విప్లవాత్మక ఫీచర్లతో ఐఫోన్ 7!
కాలిఫోర్నియా: ఎప్పటికప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఐఫోన్, ఐపాడ్ సిరీస్‌ను తీసుకొస్తూ ఎలక్ట్రానిక్స్ రంగంలో ముందుకు దూసుకెళుతున్న అమెరికా దిగ్గజం ఆపిల్ కంపెనీ మరిన్ని విప్లవాత్మక ఫీచర్లతో త్వరలోనే ఐఫోన్ 7 సిరీస్‌ను తీసుకరానుంది.
ఇయర్ ఫోన్స్, హెడ్‌ఫోన్ల కోసం ఉపయోగించే సాకెట్‌ను, బ్యాటరీ చార్జింగ్ కోసం ఉపయోగించే 3.5 జాక్‌ను పూర్తిగా ఎత్తివేస్తోంది. అంటే, ఇకముందు వైర్‌లెస్ ఇయర్ ఫోన్స్, హెడ్‌ఫోన్స్ అందుబాటులో ఉంటాయి. బ్యాటరీ చార్జింగ్‌కు, ఇయర్, హెడ్‌ఫోన్స్‌కు కనెక్ట్ కావడానికి ఇప్పటికే కొన్ని మోడల్స్‌లోవున్న లైటనింగ్ కనెక్టర్ వ్యవస్థనే ఉపయోగిస్తారు. ఈ లైటనింగ్ కనెక్టర్ లేదా బ్లూటూత్ ద్వారా ఇయర్ లేదా హెడ్‌ఫోన్లకు కనెక్ట్ చేసుకోవచ్చు.
30 పిన్స్ ఉండే 3.5 జాక్‌ను ఉపయోగిస్తుండడం వల్ల ఐఫోన్ 6ఎస్ సిరీస్‌ను 7.1 మిల్లీమీటర్లకన్నా తక్కువ మందానికి తయారు చేయలేకపోయారు. ఇప్పుడు ఆ స్థానంలో 8 పిన్స్‌తో పనిచేసే లైటనింగ్ కనెక్టర్‌ను తీసుకరావడం వల్ల ఫోన్ మందం కూడా 1 ఎంఎం తగ్గుతుంది. ఈ కొత్త సిరీస్‌లో ఉండే మరో ఆకర్షనీయమైన ఫీచర్ ఏమిటంటే....నాయిస్ కన్సీలింగ్ (అనవసర శబ్దాలను నియంత్రించే)టెక్నాలజీని ఉపయోగించాలనుకోవడం. దీనికోసం ఎప్పటి నుంచో ఆపిల్ చిప్ పార్టనర్‌గా పనిచేస్తున్న ‘సైరస్ లాజిక్’కు ప్రాజెక్ట్ కాంట్రక్ట్ ఇచ్చినట్లు కంపెనీకి చెందిన విశ్వసనీయ వర్గాలు తెలియజేస్తున్నాయి.
నాయిస్ కన్సీలింగ్ వ్యవస్థ ఫోన్ అంతర్భాగంలోనే ఉండడం వల్ల ఫోన్‌లోని స్పీకర్ల గుండా కూడా స్పష్టమైన వాయిస్‌ను వినవచ్చు. లైటనింగ్ కనెక్టర్ ద్వారా కూడా ఇయర్ లేదా హెడ్ ఫోన్లలో మరింత స్పష్టంగా వాయిస్ వినిపిస్తుందని ఆ వర్గాలు వివరించాయి. పాత ఐఫోన్లకు కూడా ఉపయోగపడేలాగా కొత్త ఐఫోన్లతోపాటు అడాప్టర్లను అందజేస్తారని తెల్సింది. అయితే ఈ సరికొత్త ఫీచర్లు కలిగిన ఐఫోన్ 7 సిరీస్ ఎప్పుడు మార్కెట్‌లోకి వచ్చేది కంపెనీ వర్గాలు తెలపడం లేదు.