Bernie Ecclestone
-
ఎకిల్‌స్టోన్ ఓ అజ్ఞాని: హామిల్టన్
పారిస్: ‘తెల్లవారికంటే నల్లవారే ఎక్కువగా జాతి వివక్షను ప్రదర్శిస్తారు’ అంటూ ఫార్ములావన్ (ఎఫ్1) మాజీ చీఫ్ బెర్నీ ఎకిల్‌స్టోన్ చేసిన వ్యాఖ్యలపై వరల్డ్ చాంపియన్ లూయిస్ హామిల్టన్ మండి పడ్డాడు. అతను ఒక అజ్ఞాని అంటూ తీవ్రంగా విమర్శించాడు. ఇటీవలి జాతి వివక్ష నేపథ్యంలో అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ ఎకిల్‌స్టోన్... ‘ఈ వివాదం ప్రభావం ఫార్ములావన్‌పై ఏ రకంగానూ ఉండదు. అయితే అందరూ ఆలోచించే తీరు మాత్రం మారుతుంది. తెల్లవారైనా, నల్లవారైనా అవతలి వారి గురించి తప్పుగానే ఆలోచిస్తారు. ఇంకా చెప్పాలంటే నల్లజాతివారే ఎక్కువగా జాతి వివక్షను ప్రదర్శిస్తారు. దీనికి నేను రుజువులు చూపించలేనుగానీ ఇన్నేళ్లుగా నాకు అలాగే అనిపించింది’ అన్నాడు. 89 ఏళ్ల ఎకిల్‌స్టోన్ వ్యాఖ్యలు హామిల్టన్‌కు ఆగ్రహం తెప్పించాయి. దాంతో అతను కూడా ఎదురుదాడికి దిగాడు. ‘బెర్నీ ఆటకు దూరమై చాలా కాలమైంది. అతను పాత తరానికి చెందినవాడు. అయితే ఏమీ తెలియని ఇలాంటి అజ్ఞానులు చేసే వ్యాఖ్యలు చూస్తుంటేనే జాతి వివక్ష విషయంలో అంతరాలు తొలగించడం ఎంత కష్టమో అర్థమవుతుంది. సుదీర్ఘ కాలం ఒక క్రీడకు పరిపాలకుడిగా వ్యవహరించిన వ్యక్తికి దిగువ స్థాయిలో తీవ్రంగా ఉన్న సమస్య గురించి ఇలాంటి అవగాహన ఉంటే అతని వద్ద ఇన్నేళ్లుగా పని చేసినవారి ఆలోచనలు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు’ అని వ్యాఖ్యానించాడు. మరోవైపు ఎఫ్1 మేనేజ్మెంట్ మాత్రం ఎకిల్‌స్టోన్ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని, ప్రస్తుతం ఆయన ఏ హోదాలో లేరని స్పష్టం చేసింది. -
ఎఫ్–1 సీజన్ రద్దు చేయాలి
లండన్: ఈ సీజన్ ఫార్ములావన్ (ఎఫ్1) చాంపియన్‌షిప్‌ను రద్దు చేయాలని ఫార్ములావన్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బెర్నీ ఎకిల్‌స్టోన్ అన్నారు. షెడ్యూల్ ప్రకారం ఇప్పటివరకు జరగాల్సిన 8 రేసులు కరోనా కారణంగా వాయిదా పడటమో, రద్దు కావడమో జరిగాయి. తదుపరి రేసులు కూడా అనుకున్న సమయానికి జరిగే పరిస్థితులు లేకపోవడంతో మాజీ బాస్ మిగతా 14 రేసుల్ని కూడా నిలిపివేసి వచ్చే ఏడాది తాజాగా సీజన్‌ను ప్రారంభించాలని అభిప్రాయపడ్డారు. ‘ఈ ఏడాది చాంపియన్‌షిప్ నిర్వహణను ఆపేయాలి. వచ్చే సీజన్‌ను తాజాగా ప్రారంభిస్తే మంచిది. ఎందుకంటే ఈ సీజన్లో చాంపియన్‌షిప్ టైటిల్ గెలుపొందడానికి అవసరమైన రేసుల్ని నిర్వహించే పరిస్థితులు కనిపించడం లేదు. కనీసం 8 రేసులు జరిగితే ఆ చాంపియన్‌షిప్‌కు విలువ ఉంటుంది. కానీ ఈ విపత్కర పరిస్థితుల్లో అది జరిగేలా అనిపించడం లేదు’ అని ఎకిల్‌స్టోన్ పేర్కొన్నారు. కరోనా కారణంగా రేసులన్నీ రద్దుకావడంతో షుమాకర్ పేరిట ఉన్న ఏడు ‘డ్రైవర్స్ చాంపియన్‌షిప్’ టైటిళ్ల రికార్డును సమం చేసేందుకు లూయిస్ హామిల్టన్‌కు మరింత కాలం వేచి చూడాల్సి రావొచ్చు. ప్రస్తుతం హామిల్టన్ ఖాతాలో 6 టైటిళ్లు ఉన్నాయి. -
89 ఏళ్ల వయస్సులో...
లండన్: కోవిడ్–19 మహమ్మారి వల్ల గత కొన్నిరోజులుగా అన్ని దుర్వార్తలే వింటున్న నేపథ్యంలో ‘ఫార్ములావన్’ మాజీ చీఫ్ ఎకిల్‌స్టోన్ నుంచి ఓ శుభవార్త వచ్చింది. 1978 నుంచి 2017 వరకు ఫార్ములావన్‌కు సీఈఓగా ఉన్న ఆయన త్వరలోనే తండ్రి కాబోతున్నాడు. మామూలుగా అయితే ఎవరైనా తండ్రి కావడం సాధారణ విషయమే. కానీ ఎకిల్‌స్టోన్‌కు ఇప్పుడు 89 ఏళ్లు! అదే ఈ వార్తకున్న విశేషం! ఆయనకు లేటు వయసులోనూ నాన్నయ్యే ‘ఫార్ములా’ పంట పండింది. ఎకిల్‌స్టోన్ మూడో భార్య 44 ఏళ్ల ఫాబియానా ఫ్లోసి ఈ జూలైలో తన వృద్ధండ పెనిమిటికి వారసుణ్ని బహుమతిగా ఇవ్వనుంది. వైద్య పరీక్షల్లో ఆమెకు కలిగే సంతానం మగ శిశువని తేలింది. ఈ వార్త తెలిసినప్పటి నుంచి తన భార్య తెగ సంబరపడుతున్నట్లు ఎకిల్‌స్టోన్ తెలిపారు. తమ ఇద్దరి మధ్య వయసురీత్యా చాలా వ్యత్యాసం ఉండటంతో ఈ వార్తను ఊహించలేదన్నారు. ఎకిల్‌స్టోన్‌కు తన మాజీ ఇద్దరు భార్యల ద్వారా ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. ఇక తాజా వైరస్ మరణమృదంగంపై ఆయన స్పందిస్తూ ‘మొ దట్లో ఏంటీ నాన్సెన్స్ అనుకున్నా. ఫ్లూ గురించి ఎప్పుడూ వినేదే! యేటా ఓ సీజన్‌లా వచ్చిపోయేదే అని భావించా... కానీ ఇది చాలా ప్రమాదకరంగా తయారైంది’ అని కరోనాపై వ్యాఖ్యానించారు. -
రూ.30 వేల కోట్లకు ఎఫ్1 అమ్మకం
లండన్: మోటార్ కార్ రేసింగ్‌లో అత్యంత ఆదరణ పొందిన ఫార్ములావన్ చేతులు మారింది. అమెరికాకు చెందిన లిబర్టీ మీడియా కార్పొరేషన్ ఏకంగా 4.4 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.30 వేల కోట్లు)కు కొనుగోలు చేసింది. దీంతో ఇన్నాళ్లుగా ఈ డీల్‌పై కొనసాగుతున్న అనిశ్చితికి 75 ఏళ్ల బిజినెస్ టైకూన్ జాన్ మలోన్ తెర దించారు. వచ్చే ఏడాది మార్చి వరకు ఈ ఒప్పంద ప్రక్రియ పూర్తవుతుంది. అయితే ఇప్పటిదాకా ఫార్ములావన్ గ్రూప్‌ను తన అదుపులో ఉంచుకుని సీఈవోగా వ్యవహరిస్తున్న బెర్నీ ఎకెల్‌స్టోన్ అదే పదవిలో కొనసాగనున్నారు. కొత్త చైర్మన్ చేజ్ క్యారీ ఆధ్వర్యంలో ఆయన పనిచేయాల్సి ఉంటుంది. -
అత్తను కిడ్నాప్ చేసి 250 కోట్లు డిమాండ్!
