రాళ్లతో కొట్టి భిక్షగాడి దారుణ హత్య
సాక్షి, గూడూరు: గుర్తుతెలియని వ్యక్తులు ఓ భిక్షగాడిని రాళ్లకొట్టి అతి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన రెండో పట్టణంలోని జీఎస్ రాయులు కూడలిలో శుక్రవారం రాత్రి జరిగింది. రెండో పట్టణ ఎస్సై ఆదిలక్ష్మి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్‌తో ఆధారాలు సేకరించే ప్రయత్నించారు. భిక్షగాడి హత్య మిస్టరీగా ఉంది. స్థానికుల సమాచారం మేరకు.. హతుడు ఏడాదికిపైగా ఇక్కడే ఉంటున్నాడు. అతనికి తెలుగు రాదు, హిందీలోనే మాట్లాడుతుంటాడని తెలుస్తోంది. అతను పగటి వేళల్లో బయటకు వెళ్లి భిక్షాటన చేసుకుని రాత్రి వేళ స్థానికంగా రేకుల షెడ్డు కింద వండుకొని తిని, నిద్రపోతుంటాడు. అయితే భిక్షగాడ్ని హతమార్చే అవసరం ఎవరికొచ్చింది, దానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
డబ్బుల కోసమే అతన్ని హత్య చేశారా? అనుకుంటే అతని జేబులో రూ.2 వేల నగదు ఉంది. అయితే భిక్షగాడి వద్ద భారీగా నగదు ఉండొచ్చని, ఈ నగదు కాజేసే ప్రయత్నంలో ప్రతిఘటించడంతో హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. వేసుకున్న జేబులో డబ్బులు గుర్తించలేక వదిలేసి వెళ్లి ఉంటారనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. అర్బన్ సీఐ నాగేశ్వరమ్మ మాట్లాడుతూ కేసును ఛేదించేందుకు డాగ్ స్క్వాడ్‌తో ప్రయత్నం చేశామన్నారు. జాగిలం ఘటనా స్థలం వద్ద కలియ తిరిగి అక్కడి నుంచి విందూరు వైపు వెళ్లే రోడ్డు వద్దకు వచ్చి ఆగిపోయిందన్నారు. సీసీ ఫుటేజీలను సేకరించి, నిందితులను త్వరలో పట్టుకుంటామని తెలిపారు. రెండో పట్టణ ఎస్సై ఆదిలక్ష్మి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.