బెల్లంపల్లి : రాత్రి అయితే చలి..పగలు ఎండ..పగటి ఉష్ణోగ్రతలు ప్రస్తుతం శరవేగంగా మారుతున్నాయి. ఎండలు ఈసారి ఫిబ్రవరి నెలలోనే మొదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో బెల్లంపల్లి పురప్రజలను వేసవిలో నీటి ‘ఫోబియా’ వెంటాడుతుంది. వేసవిలో తాగునీటి సమస్య ఆందోళన ఈ ఎండలను చూసి ఇప్పటి నుంచే మొదలవుతున్నాయి. గోదావరి జలాలు మున్సిపల్‌కు అందకపోవడంతో ఈసారి కూడా తిప్పలు తప్పేలా లేవని భావిస్తున్నారు. మున్సిపల్ అధికారులు మేల్కొని నీటి సమస్య తీర్చేందుకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైన ఉంది.
ఈ నేపథ్యంలో మున్సిపల్‌లో తాగునీటి సరఫరా తీరుపై ప్రత్యేక కథనం.. బెల్లంపల్లి పుర ప్రజల దాహార్తిని తీర్చడం కోసం 2011లో గోదావరి నీటి పథకాన్ని ప్రతిపాదించారు. ఇందుకు అప్పటి ప్రభుత్వం రూ.18కోట్లతో అంచనా వేశారు. మెగా కన్స్‌స్ట్రక్షన్ లిమిటెడ్ కంపనీ టెండర్ దక్కించుకుని 2014లో పనులను పూర్తి చేసింది. తాగునీటి సరఫరా కోసం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మందమర్రి ఫిల్టర్‌బెడ్ వరకు అంతర్గత పైపులైన్ వేసి, అప్పటికే బెల్లంపల్లి– మందమర్రి గోదావరి తాగునీటి పథకం కోసం ఏర్పాటు చేసిన పాతపైపులైనుకు అనుసంధానం చేశారు.
వెంటాడిన లీకేజీ సమస్యలు...
గోదావరి జలాల కోసం పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద ఓవర్‌హెడ్ ట్యాంకు, ఫిల్టర్ బెడ్ నిర్మించారు. గతేడాది ట్రయల్ రన్ నిర్వహించినా ఎల్లంపల్లి– మందమర్రి మధ్య చాలా చోట్ల పైపులైన్ లీకేజీలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత లీకేజీలను అరికట్టి నీటి సరఫరా కోసం మార్గం సుగమం చేశారు. మరమ్మతుల అనంతరం ఇటీవలనే మరోసారి ట్రయల్‌రన్ చేపట్టగా విజయవంతమైంది.
అందని నీరు...
ట్రయల్ రన్ విజయవంతమైనా ఫిల్టర్‌బెడ్‌కు పూర్తిస్థాయిలో నీటిసరఫరా జరగడం లేదు. ఈ నేపథ్యంలో నిర్ధేశించిన ప్రకారంగా నీటి సరఫరా జరుగుతుందా లేదా అనేది పురప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మున్సిపల్‌లో వాల్వ్‌ల ఏర్పాటు, జాయింట్ల అనుసంధానం చేయాల్సిన పనులు మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది.
నీటి పథకంపైనే భారం..
వేసవిలో పట్టణ ప్రజల తాగునీటి సమస్య తీర్చేందుకు ఎల్లంపల్లి నీటి పథకం ఒక్కటే ఆధారం. ప్రస్తుతం బెల్లంపల్లి– మందమర్రి గోదావరి నీటి పథకం ద్వారా సరఫరా అరకొరగా జరుగుతోంది. నాలుగు రోజులకోసారి తాగునీటిని అందిస్తున్నారు.
ప్రజాప్రతినిధులు, అధికారులు మేల్కొని గోదావరి జలాలు పూర్తిస్థాయిలో అందేలా చూసి వేసవిలో దాహారం తీర్చాలని పురప్రజలు కోరుతున్నారు.
మున్సిపాలిటీలో తాగునీటి సరఫరా స్వరూపం..
జనాభా 56,369
ఇళ్ల సంఖ్య 16,066
నల్లా కనెక్షన్‌ల సంఖ్య 3000
రోజువారీగా నీటి సరఫరా లక్ష్యం 7 ఎంఎల్‌డీ
సరఫరా అవుతున్న తాగునీరు 3.4 ఎంఎల్‌డీ
ప్రత్యామ్నాయం సింగరేణి ఫిల్టర్ బెడ్‌లు, బోర్లు
వేసవికి ముందే నీరందిస్తాం
మున్సిపల్ ప్రజలకు వేసవికి ముందే గోదావరి జలాలు అందిస్తాం. ఎల్లంపల్లి నుంచి ట్రయల్ రన్ సక్సెస్ అయింది. అక్కడక్కడ చిన్నచిన్న లీకేజీలు ఉన్నాయి. వీటిని సవరించి నీటి ఎద్దడి లేకుండా నీరందించేందుకు కృషి చేస్తున్నాం. ఈసారి గోదావరి నీరు అందిస్తాం.
– సునీతారాణి, మున్సిపల్ చైర్‌పర్సన్
Comments
Please login to add a commentAdd a comment