Beg
-
వీధుల్లో బిక్షాటన చేసే అమ్మాయి నేడు డాక్టర్‌గా..!
జీవితం అంటేనే కష్టాల మయం అనుకుంటాం. కటిక దారిద్ర్యంలో మగ్గుతున్న వాళ్లకు కూడా జీవితం కొన్ని సువర్ణావకాశాలు అందిస్తుంది. అయితే ఆ అవకాశాలను తెలివిగా అందిపుచ్చుకున్న వారే అద్భుతాలు చేసి చూపిస్తారు. అలాంటి కోవకు చెందిందే పింకీ హర్యాన్. మురికి వాడల్లో తల్లిదండ్రులతో బిక్షాటన చేస్తూ బతికిన అమ్మాయి..నేడు డాక్టర్ అయ్యి అందర్నీ ఆశ్చర్యపరిచడమే గాక ఎందరికో స్ఫూర్తిని కలిగించింది. వివరాల్లోకెళ్తే.. పింకీ హర్యానా హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలోని మెక్లీడ్‌గంజ్‌లో నిరుపేద కుటుంబంలో జన్మించింది. చరణ్ ఖుద్లోని మురికివాడలో నివసించే ఆ కుటుంబం రోడ్డుపై భిక్షాటను చేస్తూ జీవనం సాగిస్తుండేది. చెత్త కుండిల్లో ఆహారాన్ని ఏరుకుని తినే దుర్భర జీవితాన్ని సాగించేది పింకీ కుటుంబం. ప్రారంభ జీవితం అంతా కటిక దారిద్య్రం, కష్టాల మధ్య సాగింది. ఏదో అద్భుతం జరిగినట్లుగా ధర్మశాలలోని టోంగ్ లెన్ ఛారిటబుల్ ట్రస్ట్‌కు నేతృత్వం వహించే బౌద్ధ సన్యాసి లోబ్సాంగ్ జమ్యాంగ్ దృష్టిలో పింకీ పడింది. అదే ఆమె జీవితాన్ని మార్చబోతుందని ఆనాడు ఊహించలేదు. ఆయన పింకీని చూసి చదివించాల్సిందిగా ఆమె తండ్రి కాశ్మీరీ లాల్‌ను కోరాడు. అందుకు మొదట కాశ్మీరీ లాల్ అంగీకరించలేదు. ఐతే జమ్యాంగ్ తన మాటలతో అతడిని ఒప్పించి పింకీని ధర్మశాలలోని దయానంద్ పబ్లిక్ స్కూల్లో చేరిపించాడు. అలా అక్కడ నిరుపేద పిల్లల కోసం ఏర్పాటు చేసిన ట్రస్ట్ హాస్టల్లో నివశించిన తొలి విద్యార్థిగా పింకీ నిలిచింది. తన జీవితాన్ని మంచిగా మార్చుకునేందుకు దేవుడిచ్చిన ఈ సువర్ణావకాశాన్ని పింకీ అస్సలు వదులుకోలేదు. ఆ పాఠశాలలో చేరినప్పటి నుంచి తెలివైన విద్యార్థిగా పేరు తెచ్చకోవడమే గాక మంచి మార్కులతో అన్ని తరగతులు పాసయ్యింది. చివరికీ పింకీ 12వ తరగతి పరీక్షలు పూర్తి అయిన వెంటనే రాసిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్‌లో కూడా ఉత్తీర్ణత సాధించింది. కానీ ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు సంపాదించుకునేలా మంచి ర్యాంకు సాధించలేకపోయింది. అందువల్ల మిగతా పిల్లలు మాదిరిగా ప్రైవేట్ మెడికల్ కాలేజీలో అంతంతా ఫీజులు చెల్లించి చదవుకులేని నిస్సహయ స్థితిలో పడింది పింకీ. మళ్లీ తన పరిస్థితి మొదటకొచ్చింది అనుకునేలోపే 2018లో, టోంగ్-లెన్ ఛారిటబుల్ ట్రస్ట్ మరోసారి ఆమెను ఆదుకుంది. చైనాలోని ప్రఖ్యాత మెడికల్ కాలేజ్‌లో అడ్మిషన్ పొందడంలో పింకీకి సహాయం చేసింది. అలా ఆమె ఆరేళ్లలో చైనీస్ కళాశాల నుంచి ఎంబీబీఎస్ పట్టా పొంది డాక్టర్ అయ్యింది. ఇప్పుడు మళ్లీ ధర్మశాలకు తిరిగి వచ్చేసింది. ప్రస్తుతం ఆమె భారతదేశంలో వైద్యం అందించేందుకు అవసరమైన