ఇది భారతీయ సంస్కృతిపై దాడే
సాక్షి, అమరావతి బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రేమికుల రోజులను పురస్కరించుకుని ఫిబ్రవరిలో విశాఖలో బీచ్ లవ్ ఫెస్టివల్ నిర్వహణకు పూనుకోవడం బాధాకరమని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. దీనిపై పునరాలోచించుకోవాలని సీఎం చంద్రబాబుకు ఆయన హితవు పలికారు. అంబటి గురువారం గుంటూరులో విలేకరులతో మాట్లాడారు. బీచ్ లవ్ ఫెస్టివల్ నిర్వహణను తప్పుపట్టారు. ఇది అనేది విదేశీ సంస్కృతి అని, గోవా వంటి రాష్ట్రాల్లో జరిపినా అక్కడి పరిస్థితులు, నిర్వహించిన తీరు భిన్నమన్నారు. ఆంధ్రప్రదేశ్ సంప్రదాయాల్లో ఉత్తమమైన రాష్ట్రమన్నారు. అటువంటి రాష్ట్రంలోకి పాశ్చాత్య సంస్కృతిని తీసుకొచ్చి ఇక్కడి సంప్రదాయాలపై దాడిచేయాలని ప్రభుత్వం చూస్తున్నదని దుయ్యబట్టారు.
బీచ్ లవ్ ఫెస్టివల్‌కు 9 వేలమంది ప్రేమపక్షుల్ని ఇతర దేశాలనుంచి ఆహ్వానించి, వారికి విలాసవంతమైన గుడారాలు ఏర్పాటు చేస్తున్నారని, ప్రేమపక్షులతో బ్రహ్మాండమైన ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారని... ఆ ప్రదర్శనను ఏపీ ప్రజలు చూసేందు కు టికెట్ కూడా నిర్ణయించారని చెప్పారు. ఇలాంటి విష సంస్కృతి, విదేశీ సంస్కృతిని విశాఖలో రుద్దితే చూస్తూ ఊరుకోబోమన్నారు. ‘‘చంద్రబాబు విదేశీ మోజులో ఉంటే ఆయన తన కుటుంబంతోపాటు వెళ్లి అక్కడ గడపవచ్చు. ఇక్కడ నిర్వహించడంపై మాత్రం పునరాలోచించుకోవాలి’’ అని డిమాండ్ చేశారు.
బీజేపీ వైఖరేంటో చెప్పాలి..
చంద్రబాబుతోపాటు రాష్ట్రంలో, కేంద్రంలో అధికారాన్ని పంచుకుంటున్న బీజేపీ బీచ్ లవ్ ఫెస్టివల్‌పై తన వైఖరేంటో చెప్పాలని అంబటి డిమాండ్ చేశారు. బీజేపీ అనుబంధ సంస్థలైన ఏబీవీపీ, జన్‌సంఘ్, భజరంగ్‌దళ్‌లు వాలంటైన్స్‌డే రోజున ప్రేమజంటలు కూర్చున్న చోట్లకు వెళ్లి చట్టానికి వ్యతిరేకంగా దాడిచేసి తరిమి కొట్టిన సందర్భాలున్నాయని ఆయన గుర్తు చేశారు. బలవంతంగా వారికి మంగళసూత్రాలిచ్చి కట్టించిన ఘటనలున్నాయన్నారు. ఇప్పుడు బీచ్ లవ్ ఫెస్టివల్‌పై బీజేపీ జవాబు చెప్పాలన్నారు.