ఇక బార్‌లోనే బీర్ తయారీ
- ఆదాయం పెంపుకోసంఎక్సైజ్ శాఖ సన్నాహాలు
- వ్యాపారుల నుంచీ పెరుగుతున్న డిమాండ్
- ఇప్పటికే పుణే, గుర్గావ్, ముంబైల్లో తయారీ కేంద్రాలు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని బార్ అండ్ రెస్టారెంట్స్, షాపింగ్ మాల్స్, ఫైవ్ స్టార్ హోటళ్లలో బీర్ తయారు చేసే సూక్ష్మ కేంద్రాలకు అనుమతించే యోచనలో ఉంది ఢిల్లీ ప్రభుత్వం. దీనిద్వారా ఆదాయ పెంపునకు కసరత్తులు చేస్తోంది. గుర్గావ్, ముంబై, పుణేల్లో ఇలాంటి బీర్ తయారీ కేంద్రాలు ఇప్పటికే ఉన్నాయి. వీటి తరహాలోనే ఢిల్లీలో ఏర్పాటు చేసేందుకు ఎక్సైజ్ శాఖ సన్నాహాలు చేస్తోంది.
ఢిల్లీ ప్రభుత్వం రెండేళ్ల కిందట ఆమోదించిన ఈ ప్రతిపాదనను ఆర్థిక శాఖకు పంపినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఆ ప్రతిపాదనను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. గుర్గావ్‌లో ఇలాంటి యూనిట్స్ నిర్వహిస్తున్న ఢిల్లీలోని హోటళ్లు, పబ్‌లనుంచి వివరాలు సేకరించామని అధికారులు వెల్లడించారు. ఒక్క మైక్రో బీర్ ప్లాంట్ ఏర్పాటుకు 4వేల చదరపు అడుగుల స్థలం అవసరం కాగా.. ఇందుకుగాను 10 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది.
గతంలో ఢిల్లీ మంత్రివర్గ ఆమోదం తరువాత ఈ ఫైల్‌ను కేంద్ర ప్రభుత్వ పట్టణ అభివృద్ధి మంత్రిత్వ శాఖకు పంపారు. ఆ సమయంలో కేంద్రం ఢిల్లీ విమానాశ్రయంలో మాత్రమే బీర్ తయారీ యూనిట్ ఏర్పాటుకు అనుమతించింది కేంద్రం. హోటళ్లు, షాపింగ్ మాల్స్‌లో సైతం ఈ బీర్ తయారీ సూక్ష్మ యూనిట్ల ఏర్పాటుకు అనుమతివ్వాలని తాజాగా వ్యాపారవేత్తలనుంచి డిమాండ్ వస్తోంది. దీంతో ఎక్సైజ్ అధికారులు తమ ప్రతిపాదనను ఆమోదించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అనుమతి కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి మరో లేఖరాయాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఇతర దేశాలతో పోలిస్తే... బీర్ వినియోగం మన దేశంలో చాలా తక్కువగా ఉందని హోటళ్ల వ్యాపారులు, విశ్రాంతి పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు.
ఈ సూక్ష్మ యూనిట్ల వల్ల వినియోగదారులకు ఇష్టమైన ఫ్లేవర్‌లో బీర్‌ను వారి ముందే తయారు చే సి అందించడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల విశ్వసనీయత పెరిగి బీర్ వినియోగం పెరుగుతుందని గుర్గావ్ లోని ఓ పబ్ యజమాని చెబుతున్నాడు. గుర్గావ్, ఢిల్లీ సరిహద్దుల్లోని హర్యానా పట్టణ ప్రాంతాల్లో బహుళజాతి కంపెనీలు, సంపన్నులు నివసించే ప్రాంతాల్లో ఇప్పటికే ఎనిమిది బీర్ తయారీ సూక్ష్మ కేంద్రాలున్నాయని, వాటిలో వ్యాపారం బ్రహ్మాండంగా నడుస్తోందని ఆయన చెప్పారు.