ఫార్ములా వన్ టైకూన్ అయిన బెర్నీ ఎస్సెల్స్టోన్కు భారీ షాక్ తగలింది. ఆయన అత్తయ్యను గ్యాంగ్స్టర్స్ బ్రెజిల్లో కిడ్నాప్ చేశారు. 28మిలియన్ పౌండ్లు పరిహారం చెల్లిస్తేనే ఆమెను విడుదల చేస్తామని గ్యాంగ్స్టర్స్ కుటుంసభ్యులకు వర్తమానం పంపారు. టైకూన్ బ్రెజిలియన్ భార్య ఫాబియాన ఫ్లోసి తల్లి అపరిషిదా షుంక్ (67)ను సావో పాలోలోని ఆమె ఇంటి బయట గ్యాంగ్స్టర్లు కిడ్నాప్ చేశారు. ఈ కిడ్నాప్ మిస్టరీని ఛేదించేందుకు మరోవైపు బ్రెజిల్ పోలీసులు కూడా రంగంలోకి దిగినట్టు తెలిసింది. బిలియనీర్ అయిన 89 ఏళ్ల బెర్నీ లేటు వయస్సులో 38 ఏళ్ల ఫాబియాన ఫ్లోసిని పెళ్లి చేసుకున్నాడు. 2009లో బ్రెజిలియన్ గ్రాండ్ ప్రిక్స్ సందర్భంగా వీరు తొలిసారి కలుసుకున్నారు. అప్పుట్లో ఫ్లోసి బ్రెజిల్ ఫార్ములా వన్ డైరెక్టర్‌గా ఉండేది. కొంతకాలానికి వీరి మధ్య ప్రేమ చిగురించింది. బ్రిటన్‌లోనే నాలుగో అత్యంత సంపన్నుడిగా పేరొందిన బెర్నీ అంగరంగ వైభవంగా ఫాబియానను పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ జంట లండన్‌లో నివసిస్తోంది. -
నిర్ణయం జేపీ గ్రూప్‌దే!
ఇండియన్ గ్రాండ్‌ప్రిపై ఎకెల్‌స్టోన్ వ్యాఖ్య న్యూఢిల్లీ : వచ్చే ఏడాది ఇండియన్ గ్రాండ్ ప్రి జరగడం రేస్ ప్రమోటర్ జేపీ గ్రూప్‌పైనే ఆధారపడి ఉందని ఎఫ్-1 చీఫ్ బెర్నీ ఎకెల్‌స్టోన్ అన్నారు. ఈ విషయం తేల్చుకోవడానికి వాళ్లకు చాలా తక్కువ సమయం ఉందని స్పష్టం చేశారు. ఓవరాల్‌గా జేపీ గ్రూప్ స్పందన కోసం తాము వేచి చూస్తున్నామని చెప్పిన ఆయన భారత్‌లో రేసు జరిగితే బాగుంటుందన్నారు. ‘దాదాపు ఆరు నెలల తర్వాత జేపీఎస్ఐ చీఫ్ సమీర్ గౌర్తో జరిగిన చర్చలు ఫలవంతంగా ముగిశాయి. 2016లో రేసు నిర్వహణ కోసం కసరత్తులు చేస్తున్నారు. రష్యా గ్రాండ్ ప్రి సందర్భంగా జరిగిన చర్చల్లో కూడా సానుకూలాంశాలే కనిపించాయి. కాబట్టి ఇండియన్ గ్రాండ్ ప్రి జరుగుతుందని నమ్ముతున్నా’ అని ఎకెల్‌స్టోన్ పేర్కొన్నారు.