తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి పదవీ బాధ్యతలు చేపట్టినందుకు ముందుగా అభినందనలు. రేవంత్ ప్రమాణ స్వీకారం తర్వాత క్లుప్తంగా చేసిన ప్రసంగంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ప్రజాస్వామ్యం తిరిగి వచ్చిందని, ప్రజలకు స్వేచ్చ లభించిందని, తెలంగాణకు పట్టిన చీడ విరగడ అయిందని వ్యాఖ్యానించారు. ప్రజలకు ఇక ప్రగతి భవన్ ప్రజా దర్బార్‌గా అందుబాటులోకి రాబోతోందని ప్రకటించారు. అందుకు తగ్గట్లుగానే వెంటనే ప్రగతి భవన్ వద్ద కంచెలను తొలగించారు.వెంటనే ప్రగతి భవన్ పేరు మార్చారు.
✍️జ్యోతీరావు పూలే ప్రజాభవన్ అని పేరు పెట్టి అక్కడ ప్రజా దర్బార్ నిర్వహించబోతున్నట్లు రేవంత్ తెలిపారు. దానికి ఎవరైనా స్వేచ్చగా రావచ్చని ఆయన పిలుపు ఇచ్చారు. ఇది హర్షణీయమైన సంగతే. ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌ను నిర్మించారు కాని, ప్రజలకు అందుబాటులో లేకుండా చేశారు. దానిని విపక్షం ఎప్పటికప్పుడు విమర్శిస్తూనే ఉండేది. అలాగే పాత సచివాలయం పడగొట్టి ఆధునిక సచివాలయం భారీ ఎత్తున నిర్మించారు. కాని అందులోకి కూడా ఆయన పెద్దగా వెళ్లలేదు. ఇప్పుడు అది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉపయోగపడుతోంది. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ అని అంటారు. ఆ విషయం మరోసారి కనిపించింది. రేవంత్ తో పాటు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన వేదిక అంతా గందరగోళంగా మారింది. ఎవరెవరో ఆ వేదికపై కలియతిరుగుతూ సందడి చేశారు. ఒక రకంగా ఇది అవధులు లేని ప్రజాస్వామ్యమేమో అనిపించింది.
✍️తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ లభించిందని రేవంత్ అన్నట్లుగా చాలామంది ఆ వేదికపై సంచరించారు. ఒక పక్క మంత్రుల ప్రమాణ స్వీకారం జరుగుతున్నా వారి వెనుకే కొందరు మాట్లాడుకుంటూ ఉండడం, వారిని అధికారులు నివారించవలసి రావడం వంటి ఘట్టాలు అగుపించాయి. ఒక మాజీ ఎంపీ అయితే కలియతిరుగుతూ టీవీలలో కనిపించారు. అంత మాత్రాన ఏదో పెద్ద తప్పు జరిగిపోయిందని కాదు. సాధారణంగా ప్రమాణ స్వీకార వేదికపై కేవలం గవర్నర్, ముఖ్యమంత్రి, మహా అయితే కొద్ది మంది ముఖ్య అతిథులు ఉంటారు. మిగిలినవారంతా వేదిక ఎదురుగానో, పక్కన మరో వేదికపైనో ఉంటారు. ప్రమాణ స్వీకారం పూర్తి అయిన తర్వాత, గవర్నర్ వెళ్లిపోయిన తదుపరి పెద్ద నాయకులంతా ఒక వేదికపైకి వచ్చి ప్రజలకు అభివాదాలు చేస్తారు. కాని ఈ వేదిక అంతా గందరగోళంగా మారడంతో ఏఐసీసీ అగ్రనేతలు సైతం కిందికి దిగి వెళ్లిపోయారనిపిస్తుంది.అయినా ఫర్వాలేదు. కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగింది.
✍️ప్రజలు వేల సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రేవంత్ ప్రమాణం చేస్తున్నప్పుడు, ఆయా మంత్రులు ప్రమాణ స్వీకార సమయంలో పెద్ద ఎత్తున హర్షద్వానాలు చేశారు. అందరికన్నా సీతక్క మంత్రిగా ప్రమాణం చేస్తున్నప్పుడు చప్పట్లు మారుమోగాయి. రేవంత్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు ఫైల్ పై సంతకం చేశారు. ఆ విషయాన్ని ప్రజలకు తన స్పీచ్ లో వివరించి ఉండాల్సింది. ఒక దివ్యాంగురాలికి ఉద్యోగం ఇస్తానన్న హామీని కూడా ఆయన నెరవేర్చారు. మంత్రివర్గ కూర్పు గురించి విశ్లేషించుకోవడం కూడా ఆసక్తికరంగానే ఉంటుంది. రేవంత్ రెడ్డి సీఎం అవ్వడానికి ముందు రెండుసార్లు ఎమ్మెల్యే అయినా, ఒకసారి ఎంపీ అయినా రాష్ట్రంలో కాని, కేంద్రంలో కాని మంత్రి పదవి చేయలేదు. దానికి కారణం ఆయన ప్రతిపక్షంలో ఉండడమే.
✍️మూడోసారి శాసనసభకు ఎన్నికైన తర్వాత నేరుగా ముఖ్యమంత్రి బాధ్యతను ఆయన చేపట్టారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నాలుగోసారి ఎమ్మెల్యే అయ్యాక ఈ అవకాశం వచ్చింది. అంతకు ముందు ఆయన ఎమ్మెల్సీ, విప్, ఉప సభాపతి వంటి పదవులు చేపట్టారు. మిగిలినవారిలో అందరికన్నా సీనియర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఆయన 1985లోనే తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. అదే టరమ్ లో ఎన్.టి.ఆర్.క్యాబినెట్‌లో మంత్రిగా కూడా ఉన్నారు. తదుపరి 1994,1999లలో ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్.టి.ఆర్.ముఖ్యమంత్రిగా పదవీచ్యుతుడు అయ్యాక 1995లో ఏర్పడిన చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రిగా ఉండి 2004 వరకు కొనసాగారు.
✍️2009లో మరోసారి ఎమ్మెల్యే అయ్యారు. కాని ప్రతిపక్షంలో ఉన్నారు రాష్ట్ర విభజన తర్వాత 2014లో ఆయన గెలవలేకపోయారు. అయినా టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈయనను టీడీపీ నుంచి టీఆర్ఎస్‌లోకి ఆహ్వానించి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేశారు. ఆ తర్వాత ఉప ఎన్నికలో మళ్లీ ఎమ్మెల్యే అయ్యారు. 2018 ఎన్నికలలో గెలవలేకపోయారు. తిరిగి 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లోకి వచ్చి ఎమ్మెల్యేగా విజయడంకా మోగించి రేవంత్ రెడ్డి క్యాబినెట్‌లో మంత్రి అయ్యారు. ఈ రకంగా ఆయన నలుగురు క్యాబినెట్‌లలో మంత్రిగా ఉన్నారు.
✍️మంత్రి దామోదర రాజనరసింహ 1989లో తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. తదుపరి 2004, 2009లలో, మళ్లీ 2023లో శాసనసభకు ఎన్నికయ్యారు. గతంలో వైఎస్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల క్యాబినెట్‌లలో పనిచేశారు. కిరణ్ సీఎంగా ఉన్నప్పుడు ఈయన ఉప ముఖ్యమంత్రి అయ్యారు. మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు కూడా 1999 లో తొలిసారి శాసనసభ్యులయ్యారు. ఉత్తం కుమార్ అంతకు ముందు ఓటమి చవిచూసినా, 1999 నుంచి గెలుస్తూనే ఉన్నారు. ఉత్తంకుమార్ రెడ్డి ఉమ్మడి ఏపీలో కిరణ్ క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. 2018 ఎన్నికల సమయంలో పీసీసీ అధ్యక్షుడుగా పనిచేశారు. 2019లో లోక్ సభకు ఎన్నికయ్యారు. 2023లో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి పొందారు.
