BC boys hostel
-
రాజోలు బీసీ బాయ్స్ హాస్టల్ లో విద్యార్థలు ఆకలి కేకలు
-
హాస్టల్లో 78 మంది పిల్లలు?.. అక్కడ ఒక్కరుంటే ఒట్టు
ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. జిల్లా వ్యాప్తంగా దాడులను ముమ్మరం చేశారు. ఈక్రమంలో బీసీ బాలుర హాస్టల్లో తనిఖీలు చేయగా విస్మయం కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాక్షి, ఆత్మకూరు(నెల్లూరు): చేజర్ల మండలంలోని మాముడూరు బీసీ బాలుర వసతిగృహంలో ఏసీబీ డీఎస్పీ సీహెచ్ దేవానంద్ శాంతో ఆధ్వర్యంలో ఆ శాఖ అధికారులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అధికారుల కథనం మేరకు.. ఉదయం 6:30 గంటలకే వారు గ్రామంలోని హాస్టల్‌కు చేరుకున్నారు. ఆ సమయంలో ఇద్దరు ఔట్సోర్సింగ్ సిబ్బంది మాత్రమే ఉన్నారు. వార్డెన్ సురేష్‌బాబు అందుబాటులో లేరు. బుచ్చి మండలం అన్నారెడ్డిపాళెం హాస్టల్లో కూడా ఆయన డెప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నారని తెలిసి అక్కడ విచారించారు. అయితే వార్డెన్ అక్కడ లేరని తెలుసుకున్నారు. కాగా హాస్టల్లో పరిశీలించగా ఒక్కరంటే ఒక్క విద్యార్థి కూడా లేరు. అయితే హాజరుపట్టికలో మాత్రం 78 మంది ఉన్నట్లుగా నమోదై ఉంది. బియ్యం మాత్రమే ఉంది అధికారులు స్టోర్ రూమ్‌లో వస్తువులు పరిశీలించగా కేవలం బియ్యం మాత్రమే ఉంది. ఏసీబీ తనిఖీలు ప్రారంభమైన తర్వాత గ్రామస్తుల సమాచారం తెలుసుకున్న సుమారు 20 మంది విద్యార్థులు హాస్టల్‌కు చేరుకున్నారు. వారిని అధికారులు విచారించగా హాస్టల్లో నీరు, మరుగుదొడ్ల వసతి లేకపోవడంతో ఇళ్లకు వెళుతున్నట్లు చెప్పారు. దీంతో అధికారులు మరుగుదొడ్లు పరిశీలించారు. అవి దుర్భరంగా ఉండగా, తలుపులు సైతం లేవు. అనంతరం ఏఎస్డబ్ల్యూఓ బి.శ్రీదేవిని హాస్టల్‌కు పిలిపించి ఆమె ద్వారా హాస్టల్ స్థితిగతుల గురించి వివరాలు నమోదు చేసుకున్నట్లు డీఎస్పీ శాంతో వివరించారు. హాస్టల్ గదులు అపరిశుభ్రంగా ఉన్నాయని, శానిటేషన్ లేదని, కొన్ని గదులను పాత సామాన్లతో నింపి నిరుపయోగంగా ఉంచారని గుర్తించినట్లు ఆయన తెలిపారు. హాస్టల్లో స్థానిక విద్యార్థులతోపాటు నడిగడ్డ అగ్రహారం, బిల్లుపాడు గ్రామాలకు చెందినవారు ఉన్నట్లుగా రికార్డుల్లో నమోదై ఉన్నారు. వాస్తవానికి ఆ గ్రామాల విద్యార్థులు రాత్రి వేళల్లో ఉండటంలేదని తెలుసుకున్నారు. సమగ్ర నివేదికను రూపొందించి జిల్లా కలెక్టర్‌కు, సంబంధిత ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు డీఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో ఏసీబీ ఇన్స్పెక్టర్ బి.రమేష్‌బాబు, సిబ్బంది నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. నివేదిక ఇచ్చాం ఏఎస్డబ్ల్యూఓ బి.శ్రీదేవి మాట్లాడుతూ తాను గత నెల 26 తేదీన హాస్టల్‌ను తనిఖీ చేసినట్లు చెప్పారు. సౌకర్యాలు, విద్యార్థుల హాజరు గురించి నమోదు చేసుకున్నట్లు చెప్పారు. వసతులు ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులకు నివేదిక అందజేసినట్లు చెప్పుకొచ్చారు. -
ఇదేనా సం‘క్షేమం’?