మెడికల్ లైసెన్స్‌ని పొందేందుకు ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎగ్జామినేషన్(ఎఫ్ఎంజీఈ) కోసం సిద్ధమవుతుంది. ఇంతలా పింకీ జీవితాన్ని మార్చిన బౌద్ధ సన్యాసి లోబ్సాంగ్ జమ్యాంగ్ ఆమెను చూసి గర్వపడుతున్నానని అన్నారు. పిల్లలు మంచి మనుషులుగా మారేలా ప్రోత్సహించబడితే నిస్సందేహంగా అద్భుతాలు చేస్తారని విశ్వసిస్తానని చెప్పారు. ఇక పింకీ తన జీవితాన్ని ఇంతలా గౌరవప్రదంగా మార్చిన జమ్యాంగ్ని తన తండ్రిగా అభివర్ణించింది. అంతేగాదు పింకీలా ఆ ధర్మశాలలో చదివిన వందలాది మంది పిల్లలు జీవితాలు మారడమే గాక వారంతా వైద్యులు, ఇంజనీర్లు, ప్రభుత్వాధికారులుగా స్థిరపడ్డారు. ఈ పింకీ గాథ జీవితంలో లభించే అవకాశాన్ని అందిపుచ్చుకుని కష్టపడితే కష్టాల నుంచి బయటపడటమే గాక అద్భుతాలు చేసి చూపించొచ్చని తెలుస్తోంది కదూ..!.(చదవండి: ఈసారి దీపావళికి చీరను వెరైటీగా కట్టుకోండిలా..!) -
పారాఅథ్లెట్తో బిచ్చమెత్తించారు..
న్యూఢిల్లీ: శారీరక లోపాలతో సతమతమవుతున్నా వెరవక కష్టించి.. ఏదో సాధించి దేశం పేరు మార్మొగేలా చేయాలని తపన పడుతున్న ఓ పారాఅథ్లెట్‌కు తీవ్ర అవమానం జరిగింది. దృష్టిలోపం గల కాంచనమాల పాండే ఈ నెల 3 నుంచి 9 వరకూ జర్మనీ రాజధాని బెర్లిన్‌లో జరిగిన పారా స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొని వెండి పతకం సాధించారు. అయితే, చాంపియన్‌షిప్‌లో పాల్గొంటున్న సమయంలో ఖర్చులకు డబ్బు లేకపోవడంతో ఆమె బిచ్చమెత్తినట్లు రిపోర్టులు వచ్చాయి. కాంచనమాల పాండే ఇంటర్వూ తీసుకున్న మెయిల్ టుడే.. టూర్లో ఆమెకు జరిగిన అవమానాన్ని వెలుగులోకి తెచ్చింది. టోర్నీలో పాల్గొనేందుకు రూ.5 లక్షలు లోన్ తీసుకున్నట్లు కాంచనమాల మెయిల్ టుడేకు వెల్లడించారు. టోర్నమెంట్ ముగిసేనాటికి తాను రూ.1,10,000/- హోటల్ బిల్లు చెల్లించాల్సివుందని చెప్పారు. తాను ఖర్చు చేసిన డబ్బు రీయింబర్స్మెంట్ రూపంలో వెనక్కు వస్తుందో? రాదో కూడా అధికారికంగా సమాచారం లేదని వెల్లడించారు. కాగా, ఈ ఏడాది జరిగిన పారా అథ్లెటిక్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌కు భారత్ నుంచి ఎంపికైన ఏకైక స్విమ్మర్ కాంచనమాల పాండేనే. కాంచనమాలకు ఈ గతి పట్టడానికి కారణం భారత పారాలింపిక్ కమిటి(పీసీఐ)యే అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టూర్‌కు బయల్దేరే ముందు ఆర్థిక సాయం కోసం కాంచనమాల పెట్టుకున్న అభ్యర్ధనను పీసీఐ పట్టించుకోలేదు. ఈ ఘటనపై టాప్ చైర్మన్ అభినవ్ బింద్రా ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు బాధ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ క్రీడా శాఖ మంత్రి విజయ్ గోయల్, ప్రధానమంత్రి నరేంద్రమోదీలకు ట్వీట్ చేశారు. బింద్రా ట్వీట్‌కు వెంటనే సమాధానం ఇచ్చిన గోయల్.. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. విచారణ తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. -