✍️కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో వైఎస్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్‌లలో పనిచేశారు. తెలంగాణ ఉద్యమం కోసం మంత్రి పదవిని వదలుకున్నారు. 2018లో ఓటమి చెందినా 2019 లో ఎంపీగా గెలిచారు. తిరిగి ఈసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కాగలిగారు. మరో మంత్రి కొండా సురేఖ కూడా సీనియర్ నేతే. ఆమె కూడా 1999లోనే తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు.ఆమె ఉమ్మడి ఏపీలో వైఎస్ క్యాబినెట్‌లో ఉన్నారు. తర్వాత రోశయ్య క్యాబినెట్ లో కొద్దికాలం ఉండి రాజీనామా చేశారు. అప్పట్లో వైఎస్ జగన్ కు మద్దతుగా ఆమె నిలబడి అనర్హత వేటుకు గురయ్యారు.2014లో టిఆర్ఎస్ పక్షాన ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత కాంగ్రెస్ లోకి వచ్చి ఈసారి మంత్రి అయ్యారు. మరో మంత్రి జూపల్లె కృష్ణారావు 1999లో ఇండిపెండెంట్‌గా 2004లో కాంగ్రెస్ పక్షాన గెలిచారు. 2009లో కూడా ఎన్నికై రాష్ట్ర మంత్రిగా కూడా మూడు మంత్రివర్గాలలో పనిచేశారు. తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా పదవికి రాజీనామా చేశారు.ఎమ్మెల్యే పదవి కూడా వదలుకుని తిరిగి టిఆర్ఎస్ పక్షాన ఉప ఎన్నిక లో నెగ్గారు.
✍️రాష్ట్ర విభజన తర్వాత 2014లో గెలిచి కేసీఆర్ క్యాబినెట్ లో మంత్రి అయ్యారు.2018 లో ఓటమి చెందారు.కొంతకాలం క్రితం టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి, కాంగ్రెస్ లో చేరి 2023లో గెలిచి మంత్రి అయ్యారు.మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు 1999 లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2004,2009లలో కూడా గెలిచారు. ఉమ్మడి ఎపిలో కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో సభ్యుడుగా ఉంటూ చివరిలో మంత్రి పదవికి రాజీనామా చేశారు. 2018,2023 లలో గెలుపొంది, రేవంత్ క్యాబినెట్ లో మంత్రి అయ్యారు. పొన్నం ప్రభాకర్ సీనియర్ నేత గతంలో ఎమ్.పిగా ఎన్నికయ్యారు.ప్రస్తుతం మొదటిసారిగా ఎమ్మెల్యే అయి మంత్రి పదవి పొందారు. అలాగే మరో మాజీ ఎమ్.పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా తొలిసారి ఎమ్మెల్యే అయి మంత్రి పదవి పొందారు.
✍️తొలుత టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సీతక్క తదుపరి కాంగ్రెస్ నుంచి రెండుసార్లు గెలిచి రేవంత్ ప్రభుత్వంలో మంత్రి పదవి పొందారు. రేవంత్ తో పాటు ఉత్తంకుమార్, వెంకటరెడ్డి, పొంగులేటిలు రెడ్డి సామాజికవర్గానికి చెందినవారు. తుమ్మల నాగేశ్వరరావు కమ్మ వర్గం అయితే, ఎస్సిల నుంచి మల్లు భట్టి,దామోదర రాజనరసింహ, ఎస్టీల నుంచి సీతక్క, బీసీ వర్గాల నుంచి పొన్నం ప్రభాకర్ (గౌడ), కొండా సురేఖ (పద్మశాలి) పదవులు పొందారు.
✍️దుద్దిళ్ల శ్రీధర్ బాబు బ్రాహ్మణవర్గం కాగా, జూపల్లె కృష్ణారావు వెలమ సామాజికవర్గం వారు. రేవంత్, తుమ్మల, సీతక్కలు టీడీపీ మూలాలు కలిగినవారైతే, ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మల్లుభట్టి, దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్ , శ్రీధర్ బాబులు పూర్తిగా కాంగ్రెస్‌లోనే ఉన్నారు. కొండా సురేఖ కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లలో కూడా ఉన్నారు. జూపల్లె కృష్ణారావు కాంగ్రెస్ మూలం కలిగిన నేతే అయినా తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్‌లోకి వెళ్లారు. పొంగులేటి వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీగా ఎన్నికై తదుపరి టీఆర్ఎస్‌లో చేరి అనంతరం కాంగ్రెస్ లోకి వచ్చారు. ఎన్నికలకు ముందు తుమ్మల, పొంగులేటి,జూపల్లె లు కాంగ్రెస్ లోకి వచ్చి మంత్రులు అవడం విశేషం. వాస్తవం చెప్పాలంటే ఒక్క తుమ్మలకు తప్ప మిగిలినవారెవరికి మంత్రులుగా విశేష అనుభవం లేదనే అనుకోవాలి. వారందరికి ఇది పరీక్ష సమయం. తమ ,తమ శాఖలను పూర్తిగా అధ్యయనం చేసి , బాధ్యతలను నిర్వర్తించవలసి ఉంటుంది.
:::కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment