లండన్: ఈ సీజన్ ఫార్ములావన్ (ఎఫ్1) చాంపియన్‌షిప్‌ను రద్దు చేయాలని ఫార్ములావన్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బెర్నీ ఎకిల్‌స్టోన్ అన్నారు. షెడ్యూల్ ప్రకారం ఇప్పటివరకు జరగాల్సిన 8 రేసులు కరోనా కారణంగా వాయిదా పడటమో, రద్దు కావడమో జరిగాయి. తదుపరి రేసులు కూడా అనుకున్న సమయానికి జరిగే పరిస్థితులు లేకపోవడంతో మాజీ బాస్ మిగతా 14 రేసుల్ని కూడా నిలిపివేసి వచ్చే ఏడాది తాజాగా సీజన్‌ను ప్రారంభించాలని అభిప్రాయపడ్డారు. ‘ఈ ఏడాది చాంపియన్‌షిప్ నిర్వహణను ఆపేయాలి. వచ్చే సీజన్‌ను తాజాగా ప్రారంభిస్తే మంచిది. ఎందుకంటే ఈ సీజన్‌లో చాంపియన్‌షిప్ టైటిల్ గెలుపొందడానికి అవసరమైన రేసుల్ని నిర్వహించే పరిస్థితులు కనిపించడం లేదు. కనీసం 8 రేసులు జరిగితే ఆ చాంపియన్‌షిప్‌కు విలువ ఉంటుంది. కానీ ఈ విపత్కర పరిస్థితుల్లో అది జరిగేలా అనిపించడం లేదు’ అని ఎకిల్‌స్టోన్ పేర్కొన్నారు. కరోనా కారణంగా రేసులన్నీ రద్దుకావడంతో షుమాకర్ పేరిట ఉన్న ఏడు ‘డ్రైవర్స్ చాంపియన్‌షిప్’ టైటిళ్ల రికార్డును సమం చేసేందుకు లూయిస్ హామిల్టన్‌కు మరింత కాలం వేచి చూడాల్సి రావొచ్చు. ప్రస్తుతం హామిల్టన్ ఖాతాలో 6 టైటిళ్లు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment