పేదల గొంతుక.. డిజిధన్
ఇది అవినీతిపై స్వచ్ఛ ఉద్యమం
► నాగ్‌పూర్ దీక్షాభూమిలో అంబేడ్కర్ జయంతి సందర్భంగా నివాళులు
► అక్కడే భీమ్–ఆధార్ యాప్‌ను ప్రారంభించిన మోదీ
నాగ్‌పూర్: కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన డిజిధన్ ఉద్యమం అవినీతిని పారదోలటంతోపాటు పేదల గొంతుకగా పనిచేస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ఇది అవినీతిపై స్వచ్ఛ ఉద్యమమన్నారు. తక్కువ నగదు లావాదేవీలను ప్రోత్సహించే దిశగా భీమ్ యాప్ వినియోగదారులకు రిఫరల్ బోనస్, దుకాణదారులకు క్యాష్‌బ్యాక్ పథకాలను ఆయన ప్రారంభించారు.
రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ 126వ జయంతి సందర్భంగా నాగ్‌పూర్‌లోని అంబేడ్కర్ దీక్షాభూమిలో ప్రత్యేక నివాళులు అర్పించిన ప్రధాని.. అదే వేదికగా భీమ్–ఆధార్ యాప్‌ను ఆవిష్కరించారు. తర్వాత బహిరంగ సభలో మాట్లాడుతూ.. ‘కొంతకాలంగా మేం డిజిటల్ ఇండియా నిర్మాణం కోసం ప్రయత్నిస్తున్నాం. ఈ దిశగా పేదల నిజమైన ధనంగా మారేందుకు డిజిధన్ కార్యక్రమాన్ని రూపొందించాం. ఇది పేద ప్రజల గొంతుకగా మారనుంది. ’ అని వెల్లడించారు.
భీమ్ రిఫరల్ బోనస్
భీమ్ యాప్‌కు రూ.10తో రిఫరల్ బోనస్‌తోపాటు వ్యాపారులకు ప్రోత్సాహం అందించేలా క్యాష్‌బ్యాక్ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఆర్నెల్లకు రూ.495 కోట్లను క్యాష్‌బ్యాక్, రిఫరల్ బోనస్లుగా ఇవ్వనున్నారు. ‘మీరు ఒకరికి భీమ్ యాప్‌ను సూచిస్తే మీకు 10 రూపాయలొస్తాయి. అదే ఒకరోజులో 20 మందికి సూచిస్తే రూ.200 సంపాదించుకోవచ్చు.
మొబైల్ ఫోన్ ఉంటేచాలు లావాదేవీలు జరుపుకునే స్థితికి మనం చేరుకుంటున్నాం’ అని అన్నారు. ఈ సందర్భంగా భీమ్–ఆధార్ యాప్‌ను మోదీ ప్రారంభించారు. ఆధార్ ద్వారా డిజిటల్ చెల్లింపులు జరిపేందుకు ఈ యాప్ సాయపడనుంది. యాప్ ద్వారా భారతీయ పౌరులు దుకాణదారుడి వద్దనున్న బయోమెట్రిక్ పరికరం ద్వారా వేలిముద్రతోనే చెల్లింపులు చేయొచ్చు. తక్కువ నగదు వాడకంతో లావాదేవీలు పూర్తవుతాయి.
‘నిరక్షరాస్యులు మాత్రమే తమ సంతకంగా వేలిముద్ర వినియోగించే రోజులుండేవి. కానీ ఇప్పుడు వేలిముద్రే మీ బలం’ అని అన్నారు. దేశవ్యాప్తంగా 75 నగదు రహిత/తక్కువ నగదు లావాదేవీలు జరిగే టౌన్‌షిప్‌లను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ కేంద్రాల్లో రోజుకు లక్షన్నర రూపాయల నగదురహిత లావాదేవీలు, ఏడాదికి 5.5 కోట్ల లావాదేవీలు జరుగుతాయి. ఇందులో గరిష్టంగా గుజరాత్ నుంచే 56 ఉన్నాయి. ఈ టౌన్‌షిప్‌ల ఎంపిక ప్రక్రియను ప్రైస్ వాటర్‌హౌజ్ కూపర్ సంస్థ ద్వారా నీతి ఆయోగ్ చేపట్టింది.
