కాంగ్రెస్ డైలమా
ప్రభుత్వ ఏర్పాటా? రాష్ట్రపతి పాలనా?
రెండు రాష్ట్రాలకూ పీసీసీలు ఖరారు... నేడో రేపో ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి అన్ని అవకాశాలున్నప్పటికీ.. రాజకీయ ప్రయోజనాల బేరీజుపై భిన్నాభిప్రాయాల నేపథ్యంలో కాంగ్రెస్ అధినాయకత్వం ఒక నిర్ణయానికి రాలేకపోతోంది. రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంటు ఆమోదించిన అనంతర పరిణామాల్లో రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలపై కాంగ్రెస్ పెద్దలు పార్టీకి చెందిన తెలంగాణ, సీమాంధ్ర నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించి అభిప్రాయాలు సేకరించారు. బుధవారంతో అభిప్రాయ సేకరణ పూర్తి చేసిన హైకమాండ్ నేతలు రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలా? లేక రాష్ట్రపతి పాలనకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాలా? అన్న అంశంపై తర్జనభర్జన పడ్డారు. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో సీమాంధ్ర నేతల మధ్య భిన్నాభిప్రాయాలు కూడా అధిష్టానం ఒక నిర్ణయానికి రాలేకపోవడానికి కారణంగా చెప్తున్నారు. రాష్ట్రం విడిపోతున్న తరుణంలో సీమాంధ్రకు చెందిన నేతలు చిరంజీవి, కన్నా లక్ష్మీనారాయణ, బొత్స సత్యనారాయణల్లో ఒకరిని సీఎం చేయాలన్న ప్రతిపాదనను హైకమాండ్ పరిశీలించినప్పుడు స్థానిక నేతలు కొందరు వ్యతిరేకించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో సీమాంధ్ర నేతల మధ్య సమన్వయం లేకపోవటం కూడా నిర్ణయాన్ని వాయిదా వేసుకోవటానికి ఒక కారణంగా చెప్తున్నారు. తాజా పరిణామాలపై గురువారం పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి నివేదించే అవకాశాలున్నాయి. దానిపై సోనియా గురువారం తుది నిర్ణయం తీసుకుంటారా? లేక శుక్రవారం నాటి కేంద్ర మంత్రిమండలి సమావేశంలో చర్చించి నిర్ణయానికి వస్తారా? అన్నది తేలాల్సి ఉంది.
లాభనష్టాల బేరీజులో సతమతం
ఇప్పుడు రాష్ట్రంలో ఏం చేస్తే తమకు లాభమన్న కోణంలో కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచిస్తోంది. విభజన తేదీని ఎప్పుడు నిర్ణయించాలి? ఎన్నికల షెడ్యూలు రాకముందే ఆ తేదీ ఉండాలా? లేక ఎన్నికలు ముగిశాక ఉండాలా? ముందే ఆ తేదీ ప్రకటిస్తే లాభమేనా? ఇలా చేస్తూ రెండు ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం వల్ల లాభముందా? విభజన తేదీని వాయిదా వేస్తే ఎలా ఉంటుంది? అలా చేస్తే విభజన ప్రభావం సీమాంధ్ర ప్రజలపై పడుతుందా? అందువల్ల విభజన తేదీ (అపాయింటెడ్ డే) ఎప్పుడుండాలి? అనే అంశాలను తేల్చుకోలేక కాంగ్రెస్ అధిష్టానం సతమతమవుతోంది.
అనైక్యతతో కొత్త చిక్కుల భయం
ముఖ్యమంత్రిగా ఒకరి పేరు బయటకు రాగానే మరొకరు ఆ వ్యక్తి వైఫల్యాల చిట్టా విప్పుతుండటంతో ప్రభుత్వ ఏర్పాటు కష్టమేనన్న భావనకు కాంగ్రెస్ అధిష్టానం వచ్చింది. రాజకీయ సమీకరణల నేపథ్యంలో సీఎం అభ్యర్థులుగా పరిశీలనలో ఉన్న పేర్లు బయటకు పొక్కగానే నేతల అనైక్యత బయటపడింది. ఈ నేపథ్యంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయంగా కొత్త చిక్కులు ఎందుకని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
షెడ్యూలుకు ముందే ప్రకటిస్తే..
బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర లభించి గెజిట్ నోటిఫికేషన్ ఇస్తే దానిలో అపాయింటెడ్ డేను ప్రస్తావించాల్సి ఉంటుంది. ఎన్నికల షెడ్యూలు మార్చి తొలి వారాంతంలో రావాల్సి ఉంది. మరి ఈలోగానే అపాయింటెడ్ డేను ప్రకటించి రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటుచేస్తే.. న్యాయపరమైన చిక్కులు ఉండవని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఇచ్చినట్టు చెప్పుకొని లబ్ధిపొందవచ్చని, సీమాంధ్ర ప్రాంతంలో తాము ఆ ప్రాంతానికి బిల్లులోనూ, ప్రధానమంత్రి ప్రసంగంలోనూ చేసిన మేలును చెప్పుకోవచ్చని యోచిస్తోంది. అయితే.. విభజనకు సంబంధించి లాంఛనాలు పూర్తిచేసేందుకు ఇంతతక్కువ వ్యవధి సరిపోదన్నది ఇందులో ప్రతికూలాంశం.
హోంశాఖకు చేరిన టీ-బిల్లు...
పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొందిన తరువాత న్యాయశాఖ పరిశీలనకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు-2014 బుధవారం తిరిగి హోంశాఖకు చేరింది. దీనిని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి పంపించాల్సి ఉంది. బుధవారం రాత్రి కానీ, గురువారం కానీ రాష్ట్రపతికి చేరే అవకాశం ఉంది. కాగా పార్లమెంటు 15వ సెషన్ ముగిసినట్టుగా భావిస్తూ ప్రొరోగ్ చేయాలని కోరుతూ హోంశాఖ రాష్ట్రపతికి నివేదన పంపింది. సాధారణంగా పార్లమెంటు సెషన్ ఇలా అధికారికంగా ముగిస్తే ఇక కేంద్రం ఆర్డినెన్సులు తేవడానికి వీలుంటుంది. అలాగే రాష్ట్రపతి పాలన విధించేందుకు కూడా అవకాశం ఉంటుంది.
బిల్లు నాటి ఆడియో ఫైళ్లు వెబ్‌సైట్లో..
ఈ నెల 18న లోక్‌సభలో తెలంగాణ బిల్లుపై చర్చ జరుగుతున్నప్పుడు మధ్యాహ్నం 3 గంటల నుంచి లోక్‌సభ ప్రసారాలు నిలిచిపోయిన నేపథ్యంలో అందుకు సంబంధించిన ఆడియో రికార్డులు మొత్తం 9 ఫైళ్ల రూపంలో లోక్‌సభ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.
విభజన తేదీని వాయిదావేస్తే...
అపాయింటెడ్ డే(విభజన తేదీ)ని జూన్ 1 గానో లేక మరో తేదీనో ప్రకటించి.. ఇప్పుడు ఒకే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలకు వెళితే ఎలా ఉంటుందన్న అంశాలపై కూడా కాంగ్రెస్ అధినాయకత్వం బేరీజు వేస్తోంది. ఈ నిర్ణయం తీసుకుంటే అపాయింటెడ్ డే ఆలస్యమవుతుండటంతో పాటు.. ఈలోగా కోర్టులో న్యాయపరమైన చిక్కులు ఏమైనా వస్తాయా? అన్న అంశాలనూ చర్చిస్తోంది. మరోవైపు ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసినా.. సీనియర్ నేతల్లో అసంతృప్తి ఏర్పడితే వారిలో నుంచి కొంతమంది బయటకు వెళితే ఎన్నికల సమయంలో అదొక ప్రతికూల అంశంగా మారుతుందని భావిస్తోంది. దీనికంటే రాష్ట్రపతి పాలనే మేలన్న అభిప్రాయమూ నేతల్లో ఉంది.
రాష్ట్రపతి పాలన అయితే: మెజారిటీ ఉన్నప్పటికీ చిక్కులకు భయపడి కారణం లేకుండా రాష్ట్రపతి పాలన విధించారన్న అపఖ్యాతి ఎదురవుతుంది. అయితే రెండు పీసీసీల ఏర్పాటు ద్వారా అక్కడికక్కడే.. ఇక్కడికిక్కడే ప్రచార బాధ్యతలు అప్పగిస్తే ఎవరి పనివారు చేసుకుపోతారని, ఇక ప్రభుత్వాలు ఎందుకని అధిష్టానం భావిస్తోంది. దీనిలో భాగంగానే ఇప్పటికే రెండు పీసీసీలు, రెండు ఎన్నికల ప్రచార కమిటీలు, రెండు మేనిఫెస్టో కమిటీలు ఖరారు చేసింది. వీటిని నేడో రేపో ప్రకటించే అవకాశం కూడా ఉంది. పైగా రాష్ట్రపతి పాలన అయితే.. రెండు నెలలు ప్రభుత్వం లేకపోతే ప్రభుత్వ వ్యతిరేకత కూడా ఎన్నికల అంశం కాకుండాపోవచ్చు.. ఇలాంటి అంశాలన్నింటినీ బేరీజు వేస్తోంది. అయితే నిర్ణయం మాత్రం గురువారం కోర్ కమిటీ భేటీలో గానీ, శుక్రవారం నాటి కేబినెట్ భేటీలోగానీ తీసుకోవచ్చు.