అయ్యా.. కాల్మొక్తా | etigadda and kistapur village people request to collector for stop land servey | Sakshi
Sakshi News home page

అయ్యా.. కాల్మొక్తా

Published Wed, May 18 2016 3:06 AM | Last Updated on Mon, Sep 4 2017 12:18 AM

మెదక్ కలెక్టర్ రోనాల్డ్ రాస్ కాళ్లపై పడి రోదిస్తున్న మహిళ

మెదక్ కలెక్టర్ రోనాల్డ్ రాస్ కాళ్లపై పడి రోదిస్తున్న మహిళ

బతుకులు ఆగం చేయకుండ్రి
ఎవుసం.. ఇండ్లు.. గొడ్డు.. గోద..
ఇడ్సిపెట్టి యాడికి బోవాలె..
కలెక్టర్, ఆర్డీఓ కాళ్లపై పడి వేడుకోలు
బోరున విలపించిన ఏటిగడ్డ కిష్టాపూర్
ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించాలి: రోనాల్డ్‌రాస్
తాత్కాలికంగా భూ సర్వేను వాయిదా వేసిన జేసీ

 తొగుట: ‘కాల్మొక్తం సార్లు.. మా కొంపలు ముంచి మా బత్కుల్ని ఆగం జేయకుండ్రి.. మా ఊరు మునిగిపోతే మేమెట్లా బతికేది.. ఎవుసం, ఇండ్లు, గొడ్డు గోద ఇడ్సిపెట్టి మేము యాడికి బోవాలే సార్లు...’ అంటూ సాక్షాత్తు కలెక్టర్ కాళ్లమీద పడి ఊరుకు ఊరే బోరున విలపించింది. ఈ ఘటన తొగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్‌లో మంగళవారం చోటుచేసుకుంది. మల్లన్న సాగర్ ప్రాజెక్టు  నిర్మాణంతో మండల పరిధిలోని ఏడు గ్రామా లు ముంపునకు గురవుతన్నాయి. ఈ నేపథ్యంలో ముంపు బాధితుల్లో ఆందోళన నెల కొంది. కలెక్టర్‌తో పాటు జేసీ వెంకట్రామిరెడ్డి, సిద్దిపేట ఆర్డీఓ ముత్యం రెడ్డి.. ఏటిగడ్డ కిష్టాపూర్‌లో ముంపు బాధితులకు భూ సేకరణ చట్టం పై అగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామంలోని మిహ ళలంతా ఉద్వేగాన్ని ఆపుకోలేక ఒక్కసారిగా బోరున విలపిం చారు. మా బత్కుల్ని ఆగం చేయవద్దు సార్లూ.. అటూ కలెక్టర్ రోనాల్డ్ రాస్, సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి కాళ్ళపై పడి కన్నీరు మున్నీరయ్యా రు. అక్కడే ఉన్న మరి కొందరు రైతులు కంట తడి పెట్టారు. వేములఘట్ మాజీ సర్పంచ్ కరుణాకర్‌రెడ్డి మనోవేదనకు గురై ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయాడు. వెంటనే చికిత్స కో సం సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.

 ప్రతి ఒక్కరూ చేయూతనివ్వాలి: కలెక్టర్
సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు సాగాలంటే ప్రతి ఒక్కరూ చేయూతనివ్వాలని కలెక్టర్ రోనాల్డ్ రాస్ ముంపు బాధితులను కోరారు.  ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామస్తుల సమస్యలను ఆయన సావదానంగా అడిగి తెలుసుకున్నారు. ఉద్వేగానికి గురై విలపించిన భూ బాధితులను, రైతులను ఓదార్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ముంపు బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

అందుకు భూ సేకరణ చట్టంపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించడం కోసం రెవెన్యూ యంత్రాంగం చర్యలు చేపట్టిందన్నారు. మల్లన్న సాగర్ నిర్మాణానికి  లైడార్ శాస్త్రవేత్తలు సర్వే పూర్తి చేసి సర్కారుకు నివేదికలు అందించారని తెలిపారు. సర్వే ప్రకారం తొగుట, కొండపాక మండలాలల్లో రిజార్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిందన్నారు. గ్రామాల్లో గ్రామ సభలను నిర్వహించి, ప్రజలకు  భూ సేకరణ చట్టంపై అవగాహన కల్పించాల్సి ఉండగా ఇక్కడి అధికారుల నిర్లక్ష్యం వహించడంతో సమస్యలకు దారి తీసిందన్నారు.

 రైతులు పెద్ద మనసుతో భూములు ఇవ్వాలని కోరారు. ఎకరానికి రిజిష్ట్రేషన్ విలువ ప్రకారం రూ.5.85 లక్షల నష్ట పరిహారం చెల్లిస్తుందన్నారు. చెట్లు, బోరు బావులు, ఓపెన్ వెల్స్‌కు, డ్రిప్పు పైపులైన్లకు అదనంగా నష్ట పరిహారం చెల్లిస్తామని తెలిపారు. ఇంటి పరిహారంతో పాటు అదనంగా రూ. 5.04 లక్షల పరిహారం అందజేస్తమన్నారు. ప్రజలు ముంపు ప్రాంతం నుండి మరో చోటికి వెళ్ళడానికి మరో రూ. 50 వేలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు.

 ముంపు బాధితులను ఆదుకునేందుకు కొత్త జీవో తేవాలి
కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన 2013 భూ సేకరణ చట్టం, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 123 జీవోలతో సంబంధం లే కుండా ముంపు బాధితులకు న్యాయం జరిగేలా కొత్త జీవో చట్టాన్ని తీసుకురావాలని ఏటిగడ్డ కిష్టాపూర్ ముంపు బాధితులు డిమాండ్ చేశారు. ఎకరానికి రూ. 15 లక్షల నష్ట పరిహారంతో పాటు గ్రామాలకు గ్రామాన్ని నిర్మించి ఇవ్వాలని తీర్మాణం చేస్తూ జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రాన్ని అందించారు. మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు భూ సర్వేను ఆపివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. దీంతో జేసీ వెంకట్‌రాంరెడ్డి స్పందించి భూ సర్వేను తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్లు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement