జీవితం అంటేనే కష్టాల మయం అనుకుంటాం. కటిక దారిద్ర్యంలో మగ్గుతున్న వాళ్లకు కూడా జీవితం కొన్ని సువర్ణావకాశాలు అందిస్తుంది. అయితే ఆ అవకాశాలను తెలివిగా అందిపుచ్చుకున్న వారే అద్భుతాలు చేసి చూపిస్తారు. అలాంటి కోవకు చెందిందే పింకీ హర్యాన్. మురికి వాడల్లో తల్లిదండ్రులతో బిక్షాటన చేస్తూ బతికిన అమ్మాయి..నేడు డాక్టర్ అయ్యి అందర్నీ ఆశ్చర్యపరిచడమే గాక ఎందరికో స్ఫూర్తిని కలిగించింది.
వివరాల్లోకెళ్తే.. పింకీ హర్యానా హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలోని మెక్లీడ్‌గంజ్‌లో నిరుపేద కుటుంబంలో జన్మించింది. చరణ్ ఖుద్‌లోని మురికివాడలో నివసించే ఆ కుటుంబం రోడ్డుపై భిక్షాటను చేస్తూ జీవనం సాగిస్తుండేది. చెత్త కుండిల్లో ఆహారాన్ని ఏరుకుని తినే దుర్భర జీవితాన్ని సాగించేది పింకీ కుటుంబం. ప్రారంభ జీవితం అంతా కటిక దారిద్య్రం, కష్టాల మధ్య సాగింది.
ఏదో అద్భుతం జరిగినట్లుగా ధర్మశాలలోని టోంగ్ లెన్ ఛారిటబుల్ ట్రస్ట్‌కు నేతృత్వం వహించే బౌద్ధ సన్యాసి లోబ్సాంగ్ జమ్యాంగ్ దృష్టిలో పింకీ పడింది. అదే ఆమె జీవితాన్ని మార్చబోతుందని ఆనాడు ఊహించలేదు. ఆయన పింకీని చూసి చదివించాల్సిందిగా ఆమె తండ్రి కాశ్మీరీ లాల్‌ను కోరాడు. అందుకు మొదట కాశ్మీరీ లాల్ అంగీకరించలేదు. ఐతే జమ్యాంగ్ తన మాటలతో అతడిని ఒప్పించి పింకీని ధర్మశాలలోని దయానంద్ పబ్లిక్ స్కూల్‌లో చేరిపించాడు.
అలా అక్కడ నిరుపేద పిల్లల కోసం ఏర్పాటు చేసిన ట్రస్ట్ హాస్టల్‌లో నివశించిన తొలి విద్యార్థిగా పింకీ నిలిచింది. తన జీవితాన్ని మంచిగా మార్చుకునేందుకు దేవుడిచ్చిన ఈ సువర్ణావకాశాన్ని పింకీ అస్సలు వదులుకోలేదు. ఆ పాఠశాలలో చేరినప్పటి నుంచి తెలివైన విద్యార్థిగా పేరు తెచ్చకోవడమే గాక మంచి మార్కులతో అన్ని తరగతులు పాసయ్యింది. చివరికీ పింకీ 12వ తరగతి పరీక్షలు పూర్తి అయిన వెంటనే రాసిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్‌లో కూడా ఉత్తీర్ణత సాధించింది. కానీ ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు సంపాదించుకునేలా మంచి ర్యాంకు సాధించలేకపోయింది.
అందువల్ల మిగతా పిల్లలు మాదిరిగా ప్రైవేట్ మెడికల్ కాలేజీలో అంతంతా ఫీజులు చెల్లించి చదవుకులేని నిస్సహయ స్థితిలో పడింది పింకీ. మళ్లీ తన పరిస్థితి మొదటకొచ్చింది అనుకునేలోపే 2018లో, టోంగ్-లెన్ ఛారిటబుల్ ట్రస్ట్ మరోసారి ఆమెను ఆదుకుంది. చైనాలోని ప్రఖ్యాత మెడికల్ కాలేజ్‌లో అడ్మిషన్ పొందడంలో పింకీకి సహాయం చేసింది. అలా ఆమె ఆరేళ్లలో చైనీస్ కళాశాల నుంచి ఎంబీబీఎస్ పట్టా పొంది డాక్టర్ అయ్యింది. ఇప్పుడు మళ్లీ ధర్మశాలకు తిరిగి వచ్చేసింది. ప్రస్తుతం ఆమె భారతదేశంలో వైద్యం అందించేందుకు అవసరమైన మెడికల్ లైసెన్స్‌ని పొందేందుకు ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎగ్జామినేషన్(ఎఫ్‌ఎంజీఈ) కోసం సిద్ధమవుతుంది.
ఇంతలా పింకీ జీవితాన్ని మార్చిన బౌద్ధ సన్యాసి లోబ్సాంగ్ జమ్యాంగ్ ఆమెను చూసి గర్వపడుతున్నానని అన్నారు. పిల్లలు మంచి మనుషులుగా మారేలా ప్రోత్సహించబడితే నిస్సందేహంగా అద్భుతాలు చేస్తారని విశ్వసిస్తానని చెప్పారు. ఇక పింకీ తన జీవితాన్ని ఇంతలా గౌరవప్రదంగా మార్చిన జమ్యాంగ్‌ని తన తండ్రిగా అభివర్ణించింది.
అంతేగాదు పింకీలా ఆ ధర్మశాలలో చదివిన వందలాది మంది పిల్లలు జీవితాలు మారడమే గాక వారంతా వైద్యులు, ఇంజనీర్లు, ప్రభుత్వాధికారులుగా స్థిరపడ్డారు. ఈ పింకీ గాథ జీవితంలో లభించే అవకాశాన్ని అందిపుచ్చుకుని కష్టపడితే కష్టాల నుంచి బయటపడటమే గాక అద్భుతాలు చేసి చూపించొచ్చని తెలుస్తోంది కదూ..!.
Comments
Please login to add a commentAdd a comment