ఆంధ్రాకు అందలం.. సీమకు అంధకారమా?
ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన బెరైడ్డి
నగరంలో సీమ జనచైతన్యయాత్ర
కర్నూలు (న్యూసిటి): రాష్ట్ర విభజన తర్వాత సీఎం చంద్రబాబు ఆంధ్రాను అన్ని విధాలా అభివృద్ధి చేస్తూ రాయలసీమను అంధకారంలోకి నెడుతున్నారని రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బెరైడ్డి రాజశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. రాయలసీమ చైతన్య యాత్రలో భాగంగా బెరైడ్డి బుధవారం నగరంలో పర్యటించారు. కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగా రోడ్‌షోలో ఆయన మాట్లాడుతూ రాయలసీమ అభివృద్ధిపై సీఎం నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. బడ్జెట్ కేటాయింపులో కూడా సీమకు మొండి చేయి చూపారన్నారు. ఒకప్పుడు కర్నూలు కేంద్రంగా ఉన్నా రాజధానిని హైదరాబాద్‌కు త రలించారని, విభజన కారణంగా రాజధాని ఏర్పాటు అనివార్యమైనా కర్నూలును విస్మరించారన్నారు. రాయలసీమ వాసులను అంటరాని వాళ్లుగా చూస్తున్నారని, ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఆరుగాలం శ్రమించి పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పట్టిసీమ ద్వారా కృష్ణా జిల్లాకు నీరు అందుతుంది తప్ప రాయలసీమ ప్రాంతానికి కాదని, ఈ విషయాన్ని సీమ వాసులు గుర్తుంచుకోవాలన్నారు. ప్రత్యేక రాయలసీమ తప్ప ఈ ప్రాంత వాసులకు వేరే మార్గం లేదని, ఇందుకోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు.