బీఎంఎం సిమెంట్స్ కొనుగోలు ప్రక్రియ మే నాటికి పూర్తి
సాగర్ సిమెంట్స్ ఈడీ శ్రీకాంత్ రెడ్డి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిమెంటు తయారీలో ఉన్న సాగర్ సిమెంట్స్.. బీఎంఎం సిమెంట్స్ కొనుగోలు ప్రక్రియను మే నెలలో పూర్తి చేయాలని కృతనిశ్చయంతో ఉంది. ఇరు కంపెనీల మధ్య గతేడాది నవంబరులో వాటా కొనుగోలు ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. కొనుగోలు ప్రక్రియకు సంబంధించిన ఇతర లాంఛనాలు మే 15కల్లా పూర్తి అవుతాయని సాగర్ సిమెంట్స్ ఈడీ శ్రీకాంత్ రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు.
బీఎంఎం ఉత్పత్తి చేస్తున్న సిమెంటును కొనుగోలు చేసి సాగర్ సిమెంట్స్ బ్రాండ్‌తో విక్రయిస్తున్నట్టు కంపెనీ శుక్రవారం బీఎస్ఈకి వెల్లడించింది. బీఎంఎం కొనుగోలుకై సాగర్ సిమెంట్స్ రూ.540 కోట్లను వెచ్చిస్తోంది. బీఎంఎంకు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలో ఏటా 10 లక్షల టన్నుల సిమెంటు ఉత్పత్తి చేయగల ప్లాంటుతోపాటు 25 మెగావాట్ల బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంటు ఉంది. ఈ కంపెనీ చేరికతో సాగర్ సిమెంట్స్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 37.5 లక్షల టన్నులకు చేరుకుంది.