లాభాలంటే ఇష్టం.. నష్టాలంటే కష్టం
ఆర్థిక శాస్త్రానికి సంబంధించి రెండు విరుద్ధమైన సూత్రాలున్నాయి. ఒకటి సహేతుక నడవడిక. అంటే తమకు నష్టాన్ని కలిగించే లేదా తటస్థ నిర్ణయాలు కాకుండా.. ప్రయోజనం కలిగించే నిర్ణయాలను తీసుకోవడం. మరింత వివరంగా చూస్తే.. ఈ తరహా వ్యక్తులు తమపై, తమ మనసుపై నియంత్రణ కలిగి ఉంటారు. భావోద్వేగాలతో ఊగిపోరు.
బిహేవియరల్ ఫైనాన్స్ మాత్రం.. ప్రజలు భావోద్వేగాలతో ఉంటారని.. సులభంగా దారితప్పడమే కాకుండా.. హేతుబద్ధంగా వ్యవహరించలేరని చెబుతోంది. సహేతుకంగా వ్యవహరించడానికి బదులు.. తరచుగా ఆర్థిక నిర్ణయాల విషయంలో తమ భావోద్వేగాలు, ఆలోచనలకు తగ్గట్టు పక్షపాతంగా వ్యవహరిస్తారని అంటోంది. చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లను పరిశీలిస్తే ఈ రెండింటిలో బిహేవియరల్ ఆర్థిక శాస్త్రం చెప్పిందే నిజమని అనిపిస్తుంటుంది. పెట్టుబడుల విషయంలో ఇన్వెస్టర్లపై ప్రభావం చూపించే అంశాలపై అవగాహన కలి్పంచే కథనమే ఇది...
1970, 1980ల్లో విడుదలైన పలు ఆర్థిక అధ్యయన పత్రాలు అన్నీ కూడా.. ఎక్కువ మంది ఇన్వెస్టర్లు పెట్టుబడుల విషయాల్లో సహేతుకంగానే వ్యవహరిస్తారని చెప్పగా.. దీనికి విరుద్ధంగా అదే కాలంలో ప్రముఖ సైకాలజిస్టులు డానియల్ కహెన్‌మాన్, అమోస్ ట్వెర్స్కీ మాత్రం.. ఆర్థికవేత్తలు చెప్పినట్టు సహేతుక నిర్ణయాలను కొద్ది మందే తీసుకుంటున్నట్టు గుర్తించారు. ప్రజలు నిజంగా ఎలా నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై వీరు అధ్యయనం చేశారు. 80వ దశకం చివరి నాటికి ఆర్థికవేత్తల ఆలోచనా ధోరణిని సైకాలజిస్టులు ప్రభావితం చేయడం మొదలైంది.
ఇది బిహేవియరల్ ఆర్థిక శాస్త్రానికి దారితీసిందని చెబుతారు. 2002లో డానియల్ కహెన్‌మాన్ ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని గెలుచుకున్నారు. ఇన్వెస్టర్లు ఆర్థిక వేత్తలు చెప్పినట్టు కాకుండా.. సైకాలజిస్టులు అంచనా వేసినట్టుగానే ప్రవర్తిస్తుంటారని కహెన్‌మాన్ శిష్యుడైన ఓడియన్ సైతం అంటారు. ‘‘అతి విశ్వాసం, పరిమిత శ్రద్ధ, కొత్తదనం కోసం పాకులాడడం, నష్టపోకూడదన్న తత్వం, అత్యుత్సాహం అన్నవి ఇన్వెస్టర్ల ప్రవర్తనను, ముఖ్యంగా రిటైల్ ఇన్వెస్టర్లను ప్రభావితం చేస్తున్నాయని నేను గుర్తించాను’’ అని ఓడియన్ పేర్కొన్నారు.
‘‘పెట్టుబడులు అంటేనే క్లిష్టమైన అంశం. మనుషులు ఈ విషయంలో అసంపూర్ణంగా వ్యవహరిస్తుంటారు. నిర్ణయాల్లో తప్పులకు అవకాశం ఉంటుంది’’అని బిహేవియరల్ ఫైనాన్స్‌లో విస్తృత అధ్యయనం చేసిన కెనడియన్ ఆర్థికవేత్త అగ్రీడ్ హెర్‡్ష షెఫ్రిన్ (శాంతా క్లారా యూనివర్సిటీ) అంటారు. అటు ఆర్థికవేత్తలు, ఇటు మనస్వత్త శాస్త్రవేత్తలు ఎన్నో అధ్యయనాల ఆధారంగా అంగీకారానికి వచ్చిన విషయం.. పెట్టుబడుల విషయంలో మనుషుల మనస్తత్వం, ఆలోచనలు కీలక పాత్ర పోషిస్తాయని. సెబీ నమోదిత పెట్టుబడుల సలహాదారు చెంతిల్ అయ్యర్ (హోరస్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్స్) కూడా ఇదే విషయాన్ని అంగీకరిస్తారు.
‘‘క్లిష్టమైన అంశాల విషయంలో సత్వర పరిష్కారాలను ఇన్వెస్టర్లు కోరుకుంటారు. ఫలితంగా నిర్ణయాల్లో ఎన్నో తప్పులు దొర్లుతుంటాయి’’ అని ఆయన పేర్కొన్నారు. ఇన్వెస్టర్ల చర్యలపై మానసిక ప్రభావాన్ని.. అలాగే, తార్కిక, భావోద్వేగ, సామాజిక అంశాల ప్రభావాన్ని వివరించేదే బిహేవియరల్ ఫైనాన్స్.
పెడచెవిన వాస్తవాలు
ఇన్వెస్ట్మెంట్లు, లాభాల స్వీక రణపై అస్పష్ట మానసిక స్థితి తో పాటు, జరుగు తున్న వాస్తవా లను, హెచ్చరికలను పెడచెవిన బెట్టడం మెజారిటీ ఇన్వెస్టర్లకు మామూలే. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం గురించి ఇన్వెస్టర్లను అడిగినప్పుడు.. ఆ సంక్షోభం తాలూకూ సంకేతాలను ముందే గుర్తించామని చెబుతారు. కానీ, ఆయా సంక్షోభాలపై నిపుణుల హెచ్చరికలను మెజారిటీ ఇన్వెస్టర్లు పట్టించుకోకపోవడాన్ని గమనించొచ్చు. అం తెందుకు.. 2020 జనవరి నుంచే చైనాలో ఒక భయంకరమైన (కోవిడ్–19) వైరస్ వెలుగు చూసిందని.. అది ప్రపంచమంతా వ్యాప్తి చెందొచ్చన్న వార్తలను ఎవ్వరూ పట్టించుకోలేదన్నది కూడా వాస్తవం.
అధిగమించడం ఎలా..?
పెట్టుబడుల విషయంలో పలు ప్రతికూల, అస్పష్ట మానసిక స్థితి, వైఖరులను అధిగమించడం నిజానికి కష్టమైన పనే. ఎందుకంటే మానవులు సాధారణంగానే సంపూర్ణ కచ్చితత్వంతో ఉండరన్నది మనస్తత్వ శాస్త్రవేత్తల అభిప్రాయం. కాకపోతే ఈ తరహా అంశాల విషయంలో కాస్త మెరుగ్గా వ్యవహరించేందుకు ప్రయత్నించొచ్చని చెబుతారు. వీటిని అధిగమించేందుకు మంచి అలవాట్లను ఆచరణలో పెట్టుకోవాల్సి ఉంటుంది. విస్తృతమైన సమాచార పరిజ్ఞానాన్ని సమకూర్చుకుంటే.. ఈ తరహా ధోరణుల్లో పడిపోకుండా కాపాడే మంచి ఆయుధం అవుతుంది. ఇన్వెస్టర్ ముందుగా తన గురించి తాను పూర్తిగా తెలుసుకోవాలి. తన గురించి స్నేహితులను అడిగి తెలుసుకోవాలి.
ఇతర ఇన్వెస్టర్ల ధోరణులను విశ్లేషించాలి. అప్పుడు తన ఆలోచనా తీరుపై అంచనాకు రావాలి. ఇన్వెస్టర్లు తమ గురించి మరింత అర్థం చేసుకునేందుకు ఇది సహకరిస్తుందన్నది ఆర్థికవేత్తల అభిప్రాయం. సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భాల్లో.. భావోద్వేగాలు, ముందుగా అనుకున్న మానసికమైన సిద్ధాంతాలు అడ్డుపడకుండా ఇది సాయపడుతుందని చెబుతారు. చాలా మంది ఇన్వెస్టర్లకు నిపుణుల సూచన ఏమిటంటే.. వైవిధ్యమైన పెట్టుబడులను ఏర్పాటు చేసుకుని దీర్ఘకాలం పాటు కొనసాగించుకోవాలే కానీ.. స్పెక్యులేటివ్ ట్రేడింగ్ చేయకూడదు. తక్కువ వ్యయాలు (ఎక్స్పెన్స్ రేషియో) ఉండే æ ఫండ్స్ లేదా ఈటీఎఫ్‌లు వైవిధ్యమైన పోర్ట్‌ఫోలియో ఏర్పాటుకు చక్కని మార్గం.