ఉప్పునుంతల : స్థానిక బీసీ బాలుర హాస్టల్లో సమస్యలు తిష్టవేశాయి. కనీస వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు పలుమార్లు హాస్టల్ నిద్ర చేసి ప్రత్యక్షంగా చూసిన సమస్యలపై ఉన్నతాధికారులకు నివేదికలు అందజేసినా ఫలితం లేదు. హాస్టల్ చుట్టూ ప్రహరీ లేకపోవడంలో ఇబ్బందిగా మారింది. వాటర్ ట్యాంకుకు పగుళ్లు రావడంతో నీరు నిల్వ చేసుకునే పరిస్థితి లేదు. హాస్టల్పైన, ఉన్న చిన్న వాటర్ ట్యాంకు ద్వారా వచ్చే నీటితోనే ఇబ్బందుల మధ్య స్నానాలు చేస్తున్నారు. నీటివసతి లేక స్నానపు గదులు, మరుగుదొడ్లు నిరుపయోగంగా ఉన్నాయి. దాంతో విద్యార్థులు ఆరుబయటకు వెళ్తున్నారు. 35కు దాటని విద్యార్థుల హాజర్ 160మంది విద్యార్థుల సామర్థ్యం ఉన్న ఈ హాస్టల్లో ప్రస్తుతం 90 మంది విద్యార్థులు ఉన్నట్లు అధికారులు రికార్డుల్లో చూపిస్తున్నా 35 మందికి మించి ఉండటంలేదు. వారిలో 20మంది వరకు పదో తరగతి విద్యార్థులు ఉన్నారు. తాడూరు, మర్రిపల్లి తదితర గ్రామాలకు చెందిన విద్యార్థులు హాస్టల్లో అడ్మిషన్ ఉన్నా ఆయా గ్రామాల నుంచే పాఠశాలకు వచ్చి వెళ్తున్నారు తప్పా హాస్టల్లో ఉండడంలేదు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి హాస్టల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. సమస్యలు పరిష్కరించాలి హాస్టల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలి. విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మరుగుదొడ్లు నిరుపయోగంగా ఉండడంతో ఆరుబయటికి వెళ్తున్నాం. స్నానం చేయడానికి ఇబ్బందిగా ఉంది. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి. – శివ, 5వ తరగతి, హాస్టల్ విద్యార్థి -
హాస్టల్లో 17మంది విద్యార్థులకు అస్వస్థత
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలోని ఇచ్చాపురం బి.సి. బాలుర వసతి గృహంలో కొందరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కలుషిత ఆహారం తినడంతో 17మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరందరిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్సలు చేయిస్తున్నారు. -
ఏసీబీ హల్చల్
* కొండనాగుల, మన్ననూర్ హాస్టళ్లలో తనిఖీలు * విద్యార్థుల పేర తప్పుడు లెక్కలు ఉన్నట్లు గుర్తింపు * అనేక అక్రమాలు వెలుగులోకి..రికార్డులు స్వాధీనం * ఉన్నతాధికారులకు నివేదిస్తాం: ఏసీబీ డీఎస్పీ బల్మూర్ : మండలంలోని కొండనాగుల బీసీ బాలుర వసతి గృహంలో మంగళవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఏసీబీ ఇన్స్పెక్టర్లు వెంకటేశ్వర్రావు, విజయ్ భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో 8గంటలపాటు తనిఖీ చేశారు. వార్డెన్ సుబ్బారెడ్డితో రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అధికారులు విచారణ చేపట్టారు. ఉదయం 7 గంటలకు వసతి గృహాన్ని తనిఖీ చేయగా 98 విద్యార్థులు మాత్రమే ఉన్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. స్టాక్, మెయింటెనెన్స్‌కు సంబంధించిన రికార్డులు దొరకలేదని, విద్యార్థులకు సరిపడా స్టాక్ వసతి గృహంలో లేకపోవడాన్ని వార్డెన్‌ను ప్రశ్నించగా సరైన సమాధానమివ్వలేదన్నారు. విద్యార్థులకు మెనూలో ఉండాల్సిన కిచిడీ, చట్నీ లేదన్నారు. కేవలం చిత్రన్నం, చారు ఉందని తెలిపారు. విద్యా సంవ త్సరం పూర్తి కావస్తున్నా పదో తరగతి విద్యార్థులకు ట్యూటర్స్ ను నియమించలేదని, దీంతో చాలామంది ఇంటివద్ద ఉండి చదువుకుంటున్నట్లు తమ విచారణలో వెల్లడైందని తెలిపారు. రికార్డుల్లో 138మంది