అత్యంత అరుదైన, క్లిష్టమైన పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ పునరాగమనం కావడానికి తోడ్పడిన ఇంగ్లండ్, వెస్టిండీస్, పాకిస్తాన్ జట్లకు ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రస్తుతం నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల్లో నియమ నిబంధనలు పాటించాలంటే చాలా క్రమశిక్షణ, అంకితభావం కావాలి. సరైన సన్నాహాలు లేకుండానే క్రికెటర్లు బరిలోకి దిగి గత ఆరు టెస్టుల్లో నాణ్యమైన క్రికెట్‌ను ఆడారు. ఎంత పేరున్న క్రీడాకారులైనా విరామం తర్వాత బరిలోకి దిగి ఫామ్‌లోకి రావడానికి కాస్త సమయం తీసుకుంటారు. ఇక నేటి నుంచి మొదలయ్యే ఇంగ్లండ్, పాకిస్తాన్ మధ్య మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లోనూ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేస్తారని ఆశిస్తున్నాను. ఆతిథ్య ఇంగ్లండ్ జట్టులోని ఆటగాళ్లకు ఈ సిరీస్ ఐపీఎల్ టోర్నీకి ప్రాక్టీస్‌లా పనికొస్తుంది. పాకిస్తాన్ జట్టుకేమో తమ యువ ఆటగాళ్ల సత్తాను పరీక్షించే అవకాశం లభించనుంది. అన్ని ఫార్మాట్‌లలో రాణించే బ్యాట్స్‌మన్‌గా పేరున్న పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌పైనే అందరి దృష్టి ఉండనుంది.
అనుభవజ్ఞులు, యువ ఆటగాళ్ల మేళవింపుతో పాక్ సమతూకంగా కనిపిస్తోంది. టెస్టు ఫార్మాట్‌కు, వన్డే ఫార్మాట్‌కు వేర్వేరు ఆటగాళ్లను ఎంపిక చేయడం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు మంచి ఆలోచన. వన్డే, టి20 ఫార్మాట్‌లలో ఇంగ్లండ్ విజయరహస్యం కూడా ఇదే అంటే అతిశయోక్తి కాదు. భవిష్యత్‌లో ఇతర జట్లూ దీనిని అనుసరించే అవకాశముంది. బెన్ స్టోక్స్, జాస్ బట్లర్ టి20 జట్టులోనూ తమ స్థానాలను నిలబెట్టుకుంటారు. అయితే ఇంగ్లండ్ టెస్టు జట్టులోని ఇతర ఆటగాళ్లకు టి20ల్లో ఆడే చాన్స్ రాకపోవచ్చు. సొంతగడ్డపై ఆడనుండటం, జట్టులో పవర్‌ఫుల్ హిట్టింగ్ చేసే బ్యాట్స్‌మెన్ ఉండటంతో టి20 సిరీస్‌లో ఇంగ్లండ్ జట్టు ఫేవరెట్‌గా కనిపిస్తోంది. కానీ పాకిస్తాన్ జట్టును తక్కువ అంచనా వేయలేము. మొత్తానికి టి20 సిరీస్ ఉత్కంఠభరితంగా సాగుతుందని అనుకుంటున్నాను. రెండు జట్లకు నా తరఫున అభినందనలు. ఉత్తమ జట్టునే విజయం వరిస్తుందని ఆశిస్తున్నాను.
Comments
Please login to add a commentAdd a comment