BC Certificate
-
అనాథలు బీసీ జాబితాలోకా?
అశాస్త్రీయమంటున్న కొన్ని బీసీ, విద్యార్థి సంఘాలు సాక్షి, హైదరాబాద్: శాస్త్రీయ అధ్యయనం, జిల్లాల వారీ పరిశీలన లేకుండా,అనాథలను బీసీ జాబితాలో ఎలా చేరుస్తారని కొన్ని బీసీ, విద్యార్థి సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. దీనిపై విస్తృతంగా చర్చ జరపాలనీ, తమ అభిప్రాయాలు తెలుసుకోవాలని కోరుతున్నాయి. కేవలం బీసీ-ఏ జాబితాలో అనాథలను చేర్చినంత మాత్రాన సరిపోదని, రిజర్వేషన్ల శాతాన్నీ పెంచాలంటున్నాయి. అనాథల పేరిట ఇతర కులాల వారు తప్పుడు ధ్రువీకరణలతో ప్రస్తుతమున్న రిజర్వేషన్లకు గండికొట్టే అవకాశముందంటున్నాయి. అందుకే వారికి బీసీ సర్టిఫికెట్‌ను తహసీల్దార్లు కాకుండా ఆర్డీఓ స్థాయి అధికారి ఇచ్చేలా ఉత్తర్వులు సవరణలు చేయాలని కోరుతున్నాయి. బీసీ-ఏ జాబితాలో వారిని చేర్చినా రాజకీయ రిజర్వేషన్లు వర్తించకుండా చూడాలంటున్నాయి. తమిళనాడు జీవో ప్రకారమే ఇక్కడా అనాథలను బీసీ కేటగిరీలో చేర్చుతూ రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి తమిళనాడులో అనుసరిస్తున్న విధానమే మార్గదర్శకమైంది. అక్కడ అనాథలను బీసీ జాబితాలో పొందుపరచడంతో పాటు కేంద్రంలో ఓబీసీలుగా పరిగణించాలని కూడా సంబంధిత కమిషన్‌కు ఆ ప్రభుత్వం తెలిపింది. తమ విధానానికి మద్ధతుగా మూడు అంశాలను పేర్కొంది... ►పదేళ్ల వయసులోపు పిల్లలు తల్లితండ్రుల్ని కోల్పోయి, నిరాశ్రయులై ఉండాలి. ► వారి బాగోగులు చూసేందుకు చట్టపరంగా, ఇతరత్రా ఎవరూ లేనివారు. ► ప్రభుత్వం, అది గుర్తించిన సంస్థల స్కూళ్లు, అనాథ శరణాలయాల్లోనివారు ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్నవారిని తమిళనాడు సర్కార్ బీసీలుగా పరిగణిస్తోంది. ఇదే ప్రాతిపదికన ఇక్కడి అనాథలను కూడా బీసీ-ఏ(55) క్రమసంఖ్యలో వారిని చేర్చాలని తెలంగాణ ప్రభుత్వమూ నిర్ణయించింది. అయితే తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. ఈ విషయాన్నే ఇక్కడ బీసీ నేతలు ప్రస్తావిస్తున్నారు. అభ్యంతరాలు తెలిపితే పరిశీలిస్తాం బీసీ సంఘాల వారు అభ్యంతరాల ను రాతపూర్వకంగా తమకు తెలియజేస్తే పరిశీలిస్తామని బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి టి.రాధ వెల్లడించారు. గురువారం బీసీ సంక్షేమసంఘం నేత ఆర్.కృష్ణయ్య, రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, ఇతర బీసీ, విద్యార్థిసంఘాల ప్రతి నిధులు కలిసిన నేపథ్యంలో ఆమె ఇలా స్పందించారు. అధ్యయనం లేకుండానా! విస్తృత అధ్యయనం చేయకుండా కేవ లం కేబినెట్లో నిర్ణయించి, జీవో విడుదల చేయడం సరికాదు. అనాథలంటే మాకూ సానుకూల దృక్ఫథమే ఉంది. ప్రభుత్వం గుర్తించిన సంస్థలంటే అవకతవకలకు ఆస్కారముంది. ప్రస్తుతం నకిలీ ఎంబీబీఎస్ సర్టిఫికెట్లు, ఐఏఎస్ లు పుట్టుకొస్తున్నారు. అందువల్ల ఎమ్మార్వోలు కాకుండా ఆర్డీఓలకు బీసీ సర్టిఫికెట్లు జారీచేసే అధికారమివ్వాలి. - జాజుల శ్రీనివాస్‌గౌడ్, బీసీసంక్షేమసంఘం -
అక్క ఓసీ... తమ్ముడు బీసీ
తుమ్మలగుంటలో కులమార్పుపై ప్రభుత్వం సీరియస్ విచారణకు ఆదేశం సర్టిఫికెట్లు పరిశీలించిన ఆర్డీవో తిరుపతి రూరల్, న్యూస్‌లైన్: ఒకే కుటుంబానికి చెందిన అక్క ఏమో ఓసీ.. తమ్ముడేమో బీసీ... తండ్రి ఓసీ... కూతురు బీసీ.... వినడానికి వింతగా ఉన్నా ఇది నమ్మలేని నిజం. రెవెన్యూ అధికారుల అవినీతికి అద్దం పట్టేలా ఈ వ్యవహారం నిలిచింది. వివరాలు... చంద్రగిరి నియోజకవర్గంలోని తుమ్మలగుంట సర్పంచ్ స్థానం గత ఎన్నికల్లో బీసీలకు రిజర్వ్ అయ్యింది. సర్పంచ్ అభ్యర్థులుగా యాదవ కులానికి చెందిన మించల జయలక్ష్మి, దొడ్ల కుటుంబానికి చెందిన కరుణాకరరెడ్డి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో మించల జయలక్ష్మి గెలుపొందింది. తప్పుడు బీసీ సర్టిఫికెట్‌ను మంజూరు చేసి రూరల్ మండల తహశీల్దార్ వెంకటరమణ కావాలనే తనపై కరుణాకరరెడ్డిని పోటీ పెట్టించారని జయలక్ష్మి ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. 