వేకువజామునే నిద్రలేచేవాళ్లు ఆరోగ్యవంతులు, సంపన్నవంతులు, వివేకవంతులు అవుతారు... అన్నారు బెంజిమన్ ఫ్రాంక్లిన్. అయితే ఇలాంటి వాక్యాలను ఎన్ని సార్లు విన్నా.. పాటించాల్సి వచ్చేసరికి బద్ధకం ఆవహించేస్తుంటుంది. మరి వివేకవంతులుగా, సంపన్నవంతులుగా ఇప్పటికే ఎదిగిన వారి తీరు ఎలా ఉంటుంది అంటే... అలాంటి వాళ్లలో చాలా మంది నిద్రపోతూ సూర్యుడికి పట్టుబడటం లేదు. బ్రహ్మీముహూర్తంలోనే నిద్రలేచి తమ పనులకు ఉపక్రమిస్తున్నారు. అలాంటి వారిలో కొందరు ప్రముఖులు...
టిమ్ కుక్
ఈ ప్రపంచంలో ఐఫోన్ వినియోగదారులు అనే ప్రత్యేక జాతిని సృష్టించగలిగిన యాపిల్ సంస్థ సీఈవో స్థానంలో ఉన్న టిమ్ కుక్ తెల్లవారుజామున నాలుగున్నరకే కంప్యూటర్ ముందు కూర్చుంటారట. కంపెనీకి సంబంధించిన మెయిల్స్‌ను పర్యవేక్షిస్తూ తన పనిని మొదలు పెడతానని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
రిచర్డ్ బ్రాసన్
ఈయన వర్జిన్ గ్రూప్ చైర్మన్ మాత్రమే కాదు... మంచి ఫిజిక్‌తో లేటు వయసులో హాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్న వ్యక్తి కూడా. సినిమాలపై ఎనలేని ఆసక్తికలిగిన బ్రాసన్ సూర్యోదయానికి ముందే నిద్రలేచి వ్యాయామం చేస్తానని, తర్వాత దైనందిన కార్యక్రమాలపై దృష్టిసారిస్తానని చెబుతారు.
ఇంద్రనూయి
పెప్సీ సీఈవోగా ఉన్న ఇంద్రనూయి శరీర అవసరానికి మించి నిద్రపోవడానికి మించిన సోమరితనం లేదంటారు. దేవుడు మనకు బహుమతిగా ఇచ్చిన నిద్రను సకాలంలో ఉపయోగించుకోవాలి అని నూయి అంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వేకువజామున నాలుగింటికి ఆమె నిద్రలేస్తారట.
సుశీల్ కుమార్
ఒలింపిక్ మెడలిస్ట్‌గా ప్రపంచ ప్రఖ్యాతిని సాధించిన ఈ మల్లయోధుడి జీవనశైలిలో ఎలాంటి మార్పులూ లేవు. తను పుట్టి పెరిగిన పరిసరాల్లోనే ఇప్పటికీ ఉంటున్న సుశీల్ క్రమశిక్షణ విషయంలో కూడా నో రాజీ. ఉదయం నాలుగింటికే నిద్రలేచి కోచ్ సూచనల ప్రకారం కసరత్తు మొదలు పెట్టడమే.
అక్షయ్ కుమార్
ఈ యాక్షన్ హీరో దినచర్య ఉదయం నాలుగున్నరకే మొదలవుతుంది. ఈ విషయాన్ని చాలా గర్వంగా చెప్పుకుంటాడు అక్షయ్. మరీ అర్ధరాత్రుళ్లు దాటే వరకూ షూటింగ్‌లు ఉంటే తెల్లవారు జామునే లేవలేకపోయినందుకు అక్షయ్ బాధపడతారట. వేకువనే నిద్రలేచిన రోజు కొత్త ఆత్మవిశ్వాసం తోడవుతుందని ఈ బాలీవుడ్‌హీరో చెబుతారు.
సూర్యుడిని నిద్రలేపుతారు...!
Published Sun, Sep 14 2014 2:55 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
Advertisement
Advertisement