ఊహించినట్లుగానే ఇంగ్లండ్ మెరుపు బ్యాటింగ్ లైనప్ ఆ జట్టుకు విజయాన్ని అందించింది. ఈ రోజుల్లో ఎంత భారీ స్కోరు చేసినా గెలుపుపై నమ్మకం ఉంచలేం. అందులోనూ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఎలా ఆడాలో ఇటీవల బాగా ఒంటబట్టించుకున్న ఇంగ్లండ్‌తో అయితే అది మరీ కష్టం. ఏ దశలో కూడా ఆతిథ్య జట్టు తడబడకపోవడం చూస్తే ఈ ఫార్మాట్ బ్యాటింగ్‌కు ఎంత అనుకూలమో అర్థమవుతోంది. బంతికి, బ్యాట్‌కు మధ్య హోరాహోరీ పోరు జరిగే విధంగా పిచ్‌లో ఎంతో కొంత జీవం ఉంచాలి. కేవలం బౌండరీలు బాదడంలోనే పోటీ పడినట్లుగా మ్యాచ్ అనిపించకూడదు. అదే రోజు ప్రత్యర్థిని ఆలౌట్ కూడా చేయకుండా 92 పరుగులను కాపాడుకోవడం కూడా మనం చూశాం.
ఈ రకంగా మరీ బౌలింగ్ పక్షాన కూడా అనుకూలత ఉండరాదు. నెమ్మదైన, టర్నింగ్ పిచ్‌లు రూపొందించడం తప్పు కాదు కానీ అదే అలవాటుగా మారిపోకూడదు. 50 ఓవర్ల క్రికెట్ బాల్యావస్థలో ఉన్నప్పుడు బ్యాటింగ్‌కు బాగా అనుకూలమైన పిచ్‌లపై కూడా సగటున ఓవర్‌కు నాలుగు పరుగులే వచ్చేవి. ఆ తర్వాత బరువైన బ్యాట్‌లు రావడం, తెల్ల బంతి పూర్తిగా స్వభావం మార్చుకోవడం, మధ్యాహ్నం సమయంలో మ్యాచ్‌లు మొదలు కావడంతో పాటు పస లేని పిచ్‌లు రావడంతో బంతికో పరుగు చొప్పున చేయడం సాధారణంగా మారిపోయింది. నా దృష్టిలో 150–160 స్కోరు చేసిన తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసే జట్టుకు కూడా సమాన విజయావకాశం ఉంటే మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుంది.
అభిమానులు అలాంటి మ్యాచ్‌లు చూసేందుకు ఇష్టపడతారు. ఇప్పుడు టి20ల్లో అంతర్జాతీయ మ్యాచ్‌లు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి నిర్వాహకులు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే వారి పరిస్థితి కూడా వన్డేలలాగే మారుతుంది. ఇక చివరి టి20 విషయానికి వస్తే ఇంగ్లండ్ చాలా బలంగా కనిపిస్తుండగా, ముందుగా బ్యాటింగ్ చేస్తే పాకిస్తాన్ గెలుపు అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. వికెట్‌ను చూస్తే ఎంతటి లక్ష్యమైనా ఛేదించవచ్చని అనిపిస్తుంది. ఈ స్థితిలో టాస్ కీలకం. పాక్ ఫీల్డింగ్ ఎంచుకొని ఇంగ్లండ్‌ను 200 లోపు కట్టడి చేయగలిగితే సిరీస్ సమం చేసేందుకు వారికి మంచి అవకాశం లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment