కడప, బయ్యారం స్టీల్ ప్లాంట్ సాధ్యాసాధ్యాలపై కమిటీ
వెంకయ్యనాయుడికి సమాచారం ఇచ్చిన బీరేంద్ర సింగ్
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కడపలో, ఖమ్మం జిల్లా బయ్యారంలో స్టీల్ ప్లాంటు ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను తేల్చేందుకు టాస్క్ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసినట్టు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బీరేంద్ర సింగ్.. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడికి మంగళవారం సమాచారం ఇచ్చారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి తక్కువ ఉత్పత్తి వ్యయంతో నిర్మించేందుకున్న అవకాశాలను ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది.
ఉక్కు శాఖ సంయుక్త కార్యదర్శి నేతృత్వం వహించే ఈ కమిటీలో సెయిల్, ఆర్ఐఎన్ఎల్, ఎన్ఎండీసీ, మెకాన్ సంస్థల నుంచి డెరైక్టర్ స్థాయి అధికారి సభ్యులుగా ఉంటారు. ఏపీ, తెలంగాణ నుంచి ప్రభుత్వ ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. అంతర్జాతీయంగా, దేశీయంగా ఉక్కు పరిశ్రమ స్థితిగతులు సరిగా లేనందున వాణిజ్యపరమైన యోగ్యత లేదంటూ సెయిల్ సంస్థ కడప, బయ్యారం స్టీలు ప్లాంట్లపై గతంలో నివేదిక ఇచ్చింది. దీంతో వెంకయ్యనాయుడు ఇటీవల ఉక్కు మంత్రితో ఈ అంశమై చర్చించారు. టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసి సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని సూచించారు.