bellam palli
-
భరించరాని నొప్పి.. చెప్పుకోలేని బాధ
సాక్షి, బెల్లంపల్లి: పన్నెండేళ్లపాటు ప్రేమించి, పెళ్లి చేసుకున్న వారి జీవనప్రయాణం పదినెలల్లోనే అర్ధాంతరంగా ముగిసింది. బెల్లంపల్లిలోని సుభాష్‌నగర్‌కు చెందిన మోసం మల్లేష్‌కుమార్ (36), బాబుక్యాంపు బస్తీకి చెందిన నర్మద (28) చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్రంగా కలిచివేసింది. నర్మద మందమర్రి గురుకులంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. మల్లేష్ ఓ ప్రైవేట్ టీవీ ఛానల్లో రిపోర్టర్. పెళ్లయిన కొద్ది నెలలకే దంపతులిద్దరికీ అనారోగ్య సమస్యలు ఏర్పడ్డాయి. వాటిని ఎలా భరించాలో తెలియక.. చనిపోదామనే నిర్ణయించుకున్నారు. గురువారం అర్ధరాత్రి దాటాక (12.40 గంటల ప్రాంతంలో) మల్లేశ్ తన సన్నిహితులైన కొందరికి వాట్సాప్ మెసేజ్ చేశాడు. పోచమ్మ చెరువు కట్ట వద్దకు బైక్ వచ్చి అందులో దూకారు. కొద్దిసేపటికి మిత్రులు మెసేజ్ చూసి వారికోసం వెదకడం ప్రారంభించారు. చెరువు కట్ట వద్ద బైక్ కనిపించడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారణకు వచ్చారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో శుక్రవారం ఉదయం ఏసీపీ ఎంఏ రహమాన్, వన్‌టౌన్ ఎస్హెచ్ఓ రాజు, తహసీల్దార్ కుమారస్వామి గజ ఈతగాళ్లను రప్పించారు. మల్లేశ్ మృతదేహం 11 గంటలకు బయటపడగా.. నర్మద మృతదేహం కోసం గజ ఈతగాళ్లు శ్రమించాల్సి వచ్చింది. చివరకు సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ఆమె మృతదేహాన్ని బయటకు తీయించారు. వారి మృతదేహాలను చూసి ఇరు కుటుంబాలు బోరున విలపించాయి. మిత్రులు, సన్నిహితులు కన్నీరుపెట్టుకున్నారు. చదవండి: (పెళ్లంటూ ఎర... గిఫ్టంటూ టోకరా! ) కలచివేసిన సూసైడ్ నోట్ “నా కుటుంబ సభ్యులను, నా ప్రాణమిత్రులను, అందరిని వదిలి వెళ్తున్నందుకు చాలా బాధగా ఉంది. రోజురోజుకూ నా ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. రోజు నరకం చూస్తున్న. భరించరాని నొప్పి. చెప్పుకోలేని బాధ. ఈ లోకాన్ని వదిలి వెళ్లడం తప్ప వేరే మార్గం లేదు. కడుపునొప్పితో రోజూ నరకం చూస్తోంది. ఇలా బతకడం కంటే చావడం మేలని ఈ నిర్ణయం తీసుకుంటున్నాం. నా నిర్లక్ష్యం, జర్నలిజం వృత్తియే నా అనారోగ్యానికి కారణం అనుకుంటున్న. సమయానికి తినక ఎన్నోసార్లు టెన్షన్‌కి గురయ్యాను. నా ప్రాణమిత్రులు, విలేకరులు నాకుటుంబానికి బాసటగా నిలవాలని వేడుకుంటున్న. అని సూసైడ్ నోట్లో రాసి ఉంది. “అమ్మను, అన్నయ్యను, అక్కలను మంచిగా సూసుకో, నీదే బాధ్యత, నీకు కొడుకుగానో, బిడ్డగానో పుడుత’ అని తన తోబుట్టువు శ్రీనివాస్‌ను ప్రాధేయపడిన తీరు కలిచివేసింది. అలాగే వారు తీసుకున్న అప్పులు.. తమ వద్ద అప్పు తీసుకున్నవారి వివరాలను కూడా అందులో రాసి పెట్టారు. -
కారుణ్య ఉద్యోగం కోసమే హత్య.!
బెల్లంపల్లి రూరల్ : బెల్లంపల్లి మండలంలోని పాతబెల్లంపల్లి గ్రామానికి చెందిన ముత్తె శంకరి (56) సింగరేణి కార్మికుడు హత్యకు గురయ్యాడు. బెల్లంపల్లిరూరల్ సీఐ కె.జగదీష్, తాళ్లగురిజాల ఎస్సై బి.సమ్మయ్య వివరాల ప్రకారం.. పాతబెల్లంపల్లి గ్రామానికి చెందిన ముత్తె శంకరి శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కె–7 గనిలో టింబర్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. శంకరికి, అతని కుటుంబ సభ్యులకు తరచూ గొడవలు జరిగేవి. దీంతో శంకరి మంచిర్యాలలో నివాసం ఉంటున్నారు. శుక్రవారం భార్య విజయ శంకరికి ఫోన్ చేసి కూతురుకి కరోనా పాజిటివ్ వచ్చిందని, ఇంటికి రావాలని సూచించింది. దీంతో శంకరి శుక్రవారం ఇంటికి వచ్చాడు. రాత్రి నిద్రిస్తుండగా భార్య, కూతురు స్వాతి, కుమారుడు శ్రావణ్ కుమార్ శంకరి మెడకు చీరతో బిగించి హత్య చేశారు. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించే ప్రయత్నం చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానంతో కుటుంబీకులను గట్టిగా విచారించడంతో అసలు విషయం వెలుగు చూసింది. ఘటనాస్థలాన్ని బెల్లంపల్లి ఏసీపీ ఎం.ఏ రహమాన్ పరిశీలించారు. ఉద్యోగం కోసమే హత్య చేశారని శంకరి చెల్లెలు రుక్మిణి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ముందు జాగ్రత్త పడితేనే..
బెల్లంపల్లి : రాత్రి అయితే చలి..పగలు ఎండ..పగటి ఉష్ణోగ్రతలు ప్రస్తుతం శరవేగంగా మారుతున్నాయి. ఎండలు ఈసారి ఫిబ్రవరి నెలలోనే మొదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో బెల్లంపల్లి పురప్రజలను వేసవిలో నీటి ‘ఫోబియా’ వెంటాడుతుంది. వేసవిలో తాగునీటి సమస్య ఆందోళన ఈ ఎండలను చూసి ఇప్పటి నుంచే మొదలవుతున్నాయి. గోదావరి జలాలు మున్సిపల్‌కు అందకపోవడంతో ఈసారి కూడా తిప్పలు తప్పేలా లేవని భావిస్తున్నారు. మున్సిపల్ అధికారులు మేల్కొని నీటి సమస్య తీర్చేందుకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైన ఉంది. ఈ నేపథ్యంలో మున్సిపల్లో తాగునీటి సరఫరా తీరుపై ప్రత్యేక కథనం.. బెల్లంపల్లి పుర ప్రజల దాహార్తిని తీర్చడం కోసం 2011లో గోదావరి నీటి పథకాన్ని ప్రతిపాదించారు. ఇందుకు అప్పటి ప్రభుత్వం రూ.18కోట్లతో అంచనా వేశారు. మెగా కన్స్‌స్ట్రక్షన్ లిమిటెడ్ కంపనీ టెండర్ దక్కించుకుని 2014లో పనులను పూర్తి చేసింది. తాగునీటి సరఫరా కోసం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మందమర్రి ఫిల్టర్‌బెడ్ వరకు అంతర్గత పైపులైన్ వేసి, అప్పటికే బెల్లంపల్లి– మందమర్రి గోదావరి తాగునీటి పథకం కోసం ఏర్పాటు చేసిన పాతపైపులైనుకు అనుసంధానం చేశారు. వెంటాడిన