బీఎడ్‌లో ఫీజుల మోత
* కనీస ఫీజు రూ.16 వేలు, గరిష్ట ఫీజు రూ.31 వేలు
* కాలేజీల ఆదాయ, వ్యయాల ఆధారంగా నిర్ధారించిన ఏఎఫ్ఆర్సీ
* ప్రభుత్వ అనుమతి రాగానే అమల్లోకి..
* ఇక అన్ని వృత్తివిద్యా కోర్సుల్లో కనీస, గరిష్ట ఫీజుల విధానం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ విద్యా కోర్సు బీఎడ్ ఫీజులను పెంచుతూ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్ఆర్సీ) నిర్ణయం తీసుకుంది. 222 ప్రైవేటు బీఎడ్ కాలేజీల్లో వచ్చే మూడేళ్ల పాటు (2016-17, 2017-18, 2018-19 విద్యా సంవత్సరాల్లో) వసూలు చేయాల్సిన ఫీజులను గురువారం ఖరారు చేసింది.
ఇప్పటివరకూ కామన్‌గా రూ.13,500గా ఉన్న వార్షిక ఫీజును... కాలేజీల ఆదాయ, వ్యయాలకు అనుగుణంగా కనిష్టంగా రూ.16 వేల నుంచి.. గరిష్టంగా రూ. 31వేల వరకు పెంచింది. ఒక కాలేజీకి మాత్రమే రూ.31 వేల గరిష్ట ఫీజు నిర్ణయించినట్లు తెలిసింది. మరో 15 వరకు కాలేజీల్లో రూ.30 వేలు, పదికిపైగా కాలేజీల్లో కనీస ఫీజు అయిన రూ.16 వేలను వార్షిక ఫీజుగా నిర్ణయించింది. మిగతా కాలేజీల్లో రూ.18 వేల నుంచి రూ.30 వేల వరకు నిర్ణయించినట్లు తెలిసింది. ప్రభుత్వ ఆమోదం రాగానే ఈ కొత్త ఫీజులు అమల్లోకి వస్తాయి. ఇక మిగతా వృత్తి విద్యా కోర్సులకు కూడా కాలేజీల ఆదాయ, వ్యయాలను బట్టి ఫీజులను ఖరారు చేయాలని... ఇప్పటివరకు కొనసాగిన కామన్ ఫీజు విధానాన్ని రద్దు చేయాలని ఏఎఫ్ఆర్సీ నిర్ణయించింది.
దీంతోపాటు ఇంజనీరింగ్ సహా అన్ని కోర్సుల్లో కనీస, గరిష్ట ఫీజుల విధానం తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. మరోవైపు ఇంజనీరింగ్ ఫీజుల పెంపునకూ రంగం సిద్ధమవుతోంది. ఇప్పటివరకు రూ.35 వేలుగా ఉన్న కనీస ఫీజును రూ.45 వేలకు... రూ.1,13,500గా ఉన్న గరిష్ట ఫీజును రూ.2 లక్షలకుపైగా నిర్ధారించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఏఎఫ్ఆర్సీ తమకు అందిన ఫీజుల పెంపు ప్రతిపాదనల్లో శాస్త్రీయత, ఇతర లోపాలపై ఇప్పటికే యాజమాన్యాలకు నోటీసులు జారీ చేసి వివరణలు తీసుకుంది.
పెరిగే ఫీజులు భరించాల్సింది విద్యార్థులే?
కాలేజీల ఆదాయ, వ్యయాలను బట్టి ఈసారి అన్ని వృత్తి విద్యా కోర్సుల ఫీజుల్లో 15 శాతానికిపైగా పెరుగుదల ఉండే అవకాశముంది. ఆదాయ, వ్యయాల ప్రకారం ఫీజుల పెంపునకు ఏఎఫ్ఆర్సీ సిఫారసు చేసినా... రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చే అంశంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించే అవకాశం ఉంటుందని ఉన్నత విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఫీజులు పెరిగినప్పటికీ ఇప్పటివరకు ఉన్న కామన్ ఫీజు మొత్తాన్నే ఫీజు రీయింబర్స్‌మెంట్‌గా ఇచ్చే అవకాశముందని... మిగతా ఫీజు మొత్తాన్ని విద్యార్థులే భరించాల్సి ఉంటుందని చర్చ జరుగుతోంది.
ఉమ్మడి రాష్ట్రంలో నిర్ణయించిన ప్రకారం ఇప్పటివరకు వివిధ కోర్సుల్లో టాప్ 10 వేల మంది ర్యాంకర్లకు (ఎస్సీ, ఎస్టీలకు పూర్తిగా రీయింబర్స్మెంట్ ఉంది) రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తోంది. అయితే వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీనిని టాప్ 5 వేల ర్యాంకులకు తగ్గించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.