తాజా అంశాలపై దృష్టి
‘‘మెజారిటీ ఇన్వెస్టర్లు తాజా రాబడులకు ప్రాధాన్యం ఇస్తారే కానీ, చారిత్రక రాబడులకు కాదు’’ అని యూనివర్సిటీ ఆఫ్ క్యాలిఫోరి్నయా ప్రొఫెసర్ టెర్నాన్స్ ఓడియన్ అంటారు. అంటే ఇటీవలి కాలంలో మంచి పనితీరు చూపించిన స్టాక్స్ లేదా ఇతర ఆస్తులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. కానీ, ఆయా స్టాక్స్, ఆస్తుల పనితీరు అంతకుముందు కాలంలో ఎలా ఉన్నా పట్టించుకోనట్టు వ్యవహరిస్తారు. ఎక్కువ సంఖ్యలో ఇన్వెస్టర్లు రాబడుల వెంట పడినప్పుడు ఆయా స్టాక్స్ ధరలు స్వల్ప కాలంలోనే గణనీయంగా పెరిగిపోవడానికి దారితీస్తుంది. దీని కారణంగా దీర్ఘకాలంలో రాబడులు తక్కువగా ఉండచ్చు.
నష్టాలకు కారణం
పరిమిత దృష్టి ఉండడం వల్ల ఇన్వెస్టర్లు వారి దృష్టిలో పడిన స్టాక్స్‌ను కొనుగోలు చేస్తారు. కొనుగోళ్లకే కానీ.. విక్రయించడంపై ఈ ప్రభావం తక్కువగా ఉంటుంది. దీని ఫలితం ఎక్కువ మంది ఇన్వెస్టర్లు కొనుగోళ్ల వైపే ఉంటారు. ‘‘తమను ఆకర్షించిన స్టాక్స్‌ను కొనుగోలు చేస్తుంటారు. దీంతో ఆయా స్టాక్స్ ధరలపై ఇది తాత్కాలిక ఒత్తిళ్లకు దారితీస్తుంది. ఇలా ధరలు పెరిగిపోయిన స్టాక్స్‌ను కొనుగోలు చేయడం వల్ల.. అనంతరం వాటి ధరలు అమ్మకాల ఒత్తిడికి పడిపోవడంతో నష్టాల పాలవుతుంటారు’’అని యూనివర్సిటీ ఆఫ్ క్యాలిఫోరి్నయా ప్రొఫెసర్ టెర్నాన్స్ ఓడియన్ వివరించారు.
ఏకపక్ష ధోరణి
మనలో చాలా మంది సమాచార నిర్ధారణలో ఏకపక్షంగా వ్యవహరిస్తుంటామనేది కాదనలేని నిజం. ఈ ధోరణి కారణంగా మనకు ఫలానా కంపెనీకి సంబంధించి అప్పటికే తెలిసిన సమాచారంపైనే ఆధారపడతామే తప్పించి.. మన నమ్మకాలకు విరుద్ధంగా వచ్చే తాజా సమాచారాన్ని స్వీకరించలేని పరిస్థితుల్లో ఉంటాం. ఉదాహరణకు ఎక్స్ అనే కంపెనీకి సంబంధించిన వ్యాపారం, ఆర్థిక అంశాలు నచ్చి ఇన్వెస్ట్ చేశారనుకోండి. అదే కంపెనీ వ్యాపారానికి సంబంధించి వెలుగులోకి వచ్చే కొత్త అంశాలను పట్టించుకోకుండా వ్యవహరిస్తుంటాం. ఆలోచించకుండా పెట్టుబడులు పెట్టేస్తాం. ఇది నష్టాలకు దారితీస్తుంది.
నష్టపోకూడదనే తత్వం
‘రాబడి కోసం పెట్టుబడి పెడతాం.. కనుక నష్టపోయే సందర్భమే వద్దు’ అన్నది చాలా మంది ఇన్వెస్టర్లలో ఉండే ధోరణి. దీంతో రాబడులు ఎలా సంపాదించుకోవాలన్న అంశానికంటే నష్టపోకుండా ఎలా ఉండాలన్న దానిపై దృష్టి ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ఒక ఇన్వెస్టర్ ఒక తప్పుడు పెట్టుబడి నిర్ణయం తీసుకున్నాడని అనుకుంటే.. నష్టం బుక్ చేసుకోవద్దన్న ధోరణితో అందులోనే కొనసాగుతుంటారు. ఒకవేళ పెట్టుబడిని వెనక్కి తీసుకుంటే నష్టపోయినట్టు అవుతుందని వారి ఆందోళన. నిజానికి అలాగే కొనసాగితే మిగిలినది కూడా నష్టపోవాల్సి వస్తుందేమో? అన్న ఆలోచనను వారు అంగీకరించరు.