లీకేజీ సమస్యలు... గోదావరి జలాల కోసం పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద ఓవర్‌హెడ్ ట్యాంకు, ఫిల్టర్ బెడ్ నిర్మించారు. గతేడాది ట్రయల్ రన్ నిర్వహించినా ఎల్లంపల్లి– మందమర్రి మధ్య చాలా చోట్ల పైపులైన్ లీకేజీలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత లీకేజీలను అరికట్టి నీటి సరఫరా కోసం మార్గం సుగమం చేశారు. మరమ్మతుల అనంతరం ఇటీవలనే మరోసారి ట్రయల్‌రన్ చేపట్టగా విజయవంతమైంది. అందని నీరు... ట్రయల్ రన్ విజయవంతమైనా ఫిల్టర్‌బెడ్‌కు పూర్తిస్థాయిలో నీటిసరఫరా జరగడం లేదు. ఈ నేపథ్యంలో నిర్ధేశించిన ప్రకారంగా నీటి సరఫరా జరుగుతుందా లేదా అనేది పురప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మున్సిపల్లో వాల్వ్‌ల ఏర్పాటు, జాయింట్ల అనుసంధానం చేయాల్సిన పనులు మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది. నీటి పథకంపైనే భారం.. వేసవిలో పట్టణ ప్రజల తాగునీటి సమస్య తీర్చేందుకు ఎల్లంపల్లి నీటి పథకం ఒక్కటే ఆధారం. ప్రస్తుతం బెల్లంపల్లి– మందమర్రి గోదావరి నీటి పథకం ద్వారా సరఫరా అరకొరగా జరుగుతోంది. నాలుగు రోజులకోసారి తాగునీటిని అందిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు మేల్కొని గోదావరి జలాలు పూర్తిస్థాయిలో అందేలా చూసి వేసవిలో దాహారం తీర్చాలని పురప్రజలు కోరుతున్నారు. మున్సిపాలిటీలో తాగునీటి సరఫరా స్వరూపం.. జనాభా 56,369 ఇళ్ల సంఖ్య 16,066 నల్లా కనెక్షన్ల సంఖ్య 3000 రోజువారీగా నీటి సరఫరా లక్ష్యం 7 ఎంఎల్డీ సరఫరా అవుతున్న తాగునీరు 3.4 ఎంఎల్డీ ప్రత్యామ్నాయం సింగరేణి ఫిల్టర్ బెడ్లు, బోర్లు వేసవికి ముందే నీరందిస్తాం మున్సిపల్ ప్రజలకు వేసవికి ముందే గోదావరి జలాలు అందిస్తాం. ఎల్లంపల్లి నుంచి ట్రయల్ రన్ సక్సెస్ అయింది. అక్కడక్కడ చిన్నచిన్న లీకేజీలు ఉన్నాయి. వీటిని సవరించి నీటి ఎద్దడి లేకుండా నీరందించేందుకు కృషి చేస్తున్నాం. ఈసారి గోదావరి నీరు అందిస్తాం. – సునీతారాణి, మున్సిపల్ చైర్పర్సన్ -
మెరుపు సమ్మె
శ్రీరాంపూర్, న్యూస్‌లైన్: సింగరేణిలో బొగ్గు లారీల యజమానులు మెరుపు సమ్మెకు దిగారు. గనుల నుంచి ఉత్పత్తి బొగ్గును దూర ప్రాంతాల్లోని పరిశ్రమకు వీరు సరఫరా చేస్తుంటారు. రవాణా చార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తూ లారీల యాజమానులు సోమవారం మధ్యాహ్నం నుంచి సమ్మెకు దిగారు. శ్రీరాంపూర్, మందమర్రి డివిజన్లకు చెందిన లారీ ఓనర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమ్మె జరుగుతోంది. బెల్లంపల్లి డివిజన్లో కూడా నేడు లేదా రేపు మొదలయ్యే అవకాశం ఉంది. సమ్మె