గులాబీయింగ్
► బేగ్‌కు నామినేటెడ్ పోస్టుతో ఆశావహుల ఎదురుచూపు ► ప్రజాబలం ఉన్న నేతలకే ఇవ్వాలని ఆ పార్టీలో చర్చ ► వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు సాక్షి, ఖమ్మం: అధికార పార్టీ జిల్లా అధ్యక్ష పీఠం ఎవరికి దక్కనుంది..? ప్రజాబలం ఉన్న నేతలకే ఇస్తారా..? వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రథసార«థి బాధ్యతలు కట్టబెడతారా..? లేక రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టు దక్కించుకున్న ప్రస్తుత అధ్యక్షుడు బేగ్‌నే ఈ పదవిలో కొనసాగిస్తారా..? అన్న దానిపై టీఆర్ఎస్లో చర్చసాగుతోంది. ఒకవేళ బేగ్‌ను మారిస్తే ఎవరిని జిల్లా అధ్యక్షుడిని చేయాలనే దానిపై ఆపార్టీ నేతలు కసరత్తు మొదలుపెట్టారు. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు టీఆర్ఎస్లో పార్టీ పదవుల విషయంలో జిల్లాలో పోటీనే లేదు. మిగతా జిల్లాలతో పోలిస్తే ఆపార్టీకి ఇక్కడ తగిన బలం లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. అయితే టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఇతర పార్టీల నుంచి వలసలు పెరిగాయి. తాము టీఆర్ఎస్లో చేరకముందు ఇతర పార్టీల్లో ప్రాముఖ్యత ఉన్న పదవుల్లో కొనసాగామని, పార్టీ పదవి లేకపోతే నామినేటెడ్ పోస్టు అయినా ఇవ్వాలని రాష్ట్ర స్థాయిలో చేరికల సమయంలోనే హామీలు తీసుకున్నారు. ఇటీవల నామినేటెడ్ పోస్టుల భర్తీలో జిల్లాకు తగిన ప్రాధాన్యత దక్కింది. అదేవిధంగా జిల్లాలోనూ పలు వ్యవసాయ మార్కెట్ కమిటీలు భర్తీ చేయడంతో పదవుల కోలాహలం నెలకొంది. ఇంకా జిల్లాలో కొన్ని మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీలు త్వరలో భర్తీ చేస్తామన్న ఆపార్టీ నేతల ప్రకటనలతో.. ఈపదవులు తమకు దక్కవని నిరాశతో ఉన్నవారు కనీసం జిల్లా, మండల స్థాయిలో పార్టీ పదవులు దక్కుతాయోనన్న ఆశలో ఉన్నారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడుగా ఉన్న బుడాన్బేగ్ను ఇటీవల ప్రభుత్వం రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా నియమించడంతో.. జిల్లా పార్టీ అధ్యక్ష పీఠం తమకే దక్కుతుందని ఆపార్టీలోని కొంతమంది నేతలు ధీమాగా ఉన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ ఆశీస్సులు తమకంటే తమకే ఉన్నాయని, పార్టీ అధ్యక్ష పదవి నియామకం చేపడితే ..తమకు పదవి ఖాయమేనని ఆశావహులు భావిస్తున్నారు. జిల్లా పార్టీని నడిపించే సత్తా ఎవరికి ఉంది..? ఫలానా నేత అయితే ఎలా ఉంటుంది, ప్రజాబలం ఎవరికి ఉంది..? అన్న కోణంలో పార్టీ ప్రజాప్రతినిధులు కూడా ద్వితీయ శ్రేణి నేతల ద్వారా ఆరా తీస్తున్నట్లు తెలిసింది. వచ్చే ఎన్నికలను కీలకంగా తీసుకొని.. 2019లో వచ్చే సార్వత్రిక ఎన్నికలను కీలకంగా తీసుకొని పార్టీ అధ్యక్ష పదవుల నియామకాలు చేపడతామని కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పలుమార్లు సభలు, సమావేశాల్లో ప్రకటించారు. అయితే బుడాన్‌బేగ్‌కు రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టు ఇవ్వడంతో మిగతా జిల్లాల మాదిరిగానే జిల్లాకు కూడా కొత్త రథసారథి కోసం అన్వేషణను రాష్ట్ర నేతలు ప్రారంభించినట్లు సమాచారం. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ కేడర్ జిల్లా అధ్యక్షుడి సూచనల మేరకే నడవాలంటే బలమైన నేతకు ఈ బాధ్యతలు అప్పగించాలన్న యోచనలో ఉన్నారు. బేగ్‌ను కొంతకాలం పాటు జిల్లా అధ్యక్షుడిగా కొనసాగిస్తారా..? లేక కొత్త వారికి సారథ్య బాధ్యతలపై పార్టీ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటదోనని ఆశావహులు ఎదురుచూస్తున్నా రు. బేగ్‌కు నామినేటెడ్ పోస్టు ఇవ్వడంతో పార్టీ అధ్యక్ష పీఠం మార్పు ఖాయమని అనుకుంటు న్న వారు మాత్రం జిల్లాతో పాటు రాష్ట్ర నేతలు, మంత్రులను ప్రసన్నం చేసుకుంటున్నారు. -
అయ్యా.. కాల్మొక్తా
♦ బతుకులు ఆగం చేయకుండ్రి ♦ ఎవుసం.. ఇండ్లు.. గొడ్డు.. గోద.. ♦ ఇడ్సిపెట్టి యాడికి బోవాలె.. ♦ కలెక్టర్, ఆర్డీఓ కాళ్లపై పడి వేడుకోలు ♦ బోరున విలపించిన ఏటిగడ్డ కిష్టాపూర్ ♦ ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించాలి: రోనాల్డ్‌రాస్ ♦ తాత్కాలికంగా భూ సర్వేను వాయిదా వేసిన జేసీ తొగుట: ‘కాల్మొక్తం సార్లు.. మా కొంపలు ముంచి మా బత్కుల్ని ఆగం జేయకుండ్రి.. మా ఊరు మునిగిపోతే మేమెట్లా బతికేది.. ఎవుసం, ఇండ్లు, గొడ్డు గోద ఇడ్సిపెట్టి మేము యాడికి బోవాలే సార్లు...’ అంటూ సాక్షాత్తు కలెక్టర్ కాళ్లమీద పడి ఊరుకు ఊరే బోరున విలపించింది. ఈ ఘటన తొగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్‌లో మంగళవారం చోటుచేసుకుంది. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణంతో మండల పరిధిలోని ఏడు గ్రామా లు ముంపునకు గురవుతన్నాయి. ఈ నేపథ్యంలో ముంపు బాధితుల్లో ఆందోళన నెల కొంది. కలెక్టర్‌తో పాటు జేసీ వెంకట్రామిరెడ్డి, సిద్దిపేట ఆర్డీఓ ముత్యం రెడ్డి.. ఏటిగడ్డ కిష్టాపూర్‌లో ముంపు బాధితులకు భూ సేకరణ చట్టం పై అగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని మిహ ళలంతా ఉద్వేగాన్ని ఆపుకోలేక ఒక్కసారిగా బోరున విలపిం చారు. మా బత్కుల్ని ఆగం చేయవద్దు సార్లూ.. అటూ కలెక్టర్ రోనాల్డ్ రాస్, సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి కాళ్ళపై పడి కన్నీరు మున్నీరయ్యా రు. అక్కడే ఉన్న మరి కొందరు రైతులు కంట తడి పెట్టారు. వేములఘట్ మాజీ సర్పంచ్ కరుణాకర్‌రెడ్డి మనోవేదనకు గురై ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయాడు. వెంటనే చికిత్స కో సం సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రతి ఒక్కరూ చేయూతనివ్వాలి: కలెక్టర్ సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు సాగాలంటే ప్రతి ఒక్కరూ చేయూతనివ్వాలని కలెక్టర్ రోనాల్డ్ రాస్ ముంపు బాధితులను కోరారు. ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామస్తుల సమస్యలను ఆయన సావదానంగా అడిగి తెలుసుకున్నారు. ఉద్వేగానికి గురై విలపించిన భూ బాధితులను, రైతులను ఓదార్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ముంపు బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అందుకు భూ సేకరణ చట్టంపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించడం కోసం రెవెన్యూ యంత్రాంగం చర్యలు చేపట్టిందన్నారు. మల్లన్న సాగర్ నిర్మాణానికి లైడార్ శాస్త్రవేత్తలు సర్వే పూర్తి చేసి సర్కారుకు నివేదికలు అందించారని తెలిపారు. సర్వే ప్రకారం తొగుట, కొండపాక మండలాలల్లో రిజార్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిందన్నారు. గ్రామాల్లో గ్రామ సభలను నిర్వహించి, ప్రజలకు భూ సేకరణ చట్టంపై అవగాహన కల్పించాల్సి ఉండగా ఇక్కడి అధికారుల నిర్లక్ష్యం వహించడంతో సమస్యలకు దారి తీసిందన్నారు. రైతులు పెద్ద మనసుతో భూములు ఇవ్వాలని కోరారు. ఎకరానికి రిజిష్ట్రేషన్ విలువ ప్రకారం రూ.5.85 లక్షల నష్ట పరిహారం చెల్లిస్తుందన్నారు. చెట్లు, బోరు బావులు, ఓపెన్ వెల్స్కు, డ్రిప్పు పైపులైన్లకు అదనంగా నష్ట పరిహారం చెల్లిస్తామని తెలిపారు. ఇంటి పరిహారంతో పాటు అదనంగా రూ. 5.04 లక్షల పరిహారం అందజేస్తమన్నారు. ప్రజలు ముంపు ప్రాంతం నుండి మరో చోటికి వెళ్ళడానికి మరో రూ. 50 వేలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. ముంపు బాధితులను ఆదుకునేందుకు కొత్త జీవో తేవాలి కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన 2013 భూ సేకరణ చట్టం, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 123 జీవోలతో సంబంధం లే కుండా ముంపు బాధితులకు న్యాయం జరిగేలా కొత్త జీవో చట్టాన్ని తీసుకురావాలని ఏటిగడ్డ కిష్టాపూర్ ముంపు బాధితులు డిమాండ్ చేశారు. ఎకరానికి రూ. 15 లక్షల నష్ట పరిహారంతో పాటు గ్రామాలకు గ్రామాన్ని నిర్మించి ఇవ్వాలని తీర్మాణం చేస్తూ జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రాన్ని అందించారు. మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు భూ సర్వేను ఆపివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. దీంతో జేసీ వెంకట్రాంరెడ్డి స్పందించి భూ సర్వేను తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్లు ప్రకటించారు. -
పాపం బంగారు తల్లి!
దరఖాస్తుదారుల్లో సగం మంది అకౌంట్లలోనే డబ్బులు మిగతా వారికి ఎదురుచూపులే.. పథకం ఉందా.. లేదా అనే సందేహాలు? కొత్త ప్రభుత్వం స్పందించాలని వేడుకోలు నిరుపేదలు ఆడపిల్ల జన్మించిందని ఆందోళన చెందొద్దు.. ఆమెకు 21 ఏళ్లపాటు అండగా ఉంటామని.. ఆపై చదువులకు ఖర్చులు కూడా బ్యాంకులోనే జమ చేస్తామని గత ప్రభుత్వం భరోసా ఇచ్చింది.. బంగారు తల్లి పథకాన్ని ప్రవేశపెట్టి దాని ద్వారా అర్హులైన లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్లలో డబ్బులు వేస్తామని చెప్పింది. కానీ... దరఖాస్తు చేసుకున్న వారిలో సగం మందికే డబ్బులు అందారుు. మిగిలిన వారు డబ్బుల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. తొర్రూరు : పేదింటి ఆడపిల్లలకు పెళ్లి నాటికి చేయూతనివ్వాలని గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బంగారు పథకానికి ఆదిలోనే తూట్లు పడ్డాయి. 2013, మే 1వ తేదీ తర్వాత జన్మించిన ఆడపిల్లలను బంగారు తల్లి పథకంలో చేర్చే అవకాశం కల్పించింది. దీనికోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు బిడ్డ జన్మించినప్పుడు రూ.2,500, మొదటి, రెండో సంవత్సరం నాటికి రూ.వెయ్యి చొప్పున రూ.2వేలు, 3,4,5 ఏళ్ల నాటికి రూ.1,500 చొప్పున రూ.4,500, 6,7,8,9 ఏళ్ల నాటికి, రూ.2వేల చొప్పున రూ.8వేలు, 10,11,12,13 ఏళ్ల నాటికి రూ.2,500 చొప్పున రూ.10వేలు, 14,15 ఏళ్ల నాటికి రూ.3వేల చొప్పున రూ.6వేలు వారి బ్యాంకు అకౌంట్లలో డబ్బులు వేసేలా పథకాన్ని రూపొందించారు. 16,17 ఏళ్ల నాటికి రూ.3,500 చొప్పున రూ.7వేలు, 18,19,20,21 ఏళ్ల నాటికి రూ.4వేల చొప్పున రూ.16వేలు, అదనంగా ఇంటర్ పాస్ అయితే రూ.50వేలు, డిగ్రీ పాస్ అయితే రూ.లక్ష చొప్పున మొత్తం రూ.2.06లక్షలు ఆడపిల్ల పెళ్లినాటికి వారి అకౌంట్లలో డబ్బులు వేయాల్సి ఉంది. అయితే బిడ్డ పుట్టిన నెలలోపు ఇవ్వాల్సిన రూ.2,500లను దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల్లో సగం కంటే తక్కువ మంది అకౌంట్లలోనే జమ చేశారు. మిగిలిన సగం మంది లబ్ధిదారుల గత ఏడాదిగా దరఖాస్తులు చేసుకొని ఎప్పుడు తమ అకౌంట్లలో డబ్బులు పడుతాయోనని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. దరఖాస్తులు బోలెడు... ఆడపిల్లలకు చేయూతనిస్తామని ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా బంగారు తల్లి పథకాన్ని ప్రవేశపెట్టింది. దీంతో ఆడపిల్లలకు జన్మనిచ్చిన తల్లులు పథకం కోసం దరఖాస్తు చేయడం ప్రారంభించారు. 2013, మే 1 నుంచి ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా హన్మకొండ మినహా 44 మండలాలకు చెందిన 12,406 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో మొదట బిడ్డ జన్మించినప్పుడు అందించాల్సిన రూ.2,500 చొప్పున 4,994 మందికి మాత్రమే వారి అకౌంట్లలో జమ చేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. మిగిలిన 7,412 మందికి ఏడాది గడిచినా ఒక్క పైసా కూడా వారి అకౌంట్లలో పడలేదు. దీంతో నిరాశకు గురైన లబ్ధిదారులు అసలు బంగారు తల్లి పథకం ఉందా.. లేదా అని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో బాధ్యతలు చేపట్టిన కొత్త ప్రభుత్వం బంగారు తల్లి పథకాన్ని కొనసాగించి.. తమను ఆదుకోవాలని వేలాది మంది ఆడపిల్లల తల్లులు వేడుకుంటున్నారు. తొమ్మిది నెలలైనా పైసా రాలే నాకు బిడ్డ జన్మించి తొమ్మిది నెలలైంది. పాప పుట్టిన 10 రోజుల్లోనే బంగారు తల్లి పథకానికి దరఖాస్తు చేశా. ఆడపిల్లలు ఉన్న తమ కుటుంబానికి బంగారు తల్లి పథకం ఎంతో ఉపయోగపడుతుందని ఆశపడ్డాం. కొత్త ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి బంగారు తల్లి పథకాన్ని కొనసాగించే విధంగా చూడాలి. తమ కుటుంబాలను ఆదుకోవాలి. - గాయత్రి, అమ్మాపురం