బెంగళూరు డీఐజీ రూపపై బదిలీ వేటు
బెంగళూరు: అన్నాడీఎంకే నాయకురాలు శశికళకు పరప్పన అగ్రహార జైలులో వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తున్నారని సంచలన ఆరోపణలు చేసిన కర్ణాటక జైళ్ల శాఖ డీఐజీ రూప పై బదీలీ వేటు పడింది. ఆమెను జైళ్లశాఖ నుంచి ట్రాఫిక్కు బదిలీ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. శశికళకు జైల్లో అక్రమంగా సౌకర్యాలు కల్పించినందుకు దాదాపు రూ.2 కోట్ల మేర ముడుపులు అందాయని డీఐజీ రూప డీజీపీకి ఆరు పేజీల లేఖ రాయడం కలకలం రేపింది.
ఈ నివేదికపై జైళ్ల శాఖ డీజీ సత్యనారాయణ రావు స్పందించిన విషయం తెలిసిందే. జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళకు నిబంధనలకు విరుద్ధంగా జైలులో ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించలేదని జైళ్ల శాఖ డీజీపీ సత్యనారాయణ తెలిపారు. ప్రత్యేక సదుపాయాల కోసం రూ.2 కోట్లు ముడుపులు అందాయన్న ఆరోపణలను కొట్టిపారేశారు. అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉన్న శశికళకు ఎలాంటి ప్రత్యేక వంటగది వసతి కల్పించలేదని, కోర్టు ఉత్తర్వులు పాటిస్తున్నట్లు స్పష్టం చేశారు. తప్పుడు ఆరోపణలు చేశారని డీఐపీ రూపపై శాఖపరమైన చర్యలు తీసుకున్నారు.