చెన్నై సూపర్ కింగ్స్ శుభారంభం
టోర్నీ ఫేవరెట్ జట్లలో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్ స్థాయికి తగ్గ ఆటతీరుతో చాంపియన్స్‌లీగ్‌లో బోణి చేసింది. బౌలర్ల వైఫల్యంతో తడబడ్డా... బ్యాట్స్‌మెన్ సంచలనాత్మక హిట్టింగ్తో టైటాన్స్‌ను చిత్తు చేసింది. మొత్తం మీద భారీ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించి లీగ్‌ను ధీమాగా ప్రారంభించింది.
రాంచీ: టి20ల్లో భారీ లక్ష్యం ఎదురైతే సగం జట్లు ముందు ఒత్తిడికి లోనై ఓడిపోతాయి. కానీ బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ఆ భారీ లక్ష్యాన్ని కూడా మంచినీళ్ల ప్రాయంలా ఛేదించి చాంపియన్స్ లీగ్‌ను సంచలన విజయంతో ప్రారంభించింది. జేఎస్సీఏ స్టేడియంలో ఆదివారం జరిగిన గ్రూప్ బి లీగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ నాలుగు వికెట్లతో టైటాన్స్‌ను ఓడించింది.
టాస్ గెలిచిన ధోని బౌలింగ్ ఎంచుకోగా... టైటాన్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ డేవిడ్స్ (43 బంతుల్లో 52; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీ చేశాడు. తొలి వికెట్‌కు డేవిడ్స్, రుడాల్ఫ్ (17 బంతుల్లో 21; 4 ఫోర్లు) 46 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చారు. డివిలియర్స్ (36 బంతుల్లో 77; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) వచ్చాక ఇక మిగిలిన ఆటగాళ్లంతా ప్రేక్షకులయ్యారు. బౌలర్ ఎవరనే అంశంతో సంబంధం లేకుండా విధ్వంసం సృష్టించిన డివిలియర్స్.... రెండో వికెట్‌కు డేవిడ్స్తో కలిసి 37 బంతుల్లోనే 76 పరుగులు జోడించాడు. బెహర్డిన్ (14 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్సర్) రాణించాడు. చెన్నై బౌలర్లలో బ్రేవోకు రెండు వికెట్లు దక్కాయి.
చెన్నై సూపర్ కింగ్స్జట్టు 18.5 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసి గెలిచింది. విజయ్ (0) ఆడిన తొలి బంతికే అవుటైనా... హస్సీ (26 బంతుల్లో 47; 7 ఫోర్లు, 1 సిక్సర్), రైనా (28 బంతుల్లో 47; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు 44 బంతుల్లోనే 89 పరుగులు జోడించి టైటాన్స్‌ను ఒత్తిడిలోకి నెట్టారు. ఈ ఇద్దరూ అవుటైనా... బ్రేవో (26 బంతుల్లో 38; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) చెన్నై జోరును కొనసాగించాడు. చివర్లో బ్రేవోతో పాటు ధోని, జడేజా కూడా స్వల్ప విరామంలో వెనుదిరిగినా... బద్రీనాథ్ (20 బంతుల్లో 20 నాటౌట్; 2 ఫోర్లు) తడబాటు లేకుండా మ్యాచ్‌ను ముగించాడు.టైటాన్స్ బౌలర్లు 24 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో సమర్పించుకున్నారు. రిచర్డ్స్ 3 వికెట్లు తీసుకున్నాడు.
స్కోరు వివరాలు
టైటాన్స్ ఇన్నింగ్స్: డేవిడ్స్ (స్టం) ధోని (బి) అశ్విన్ 52; రుడాల్ఫ్ రనౌట్ 21; డివిలియర్స్ (సి) బ్రేవో (బి) జడేజా 77; బెహర్డిన్ (సి) హోల్డర్ (బి) బ్రేవో 21; వీస్ (సి) అశ్విన్ (బి) బ్రేవో 0; వాన్‌డర్ మెర్వ్ నాటౌట్ 1; మోసెహెలె నాటౌట్ 4; ఎక్స్‌ట్రాలు (బై 1, లెగ్‌బైస్ 5, వైడ్లు 3) 9; మొత్తం (20 ఓవర్లలో 5వికెట్లకు) 185.
వికెట్ల పతనం: 1-46; 2-122; 3-154; 4-154; 5-179.
బౌలింగ్: మోహిత్ శర్మ 4-0-27-0; హోల్డర్ 4-0-25-0; అశ్విన్ 4-0-36-1; ఆల్బీ మోర్కెల్ 1-0-8-0; జడేజా 3-0-49-1; డ్వేన్ బ్రేవో 4-0-34-2.
చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: మైక్ హస్సీ (సి) డివిలియర్స్ (బి) మోర్కెల్ 47; మురళీ విజయ్ (బి) వాన్‌డెర్ మెర్వ్ 0; సురేశ్ రైనా (సి) మోర్కెల్ (బి) వీస్ 47; బద్రీనాథ్ నాటౌట్ 20; డ్వేన్ బ్రేవో (సి) మోసెహెలె (బి) రిచర్డ్స్ 38; ధోని (సి) డివిలియర్స్ (బి) రిచర్డ్స్ 7; జడేజా (బి) రిచర్డ్స్ 0; మోర్కెల్ నాటౌట్ 4; ఎక్స్‌ట్రాలు (వైడ్లు 24) 24; మొత్తం (18.5 ఓవర్లలో 6 వికెట్లకు) 187.
వికెట్ల పతనం: 1-6; 2-95; 3-114; 4-172; 5-181; 6-183.
బౌలింగ్: వాన్ డెర్ మెర్వ్ 3-0-25-1; మోర్నీ మోర్కెల్ 4-0-47-1; రొవాన్ రిచర్డ్స్ 3.5-0-29-3; డిలాంజ్ 3-0-34-0; వీస్ 3-0-29-1; డేవిడ్స్ 2-0-23-0.
చాంపియన్స్ లీగ్‌లో నేడు
లయన్స్ x పెర్త్
సా. గం. 4.00 నుంచి
ముంబై x ఒటాగో
రా. గం. 8.00 నుంచి
వేదిక: అహ్మదాబాద్
స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం