Benjamin Franklin
-
పొదుపు, పెట్టుబడికి తేడా ఏంటి?
ఫైనాన్షియల్ బేసిక్స్ సంపదను కాపాడటం, దాన్ని అభివృద్ధి చేయడం ఒక కళ. ‘మీరు రూపాయి ఆదా చేస్తే రూపాయి సంపాదించినట్లే’ అనేది ఎన్నడో బెంజమిన్ ఫ్రాంక్లిన్ చెప్పిన మాట. మనలో చాలా మందికి డబ్బును ఆదా చేయాలని ఉంటుంది. డబ్బును రెండు మార్గాల్లో ఆదా చేయొచ్చు. ఒకటేమో సేవింగ్స్, రెండోది ఇన్వెస్ట్మెంట్స్. అసలు ముందు తెలియాల్సింది పొదుపునకు, పెట్టుబడికి తేడా. మిగులు సంపాదనను క్రమ పద్ధతిలో కూడబెడితే అది సేవింగ్స్. అదే మిగులు సంపాదనను అధిక రాబడిని అందించే సాధనాల్లో పెడితే అది ఇన్వెస్ట్మెంట్. సేవింగ్స్ అంటే భద్రత! సేవింగ్ అనేది చిన్న వయసు నుంచే అలవాటు కావాలి. ఇందుకు సాధారణంగా ఉపయోగించేది బ్యాంకు సేవింగ్స్ ఖాతానే. సేవింగ్స్ ముఖ్య లక్షణం భద్రత. దీన్లో రిస్క్ ఉండనే ఉండదు. అయితే పొదుపు చేసే డబ్బులో పెరుగుదల ఉండదు. ఉన్నా అది స్వల్పమే. పొదుపు చేయడం వల్ల పెద్దగా లాభం ఉండదు. అందుకని ఆ పొదుపును ఇన్వెస్ట్మెంట్గా తప్పక మార్చాలి. పెట్టుబడి ముఖ్య లక్షణం సంపద సృష్టి రేపటి జీవనం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాగాలంటే వచ్చే ఆదాయంలో మన ఖర్చులు మినహా మిగిలిన సంపదను పలు రకాల ఇన్వెస్ట్మెంట్ సాధనాల్లో పెట్టుబడిగా పెట్టాలి. అది మరింత సంపదనిస్తుంది. ఇన్వెస్ట్‌మెంట్స్‌ను స్టాక్‌మార్కెట్, బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్, బంగారం, కమోడిటీస్‌లో ఎక్కువగా చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ అనేది మీ సంపాదన మొదలైన రోజు నుంచి ఆరంభమవ్వాలి. పెట్టుబడి ముఖ్య లక్షణం సంపద సృష్టి. ఈ సంపద పిల్లల కాలేజీ ఫీజులు, పెళ్లిళ్లు, సెలవుల్లో సరదాగా గడపడం, మంచి జీవన ప్రమాణానికి, రిటైర్మెంట్ తర్వాత జీవితం సాఫీగా గడపటానికి ఇలా అన్నిటికీ ఉపయోగపడుతుంది. పెట్టుబడి వల్ల వచ్చే రాబడి పెరుగుతున్న ద్రవ్యోల్బణం కన్నా అధికంగా ఉండాలి. ఇన్వెస్ట్‌మెంట్స్‌లో రిస్క్ ఉంటుంది. రిస్క్ లేకుండా రాబడిని పొందలేమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. రికవరీ దిశగా బంగారం ధర దేశీయంగా బంగారం ధర రూ.26,000పైన స్థిరపడింది. గతవారం ప్రారంభం నుంచి తగ్గుతూ వస్తున్న బంగారం ధర వారాంతానికి వచ్చేసరికీ అంతర్జాతీయ పరిస్థితులు సానుకూలంగా మారడం, దేశీ రిటైలర్ల నుంచి డిమాండ్ పెరగడం, పండుగ సీజన్ వంటి అంశాల కారణంగా కొద్దిగా కోలుకుంది. గతవారం బంగారం ధర బాగా ఒడిదుడుకులకు లోనయింది. ముంబైలో 10 గ్రాముల 99.9 స్వచ్ఛత బంగారం ధర ఒకానొక సందర్భంలో రూ.25,930 కనిష్ట స్థాయికి పతనమై చివరకు రూ.26,380 వద్ద ముగిసింది. ఇది కడపటి వారం ముగింపు ధర రూ.26,755తో పోలిస్తే రూ.375 తక్కువ. అలాగే 10 గ్రాముల 99.5 స్వచ్ఛత బంగారం ధర కూడా రూ.25,780 వరకు పడి చివరకు రూ.26,230 వద్ద స్థిరపడింది. ఈ ధర కూడా కడపటి వారపు ముగింపు ధర రూ.26,605తో పోలిస్తే రూ.375 తక్కువ. ఇక అంతర్జాతీయంగా న్యూయార్క్ మార్కెట్లో బంగారం ధర ఔన్స్‌కు 1,137 డాలర్లుగా ఉంది. -
సూర్యుడిని నిద్రలేపుతారు...!
వేకువజామునే నిద్రలేచేవాళ్లు ఆరోగ్యవంతులు, సంపన్నవంతులు, వివేకవంతులు అవుతారు... అన్నారు బెంజిమన్ ఫ్రాంక్లిన్. అయితే ఇలాంటి వాక్యాలను ఎన్ని సార్లు విన్నా.. పాటించాల్సి వచ్చేసరికి బద్ధకం ఆవహించేస్తుంటుంది. మరి వివేకవంతులుగా, సంపన్నవంతులుగా ఇప్పటికే ఎదిగిన వారి తీరు ఎలా ఉంటుంది అంటే... అలాంటి వాళ్లలో చాలా మంది నిద్రపోతూ సూర్యుడికి పట్టుబడటం లేదు. బ్రహ్మీముహూర్తంలోనే నిద్రలేచి తమ పనులకు ఉపక్రమిస్తున్నారు. అలాంటి వారిలో కొందరు ప్రముఖులు... టిమ్ కుక్ ఈ ప్రపంచంలో ఐఫోన్ వినియోగదారులు అనే ప్రత్యేక జాతిని సృష్టించగలిగిన యాపిల్ సంస్థ సీఈవో స్థానంలో ఉన్న టిమ్ కుక్ తెల్లవారుజామున నాలుగున్నరకే కంప్యూటర్ ముందు కూర్చుంటారట. కంపెనీకి సంబంధించిన మెయిల్స్‌ను పర్యవేక్షిస్తూ తన పనిని మొదలు పెడతానని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. రిచర్డ్ బ్రాసన్ ఈయన వర్జిన్ గ్రూప్ చైర్మన్ మాత్రమే కాదు... మంచి ఫిజిక్‌తో లేటు వయసులో హాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్న వ్యక్తి కూడా. సినిమాలపై ఎనలేని ఆసక్తికలిగిన బ్రాసన్ సూర్యోదయానికి ముందే నిద్రలేచి వ్యాయామం చేస్తానని, తర్వాత దైనందిన కార్యక్రమాలపై దృష్టిసారిస్తానని చెబుతారు. ఇంద్రనూయి పెప్సీ సీఈవోగా ఉన్న ఇంద్రనూయి శరీర అవసరానికి మించి నిద్రపోవడానికి మించిన సోమరితనం లేదంటారు. దేవుడు మనకు బహుమతిగా ఇచ్చిన నిద్రను సకాలంలో ఉపయోగించుకోవాలి అని నూయి అంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వేకువజామున నాలుగింటికి ఆమె నిద్రలేస్తారట. సుశీల్ కుమార్ ఒలింపిక్ మెడలిస్ట్గా ప్రపంచ ప్రఖ్యాతిని సాధించిన ఈ మల్లయోధుడి జీవనశైలిలో ఎలాంటి మార్పులూ లేవు. తను పుట్టి పెరిగిన పరిసరాల్లోనే ఇప్పటికీ ఉంటున్న సుశీల్ క్రమశిక్షణ విషయంలో కూడా నో రాజీ. ఉదయం నాలుగింటికే నిద్రలేచి కోచ్ సూచనల ప్రకారం కసరత్తు మొదలు పెట్టడమే. అక్షయ్ కుమార్ ఈ యాక్షన్ హీరో దినచర్య ఉదయం నాలుగున్నరకే మొదలవుతుంది. ఈ విషయాన్ని చాలా గర్వంగా చెప్పుకుంటాడు అక్షయ్. మరీ అర్ధరాత్రుళ్లు దాటే వరకూ షూటింగ్‌లు ఉంటే తెల్లవారు జామునే లేవలేకపోయినందుకు అక్షయ్ బాధపడతారట. వేకువనే నిద్రలేచిన రోజు కొత్త ఆత్మవిశ్వాసం తోడవుతుందని ఈ బాలీవుడ్హీరో చెబుతారు. -
అసమాన ప్రతిభా సంపన్నుడు
సంక్షిప్తంగా... బెంజమిన్ ఫ్రాంక్లిన్ జూలై 4 ఇవాళ. అమెరికా స్వాతంత్య్ర దినం. ఈ సందర్భంగా మనం... చెప్పుకుంటే అమెరికా మొదటి అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్ గురించి చెప్పుకోవాలి. లేదంటే బెంజమిన్ ఫ్రాంక్లిన్ గురించి చెప్పుకోవాలి. ఇద్దరూ అమెరికా పుట్టక ముందు పుట్టినవారే. ఇద్దరూ అమెరికా స్వాతంత్య్ర సమరం లో భాగస్వాములైన వారే. అమెరికా వలసల తిరుగుబాటు దళం ‘కాంటినెంటల్ ఆర్మీ’ దళపతి జార్జి వాషింగ్టన్. అమెరికా వ్యవస్థాపక మేధావులలో ముఖ్యుడు బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఇద్దరూ ఒకరి కన్నా ఒకరు ఎక్కువౌతారేమో కానీ, ఈ ఇద్దరిలో ఎవరూ ఒకరి కన్నా ఒకరు తక్కువ కారు. అయితే ఒక్క విషయంలో మాత్రం బెంజమిన్.. వాషింగ్టన్ కన్న ఎక్కువ. వయసులో దాదాపు పాతికేళ్లు సీనియర్. ఈ ఒక్క పాయింట్‌ని పరిగణనలోకి తీసుకుంటే గనుక మనం బెంజమిన్ ఫ్రాంక్లిన్ గురించి స్వేచ్ఛగా, సంశయ రహితంగా మాట్లాడుకోవచ్చు. అమెరికాలో మొదట పదమూడు రాష్ట్రాలు ఉన్నట్లు, ఫ్రాంక్లిన్లో పదమూడు గొప్పదనాలు ఉండేవని ఆయన సమకాలీనులు అంటుండేవారు. శాస్త్రవేత్త, రచయిత, రాజనీతిజ్ఞుడు.. ఒక్క మాటలో బహుముఖ ప్రజ్ఞాశాలి. అయితే ఫ్రాంక్లిన్ ఆ ఒక్కమాటా ఒప్పుకునేవారు కాదు. కష్టపడి పనిచెయ్యడం తప్ప తనకింకేమీ తెలియదని చెప్పుకున్నారాయన! బెంజమిన్ ఫ్రాంక్లిన్ బోస్టన్‌లో పుట్టారు. ఫిలడెల్ఫియాలో మరణించారు. ఈ మధ్య వ్యవధిలో సాగిన ఆయన జీవితం 1706-1790 మధ్య ఉన్న నిడివి కన్నా చాలా పెద్దది. అంటే, రోజులు, నెలలు, సంవత్సరాలలో ఇమిడిపోని విస్తృత జీవితం ఆయనది. ఒకే మనిషిగా వంద పనులు చేశారు. స్వాతంత్య్రం కోసం అమెరికా నొప్పులు పడుతున్నప్పుడు ఆయన పక్కనే ఉన్నారు. స్వాతంత్య్ర ప్రకటన తీర్మాన రచనలో తన చెయ్యీ వేశారు. ఈ రెండు సందర్భాలూ ఫ్రాంక్లిన్ జీవితంలో కీలకమైనవి. ఫ్రాంక్లిన్ పదిహేడేళ్ల వయసులో బోస్టన్ వదిలి ఫిలడెల్ఫియా వెళ్లి, అక్కడి నుంచి మళ్లీ లండన్ వెళ్లి ముద్రణలో శిక్షణ పొందారు. తిరిగి ఫిలడెల్ఫియా వచ్చి సొంతంగా ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకున్నారు. తర్వాత పెళ్లి, పిల్లలు. ఆ తర్వాత పోస్టుమాస్టర్‌గా ఉద్యోగం. విద్యుత్‌పై ప్రయోగాలు. తర్వాత పెన్సిల్వేనియా అసెంబ్లీకి ప్రతినిధిగా ఎన్నికయ్యారు. తర్వాత ఐదేళ్లకు అమెరికన్ ఫిలసాఫికల్ సొసైటీ అధ్యక్షుడయ్యారు. అమెరికాకు స్వాతంత్య్రం వచ్చిన ఏడాదే ఫ్రాన్సుకు అమెరికన్ కమిషనర్‌గా ఎంపికయ్యారు. క్లుప్తంగా ఇదీ బెంజమిన్ బయోగ్రఫీ. పన్నుల విధింపునకు ఫ్రాంక్లిన్ బద్ధ వ్యతిరేకి. పన్నులు కట్టేవారే. కానీ, బాధపడుతూ కట్టేవారు. పన్నుల మీద సెటైర్లు విసిరేవారు. ‘‘మనిషి కోసం రెండు రాసి పెట్టి ఉంటాడు దేవుడు. ఒకటి మరణం. ఇంకోటి ‘పన్నులు’. ఈ రెండూ మనిషి జీవితానికి తప్పనిసరి. నువ్వెలా బతికినా చివరికి చనిపోవాల్సిందే. నువ్వెలా బతుకుతున్నా... చచ్చినట్లు పన్నులు కట్టాల్సిందే. తిన్నా, తినకున్నా కక్కాల్సిందే!’’ అంటారాయన. జీవితాన్ని తేలిగ్గా తీసుకుని సీరియస్‌గా గడిపిన అసాధారణ ప్రతిభా సంపన్నుడు, మేధావి బెంజమిన్ ఫ్రాంక్లిన్. - భావిక -
బెంజిమిన్ ఫ్రాంక్లిన్ చెప్పినట్లు...
మెన్స్ వెల్త్ రచయిత, ముద్రాపకుడు, దౌత్యవేత్త, రాజనీతిజ్ఞుడుగా... బెంజిమిన్ ఫ్రాంక్లిన్లో ఎన్నో ప్రతిభావంతమైన కోణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆయన జీవితం నుంచి ఎన్నో ఆర్థికపాఠాలు నేర్చుకోవచ్చు. అవి ఈ కాలానికి కూడా అతికినట్లుగా సరిపోతాయి. ఏడు సంవత్సరాల వయసులోనే తొలి ఆర్థిక పాఠాన్ని నేర్చుకున్నాడు ఫ్రాంక్లిన్. స్కూల్ దగ్గర ఒక అబ్బాయి అదేపనిగా విజిల్ ఊదుతున్నాడు. ఆ శబ్దం ఫ్రాంక్లిన్‌కు విపరీతంగా నచ్చింది. ‘‘ఈ విజిల్ ఎంతకిస్తావ్?’’ అని అడిగాడు. విజిల్ అబ్బాయి సమాధానం చెప్పగానే, ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా జేబులో ఉన్న డబ్బులన్నీ ఇచ్చి ఆ విజిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఇంటికొచ్చిన తరువాత సోదరికి చూపిస్తే ‘‘ఎంత ధరకు కొన్నావు?’’ అని అడిగింది ఆమె. ఫ్రాంక్లిన్ చెప్పిన సమాధానం విని ఆమె ఆశ్చర్యపోయింది.‘‘నువ్వు నాలుగు రెట్లు ఎక్కువ ధరకు ఆ విజిల్‌ను కొన్నావు తెలుసా!’’ అని ఆమె చెప్పేసరికి ఫ్రాంక్లిన్‌లోని ఆనందమంతా ఆవిరైపోయింది. ‘‘వస్తువులను కొనేముందు హేతుబద్ధంగా ఉండాలి’’ అనే పాఠం తెలిసొచ్చింది. విషయాలను స్వతహాగా నేర్చుకోవడం వల్ల డబ్బు మిగలడమే కాదు ఆత్మసంతృప్తి కూడా దొరుకుతుందని ఫ్రాంక్లిన్ నమ్మేవాడు. దాన్ని ఆచరించి చూపాడు. ప్రింటర్‌గా ఉన్నప్పుడు...‘‘ఫలానా యంత్రం ఇంగ్లండ్ నుంచి దిగుమతి చేసుకోవాలి, టైమ్ పడుతుంది’’ అని ఎవరైనా చెబితే ‘‘అప్పటివరకు ఎదురుచూడడం ఎందుకు? అలాంటి యంత్రాన్ని మనమే ఎందుకు తయారుచేసుకోకూడదు’’ అంటూ కొత్త యంత్రాలు తయారుచేయించేవాడు. ‘మనిషి అనేవాడు తప్పక పెట్టుబడి పెట్టాలి. అది డబ్బు కావచ్చు...ఇంకేదైనా కావచ్చు’ అనేది ఫ్రాంక్లిన్ సిద్ధాంతం. ఫ్రాంక్లిన్ తన డబ్బును పుస్తకాలలో పెట్టాడు, పుస్తకాలను తన కాలంలో పెట్టుబడిగా పెట్డాడు. విపరీతంగా చదివాడు. ఫలితం వృథా పోలేదు. ప్రపంచ ప్రసిద్ధ రచయిత, శాస్త్రవేత్త కావడానికి ఇది ఉపయోగపడింది.బ్యాంకుల్లో దాచుకున్నదే సంపద కాదు...స్నేహితులు కూడా సంపదే అనేవాడు ఫ్రాంక్లిన్. స్నేహితుల మద్దతు, వారి సలహాలు వెలకట్టలేనివి అని నమ్మేవాడు. తాను ఏ కొత్త పని చేసినా వాటి బాగోగుల గురించి స్నేహితులతో చర్చించడం ఫ్రాంక్లిన్ అలవాటు. ‘‘వ్యాపారం నుంచి మనసును ఎప్పుడైతే దారి మళ్లిస్తామో... అప్పుడు నష్టాలు మొదలవుతాయి. ఎంత నష్టజాతక వ్యాపారమైనా సరే, ఓపిక ఉండి కష్టపడే వాడి చేతిలో లాభాలతో వెలిగిపోతుంది’’ అని చెప్పడమే కాదు నష్టాల్లో ఉన్న సంస్థలను లాభాల బాట పట్టించాడు ఫ్రాంక్లిన్. -
అపూర్వం... అపురూపం!
‘నేను వైఫల్యాలను మూటగట్టుకుంటున్నానన్నది నిజం కాదు. ఎన్ని రకాలుగా పొరపాట్లు చేయడానికి ఆస్కారముందో తెలుసుకుంటున్నాన’ంటాడు సుప్రసిద్ధ శాస్త్రవేత్త బెంజమిన్ ఫ్రాంక్లిన్. రెండు దశాబ్దాలుగా వైఫల్యాలను ఎదుర్కొన్నా అకుంఠిత దీక్షతో, పట్టుదలతో కృషి చేసిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) శాస్త్రవేత్తలు చివరకు విజయపతాక ఎగరేశారు. ఆదివారం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్)నుంచి నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్వీ-డీ5 మన అంతరిక్ష విజయ ప్రస్థానంలో ఒక అద్భుత ఘట్టాన్ని ఆవిష్కరించింది. ఇస్రో కీర్తికిరీటంలో అది మరో కలికితురాయి అయింది. ఇదంత సులభంగా చేజిక్కలేదు. అలవోకగా చేతికి రాలేదు. జీఎస్ఎల్వీ (జియో సింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికిల్) రాకెట్లకు దేశీయంగా అభివృద్ధి చేసుకున్న క్రయోజెనిక్ ఇంజన్‌ను ఉపయోగించాలన్నది మన శాస్త్రవేత్తల సంకల్పం. ఆ సంకల్పాన్ని సాకారం చేసుకునేందుకు వారు పడిన శ్రమ అంతా ఇంతా కాదు. వైఫల్యాలను ఎదుర్కొన్నా అవి సరిదిద్దుకోలేనిగా వారు భావించలేదు. కుంగిపోలేదు. తాము సాధించాల్సిన విజయానికి వాటిని సోపానాలుగా మలుచుకున్నారు. గత ఏడాది ఆగస్టులో దీన్ని ప్రయోగించాల్సివున్నా చివరి నిమిషంలో ఇంధనం లీక్ కావడాన్ని గమనించి వాయిదా వేశారు. ప్రయోగ వేదికనుంచి రాకెట్‌ను వెనక్కు తెచ్చి లోపాలను చక్కదిద్దారు. డిజైన్‌లో అవసరమైన మార్పులు చేశారు. ఒకటికి పదిసార్లు పరీక్షించుకుని సూక్ష్మ లోపాలను కూడా పరిహరించగలిగారు. క్రయోజెనిక్ పరిజ్ఞానం విషయంలో మన శాస్త్రవేత్తలు అంత పట్టుదలగా ఉండటానికి కారణాలున్నాయి. ఎన్నడో 1992లో ఆ పరిజ్ఞానంతో కూడిన ఇంజిన్లను, సాంకేతికతను అందజేయడానికి రష్యాతో ఒప్పందం కుదిరింది. దానికి అనుగుణంగా అది కొన్ని ఇంజిన్లను అందజేసింది కూడా. కానీ ఈలోగా మన అణు పరీక్షల నేపథ్యంలో అమెరికా ఆగ్రహించి తాను ఆంక్షలు విధించడమే కాక...రష్యా కూడా సాయం చేయడానికి వీల్లేదని అడ్డుపుల్లలేసింది. ఫలితంగా రష్యానుంచి క్రయోజెనిక్ ఇంజిన్లు రావడం ఆగిపోయింది. ఇక స్వదేశీ పరిజ్ఞానంపైనే ఆధారపడాలని మన శాస్త్రవేత్తలు సంకల్పించారు. 2010 ఏప్రిల్‌లో జీఎస్ఎల్వీ- డీ3ని ప్రయోగించి విఫలమయ్యారు. దాంతో ఆ తర్వాత అదే సంవత్సరం డిసెంబర్లో ఎస్ఎల్వీ-ఎఫ్6ను రష్యా ఇంజిన్‌తో ప్రయోగించి చూశారు. కానీ, అప్పుడూ చేదు అనుభవమే ఎదురైంది. మొత్తానికి డుసార్లు జీఎస్ఎల్వీని ప్రయోగిస్తే కేవలం రెండుసార్లు మాత్రమే విజయం చేతికందింది. పర్యవసానంగా భారీ ఉపగ్రహాలను కొన్నిసార్లు ఫ్రెంచి గయానానుంచి ప్రయోగించాల్సివచ్చింది. శాస్త్రవేత్తలకు ఇన్ని పరీక్షలు పెట్టిన క్రయోజెనిక్ పరిజ్ఞానం ఎంతో కీలకమైనది. భూమికి 36,000 కిలోమీటర్ల ఎత్తున ఉండే భూ స్థిర కక్ష్యలోనికి అధిక బరువుతో ఉండే ఉపగ్రహాన్ని పంపాలంటే అది క్రయోజెనిక్ పరిజ్ఞానంతోనే సాధ్యం. అయితే, అది అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ. రాకెట్లో మొదటి దశలో ఘన ఇంధనాన్ని, రెండో దశలో ద్రవ ఇంధనాన్ని, మూడో దశలో క్రయోజెనిక్ ఇంధనాన్ని ఉపయోగించాల్సివస్తుంది. మిగిలిన రెండు దశలూ సాధారణమైనవే. కానీ, క్రయోజెనిక్ దశ కొరకరాని కొయ్య. ఇందులో వాడే హైడ్రోజన్‌నూ, దాన్ని మండించడానికి వాడే ఆక్సిజన్‌ను ద్రవరూపంలోకి మార్చాలంటే వాటిని నిర్దిష్ట స్థాయికి శీతలీకరించ్సాల్సి ఉంటుంది. ఇందులో ఏ మాత్రం లోపం తలెత్తినా హైడ్రోజన్, ఆక్సిజన్లు వాయురూపంలోకి మారిపోతాయి. హైడ్రోజన్ ద్రవ రూపంలోకి మారాలంటే మైనస్ 253 డిగ్రీల సెల్సియస్ వద్దా, ఆక్సిజన్ ద్రవరూపంలోకి మారాలంటే మైనస్ 183 డిగ్రీలవద్దా ఉండాలి. ఆ ఉష్ణోగ్రతల్లో ఉండే ఇంధనాలను శూన్యంలో మండించడమంటే మాటలు కాదు. భారీ ట్యాంకుల్లో ఉండే ఈ రెండు వాయువులనూ శీతలీక రణ స్థితిలో ఉంచడానికి అనువుగా ఇంజిన్‌లోని పరికరాలనూ, పైపులనూ కూడా శీతల స్థితిలోనే ఉంచాలి. శాస్త్రవేత్తలకు ఇదంతా పెను సవాల్. మనపై ఆంక్షలు విధించిన అమెరికాకు దీటైన జవాబివ్వడంతోపాటు ఒకరిపై ఆధారపడే స్థితిని అధిగమించడానికీ, భారీ వ్యయాన్ని తగ్గించుకోవడానికీ ఈ సవాల్‌ను శాస్త్రవేత్తలు ఛేదించారు. రష్యా క్రయోజెనిక్ ఇంజన్ల వ్యయం దాదాపు రూ.100 కోట్లుకాగా, మన శాస్త్రవేత్తలు అదే ఇంజిన్‌ను స్వదేశీ పరిజ్ఞానంతో రూ.40 కోట్లకు రూపొందించగలిగారు. అంతరిక్ష పరిజ్ఞానంలో గుత్తాధిపత్యాన్ని నిలుపుకోవడానికి, వాణిజ్యపరంగా భారీ మొత్తాలను రాబట్టుకోవడానికి ఇన్నాళ్లూ అగ్ర రాజ్యాలు క్రయోజెనిక్ పరిజ్ఞానాన్ని ఎవరికీ అందనివ్వలేదు. ఉన్నతస్థాయి పరిశోధనలైనా, అందుకవసరమైన తెలివితేటలైనా తమకే సొంతమని అవి భావించాయి. కానీ, మన శాస్త్రవేత్తలు వారి భ్రమలను పటాపంచలు చేశారు. వారి గుత్తాధిపత్యాన్ని బద్దలు కొట్టారు. ఇదేమంత సులభంగా సమకూరలేదు. జీఎస్ఎల్వీ వైఫల్యాలు ఎదురైనప్పుడు మన శాస్త్రవేత్తలు ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. ఆఖరికి పీఎస్ఎల్వీ ప్రయోగాలు విజయవంతమైనప్పుడూ జీఎస్ఎల్వీ వైఫల్యాలను గుర్తుచేసినవారున్నారు. వాటి సంగతేమిటని ప్రశ్నించినవారున్నారు. కానీ, శాస్త్రవేత్తలు నిరాశచెందలేదు. అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఎన్నో అవరోధాలను ఎదుర్కొన్నాకే క్రయోజెనిక్ సాంకేతికతను సొంతం చేసుకోగలిగాయన్న ఎరుకతో పట్టుదలగా పనిచేశారు. ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. అదే ఈరోజు విజయాన్ని చేరువ చేసింది. మరో రెండేళ్లలో ప్రయోగించదలుచుకున్న చంద్రయాన్-2కు, అటు తర్వాత కాలంలో ప్రయోగించదలుచుకున్న మానవసహిత అంతరిక్ష వాహక నౌకకూ జీఎస్ఎల్వీ, అందులో వాడే క్రయోజెనిక్ పరిజ్ఞానం ముఖ్యమైనవి. ఆదివారంనాటి విజయం ఈ మార్గంలో మరిన్ని ముందడుగులు వేసేందుకు దోహదపడుతుంది. అందువల్లే ఈ విజయం ఎంతో అపురూపమైనది. అపూర్వమైనది. అందుకు మన శాస్త్రవేత్తలను అభినందించాలి.