పొదుపు, పెట్టుబడికి తేడా ఏంటి?
ఫైనాన్షియల్ బేసిక్స్
సంపదను కాపాడటం, దాన్ని అభివృద్ధి చేయడం ఒక కళ. ‘మీరు రూపాయి ఆదా చేస్తే రూపాయి సంపాదించినట్లే’ అనేది ఎన్నడో బెంజమిన్ ఫ్రాంక్లిన్ చెప్పిన మాట. మనలో చాలా మందికి డబ్బును ఆదా చేయాలని ఉంటుంది. డబ్బును రెండు మార్గాల్లో ఆదా చేయొచ్చు. ఒకటేమో సేవింగ్స్, రెండోది ఇన్వెస్ట్‌మెంట్స్. అసలు ముందు తెలియాల్సింది పొదుపునకు, పెట్టుబడికి తేడా. మిగులు సంపాదనను క్రమ పద్ధతిలో కూడబెడితే అది సేవింగ్స్. అదే మిగులు సంపాదనను అధిక రాబడిని అందించే సాధనాల్లో పెడితే అది ఇన్వెస్ట్‌మెంట్.
సేవింగ్స్ అంటే భద్రత!
సేవింగ్ అనేది చిన్న వయసు నుంచే అలవాటు కావాలి. ఇందుకు సాధారణంగా ఉపయోగించేది బ్యాంకు సేవింగ్స్ ఖాతానే. సేవింగ్స్ ముఖ్య లక్షణం భద్రత. దీన్లో రిస్క్ ఉండనే ఉండదు. అయితే పొదుపు చేసే డబ్బులో పెరుగుదల ఉండదు. ఉన్నా అది స్వల్పమే. పొదుపు చేయడం వల్ల పెద్దగా లాభం ఉండదు. అందుకని ఆ పొదుపును ఇన్వెస్ట్‌మెంట్‌గా తప్పక మార్చాలి.
పెట్టుబడి ముఖ్య లక్షణం సంపద సృష్టి
రేపటి జీవనం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాగాలంటే వచ్చే ఆదాయంలో మన ఖర్చులు మినహా మిగిలిన సంపదను పలు రకాల ఇన్వెస్ట్‌మెంట్ సాధనాల్లో పెట్టుబడిగా పెట్టాలి. అది మరింత సంపదనిస్తుంది. ఇన్వెస్ట్‌మెంట్స్‌ను స్టాక్‌మార్కెట్, బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్, బంగారం, కమోడిటీస్‌లో ఎక్కువగా చేస్తారు. ఇన్వెస్ట్‌మెంట్ అనేది మీ సంపాదన మొదలైన రోజు నుంచి ఆరంభమవ్వాలి. పెట్టుబడి ముఖ్య లక్షణం సంపద సృష్టి. ఈ సంపద పిల్లల కాలేజీ ఫీజులు, పెళ్లిళ్లు, సెలవుల్లో సరదాగా గడపడం, మంచి జీవన ప్రమాణానికి, రిటైర్మెంట్ తర్వాత జీవితం సాఫీగా గడపటానికి ఇలా అన్నిటికీ ఉపయోగపడుతుంది. పెట్టుబడి వల్ల వచ్చే రాబడి పెరుగుతున్న ద్రవ్యోల్బణం కన్నా అధికంగా ఉండాలి. ఇన్వెస్ట్‌మెంట్స్‌లో రిస్క్ ఉంటుంది. రిస్క్ లేకుండా రాబడిని పొందలేమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
రికవరీ దిశగా బంగారం ధర
దేశీయంగా బంగారం ధర రూ.26,000పైన స్థిరపడింది. గతవారం ప్రారంభం నుంచి తగ్గుతూ వస్తున్న బంగారం ధర వారాంతానికి వచ్చేసరికీ అంతర్జాతీయ పరిస్థితులు సానుకూలంగా మారడం, దేశీ రిటైలర్ల నుంచి డిమాండ్ పెరగడం, పండుగ సీజన్ వంటి అంశాల కారణంగా కొద్దిగా కోలుకుంది. గతవారం బంగారం ధర బాగా ఒడిదుడుకులకు లోనయింది. ముంబైలో 10 గ్రాముల 99.9 స్వచ్ఛత బంగారం ధర ఒకానొక సందర్భంలో రూ.25,930 కనిష్ట స్థాయికి పతనమై చివరకు రూ.26,380 వద్ద ముగిసింది. ఇది కడపటి వారం ముగింపు ధర రూ.26,755తో పోలిస్తే రూ.375 తక్కువ. అలాగే 10 గ్రాముల 99.5 స్వచ్ఛత బంగారం ధర కూడా రూ.25,780 వరకు పడి చివరకు రూ.26,230 వద్ద స్థిరపడింది. ఈ ధర కూడా కడపటి వారపు ముగింపు ధర రూ.26,605తో పోలిస్తే రూ.375 తక్కువ. ఇక అంతర్జాతీయంగా న్యూయార్క్ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 1,137 డాలర్లుగా ఉంది.