మార్కెట్ హెచ్చుతగ్గులు తాత్కాలికమే
వాటిపై ఆందోళన అక్కర్లేదు
- పెట్టుబడులు తక్కువగా ఉండటమే సమస్య
- ఆర్థిక విధానాలే దేశాల వృద్ధికి కీలకం
- బీ20 సదస్సులో ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్
అంకారా: మార్కెట్లలో హెచ్చుతగ్గులు తాత్కాలికమేనని, వీటి గురించి భయపడక్కర్లేదని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ స్పష్టంచేశారు. ప్రజలు వ్యయాలు తగ్గించుకుని పొదుపుపై మరింతగా దృష్టి పెడుతున్నారని, దీనివల్ల వివిధ వస్తువులపై వ్యయం తగ్గుతోందని చెప్పారాయన. దీంతో పాటు పెట్టుబడులు తక్కువ స్థాయిలో ఉంటుండటం కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను సతమతం చేస్తోందన్నారు. గ్లోబల్ ఎకానమీ ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను ప్రస్తావిస్తూ... ‘‘వృద్ధి సాధించాలంటే ఆర్థికాంశాలే కీలకం. ఆయా దేశాలు పాటించే ఆర్థిక విధానాలే వాటి వృద్ధి గతిని నిర్దేశిస్తాయి’’ అని చెప్పారాయన. జీ20 దేశాలకు చెందిన బిజినెస్ లీడర్ల సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచటంపై అనిశ్చితి నెలకొటంతో ప్రపంచ మార్కెట్లలో ఆందోళన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాజన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దీన్నే ప్రస్తావిస్తూ... భవిష్యత్‌లో హెచ్చుతగ్గులపై ఆందోళనలు పరిష్కారమవ్వాలంటే ద్రవ్య విధానాలు సాధారణ స్థాయికి రావడం ఒక్కటే మార్గమని చెప్పారు. ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకుల విధానాలతో వ్యవస్థ మరింత దుర్బలంగా మారిపోయి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టీన్ లగార్డ్‌తో పాటు ఫ్రాన్స్, టర్కీ, మెక్సికో తదితర దేశాల సెంట్రల్ బ్యాంక్‌ల గవర్నర్లు ఈ సదస్సులో పాల్గొన్నారు.
ఉపాధి కల్పనపై దృష్టి పెట్టాలి..
జీ20 దేశాల నేతలు ఉపాధి కల్పనపై మరింతగా దృష్టి పెట్టాల్సి ఉందని లగార్డ్ చెప్పారు. ఇన్ఫ్రాలో పెట్టుబడులు, ఆర్థిక, కార్మిక రంగాల్లో సంస్కరణలు, ఉత్పత్తులకు మార్కెటింగ్ పరమైన సంస్కరణలు కీలకమైనవని ఆమె తెలియజేశారు. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం ముగిసిన తర్వాత నుంచి ప్రపంచ ఎకానమీ ఒక మోస్తరు వేగంతో రికవరీ అవుతోందని వక్తలు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో సంపన్న దేశాల్లో ఆర్థిక విధానాలు సాధారణ స్థాయికి వచ్చినా.. వడ్డీ రేట్లు తక్కువ స్థాయిలోనే కొనసాగే అవకాశం ఉందని వారు చెప్పారు. వృద్ధి అంచనాలు, ద్రవ్యోల్బణం తక్కువ స్థాయుల్లో ఉండటం ఇందుకు కారణమని చెప్పారు. దీంతో పాటు ఉత్పాదకత మందగిస్తుండటం, పెట్టుబడుల స్థాయి తక్కువగా ఉండటం ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులకు సవాళ్లు ఎదురవుతాయని వారు పేర్కొన్నారు.
ప్రపంచ దేశాలు వడ్డీ రేట్లు పెంచాలి..
నిలకడగా వృద్ధి సాధిస్తున్న ప్రపంచ దేశాలు వడ్డీ రేట్లు పెంచాల్సిన అవసరం ఉందని, అయితే ఇది ఒకేసారిగా భారీ స్థాయిలో మాత్రం ఉండకూడదని రాజన్ అభిప్రాయపడ్డారు. సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాలు తీసుకోవడంలో మార్కెట్ హెచ్చుతగ్గుల ఆందోళనలు ఆటంకాలు కాకూడదని ఆయన చెప్పారు. అమెరికాను, ఫెడరల్ రిజర్వ్‌ను నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ.. అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లు తప్పక పెంచుతుందన్న అంచనాల నేపథ్యంలో రాజన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వడ్డీ రేట్లు తగ్గించాలంటూ ఇటు దేశీయంగా ప్రభుత్వం, పారిశ్రామిక వర్గాల నుంచి తనపై ఒత్తిడి పెరుగుతున్న సందర్భంలో ప్రపంచ దేశాలకు ఆయన ఈ సూచనలు చేయడం గమనార్హం. సెంట్రల్ బ్యాంకులు ఉదార ఆర్థిక విధానాల నుంచి క్రమంగా వైదొలగడానికి ఇదే సరైన సమయమని రాజన్ పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు ఆరోగ్యకరమైన వృద్ధి సాధించేందుకు వడ్డీ రేట్ల విధానాలొక్కటే సహాయపడలేవని, ఆర్థిక విధానాలు కూడా కీలకమన్నారు.
రెండేళ్ల పదవీకాలం పూర్తి...
రాజన్ ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయ్యింది. 2013 సెప్టెంబర్ 4న ఆర్బీఐ 23వ గవర్నర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. మరో ఏడాదిపాటు ఆయన ఈ బాధ్యతల్లో కొనసాగుతారు. ద్రవ్యోల్బణమే ప్రధాన ప్రాతిపదికగా ద్రవ్య, పరపతి విధానం అవలంభిస్తున్న రాజన్‌పై ప్రస్తుతం రెపో రేటు తగ్గింపునకు అటు ప్రభుత్వం నుంచీ ఇటు పరిశ్రమల నుంచీ తీవ్ర ఒత్తిడి ఉంది. ఆయన బాధ్యతలు చేపట్టినప్పుడు రిలైట్ ద్రవ్యోల్బణం 9.8 శాతం కాగా, ఇప్పుడు 3.8 శాతానికి చేరింది. రూపాయి విలువ 70 స్థాయికి పడిపోతున్న భయాలు, తీవ్ర కరెంట్ అకౌంట్‌లోటు, 5 శాతం లోపు జీడీపీ వృద్ధి రేటు, సావరిన్ రేటింగ్‌ను జంక్ స్థాయికి దింపుతామన్న రేటింగ్ ఏజెన్సీల హెచ్చరికల నేపథ్యంలో ఆయన ఆర్బీఐ గవర్నర్ బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఆయా స్థూల ఆర్థిక అంశాలకు సంబంధించి ప్రస్తుతం భారత్ పరిస్థితి మెరుగుపడిందనే భావించవచ్చు.