పిచ్ మాంత్రికుడు మనోడే
♦ బెస్ట్ క్యూరేటర్‌గా చంద్రశేఖర్‌రావు
♦ అంతర్జాతీయ క్రికెట్లో మెతుకుసీమ ముద్ర
అతను ఇక్రిశాట్లో ఉద్యోగి.. నేల స్వభావాన్ని గుర్తించి పంటల బ్రీడింగ్‌పై రీసెర్చ్ చేయడం తన విధి.. మరో వైపు క్రికెట్లో రాణిస్తుండటంతో ఇక్రిశాట్ జట్టుకు 11 సంవత్సరాలు కెప్టెన్‌గా వ్యవహరించారు. వృత్తిరీత్యా నేల స్వభావం తెలియడం.. క్రికెట్‌పై ఆసక్తి.. వెరసి పిచ్‌ల తయారీలో రాణించాడు. అంతేకాదు బీసీసీఐ సర్టిఫైడ్ క్యూరేటర్‌గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. అతనే మెతుకుసీమ ముద్దుబిడ్డ వైఎల్ చంద్రశేఖర్‌రావు. జిన్నారానికి చెందిన ఇతను ప్రస్తుతం తల్లిదండ్రులతో హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. క్రికెట్లో గెలుపెవరిదైనా అభినందనలు మాత్రం ఇతనికే.. ఉత్తమ క్యూరేటర్ అవార్డులు సైతం ఇతని సొంతం. ప్రపంచ వ్యాప్తంగా సునిల్ గవాస్కర్, వివియన్ రిచర్డ్స్, సచిన్టెండూల్కర్ వంటి క్రికెట్ దిగ్గజాల నుంచి ప్రశంసలను అందుకున్నాడు. జిల్లాలోని నల్లరేగడి మట్టినే పిచ్‌ల తయారీకి వినియోగిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే అలాంటి పిచ్‌లనే జిల్లాలో సైతం తయారు చేస్తానంటున్నారు. - సిద్దిపేట జోన్
సిద్దిపేట జోన్: క్రికెట్.. ప్రస్తుతం ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు ఆసక్తి కల్గిస్తున్న ఈ క్రీడ లో గెలుపోటములు సహజం. అలాంటి క్రికెట్ ఆటకు పిచ్ కీలకం. జట్టు జయాపజయాలను నిర్ణయించేది, నిర్దేశించేది పిచ్ మాత్రమే. బౌలింగ్, బ్యాటింగ్‌లకు అనుగుణంగా ఉండేలా పిచ్‌లను తయారు చేయడానికి ప్రత్యేక నిపుణులుంటారు. అలాంటి పిచ్ తయారీలో దిట్టగా నిలిచి బీసీసీఐ సర్టిఫైడ్ క్యూరేటర్‌గా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన వైఎల్ చంద్రశేఖర్ రావు పిచ్ మాంత్రికుడు అని చెప్పడంలో అతిశయోక్తిలేదు. అలాంటి మాంత్రికుడు మెతుకుసీమ బిడ్డ కావడం జిల్లాకు గర్వకారణం.
జిన్నారం మండలం గడ్డిపోతారం గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ, నాగమణిల కుమారుడు వైఎల్ చంద్రశేఖర్‌రావు. చిన్నతనంలోనే తనతల్లిదండ్రులతో కలిసి హైదరాబాద్ వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. మహబూబ్ కళాశాలలో విద్యాభ్యాసం పూర్తిచేశారు. చదువు అనంతరం మెదక్ జిల్లా ఇక్రిశాట్లో వేరుశనగ బ్రీడింగ్ రిసెర్చ్ అసోసియేట్‌గా విధులను నిర్వర్తించారు. 1976లో పటాన్చెరువు ఇక్రిశాట్ జట్టుకు 11 సంవత్సరాలుగా కెప్టెన్‌గా కొనసాగారు. క్రికెట్‌పై ఆసక్తి కలిగిన చంద్రశేఖర్‌రావు 1994-95లో అండర్ 13 జట్టుగా కోచ్‌గా, మేనేజర్‌గా పనిచేశారు. తాను వృత్తిరీత్యా నేల స్వభావాన్ని తెలుసుకునే ఉద్యోగి కావడంతో పదవీ విరమణ అనంతరం పిచ్‌ల తయారీకి అనుకూలంగా ఉండే నేలలపై దృష్టిసారించారు.