అంబేడ్కర్‌కు నివాళులు
అంతకుముందు దీక్షాభూమిలో అంబేడ్కర్‌కు ఘన నివాళులర్పించిన మోదీ.. చేతులు కట్టుకుని కాసేపు ప్రార్థన చేశారు. తర్వాత మాట్లాడుతూ.. అంబేడ్కర్ చేసిన పోరాటం అందరికీ ఆదర్శమని ఆయన అన్నారు. నాగ్‌పూర్‌లో ఐఐఎం, ట్రిపుల్ఐటీ, ఎయిమ్స్ సంస్థలకు శుక్రవారం మోదీ శంకుస్థాపన చేశారు. కోరడి, చంద్రపూర్, పర్లీలో 3,230 మెగా వాట్ల సామర్థ్యంతో నిర్మించిన 14 యూనిట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాలను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం జాతికి అంకితం చేశారు.
అంబేడ్కర్ బౌద్ధ స్వీకరణకు ప్రత్యక్ష సాక్షి
లక్నో: అంబేడ్కర్ బౌద్ధమత స్వీకరణకు ప్రత్యక్ష సాక్షులైన ఏడుగురు బౌద్ధ సన్యాసుల్లో భదంత్ ప్రజ్ఞానంద్ ఒకరు. వారిలో ప్రస్తుతం జీవించి ఉన్నది ఆయనొక్కరే. శ్రీలంకలో జన్మించిన ప్రజ్ఞానంద్(93) లక్నో బౌద్ధ విహార్‌లో నివసిస్తున్నారు. 1956 అక్టోబర్ 14న నాగ్‌పూర్‌లో అంబేడ్కర్ బౌద్ధమతాన్ని పుచ్చుకున్నారు.
ఆయనను బౌద్ధంలోకి మార్చిన భదంత్ చంద్రమణి మహాథేరోకు అప్పటికి 22 ఏళ్ల వయసున్న ప్రజ్ఞానంద్ సహాయకుడిగా పనిచేశారు. ‘ఆరోజు నాగ్‌పూర్ దీక్షాభూమికి ఐదు లక్షల మంది వచ్చారు.. అంబేడ్కర్ పూర్తిగా కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. బయటి ప్రపంచంతో సంబంధాలేవీ లేనట్లు కనిపించారు..’ అని ప్రజ్ఞానంద్ పీటీఐ వార్తాసంస్థకు తెలిపారు. అనారోగ్యంతో మంచానికే పరిమితమై, సైగలతో సంభాషించే ప్రజ్ఞానంద్.. అంబేడ్కర్ అనే మాట వినగానే ఉత్సాహంతో మాట్లాడతారని శిష్యులు చెప్పారు.
కోటి గెలుచుకున్న శ్రద్ధా
న్యూఢిల్లీ: లక్కీ గ్రాహక్ పథకంలో రూ.కోటి గెలుచుకున్న శ్రద్ధా మోహన్ మంగ్షెటే(20)కి నాగ్‌పూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని స్వయంగా బహుమతి అందించారు. శ్రద్ధా ప్రస్తుతం మహారాష్ట్రలోని లాతుర్ జిల్లాలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నారు. తాను కొత్తగా కొన్న మొబైల్ ఫోన్ నెలసరి వాయిదా(ఈఎంఐ) రూ.1509ని రూపే కార్డుతో ఆన్లైన్లో చెల్లించడంతో శ్రద్ధాను అదృష్టం వరించింది. లక్కీ గ్రాహక్ యోజనలో రెండో బహుమతి రూ.50 లక్షలను గుజరాత్ ఖంభట్‌లోని ఓ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న హార్దిక్ కుమార్(29) అందుకున్నారు.