నాకు నచ్చిన ఐదు పుస్తకాలు  | Madhav Machavaram says I liked five books | Sakshi
Sakshi News home page

నాకు నచ్చిన ఐదు పుస్తకాలు 

Published Mon, Oct 30 2017 1:50 AM | Last Updated on Mon, Nov 13 2017 12:28 PM

Madhav Machavaram says I liked five books

♦ కెయిన్‌ (జోసే సారమాగో)
పోర్చుగీస్‌ రచయిత సారమాగో రాసిన చివరి నవల. ఈయన రాసిన ద గాస్పెల్‌ ఆఫ్‌ జీసస్‌ క్రైస్ట్‌ నవలకు కొనసాగింపులా ఉంటుంది. ఆడమ్, ఈవ్‌లకు పుట్టిన ఇద్దరు బిడ్డలు– కెయిన్, ఎబెల్‌ – వ్యవసాయం, పశుపాలన చేసి తమ ఉత్పత్తులను దేవుడికి త్యాగం చేస్తారు. కాని, దేవుడు ఎబెల్‌ త్యాగాన్ని మాత్రమే స్వీకరిస్తాడు. అసూయతో కెయిన్‌ ఎబెల్‌ను చంపేస్తాడు. దేవుడు కెయిన్‌ను దేశదిమ్మరి కమ్మని శపిస్తాడు. సారమాగో నవల ఇక్కడ మొదలవుతుంది. బైబిల్‌ పాతనిబంధనలో ‘ఐదు పుస్తకాలు’గా ప్రసిద్ధి చెందిన వాటిలోని సంఘటనలలో కెయిన్‌ను పాత్రధారిని చేసి నడిపిస్తూ ఒక కొత్త చరిత్ర రాస్తాడు సారమాగో. ఆ నిబంధనలను చర్చిస్తూనే దేవుడిని మరింతగా ఎందుకు ద్వేషించాలో కెయిన్‌ ద్వారా చెప్పిస్తాడు. ఆ రకంగా మంచి, చెడు, నైతికత వంటి వాటిపై మతం ఇచ్చిన నిర్వచనాలను నిశితంగా విమర్శిస్తాడు.

♦ ద ఫాల్‌ (ఆల్బేర్‌ కామూ)
ఇదీ కామూ చివరి నవలే. నవల అంతానూ క్లమెన్స్‌ ఒక బార్‌లో కలిసిన ఒక అపరిచితుడితో మాట్లాడ్డం – ఒక సంజాయిషీ చెప్పుకుంటున్నట్టు – గానే ఉంటుంది. కథనం ద్వితీయ పురుషలో సాగుతుంది. ఆ అపరిచితు డు ఒక్క మాట కూడా మాట్లాడడు. తనను తాను పరిచయం చేసుకుంటూ, ఆ అపరిచితునితో పోల్చుకుంటూ క్లమెన్స్‌ మాటలు మొదలు పెడతాడు మొదట కొన్ని నిజాలు దాస్తూ. ఒక గొప్ప న్యాయవాదిగా ఉండటం నుంచి ప్రస్తుతం అమ్‌స్టర్‌డామ్‌ బారులో ఇలా ఉండటానికి మధ్య కథంతా చెప్తాడు. నిదానంగా ఒక్కొక్క పొర తొలిగిపోతుంటుంది. క్లమెన్స్‌ అసలు స్వభావం, స్వరూపం బయటకొస్తుంటాయి. నవల పూర్తయ్యేసరికి కథనంతో పాటూ తత్వవేత్త కామూ అస్తిత్వం గురించీ, జీవితం అర్థం గురించీ ఆలోచించక తప్పని ప్రశ్నలు మనముందుంచుతాడు. 

♦ ఇన్‌ ఈవిల్‌ అవర్‌ 
(గాబ్రియేల్‌ గార్సియా మార్కేజ్‌)
ఈ నవలను మార్కేజ్‌ మొదటిదిగా పరిగణిస్తారు (కాకున్నా). కొలంబియా చరిత్రలో ‘ల వయొలెన్చియా’గా పేరు తెచ్చుకున్న కల్లోలిత దశకం 1950లలోని కథాకాలం. జడివానలో తెరపిలా శాంతి సమయం. అస్థిమితపరిచే ఒక తాత్కాలిక సంధికాలం. కొండలలో నది కానుకుని ఉన్న ఒక ఊరు. వానలు, వరదలు, శవాలు. ఊరిలో ప్రతీరాత్రి ఆ ఊరి ప్రజల చీకటి బ్రతుకుల గురించి చాటిస్తూ వెలువడే పోస్టర్లు. అవి కేవలం పుకార్లనే అనుకుంటారు అవి ఒక హత్యకు దారి తీసేదాకా. వెంటనే ఆ ఊరి మేయర్‌ మార్షల్‌ లా ప్రకటిస్తాడు. రాజ్యశత్రువులతోపాటు తన శత్రువులనూ మాయం చేయడం కోసం. మేయర్, బార్బర్, డెంటిస్ట్, ప్రీస్ట్‌ – నియంతృత్వం, తిరుగుబాటు, మతం నవలంతా వానముసురులా పరుచుకునుంటాయి.

♦ ద కాసిల్‌ ఆఫ్‌ క్రాస్‌డ్‌ డెస్టినీస్‌ 
(ఇటాలో కాల్వీనో)
కథాంశాల్లో, కథనరీతుల్లో కాల్వీనో చూపించిన ప్రతిభ అనితరసాధ్యం. ఒక అడవిలో ప్రమాదాలు నిండిన సుదీర్ఘ ప్రయాణం తర్వాత డస్సిపోయిన యాత్రికులు కొందరు ఒక చోట కలుసుకుంటారు. తింటూ తాగుతూ తమ తమ అనుభవాలు కథలుగా చెప్పుకోబోతారు. కాని ఆశ్చర్యంగా ఎవరికీ నోట మాట రాదు. చివరికి జోస్యం చెప్పేవారు వాడే బొమ్మల చీట్లపేక ముక్కల సహాయంతో అడవిలో తమకు ఏం జరిగిందో చెప్పడానికి ప్రయత్నిస్తారు. ఆ ముక్కల్లోని బొమ్మలు చెప్పే అర్థాలలో వారి జీవితాలన్నీ ఒకరితోవొకరివి పెనవేసుకున్నాయని తెలుస్తుంది. వారు టేబుల్‌ మీద పరుస్తున్న ఆ పేకముక్క బొమ్మల నుంచి వారి కథను నరేటర్‌ జ్యోతిష్యుడిలానే మనకు అల్లుతుంటాడు.

♦ ఏన్‌ ఇమాజినరీ లైఫ్‌ (డేవిడ్‌ మలూఫ్‌)
మహాకవి ఓవిడ్‌ రోమన్‌ మహాసామ్రాజ్యపు సాంస్కృతిక చిహ్నంగా నిలిచి పోవలసినవాడు, చివరి దశలో రోమునుంచి వెళ్ళగొట్టబడతాడు అగస్టస్‌ చక్రవర్తి చేత, ప్రపంచపు ఒక మారుమూలకు. అక్కడ ఈ మహాకవి భాష లాటిన్‌ ఎవరికీ రాదు. ఆ ప్రాంతం మొరటు, ఆ ఆటవికుల భాష మొరటు. ఓవిడ్‌ ఎవరూ లేక తనతో తనే మాట్లాడుకుంటాడు. నిదానంగా తోడేళ్ళతో పెంచబడిన ఒక పిల్లవాడితో స్నేహం పెంచుకుంటాడు. ఆ భాష నేర్చుకోడానికి కూడా ప్రయత్నిస్తాడు. లాటిన్‌లా పరిష్కరించబడినది కాని ఆ భాషలో స్వేచ్ఛకు పదం ఉండదు. ఎందుకంటే ఏదీ సర్వస్వతంత్రం కాదు కాబట్టి. అలానే విడదీయడానికి పదాలు లేవనీ, బంధాలు కలిపే పదాలు మాత్రమే ఉన్నాయనీ గ్రహిస్తాడు. మెటమార్ఫసిస్‌ రాసిన ఓవిడ్‌ మలూఫ్‌ చేతిలో తనే మెటామార్ఫోజ్‌ అవుతాడు. చివరికి ఆ పిల్లవాడి చేతుల్లోనే మరణిస్తాడు ఒక కొత్త దృక్పథంతో.

వ్యాసకర్త... -మాధవ్‌ మాచవరపు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement