ఏసీబీ హల్‌చల్ | ACB officials sudden searches | Sakshi
Sakshi News home page

ఏసీబీ హల్‌చల్

Published Wed, Mar 2 2016 1:32 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

ఏసీబీ హల్‌చల్ - Sakshi

ఏసీబీ హల్‌చల్

* కొండనాగుల, మన్ననూర్ హాస్టళ్లలో తనిఖీలు
* విద్యార్థుల పేర తప్పుడు లెక్కలు ఉన్నట్లు గుర్తింపు
* అనేక అక్రమాలు వెలుగులోకి..రికార్డులు స్వాధీనం
* ఉన్నతాధికారులకు నివేదిస్తాం: ఏసీబీ డీఎస్పీ

బల్మూర్ : మండలంలోని కొండనాగుల బీసీ బాలుర వసతి గృహంలో మంగళవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు వెంకటేశ్వర్‌రావు, విజయ్ భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో 8గంటలపాటు తనిఖీ చేశారు. వార్డెన్ సుబ్బారెడ్డితో రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం అధికారులు విచారణ చేపట్టారు. ఉదయం 7 గంటలకు వసతి గృహాన్ని తనిఖీ చేయగా 98 విద్యార్థులు మాత్రమే ఉన్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. స్టాక్, మెయింటెనెన్స్‌కు సంబంధించిన రికార్డులు దొరకలేదని, విద్యార్థులకు సరిపడా స్టాక్ వసతి గృహంలో లేకపోవడాన్ని  వార్డెన్‌ను ప్రశ్నించగా సరైన సమాధానమివ్వలేదన్నారు. విద్యార్థులకు మెనూలో ఉండాల్సిన కిచిడీ, చట్నీ లేదన్నారు. కేవలం చిత్రన్నం, చారు ఉందని తెలిపారు. విద్యా సంవ త్సరం పూర్తి కావస్తున్నా పదో తరగతి విద్యార్థులకు ట్యూటర్స్ ను నియమించలేదని, దీంతో చాలామంది ఇంటివద్ద ఉండి చదువుకుంటున్నట్లు  తమ విచారణలో వెల్లడైందని తెలిపారు.

రికార్డుల్లో 138మంది విద్యార్థులున్నట్లు  చెబుతున్నా తమ విచారణలో 98మంది ఉన్నట్లే తేలిందన్నారు. వసతి గృహంలో విద్యార్థుల కోసం మరుగుదొడ్లు నిర్మించినా నిర్వహణ లేక ఆరుబయటకు వెళ్తున్నట్లు వెల్లడైందన్నారు. హాస్టల్‌లో విద్యా ర్థులకు అందజేస్తున్న మెనూను ఫుడ్ ఇన్‌స్పెక్టర్ దేవేందర్‌తో పరిశీలించగా నాణ్యత కొరవడినట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన రికార్డులు స్వాధీనం చేసుకున్నామని, పూర్తి స్థాయి నివేదికను పై అధికారులకు అందజేసి చర్యలు తీసుకుం టామన్నారు. వార్డెన్‌నుపై వచ్చిన అవినీతి ఫిర్యాదుల మేరకు తనిఖీ చేసినట్లు వారు తెలిపారు. తనిఖీలో ఏసీబీ అధికారులు రవికుమార్, నాగభూషణం, గోపాల్ పాల్గొన్నారు.
 
మన్ననూర్ : స్థానిక గిరిజన బాలికల వసతి గృహాన్ని ఏసీబీ డీఎస్పీ రాందాస్ తేజ ఆధ్వర్యంలో అధికారుల బృందం మంగళవారం తనిఖీ చేసింది. విద్యార్థుల సంఖ్యతో పాటు నిత్యం అందజేస్తున్న మెనూను అడిగి తెలుసుకున్నారు. వసతి గృహం వార్డెన్ మంగమ్మ విధుల్లో లేకపోవడంతో ఫోన్ చేసి పిలిపించారు. వార్డెన్ గదితో పాటు స్టోర్ రూంలో ఉన్న సరుకులను పరిశీలించారు. వసతిగృహానికి సంబంధించిన రికార్డులు కొన్ని తీసుకొచ్చి మరికొన్ని ఇంటి వద్ద ఉన్నాయని వార్డెన్ తెలుపడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పూర్తి విచారణ అనంతరం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడారు. వసతి గృహంలో 380 మంది విద్యార్థులకు ప్రతి నెలా 571 మందికి బిల్లులు డ్రా చేసుకుంటున్నట్లు విచారణలో తేలిందన్నారు. 380 మంది విద్యార్థులకు 8 లీటర్లు పాలు ఇస్తున్నారని వంటవాళ్లు తెలుపగా 40 లీటర్లు ఇస్తున్నామని వార్డెన్ తెలిపారన్నారు. తీరా రిజిష్టర్‌లో చూస్తే 25 లీటర్లుగా ఉండటం గమనార్హం.

విద్యార్థుల మూమెంట్, స్టాక్, అటెండెన్స్ మరికొన్ని రిజిస్టర్లను అధికారులు వెంట తీసుకువెళ్లారు. వసతి గృహం నిర్వహణకు సంబంధించి అన్ని వివరాలను ఒక నివేదికగా తయారు చేసి ఉన్నతాధికారులకు పంపామని తెలిపారు. హాజరు నమోదకు బయోమెట్రిక్ విధానం అమలు చేయాలని ప్రభుత్వానికి విన్నవించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో  ఏసీబీ సీఐ రమేష్‌రెడ్డి, సంజీవ్‌రెడ్డీ మోయినొద్దీన్, లక్ష్మణస్వామి తదితర సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement