beer manufacturing unit
-
ఈ వార్త చదివితే జన్మలో బీరు తాగరు
కొలరాడో : సంతోషంలో మునిగినా, బాధలో ఉన్నా వాటిని మరిచిపోవాలంటే గొంతులో ‘చుక్క’ పడాల్సిందే. అందులోనూ బీర్లు తాగేవారి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక దిక్కు కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా వైన్ షాపుల ముందు మందుబాబుల సందడి ఏమాత్రం తగ్గడం లేదు. ప్రపంచంలో ఏ దేశంలో చూసిన వారి హడావిడి మాత్రం మాములుగా ఉండదు. లాక్డౌన్ సమయం కావడంతో మందు కోసం వెంపర్లాడుతున్న మందుబాబులు ఈ వార్త చదివితే నిజంగా షాక్ అవ్వాల్సిందే. ఎంతో ఇష్టంగా సేవించే బీరులో మూత్రం కలుస్తుందన్న వార్త ప్రస్తుతం వైరల్‌గా మారింది. (ఇంటర్వ్యూలో అడ్డొచ్చిన కూతురు: పేరేంటమ్మా?) ప్రపంచవ్యాప్తంగా బీర్ల తయారీలో ప్రసిద్ధి పొందిన బడ్వైజర్ బ్రాండ్‌కు అమెరికాలోని కొలరాడోలో పెద్ద ప్లాంట్ ఉంది. ఆ దేశానికి కావాల్సిన బీరులో అధిక శాతం ఆ ప్లాంటు నుంచే ఉత్పత్తి అవుతోంది. అయితే గత 12 ఏళ్లుగా ఆ ప్లాంట్‌లో పని చేస్తున్న వాల్టర్ పావెల్( పేరు మార్చారు) అనే వ్యక్తి బీరు ట్యాంకులో మూత్రం పోస్తున్నట్లు పెద్ద బాంబునే పేల్చాడు. ఈ విషయంపై వాల్టర్‌ను నిలదీయగా అతనిచ్చిన సమాధానం వింటే ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపించింది. ఆ వ్యక్తి మాట్లాడుతూ.. ' జాయిన్ అయిన మొదటి రెండు సంవత్సరాలు ట్యాంకు కింది భాగంలో నీళ్లు కలిపే పని చేసేవాడిని. ప్లాంట్‌లో సీనియర్లతో పరిచయం పెరిగిన తర్వాత పైభాగంలో పని చేసే అవకాశం లభించింది. బీర్ ట్యాంకులో మూత్రం ఎందుకు పోశావని నిలదీస్తే మాత్రం నా దగ్గర కచ్చితమైన సమాధానం లేదు. ఆ పని ఎందుకు చేశానో నాకే తెలీదు. బేసిగ్గా నాకు బద్ధకం ఎక్కువ. వాష్ రూమ్ కోసం అంత దూరం వెళ్లాలా? అనిపించేది, ప్రకృతి ఎప్పుడు పిలిచినా ట్యాంకులోనే పని కానిచ్చేవాడిని. ఒక్కోసారి మా ఇంటివాళ్లు బీర్ తెమ్మన్నప్పుడు చాలా భయపడిపోయేవాడిని. అయినా కొలరాడోలోని ఫోర్ట్ కొలిన్స్ ప్లాంట్‌లో మాత్రమే ఈ పని చేశాను' అంటూ సమాధానమిచ్చాడు. ' పైగా ఈ విషయం ఇప్పుడు మీకు తెలిసిపోయింది కాబట్టి ఇక మీదట నేను అలా చేయను.. ఇప్పటినుంచి బడ్వైజర్ ప్రియులు నాణ్యమైన బీర్‌ను పొందుతారు ' అంటూ వ్యంగ్యమైన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ విషయం తెలిసిన తర్వాత కూడా కంపెనీ యాజమాన్యం సదరు వ్యక్తిని ఉద్యోగం నుంచి తొలగించకపోవడంపై పలు అనుమానాలకు తావిచ్చింది. ప్రపంచ ప్రఖ్యాత గాంచిన బడ్వైజర్ కంపెనీలో 12 ఏళ్లుగా ఒక వ్యక్తి బీరు ట్యాంకులో మూత్రం పోయడం సాధ్యమేనా అనే అనుమానాలు కలిగాయి. ఆ వ్యక్తి చెప్పిందంతా నిజమేనా.. కాదా.. అనేది తెలుసుకోవడానికి ఒక సంస్థ దీనిపై అధ్యయనం చేసింది. వీరి అధ్యయనంలో ఇదంతా నిజం కాదని, ఫూలిష్ హ్యూమర్ డాట్ కామ్ అనే వెబ్సైట్ సంస్థ సరదాగా క్రియేట్ చేసిన ఫేక్ న్యూస్ అని తేలింది. కానీ వారు రాసిన ఈ వార్త మాత్రం బీరు ప్రియుల్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఈ విషయంపై బడ్వైజర్ సంస్థ నుంచి ఎలాంటి సమాచారం అందలేదు. చదవండి: టిక్‌టాక్ నిషేధంతో భారీగా నష్టపోయిన చైనా -
ఇక బార్లోనే బీర్ తయారీ
- ఆదాయం పెంపుకోసంఎక్సైజ్ శాఖ సన్నాహాలు - వ్యాపారుల నుంచీ పెరుగుతున్న డిమాండ్ - ఇప్పటికే పుణే, గుర్గావ్, ముంబైల్లో తయారీ కేంద్రాలు న్యూఢిల్లీ: ఢిల్లీలోని బార్ అండ్ రెస్టారెంట్స్, షాపింగ్ మాల్స్, ఫైవ్ స్టార్ హోటళ్లలో బీర్ తయారు చేసే సూక్ష్మ కేంద్రాలకు అనుమతించే యోచనలో ఉంది ఢిల్లీ ప్రభుత్వం. దీనిద్వారా ఆదాయ పెంపునకు కసరత్తులు చేస్తోంది. గుర్గావ్, ముంబై, పుణేల్లో ఇలాంటి బీర్ తయారీ కేంద్రాలు ఇప్పటికే ఉన్నాయి. వీటి తరహాలోనే ఢిల్లీలో ఏర్పాటు చేసేందుకు ఎక్సైజ్ శాఖ సన్నాహాలు చేస్తోంది. ఢిల్లీ ప్రభుత్వం రెండేళ్ల కిందట ఆమోదించిన ఈ ప్రతిపాదనను ఆర్థిక శాఖకు పంపినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఆ ప్రతిపాదనను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. గుర్గావ్లో ఇలాంటి యూనిట్స్ నిర్వహిస్తున్న ఢిల్లీలోని హోటళ్లు, పబ్లనుంచి వివరాలు సేకరించామని అధికారులు వెల్లడించారు. ఒక్క మైక్రో బీర్ ప్లాంట్ ఏర్పాటుకు 4వేల చదరపు అడుగుల స్థలం అవసరం కాగా.. ఇందుకుగాను 10 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. గతంలో ఢిల్లీ మంత్రివర్గ ఆమోదం తరువాత ఈ ఫైల్‌ను కేంద్ర ప్రభుత్వ పట్టణ అభివృద్ధి మంత్రిత్వ శాఖకు పంపారు. ఆ సమయంలో కేంద్రం ఢిల్లీ విమానాశ్రయంలో మాత్రమే బీర్ తయారీ యూనిట్ ఏర్పాటుకు అనుమతించింది కేంద్రం. హోటళ్లు, షాపింగ్ మాల్స్‌లో సైతం ఈ బీర్ తయారీ సూక్ష్మ యూనిట్ల ఏర్పాటుకు అనుమతివ్వాలని తాజాగా వ్యాపారవేత్తలనుంచి డిమాండ్ వస్తోంది. దీంతో ఎక్సైజ్ అధికారులు తమ ప్రతిపాదనను ఆమోదించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అనుమతి కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి మరో లేఖరాయాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఇతర దేశాలతో పోలిస్తే... బీర్ వినియోగం మన దేశంలో చాలా తక్కువగా ఉందని హోటళ్ల వ్యాపారులు, విశ్రాంతి పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. ఈ సూక్ష్మ యూనిట్ల వల్ల వినియోగదారులకు ఇష్టమైన ఫ్లేవర్‌లో బీర్‌ను వారి ముందే తయారు చే సి అందించడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల విశ్వసనీయత పెరిగి బీర్ వినియోగం పెరుగుతుందని గుర్గావ్ లోని ఓ పబ్ యజమాని చెబుతున్నాడు. గుర్గావ్, ఢిల్లీ సరిహద్దుల్లోని హర్యానా పట్టణ ప్రాంతాల్లో బహుళజాతి కంపెనీలు, సంపన్నులు నివసించే ప్రాంతాల్లో ఇప్పటికే ఎనిమిది బీర్ తయారీ సూక్ష్మ కేంద్రాలున్నాయని, వాటిలో వ్యాపారం బ్రహ్మాండంగా నడుస్తోందని ఆయన చెప్పారు.