గ్రేడ్ 1 మున్సిపాల్టీ మంచిర్యాల
మున్సిపల్ కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్‌కు అర్హతలు..
మంచిర్యాల టౌన్ :
మంచిర్యాల జిల్లా కేంద్రంగా మారడంతో ఇక మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌పై ప్రజల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. అన్ని అర్హతలూ ఉండడంతో కార్పొరేషన్‌గా మారే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో తూర్పు జిల్లా కేంద్రంగా మంచిర్యాల పట్టణం దినదినాభివృద్ధి చెందింది. గ్రేడ్–1 మున్సిపాల్టీగా మారిం ది. సింగరేణికి కేంద్రంగా ఉన్న శ్రీరాంపూర్‌లో పని చేసే ఉద్యోగులు, కార్మికులు, వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చిన వేలాది మంది మంచిర్యాలలో స్థిరపడ్డారు. దీనికి తోడు దాదాపుగా దేశంలోని అన్ని రాష్ట్రాలను కలుపుతూ రైలు మార్గం కూడా ఉంది. దీంతో ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతోంది. కార్పొరేషన్‌గా మారితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందే నిధులు మూడింతలు అవుతాయి. పథకాలు మరింత చేరువవడంతో సేవలు పెరిగే అవకాశాలుంటాయి.
1952లోనే బల్దియాగా ఆవిర్భావం
మంచిర్యాల పట్టణం మూడో గ్రేడ్ మున్సిపాలిటీగా 1952లో ఏర్పడింది. రైలు మార్గం ఉండడం, వేగంగా అభివృద్ధి చెందడం, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు ఇక్కడ స్థిరపడడం, బల్దియా ఆదాయం పెరగడంతో 1998లో రెండో గ్రేడ్ మున్సిపాలిటీగా మారింది. సింగరేణి ప్రాంతానికి చెందిన వారు మంచిర్యాలలో స్థిరపడడంతో జనాభా పెరిగి.. పట్టణం విస్తరించింది. జీవో ఎంఎస్ నంబర్ 378 ద్వారా ఏప్రిల్ 17, 2004న అప్పటి ప్రభుత్వం గ్రేడ్ వన్ మున్సిపాల్టీగా మార్చుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక అప్పటి నుంచి మంచిర్యాల అభివృద్ధి పథంలో దసూకుపోతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండేళ్ల క్రితం రాష్ట్రంలోనే ఉత్తమ మున్సిపాలిటీ అవార్డు దక్కించుకుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవార్డు సైతం పొంది, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అమృత్ టౌన్‌గా ఎంపికైంది. కానీ 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణ జనాభా 87,500æ ఉందని, లక్షలోపు జనాభా ఉందన్న కారణంతో అమృత్‌టౌన్ పథకం నుంచి తొలగించారు. దీంతో పట్టణ ప్రజల్లో నిరాశే మిగిలింది. అమృత్‌టౌన్‌గా గుర్తింపు పొందితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు, పలు పథకాలు వచ్చే అవకాశం ఉండేది. ప్రస్తుతం పట్టణ జనాభా 1.15 లక్షలకు పైగా ఉన్నా, 2011 జనాభా లెక్కల ప్రకారంగానే ఇంకా గుర్తించడంతో ఓ చక్కటి అవకాశాన్ని చేజార్చుకున్నట్లయింది. కార్పొరేషన్‌గానైనా మారుస్తారన్న ఆశతో ప్రజలు ఎదురుచూస్తున్నారు.
అప్‌గ్రేడ్‌తో నిధులు
మంచిర్యాల మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా మారేందుకు అన్ని అర్హతలు ఉన్నాయి. పట్టణం చుట్టూ ఉన్న సమీప గ్రామాలు ఇప్పటికే మంచిర్యాలతో కలిసి ఉన్నాయి. జనాభా 1.15 లక్షలకు పైగా ఉంది. జిల్లా కేంద్రం కావడంతో మరో 35 వేల వరకు పెరిగే అవకాశం ఉంది. సమీప గ్రామాలను కలిపితే మరో 1.50 లక్షల జనాభా కలుస్తుంది. కార్పొరేషన్‌గా మారేందుకు మున్సిపాలిటీ జనాభా 3 లక్షలకు సరిపడా పెరుగుతుంది. కార్పొరేషన్‌గా మారి, సమీప గ్రామాలు పట్టణంలో కలిస్తే, రోడ్లు, డ్రెయినేజీలు, విద్యుత్ సౌకర్యం, తాగునీటి వసతి, పారిశుధ్యం మెరుగుపడుతాయి. సెంట్రల్ డిపార్టుమెంట్, అర్బన్ డిపార్టుమెంట్ నుంచి పలు స్కీంలు, నేషనల్ వాటర్ ప్రాజెక్టు స్కీంలు వస్తాయి. ప్రస్తుతం గ్రేడ్ 1 మున్సిపాలిటీకి వస్తున్న నిధులు మూడు రెట్లకు పైగా పెంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తాయి. స్మార్ట్‌సిటీగా ఆవిర్భవించేందుకు అవకాశం ఉంటుంది. కార్పొరేషన్‌గా మారినా, మున్సిపాలిటీ పరిధిలోని ఇంటి పన్నులే కాకుండా, ఏ ఇతర పన్నుల విషయంలో ప్రజలపై ఎలాంటి అదనపు భారం పడకుండానే, సేవలు పెరిగి ప్రజలకు మేలు కలుగుతుందని మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ తేజావత్ వెంకన్న తెలిపారు. సమీప గ్రామాలు విలీనం చేయడం ద్వారా అక్కడి ప్రజల జీవనశైలి మారడంతో అక్కడి ప్రాంతాలు అభివృద్ధి దిశగా పయనిస్తాయి. ఏదేమైనా జిల్లా కేంద్రంగా మారిన మంచిర్యాల కార్పొరేషన్‌గా మారాలన్న ఇక్కడి ప్రాంత ప్రజల కల నెరవేరేందుకు ప్రజాప్రతినిధులు కృషి చేయాల్సిన అవసరం ఉంది.
‘కార్పొరేషన్’పై ఆశలు
Published Thu, Oct 27 2016 9:09 AM | Last Updated on Tue, Oct 16 2018 6:33 PM
Advertisement
Advertisement