ఒక దశలో పిచ్‌లను తయారుచేసేందుకు 1986లోనే తన ఉద్యోగ విరమణ చేసి పూర్తికాలం క్రికెట్‌పైనే ఆసక్తిని కనబర్చారు. 9 సంవత్సరాలు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ క్యూరేటర్‌గా పనిచేశారు. 5 సంవత్సరాల క్రితం బీసీసీఐ సర్టిఫైడ్ క్యూరేటర్‌గా పదోన్నతి పొందారు. పలు వన్డే, టెస్ట్ మ్యాచ్‌లకు పిచ్‌లను తయారు చేశారు. అదే విధంగా ఇప్పటి వరకు ఐపీఎల్‌లోని 50 మ్యాచ్‌లకు పిచ్‌లను రూపొందించారు. 46 రంజీ ట్రోఫీలకు పిచ్‌లను తయారు చేయడం కాకుండా దులిప్ట్రోఫీ, రంజీ ఫైనల్‌లకు పిచ్‌లను తయారు చేశారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, శ్రీలంక, భారత్ ఆడిన నాలుగు మ్యాచ్‌లకు పిచ్‌లను రూపొందించారు.
న్యూజిల్యాండ్‌తో జరిగిన రెండు టెస్ట్‌లు, ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్‌లకు పిచ్‌లు తయారు చేశారు. 2009, 2011.2012, 2014, 2015తో పాటు ప్రస్తుత ఐపీఎల్ మ్యాచ్‌లకు చంద్రశేఖర్‌రావు క్యూరేటర్‌గా పనిచేశారు. 2014లో ఉత్తమ క్యూరేటర్‌గా అవార్డును కూడా అందుకున్నారు. రెండు పర్యాయాలు ఉత్తమ క్యూరేటర్‌గా అవార్డులు, నగదు పురస్కారాలను అందుకున్నారు. బ్యాటింగ్, వికెట్లకు అనుగుణంగా పిచ్‌లను తయారు చేయడంలో చంద్రశేఖర్‌రావు నైపుణ్యం కలిగిన క్యూరేటర్. వీటితో పాటు 20-20, వన్డే, టెస్ట్ మ్యాచ్‌లకు ఇరు జట్లను దృష్టిలో పెట్టుకొని పిచ్‌ను తయారు చేయడం ఈయన ప్రత్యేకత. క్యూరేటర్‌గా ప్రముఖ క్రికెట్ దిగ్గజం సునీల్ గవస్కర్, వీవీఎన్ రిచర్డ్, సచిన్ టెండూల్కర్, ధోని, వీవీఎస్ లక్ష్మణ్‌లాంటి వారి అభినందనలు కూడా అందుకున్నారు. గోవా, నాందేడ్, చెన్నై లాంటి ప్రాంతాల్లో స్థానిక క్రీడకారుల కోసం పిచ్‌లను తయారు చేశారు.
జిల్లా నేలలు ఎంతో ఉపయోగం
పిచ్‌ల తయారీలో పేరుగాంచిన చంద్రశేఖర్‌రావుకు మెదక్ జిల్లా అంటే అమితమైన ప్రేమ. జిల్లాలోని నల్లరేగడి నెలలు క్రికెట్ పిచ్ తయారీకి ఎంతో ఉపయోగపడుతాయన్నారు. జిల్లాలోని నల్లరేగడి మట్టితో చెన్నైలో, గోవాలో, కొచ్చిలో పిచ్‌ల తయారీకి మెతుకుసీమ మట్టిని వినియోగించినట్లు ఆయన పేర్కొన్నారు.
ప్రోత్సహిస్తే జిల్లా వ్యాప్తంగా పిచ్‌లను తయారు చేస్తా
గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా వసతులు కల్పించాల్సిన ఆవసరముంది. తనను ప్రభుత్వం ప్రోత్సహిస్తే జిల్లాలోని అన్నిచోట్లా పిచ్‌ల తయారీకి కృషి చేస్తా. ప్రధానంగా టర్ఫ్ వికెట్ అనేది ఎంతో ముఖ్యంగా మారింది. సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్‌లాంటి ప్రాంతాల్లో పిచ్‌లు తయారు చేయాలని తనకు ఆసక్తి ఉంది. జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ కోరికమేరకు సిద్దిపేటలో ఇటీవలే టర్ఫ్ వికెట్ పిచ్‌ను తయారు చేశాను.
- చంద్రశేఖర్, పిచ్ క్యూరేటర్