1968 నుంచి దొడ్ల కుటుంబానికి చెందిన కుల, రెవెన్యూ, టీసీలు, మొదలైన 20 పేజీల ఆధారాలతో ఫిర్యాదు చేసింది. సీరియస్‌గా స్పందించిన ప్రభుత్వం వెంటనే విచారణ చేపట్టి నిజానిజాలను నిగ్గు తేల్చాలని కలెక్టర్‌ను ఆదేశించింది. దీనిపై స్పందించిన కలెక్టర్ ఆర్డీవోను విచారణకు ఆదేశించా రు. తిరుపతి ఆర్డీవో రంగయ్య శుక్రవారం దొడ్ల కరుణాకరరెడ్డి కుటుంబ సభ్యులను విచారించారు. రికార్డులను తనిఖీ చేశారు. ఓసీగా ఉన్న దొడ్ల కుటుంబం తుమ్మలగుంటలో దొడ్ల ఇంటి పేరుతో 25 కుటుం బాల వరకు ఉన్నాయి. ఇందులో 3 కుటుంబాలు బీసీలుగా నకిలీ సర్టిఫికెట్లును సృష్టించి లబ్ధిపొందుతున్నాయి. దొడ్ల సుబ్బారెడ్డికి ఆరుగురు సంతానం. ఇందులో దొడ్ల సుబ్రమణ్యంరెడ్డి, దొడ్ల నాగభూషణంరెడ్డి, దొడ్ల రామచంద్రారెడ్డిలు ఉన్నారు. వీరి కులం కాపు (ఓసీ)గా అన్ని రికార్డుల్లో ఉంది. దొడ్ల సుబ్రమణ్యంరెడ్డికి నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. వీరు విద్య, ఉద్యోగపరంగా ఓసీలుగానే ఉన్నారు. అయితే సుబ్రమణ్యంరెడ్డి తమ్ముడు రామచంద్రారెడ్డి పిల్లలు మాత్రం బీసీలుగా నకిలీ పత్రాలను సృష్టించి విద్య, ఉద్యోగ పరంగా లబ్ధి పొందారనేది ఫిర్యాదులో సారాంశం. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 09-07-2013న దొడ్ల సుబ్రమణ్యంరెడ్డి కుమార్తెలు దొడ్ల కోమల, దొడ్ల ఉషారాణి, దొడ్ల సరస్వతి మీసేవలో ఓసీలుగా సర్టిఫికెట్లు పొందారు. వీరి చిన్నాన్న కొడుకైన దొడ్ల కరుణాకరరెడ్డి అదే నెల 10వ తేదీన బీసీ (వన్నె రెడ్డి)గా నకిలీ పత్రాలు పొందారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ అయిన తుమ్మలగుంటలో నకిలీ సర్టిఫికెట్లతో దొడ్ల కరుణాకరరెడ్డి పోటీచేసి ఓడిపోయారు. ఆందోళన వ్యక్తం చేస్తున్న బీసీలు తమకు రాజ్యాంగ బద్ధంగా అందాల్సిన బీసీ కోటాలో నుంచి ఓసీ కుటుంబం లబ్ధ్ది పొందడంపై బీసీ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై పూర్తిస్థాయి విచారణ చేసి బీసీ కోటా కింద విద్య, ఉద్యోగ, ఇతర రంగాల్లో లబ్ధ్దిపొందినవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. దొడ్లగౌరి బీసీ కోటాలో పోటీ గత పంచాయతీ ఎన్నికల్లో తుమ్మలగుంట 8వ వార్డు నుంచి దొడ్లగౌరి బీసీ కోటా కింద పోటీ చేసి ఓడిపోయారు. దొడ్లగౌరి నల్లందల రామిరెడ్డి కుమార్తె. దొడ్ల కుటుంబంలో పెళ్లి చేసుకున్న గౌరి బీసీ కోటా కింద ఎన్నికల్లో పోటీ చేశారు. రెండు కుటుంబాల వైపు చూసినా ఓసీ క్యాటగిరికి చెందిన ఈమె బీసీ సర్టిఫికెట్ పొంది గత ఎన్నికల్లో పోటీకి దిగారు. ఓఎస్ నెంబర్ 244-1998, 1-1999లో నల్లందల రామిరెడ్డి కుమార్తె అయిన ఆమె తన అన్న సుబ్రమణ్యంరెడ్డి ఆస్తిలో వాటా కావాలని ఆమె కోర్టును ఆశ్రయిం చింది. కోర్టుకు వెళ్లి దీనిపైనా ఫిర్యాదు చేయనున్నారు. విచారణకు వచ్చాం కలెక్టర్ ఆదేశాల మేరకు దొడ్ల కరుణాకరరెడ్డి కులధ్రు వీకరణ పత్రాలను తనిఖీ చేసేందుకు వచ్చాం. ఈయన ఓసీ కుటుంబానికి చెందిన వ్యక్తిగా వుంటూ బీసీ సర్టిఫికెట్లను పొందినట్టు ఆరోపణ వుంది. వీరి కుటుంబాలకు చెందిన సర్టిపికెట్లను పరిశీలించేందుకు వచ్చాం. తహశీల్దార్ నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చినట్టు ఫిర్యాదు అందింది. దీనిపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. - రంగయ్య, ఆర్డీవో, తిరుపతి