మూలంగా ఈ రెండు డివిజన్ల పరిధిలోని 800 లారీలు బుకింగ్ యార్డుల వద్దే నిలిచాయి. దీంతో బొగ్గు రవాణాపై ప్రభావం పడింది. సింగరేణి బొగ్గును ఈ యాక్షన్ ద్వారా కొనుగోలు చేసిన కంపెనీలకు ఇక్కడి నుంచి లారీల ద్వారా రవాణా చేస్తోంది. రవాణా చేసే కంపెనీలకు, లారీ యజమానులకు మధ్య కోల్ట్రాన్స్పోర్టర్లు ఉంటారు. టన్ను బొగ్గు రవాణాకు దూరంను బట్టి ట్రాన్స్పోర్టర్లు కిరాయిని చెల్లిస్తారు. అయితే పెరిగిన ధరలకు అనుగుణంగా కి రాయి ఇవ్వడం లేదని కిరాయి పెంచాలని డిమాండ్ చేస్తూ లారీల యాజమానులు సమ్మెకు దిగారు. రెండేళ్ల కిత్రం లీటరు డీజిల్ ధర రూ.41.45 పైసలు ఉన్నప్పుడు హైదరాబాద్‌కు కిరాయి టన్నుకు రూ. 724 ఇచ్చే వారని ఇప్పుడు డీజిల్ ధర రూ.59.68 పైసలకు పెరిగినా కూడా అదే కిరాయి ఇవ్వడంతో గిట్టుబాటు కావడం లేదని లారీ యాజమానులు వాపోతున్నారు. ఇప్పుడున్న పాత కిరాయిపై 20 శాతం చార్జీ పెంచి టన్నుకు రూ.150 తగ్గకుండా కిరాయి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. వీటితోపాటు లారీల విడిభాగాల ధరలు, లారీ డ్రైవర్ల, క్లీనర్ల జీతం పెరిగిందని, టోల్‌టాక్స్‌లు కూడా పెరిగాయని లారీ యజమానులు పేర్కొంటున్నారు. రవాణా చార్జీలు పెంచాలని కోల్ట్రాన్స్పోర్టర్లను డిమాండ్ చేస్తున్నామని ఓనర్లు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా, లారీల ద్వారా దూర ప్రాంతాలకు జరగాల్సిన బొగ్గు రవాణా ఆగిపోవడంతో అధికారులు పంపించాల్సిన బొగ్గును టిప్పర్ల ద్వారా సీఎస్పీకి తరలిస్తున్నారు. శ్రీరాంపూర్ డివిజన్లో రోజుకు 7 వేల టన్నులు, మందమర్రి డివిజన్లో రోజుకు సుమారు 1,800 టన్నుల బొగ్గు లారీల ద్వారా రవాణా అయ్యేది. ఇప్పుడు దాన్ని సీఎస్పీలో స్టాక్ చేస్తున్నారు. దీనిని వ్యాగన్ల ద్వారా పంపించే అవకాశం ఉంది. నష్టాలు వస్తున్నాయి. కిరాయి తక్కువగా ఉండటంతో నష్టాలు వస్తున్నాయి. రెండేళ్ల నుంచి బొగ్గు రవాణా చార్జీలు పెంచలేదు. దీంతో లారీల నిర్వాహణ భారం అయ్యింది. దీంతో లారీలను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ట్రాన్స్పోర్టర్లు మా డిమాండ్లను తీర్చి రవాణా చార్జీ పెంచాలి. - బింగి రవీందర్, లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, శ్రీరాంపూర్ అన్నింటికి ధరలు పెరిగాయి. నిత్యావసర సరుకుల నుంచి మొదలుకొని రెండేళ్లలో అన్నింటికి ధరలు పెరిగాయి. వాటికి అనుగుణంగానే బొగ్గు రవాణా చార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. నాకు 3 లారీలు ఉన్నాయి. సమ్మెతో రోజుకు రూ. 6వేల నష్టపోతున్నా. కిరాయి పెరిగేంత వరకు లారీలు నడపం. - పుప్పాల సత్తయ్య, లారీ ఓనర్