రంగంలో ముందుకు దూసుకెళుతున్న అమెరికా దిగ్గజం ఆపిల్ కంపెనీ మరిన్ని విప్లవాత్మక ఫీచర్లతో త్వరలోనే ఐఫోన్ 7 సిరీస్‌ను తీసుకరానుంది. ఇయర్ ఫోన్స్, హెడ్ఫోన్ల కోసం ఉపయోగించే సాకెట్‌ను, బ్యాటరీ చార్జింగ్ కోసం ఉపయోగించే 3.5 జాక్‌ను పూర్తిగా ఎత్తివేస్తోంది. అంటే, ఇకముందు వైర్లెస్ ఇయర్ ఫోన్స్, హెడ్‌ఫోన్స్ అందుబాటులో ఉంటాయి. బ్యాటరీ చార్జింగ్కు, ఇయర్, హెడ్‌ఫోన్స్‌కు కనెక్ట్ కావడానికి ఇప్పటికే కొన్ని మోడల్స్లోవున్న లైటనింగ్ కనెక్టర్ వ్యవస్థనే ఉపయోగిస్తారు. ఈ లైటనింగ్ కనెక్టర్ లేదా బ్లూటూత్ ద్వారా ఇయర్ లేదా హెడ్ఫోన్లకు కనెక్ట్ చేసుకోవచ్చు. 30 పిన్స్ ఉండే 3.5 జాక్‌ను ఉపయోగిస్తుండడం వల్ల ఐఫోన్ 6ఎస్ సిరీస్‌ను 7.1 మిల్లీమీటర్లకన్నా తక్కువ మందానికి తయారు చేయలేకపోయారు. ఇప్పుడు ఆ స్థానంలో 8 పిన్స్‌తో పనిచేసే లైటనింగ్ కనెక్టర్‌ను తీసుకరావడం వల్ల ఫోన్ మందం కూడా 1 ఎంఎం తగ్గుతుంది. ఈ కొత్త సిరీస్‌లో ఉండే మరో ఆకర్షనీయమైన ఫీచర్ ఏమిటంటే....నాయిస్ కన్సీలింగ్ (అనవసర శబ్దాలను నియంత్రించే)టెక్నాలజీని ఉపయోగించాలనుకోవడం. దీనికోసం ఎప్పటి నుంచో ఆపిల్ చిప్ పార్టనర్‌గా పనిచేస్తున్న ‘సైరస్ లాజిక్’కు ప్రాజెక్ట్ కాంట్రక్ట్ ఇచ్చినట్లు కంపెనీకి చెందిన విశ్వసనీయ వర్గాలు తెలియజేస్తున్నాయి. నాయిస్ కన్సీలింగ్ వ్యవస్థ ఫోన్ అంతర్భాగంలోనే ఉండడం వల్ల ఫోన్లోని స్పీకర్ల గుండా కూడా స్పష్టమైన వాయిస్‌ను వినవచ్చు. లైటనింగ్ కనెక్టర్ ద్వారా కూడా ఇయర్ లేదా హెడ్ ఫోన్లలో మరింత స్పష్టంగా వాయిస్ వినిపిస్తుందని ఆ వర్గాలు వివరించాయి. పాత ఐఫోన్లకు కూడా ఉపయోగపడేలాగా కొత్త ఐఫోన్లతోపాటు అడాప్టర్లను అందజేస్తారని తెల్సింది. అయితే ఈ సరికొత్త ఫీచర్లు కలిగిన ఐఫోన్ 7 సిరీస్ ఎప్పుడు మార్కెట్లోకి వచ్చేది కంపెనీ వర్గాలు తెలపడం లేదు.