విద్యార్థులున్నట్లు చెబుతున్నా తమ విచారణలో 98మంది ఉన్నట్లే తేలిందన్నారు. వసతి గృహంలో విద్యార్థుల కోసం మరుగుదొడ్లు నిర్మించినా నిర్వహణ లేక ఆరుబయటకు వెళ్తున్నట్లు వెల్లడైందన్నారు. హాస్టల్లో విద్యా ర్థులకు అందజేస్తున్న మెనూను ఫుడ్ ఇన్స్పెక్టర్ దేవేందర్‌తో పరిశీలించగా నాణ్యత కొరవడినట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన రికార్డులు స్వాధీనం చేసుకున్నామని, పూర్తి స్థాయి నివేదికను పై అధికారులకు అందజేసి చర్యలు తీసుకుం టామన్నారు. వార్డెన్‌నుపై వచ్చిన అవినీతి ఫిర్యాదుల మేరకు తనిఖీ చేసినట్లు వారు తెలిపారు. తనిఖీలో ఏసీబీ అధికారులు రవికుమార్, నాగభూషణం, గోపాల్ పాల్గొన్నారు. మన్ననూర్ : స్థానిక గిరిజన బాలికల వసతి గృహాన్ని ఏసీబీ డీఎస్పీ రాందాస్ తేజ ఆధ్వర్యంలో అధికారుల బృందం మంగళవారం తనిఖీ చేసింది. విద్యార్థుల సంఖ్యతో పాటు నిత్యం అందజేస్తున్న మెనూను అడిగి తెలుసుకున్నారు. వసతి గృహం వార్డెన్ మంగమ్మ విధుల్లో లేకపోవడంతో ఫోన్ చేసి పిలిపించారు. వార్డెన్ గదితో పాటు స్టోర్ రూంలో ఉన్న సరుకులను పరిశీలించారు. వసతిగృహానికి సంబంధించిన రికార్డులు కొన్ని తీసుకొచ్చి మరికొన్ని ఇంటి వద్ద ఉన్నాయని వార్డెన్ తెలుపడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి విచారణ అనంతరం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడారు. వసతి గృహంలో 380 మంది విద్యార్థులకు ప్రతి నెలా 571 మందికి బిల్లులు డ్రా చేసుకుంటున్నట్లు విచారణలో తేలిందన్నారు. 380 మంది విద్యార్థులకు 8 లీటర్లు పాలు ఇస్తున్నారని వంటవాళ్లు తెలుపగా 40 లీటర్లు ఇస్తున్నామని వార్డెన్ తెలిపారన్నారు. తీరా రిజిష్టర్‌లో చూస్తే 25 లీటర్లుగా ఉండటం గమనార్హం. విద్యార్థుల మూమెంట్, స్టాక్, అటెండెన్స్ మరికొన్ని రిజిస్టర్లను అధికారులు వెంట తీసుకువెళ్లారు. వసతి గృహం నిర్వహణకు సంబంధించి అన్ని వివరాలను ఒక నివేదికగా తయారు చేసి ఉన్నతాధికారులకు పంపామని తెలిపారు. హాజరు నమోదకు బయోమెట్రిక్ విధానం అమలు చేయాలని ప్రభుత్వానికి విన్నవించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏసీబీ సీఐ రమేష్‌రెడ్డి, సంజీవ్రెడ్డీ మోయినొద్దీన్, లక్ష్మణస్వామి తదితర సిబ్బంది ఉన్నారు. -
స్కూలు నుంచి ముగ్గురు విద్యార్థులు అదృశ్యం
ఇబ్రహీంపట్నం(కృష్ణా): స్కూలుకు సరిగా రావటం లేదని ఉపాధ్యాయులు మందలించినందుకు మనస్తాపం చెందిన విద్యార్థులు కనిపించకుండా పోయారు. ఈ ఘటన కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చోటుచేసుకుంది. రెడ్డిగూడెం మండలం ఓబులాపురం గ్రామానికి చెందిన గంటిపూడి గోపి, వెలగనేరు గ్రామానికి చెందిన ఇమాం సాహెబ్ కొండపల్లి బీసీ బాలుర హాస్టల్లో ఉంటూ జడ్పీహెచ్ఎస్ స్కూలులో పదో తరగతి చదువుకుంటున్నారు. ఇటీవలి కాలంలో వారు సరిగ్గా తరగతులు హాజరుకావటం లేదు. దీనిపై సోమవారం ఉపాధ్యాయులు వారిద్దరినీ పిలిచి మందలించారు. తల్లిదండ్రులను తీసుకురావాలని చెప్పి ఉదయం 11 గంటల సమయంలో వారిని ఇళ్లకు పంపించారు. అయితే, వారు స్వగ్రామానికి వెళ్లలేదు. మరో స్నేహితుడు, 8వ తరగతి చదివే ప్రత్తిపాటి నోవాహును తీసుకుని ఎటో వెళ్లిపోయారు. అయితే, ఉపాధ్యాయులు... మంగళవారం తల్లిదండ్రులకు సమాచారం అందించగా విద్యార్థులు కనిపించకుండా పోయిన విషయం తేలింది. దీనిపై తల్లిదండ్రులు మంగళవారం సాయంత్రం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న సీఐ చవాన్, ఎంఈవో ఉదయ్‌కుమార్ పాఠశాలకు చేరుకుని వివరాలు సేకరించారు.