పాపం బంగారు తల్లి! | Gold mother of sin! | Sakshi
Sakshi News home page

పాపం బంగారు తల్లి!

Published Sun, Sep 14 2014 3:33 AM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM

పాపం బంగారు తల్లి! - Sakshi

పాపం బంగారు తల్లి!

  • దరఖాస్తుదారుల్లో సగం మంది అకౌంట్లలోనే డబ్బులు
  • మిగతా వారికి ఎదురుచూపులే..
  • పథకం ఉందా.. లేదా అనే సందేహాలు?
  • కొత్త ప్రభుత్వం స్పందించాలని వేడుకోలు
  • నిరుపేదలు ఆడపిల్ల జన్మించిందని ఆందోళన చెందొద్దు.. ఆమెకు 21 ఏళ్లపాటు అండగా ఉంటామని.. ఆపై చదువులకు ఖర్చులు కూడా బ్యాంకులోనే జమ చేస్తామని గత ప్రభుత్వం భరోసా ఇచ్చింది.. బంగారు తల్లి పథకాన్ని ప్రవేశపెట్టి దాని ద్వారా అర్హులైన లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్లలో డబ్బులు వేస్తామని చెప్పింది. కానీ... దరఖాస్తు చేసుకున్న వారిలో సగం మందికే డబ్బులు అందారుు. మిగిలిన వారు డబ్బుల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు.
     
    తొర్రూరు : పేదింటి ఆడపిల్లలకు పెళ్లి నాటికి చేయూతనివ్వాలని గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బంగారు పథకానికి ఆదిలోనే తూట్లు పడ్డాయి. 2013, మే 1వ తేదీ తర్వాత జన్మించిన ఆడపిల్లలను బంగారు తల్లి పథకంలో చేర్చే అవకాశం కల్పించింది. దీనికోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు బిడ్డ జన్మించినప్పుడు రూ.2,500, మొదటి, రెండో సంవత్సరం నాటికి రూ.వెయ్యి చొప్పున రూ.2వేలు, 3,4,5 ఏళ్ల నాటికి రూ.1,500 చొప్పున రూ.4,500, 6,7,8,9 ఏళ్ల నాటికి, రూ.2వేల చొప్పున రూ.8వేలు, 10,11,12,13 ఏళ్ల నాటికి రూ.2,500 చొప్పున రూ.10వేలు, 14,15 ఏళ్ల నాటికి రూ.3వేల చొప్పున రూ.6వేలు వారి బ్యాంకు అకౌంట్లలో డబ్బులు వేసేలా పథకాన్ని రూపొందించారు.

    16,17 ఏళ్ల నాటికి రూ.3,500 చొప్పున రూ.7వేలు, 18,19,20,21 ఏళ్ల నాటికి రూ.4వేల చొప్పున రూ.16వేలు, అదనంగా ఇంటర్ పాస్ అయితే రూ.50వేలు, డిగ్రీ పాస్ అయితే రూ.లక్ష చొప్పున మొత్తం రూ.2.06లక్షలు ఆడపిల్ల పెళ్లినాటికి వారి అకౌంట్లలో డబ్బులు వేయాల్సి ఉంది. అయితే బిడ్డ పుట్టిన నెలలోపు ఇవ్వాల్సిన రూ.2,500లను దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల్లో సగం కంటే తక్కువ మంది అకౌంట్లలోనే జమ చేశారు. మిగిలిన సగం మంది లబ్ధిదారుల గత ఏడాదిగా దరఖాస్తులు చేసుకొని ఎప్పుడు తమ అకౌంట్లలో డబ్బులు పడుతాయోనని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
     
    దరఖాస్తులు బోలెడు...


    ఆడపిల్లలకు చేయూతనిస్తామని ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా బంగారు తల్లి పథకాన్ని ప్రవేశపెట్టింది. దీంతో ఆడపిల్లలకు జన్మనిచ్చిన తల్లులు పథకం కోసం దరఖాస్తు చేయడం ప్రారంభించారు. 2013, మే 1 నుంచి ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా హన్మకొండ మినహా 44 మండలాలకు చెందిన 12,406 మంది దరఖాస్తు చేసుకున్నారు.

    అందులో మొదట బిడ్డ జన్మించినప్పుడు అందించాల్సిన రూ.2,500 చొప్పున 4,994 మందికి మాత్రమే వారి అకౌంట్లలో జమ చేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. మిగిలిన 7,412 మందికి ఏడాది గడిచినా ఒక్క పైసా కూడా వారి అకౌంట్లలో పడలేదు. దీంతో నిరాశకు గురైన లబ్ధిదారులు అసలు బంగారు తల్లి పథకం ఉందా.. లేదా అని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో బాధ్యతలు చేపట్టిన కొత్త ప్రభుత్వం బంగారు తల్లి పథకాన్ని కొనసాగించి.. తమను ఆదుకోవాలని వేలాది మంది ఆడపిల్లల తల్లులు వేడుకుంటున్నారు.
     
    తొమ్మిది నెలలైనా పైసా రాలే
    నాకు బిడ్డ జన్మించి తొమ్మిది నెలలైంది. పాప పుట్టిన 10 రోజుల్లోనే బంగారు తల్లి పథకానికి దరఖాస్తు చేశా. ఆడపిల్లలు ఉన్న తమ కుటుంబానికి బంగారు తల్లి పథకం ఎంతో ఉపయోగపడుతుందని ఆశపడ్డాం. కొత్త ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి బంగారు తల్లి పథకాన్ని కొనసాగించే విధంగా చూడాలి. తమ కుటుంబాలను ఆదుకోవాలి.
     - గాయత్రి, అమ్మాపురం
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement