44 కాదు.. మూడుసార్లే ఫోన్ చేశాడు!
ఐఏఎస్ అధికారి డీకే రవి అనుమానాస్పద మృతి కేసు కీలక మలుపు తిరిగింది. విచారణ కేవలం ప్రేమ కోణంలోనే జరుపుతుండటాన్ని ఆక్షేపిస్తూ రవి బ్యాచ్‌మేట్.. ఐఏఎస్ అధికారిణి రోహిణి బెంగళూరు హైకోర్టును ఆశ్రయించారు. గురువారం జరిగిన విచారణలో రోహిణి తరఫు న్యాయవాది మాట్లాడుతూ మరణానికి ముందు రవి.. 44 సార్లు ఫోన్ చేసినట్లు సీఎం సిద్ధరామయ్య పేర్కొనడం అభ్యంతరకరమన్నారు.
44 సార్లుకాదు.. కేవలం మూడుసార్లు మాత్రమే రవి ఫోన్ చేశాడని, ఆ సమయంలో రోహిణి వెంట ఆమె భర్త శ్రీధర్ రెడ్డి కూడా ఉన్నారని కోర్టుకు తెలిపారు. కేసు దర్యాప్తుపై కర్ణాటక అసెంబ్లీలో సోమవారం సీఎం సిద్ధరామయ్య ప్రకటన చేయనున్న నేపథ్యంలో ఆ ప్రకటన వెలువడకుండా చర్యలు తీసుకోవాలని కోర్టుకు విన్నవించారు. వాదనల అనంతరం విచారణ ఏప్రిల్ 6కు వాయిదాపడింది.
కాగా, రవి మృతిపై విచారణను పక్కదోవ పట్టిస్తున్నారంటూ మాజీ సీఎం, జేడీ(ఎస్) నేత కుమారస్వామి గౌడ ఆగ్రహం వ్యక్తంచేశారు. మృతిచెందిన అధికారి 44 సార్లు ఫోన్ చేశాడని చెప్పిన సీఎం.. దానిని నిరూపిస్తేగనుక తాను రాజకీయాలనుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. కేసు విచారణ సీబీఐ చేతికి వెళ్లకముందే సాధ్యమైనంత గందరగోళం సృష్టించేందుకు ప్రభుత్వం కుయుక్తులు పన్నుతున్నదని విమర్శించారు.