best 5 books
-
నాకు నచ్చిన ఐదు పుస్తకాలు
♦ కెయిన్ (జోసే సారమాగో) పోర్చుగీస్ రచయిత సారమాగో రాసిన చివరి నవల. ఈయన రాసిన ద గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ నవలకు కొనసాగింపులా ఉంటుంది. ఆడమ్, ఈవ్లకు పుట్టిన ఇద్దరు బిడ్డలు– కెయిన్, ఎబెల్ – వ్యవసాయం, పశుపాలన చేసి తమ ఉత్పత్తులను దేవుడికి త్యాగం చేస్తారు. కాని, దేవుడు ఎబెల్ త్యాగాన్ని మాత్రమే స్వీకరిస్తాడు. అసూయతో కెయిన్ ఎబెల్ను చంపేస్తాడు. దేవుడు కెయిన్ను దేశదిమ్మరి కమ్మని శపిస్తాడు. సారమాగో నవల ఇక్కడ మొదలవుతుంది. బైబిల్ పాతనిబంధనలో ‘ఐదు పుస్తకాలు’గా ప్రసిద్ధి చెందిన వాటిలోని సంఘటనలలో కెయిన్ను పాత్రధారిని చేసి నడిపిస్తూ ఒక కొత్త చరిత్ర రాస్తాడు సారమాగో. ఆ నిబంధనలను చర్చిస్తూనే దేవుడిని మరింతగా ఎందుకు ద్వేషించాలో కెయిన్ ద్వారా చెప్పిస్తాడు. ఆ రకంగా మంచి, చెడు, నైతికత వంటి వాటిపై మతం ఇచ్చిన నిర్వచనాలను నిశితంగా విమర్శిస్తాడు. ♦ ద ఫాల్ (ఆల్బేర్ కామూ) ఇదీ కామూ చివరి నవలే. నవల అంతానూ క్లమెన్స్ ఒక బార్లో కలిసిన ఒక అపరిచితుడితో మాట్లాడ్డం – ఒక సంజాయిషీ చెప్పుకుంటున్నట్టు – గానే ఉంటుంది. కథనం ద్వితీయ పురుషలో సాగుతుంది. ఆ అపరిచితు డు ఒక్క మాట కూడా మాట్లాడడు. తనను తాను పరిచయం చేసుకుంటూ, ఆ అపరిచితునితో పోల్చుకుంటూ క్లమెన్స్ మాటలు మొదలు పెడతాడు మొదట కొన్ని నిజాలు దాస్తూ. ఒక గొప్ప న్యాయవాదిగా ఉండటం నుంచి ప్రస్తుతం అమ్స్టర్డామ్ బారులో ఇలా ఉండటానికి మధ్య కథంతా చెప్తాడు. నిదానంగా ఒక్కొక్క పొర తొలిగిపోతుంటుంది. క్లమెన్స్ అసలు స్వభావం, స్వరూపం బయటకొస్తుంటాయి. నవల పూర్తయ్యేసరికి కథనంతో పాటూ తత్వవేత్త కామూ అస్తిత్వం గురించీ, జీవితం అర్థం గురించీ ఆలోచించక తప్పని ప్రశ్నలు మనముందుంచుతాడు. ♦ ఇన్ ఈవిల్ అవర్ (గాబ్రియేల్ గార్సియా మార్కేజ్) ఈ నవలను మార్కేజ్ మొదటిదిగా పరిగణిస్తారు (కాకున్నా). కొలంబియా చరిత్రలో ‘ల వయొలెన్చియా’గా పేరు తెచ్చుకున్న కల్లోలిత దశకం 1950లలోని కథాకాలం. జడివానలో తెరపిలా శాంతి సమయం. అస్థిమితపరిచే ఒక తాత్కాలిక సంధికాలం. కొండలలో నది కానుకుని ఉన్న ఒక ఊరు. వానలు, వరదలు, శవాలు. ఊరిలో ప్రతీరాత్రి ఆ ఊరి ప్రజల చీకటి బ్రతుకుల గురించి చాటిస్తూ వెలువడే పోస్టర్లు. అవి కేవలం పుకార్లనే అనుకుంటారు అవి ఒక హత్యకు దారి తీసేదాకా. వెంటనే ఆ ఊరి మేయర్ మార్షల్ లా ప్రకటిస్తాడు. రాజ్యశత్రువులతోపాటు తన శత్రువులనూ మాయం చేయడం కోసం. మేయర్, బార్బర్, డెంటిస్ట్, ప్రీస్ట్ – నియంతృత్వం, తిరుగుబాటు, మతం నవలంతా వానముసురులా పరుచుకునుంటాయి. ♦ ద కాసిల్ ఆఫ్ క్రాస్డ్ డెస్టినీస్ (ఇటాలో కాల్వీనో) కథాంశాల్లో, కథనరీతుల్లో కాల్వీనో చూపించిన ప్రతిభ అనితరసాధ్యం. ఒక అడవిలో ప్రమాదాలు నిండిన సుదీర్ఘ ప్రయాణం తర్వాత డస్సిపోయిన యాత్రికులు కొందరు ఒక చోట కలుసుకుంటారు. తింటూ తాగుతూ తమ తమ అనుభవాలు కథలుగా చెప్పుకోబోతారు. కాని ఆశ్చర్యంగా ఎవరికీ నోట మాట రాదు. చివరికి జోస్యం చెప్పేవారు వాడే బొమ్మల చీట్లపేక ముక్కల సహాయంతో అడవిలో తమకు ఏం జరిగిందో చెప్పడానికి ప్రయత్నిస్తారు. ఆ ముక్కల్లోని బొమ్మలు చెప్పే అర్థాలలో వారి జీవితాలన్నీ ఒకరితోవొకరివి పెనవేసుకున్నాయని తెలుస్తుంది. వారు టేబుల్ మీద పరుస్తున్న ఆ పేకముక్క బొమ్మల నుంచి వారి కథను నరేటర్ జ్యోతిష్యుడిలానే మనకు అల్లుతుంటాడు. ♦ ఏన్ ఇమాజినరీ లైఫ్ (డేవిడ్ మలూఫ్) మహాకవి ఓవిడ్ రోమన్ మహాసామ్రాజ్యపు సాంస్కృతిక చిహ్నంగా నిలిచి పోవలసినవాడు, చివరి దశలో రోమునుంచి వెళ్ళగొట్టబడతాడు అగస్టస్ చక్రవర్తి చేత, ప్రపంచపు ఒక మారుమూలకు. అక్కడ ఈ మహాకవి భాష లాటిన్ ఎవరికీ రాదు. ఆ ప్రాంతం మొరటు, ఆ ఆటవికుల భాష మొరటు. ఓవిడ్ ఎవరూ లేక తనతో తనే మాట్లాడుకుంటాడు. నిదానంగా తోడేళ్ళతో పెంచబడిన ఒక పిల్లవాడితో స్నేహం పెంచుకుంటాడు. ఆ భాష నేర్చుకోడానికి కూడా ప్రయత్నిస్తాడు. లాటిన్లా పరిష్కరించబడినది కాని ఆ భాషలో స్వేచ్ఛకు పదం ఉండదు. ఎందుకంటే ఏదీ సర్వస్వతంత్రం కాదు కాబట్టి. అలానే విడదీయడానికి పదాలు లేవనీ, బంధాలు కలిపే పదాలు మాత్రమే ఉన్నాయనీ గ్రహిస్తాడు. మెటమార్ఫసిస్ రాసిన ఓవిడ్ మలూఫ్ చేతిలో తనే మెటామార్ఫోజ్ అవుతాడు. చివరికి ఆ పిల్లవాడి చేతుల్లోనే మరణిస్తాడు ఒక కొత్త దృక్పథంతో. వ్యాసకర్త... -మాధవ్ మాచవరపు -
నాకు నచ్చిన 5 పుస్తకాలు
హకల్బెరీ ఫిన్: మార్క్ ట్వేన్ ‘టామ్ సాయర్’, ‘హకల్బెరీ ఫిన్, ‘విచిత్ర వ్యక్తి’ నవలలను తెలుగులోకి అనువదించినవారు నండూరి రామ్మోహనరావు. ఆయన ఆ పని యెంత ప్రతిభావంతంగా చేశారంటే అనువాదం చదువుతున్నట్టుండదు, ఒరిజినల్ ఎలావుందో చూడాలనిపించదూ. పది, పన్నెండేళ్ల పిల్లవాడు మిసిసిపీ నదిపై చిన్న పడవపై చేసే ప్రయాణానుభవాలే ‘హకల్బెరీ ఫిన్’. అతనితో పాటు స్వేచ్ఛను కోరుతూ జిమ్ అనే నీగ్రో నౌకరు కూడా ప్రయాణిస్తూ వుంటాడు. వారిద్దరి మధ్యా యేర్పడిన అనుబంధాన్ని వివరిస్తూ, మానవ స్వభావంలోని కపటత్వాన్ని వెక్కిరిస్తూ, మత ఛాందసాన్ని దుయ్యబడుతూ, బానిసత్వాన్ని నిరసిస్తూ హాస్యస్ఫోరకంగా మార్క్ ట్వేన్ రాసిన విధానం పుస్తకాన్ని కిందపెట్టనివ్వకుండా చదివిస్తుంది. నేను చిన్నప్పుడు చదివిన యీ పుస్తకాన్ని ఇప్పటికీ తీసి మళ్లీ మళ్లీ చదివి ఆనందిస్తూ వుంటాను. ద వుమన్ ఆఫ్ రోమ్: 1940 ప్రాంతాలలో వెలువడిన ఈ పుస్తక రచయిత ఆల్బర్ట్ మొరావియా ఇటలీ దేశస్థుడు. మొదటి సారి ఈ నవల చదువుతున్నపుడు నేను ఆశ్చర్యానికి గురయ్యాను. పాత్రల స్వభావాలనూ, వారి ఆలోచనలనూ ధైర్యంగా, నిర్మొహమాటంగా, నిస్సిగ్గుగా రచయిత చిత్రీకరించిన తీరు విప్లవాత్మకమయినది. ముఖ్యంగా స్త్రీ పాత్రలను చిత్రీకరించిన తీరు చూస్తే అతను వారిని పరిశీలించి కాదు, వారి ఆత్మలను దర్శించి రాశాడు అనిపిస్తుంది. అందరు ఆడపిల్లల్లాగే ఎన్నో కలలు కంటూ యవ్వనంలో అడుగుపెట్టిన వొక యువతి జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందీ, చివరికామె వొక వేశ్యగా మారటానికి దారితీసిన పరిస్థితులూ రాసిన విధానం అనుపమానం. దువ్వూరి వెంకట రమణశాస్త్రి స్వీయచరిత్ర: ఇది చదివితే తెలుగు భాషలోని రుచితో పాటు వొకప్పటి తెలుగు ప్రజల జీవితాలలోని రుచీ తెలుస్తుంది. శాస్త్రిగారు తెలుగు, సంస్కృతం చదివిన పండితులు. తన కెదురయిన వింత అనుభవాలూ, విశేషాలూ, ఆనాటి మనుషుల మనస్తత్వాలూ, మమతలూ, చిట్టి పొట్టి కథలుగా చెప్పిన విధానం పుస్తకాన్ని వదలకుండా చదివిస్తుంది. దీక్షితులు గారికి చలం లేఖలు: తెలుగులో లేఖా సాహిత్యంలో చలానిది ప్రత్యేక స్థానం. ప్రముఖులు కాని వాళ్లకు కూడా ఆయన వుత్తరాలు రాశారు. చలం నా అభిమాన రచయితయినా, ఆయన రాసినవన్నీ నాకిష్టమే అయినా ఈ పుస్తకమంటే ప్రత్యేకాభిమానం. చలం స్త్రీనే కాదు, ఒక పురుషుడిని కూడా ఎంతగా ప్రేమించీ అభిమానించీ గౌరవించీ పలవరిస్తాడో యీ పుస్తకం చదివితే తెలుస్తుంది. ఒక మనిషిని వేరొక మనిషి జెండర్ స్పృహ లేకుండా ఇంత అభిమానించవచ్చా అని ఆశ్చర్యంగానూ, చలం అభిమానాన్ని అంతగా పొందిన దీక్షితులుగారిని తలుచుకుని అసూయగానూ అనిపిస్తుంది యీ పుస్తకం చదివితే. అనుక్షణికం: తెలుగు సాహిత్యంలో నూతనత్వానికి తెరతీసిన వ్యక్తి చండీదాస్. భాషనుపయోగించే తీరుగానీ, భావాలను వ్యక్తీకరించే తీరుగానీ అంతా కొత్తే. బుచ్చిబాబును తన అభిమాన రచయితగా చెప్పుకున్నా, అక్కడక్కడా ఆయన ప్రభావం తొంగిచూసినా ఈయన ధోరణి ఈయనదే. ‘అనుక్షణికం’లో తీసుకున్న కాన్వాస్ చాలా పెద్దది. అనేక పాత్రలు వచ్చిపోతుంటాయి. 1970–80 ప్రాంతాలలోని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జీవిత శకలాన్ని కళ్లముందుంచారు. నిష్పక్షపాతంగా రకరకాల పాత్రలనీ, వారి కుటుంబ, కుల నేపథ్యంతో సహా ఆవిష్కరించిన తీరు అనితర సాధ్యం. ఒక్క స్వప్నరాగలీన తప్ప మిగతా పాత్రలన్నీ మనం రోజువారీ చూసే వ్యక్తులే అనిపించడం ఈ నవల ప్రత్యేకత. (rbhargavi17@gmail.com) డాక్టర్ భార్గవి