ఐఫోన్7 బ్యాటరీ ఎంత పెద్దదో తెలుసా? | Apple iPhone 7, iPhone 7 Plus battery capacity detailed | Sakshi
Sakshi News home page

ఐఫోన్7 బ్యాటరీ ఎంత పెద్దదో తెలుసా?

Published Wed, Sep 14 2016 8:59 AM | Last Updated on Mon, Aug 20 2018 2:55 PM

ఐఫోన్7 బ్యాటరీ ఎంత పెద్దదో తెలుసా? - Sakshi

ఐఫోన్7 బ్యాటరీ ఎంత పెద్దదో తెలుసా?

శాన్ఫ్రాన్సిస్కోలోని బిల్ గ్రాహం సివిక్ ఆడిటోరియం వేదికగా ఎంతో ప్రతిష్టాత్మకంగా లాంచ్ అయిన ఐఫోన్7, ఐఫోన్7 ప్లస్ స్మార్ట్ఫోన్ల బ్యాటరీ సామర్థ్యమెంతా అంటే అందరికీ సందేహమే. ఎందుకంటే ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయాలను పాటిస్తూ.. యాపిల్ ఈతరం ఫోన్లకూ ర్యామ్, బ్యాటరీ సైజులను ముందుగా రివీల్ చేయలేదు. కానీ ప్రస్తుతం తీసుకొస్తున్న ఈ ఫోన్ల బ్యాటరీ సామర్థ్యాలు ముందు వాటికంటే ఎక్కువ కెపాసిటీలను కలిగి ఉంటాయని మాత్రం యాపిల్ ఆవిష్కరణ ఈవెంట్లోనే పేర్కొంది. ప్రస్తుతం ఈ రెండు హ్యాండ్ సెట్లు చైనీస్ సర్టిఫికేషన్ వెబ్సైట్ టీనాలో లిస్టు అయ్యాయట. దీంతో ఈ ఫోన్ల బ్యాటరీ సైజులు బయటి పొక్కేశాయి.
 
ఈ వెబ్సైట్ లిస్టింగ్ ప్రకారం ఐఫోన్7 ప్లస్ 2,900 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉందట. ఐఫోన్ 6ఎస్ ప్లస్ కంటే ఈ బ్యాటరీ కొంచెం పెద్దదని వెల్లడైంది. చిన్న ఫోన్ ఐఫోన్7 బ్యాటరీ సామర్థ్యం 1,960 ఎంఏహెచ్ మాత్రమేనట. ఇది కూడా ఐఫోన్ 6ఎస్ కంటే పెద్దదిగానే ఉందని తెలుస్తోంది. 3జీ ఇంటర్నెట్ వాడితే 12 గంటల వరకు పనిచేయనుందని టీనా సర్టిఫికేషన్ తెలిపింది. ముందుతరం ఐఫోన్ల కంటే ఈ బ్యాటరీలు 14 శాతం పెద్దవిగా ఉన్నాయని టీనా సర్టిఫికేషన్ వెల్లడిస్తోంది. కానీ యాపిల్ ఇప్పటివరకు బ్యాటరీ సామర్థ్యాలపై అధికారికంగా ప్రకటించలేదు. సిల్వర్, గోల్డ్, రోజ్ గోల్డ్, జెట్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్లను యాపిల్ ఆవిష్కరించింది. 32జీబీ, 128జీబీ, 256జీబీ స్టోరేజ్ వేరియంట్లగా వినియోగదారుల ముందుకు వచ్చాయి. ఇండియాలో ఈ ఫోన్ల విక్రయాలు అక్టోబర్ 7 నుంచి చేపట్టనున్నారు. ప్రారంభధర రూ.60వేలు.  
 
ఆండ్రాయిడ్ ఫోన్లతో పోలిస్తే ఈ బ్యాటరీ సామర్థ్యాలేమీ ఆశించదగ్గ రీతిలో లేవని టెక్ విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. చాలా ఆండ్రాయిడ్ ఫోన్లు ఇప్పటికే 3,000ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీతో వినియోగదారులను అలరిస్తున్నాయి. కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్లు పవర్ బ్యాంకును కూడా ఆఫర్ చేస్తున్నాయి. అయితే చిన్న బ్యాటరీ, పూర్ బ్యాటరీ లైఫ్ను కలిగి ఉంటుందనడంలో ఎలాంటి రుజువు లేదంటున్నారు మరికొంతమంది విశ్లేషకులు. తక్కువ వనరులతోనే ఎక్కువ సేపు పనిచేసేలా చేయొచ్చని చెబుతున్నారు. ర్యామ్ కెపాసిటీని కూడా యాపిల్ రివీల్ చేయలేదు. బెంచ్ మార్కింగ్ వెబ్సైట్ గీక్బెంచ్, సర్టిఫికేషన్ పోర్టల్ టీనాలు ఐఫోన్ 7 ప్లస్ 3జీబీ ర్యామ్ను కలిగి ఉంటుందని అంచనావేస్తున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement