ప్రతి విద్యార్థికి సెపరేటు
ఇద్దరు చిన్ననాటి మిత్రులుచాలా రోజుల తర్వాత కలుసుకున్నారు. మాటల్లో భాగంగా పిల్లల చదువుల గురించి చెప్పుకున్నారు. ఇద్దరు పిల్లలు ఒకే స్కూల్లో చదువుతున్నారని వారి మాటల్లో తెలిసింది.మా అబ్బాయి ‘అల్ఫా సెక్షన్’ అంటే, మా వాడు ‘స్టార్ బ్యాచ్’ సంవత్సరానికి లక్ష రూపాయలు చెల్లిస్తున్నా.. అని మరో మిత్రుడు గర్వంగా చెప్పాడు. ఇదీ కార్పొరేట్ పాఠశాలలుఅనుసరిస్తున్న విభజించు-చదివించు విద్యావిధానం.
విభజించు.. చదివించు
ఫీజుల ప్రాతిపాదికన విద్యార్థుల విభజన
అధిక ఫీజులు చెల్లిస్తేనే ఉత్తమ విద్య
కార్పొరేట్ విద్యాసంస్థల్లో విష సంస్కృతి
విశాఖ ఎడ్యుకేషన్ : భారతదేశంలో బ్రిటిష్ గవర్నమెంటు ‘విభజించు..పాలించు’ విధానం అమలుచేసేదని విన్నాం. ఇప్పుడు కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ప్రత్యక్షంగా చూస్తున్నాం. పాఠశాలలో, కళాశాలలో చేరే విద్యార్థులను, వారు చెల్లించే ఫీజుల ఆధారంగా రకరకాల పేర్లతో సెక్షన్స్‌గా విభజిస్తున్నారు. ఎక్కువ ఫీజులు చెల్లించే వారికి ఒకలా, తక్కువ ఫీజులు చెల్లించే వారికి ఒకలా చదువులు చెబుతున్నారు. దీనివల్ల విద్యార్థుల్లో తెలియకుండానే ఓ వివక్ష భావం మొదలవుతుంది. కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలల్లో వేల సంఖ్యలో విద్యార్థులు ఉంటే కొంత మందిని వారి మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. మిగిలినవారు పాస్ అయినా అవ్వకున్నా పెద్ద ప్రమాదం లేదని ధోరణితో వ్యవహరిస్తున్నారు. కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలల్లో విద్యార్థుల ర్యాంకులు కాకుండా ఉత్తీర్ణత శాతం చూస్తే దారుణమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. బట్టీ పట్టి ఎలాగోలా ఇంటర్ గట్టెక్కి ఇంజినీరింగో...మరే కోర్సులో చేరితే కమ్యూనికేషన్, పర్సనల్ స్కిల్స్ లేక ఇబ్బంది పడుతున్నారు.
ప్రచారం ఘనం.. ప్రమాణాలు కనం
విద్యావిధానంలో వచ్చిన మార్పులు ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకు వరంగా మారాయి. విద్యను పూర్తిగా వ్యాపారంగా మార్చేసి దోపిడీయే ధ్యేయంగా నడుస్తున్నాయి. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన విద్య అందిస్తామని చెబుతున్న ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో కనీస సదుపాయాలు కానరావడం లేదు. చీకటి గుహలను తలపించే బిల్డింగ్లు, అగ్గిపెట్టిని తలపించే తరగతి గదులే దర్శనమిస్తున్నాయి. ఎక్కడ వెదికినా ప్రయోగశాలలు, క్రీడా మైదానాలు కనిపించడం లేదు. ఫైర్ తదితర భద్రతా చర్యలు పాటించడం లేదు. అలాగే ఇక్కడ ప్రమాణాలు లేని చదువుల వల్ల విద్యార్థులు తరువాత సమస్యలు ఎదుర్కొంటున్నారు.
ఫీజుల నియంత్రణ కమిటీలు ఉండాలి
కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల్లో నీరజా కమిటీ సూచించినట్లు ఫీజుల నియంత్రణకు ప్రత్యేక కమిటీలు ఉండాలి. కార్పొరేట్ విద్యాంస్థలు అవలంబిస్తున్న విధానం వల్ల విద్యావ్యవస్థ నాశనం అవుతుంది. మూస ధోరణిలో సాగుతున్న చదువుల వల్ల నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్ లేక ఇంటర్వ్యూల్లో ఫెయిల్ అవుతున్నారు. ప్రస్తుతం నిరుద్యోగం పెరగడానికి కార్పొరేట్, ప్రైవేట్ విద్యావిధానమే కారణం.
- వాసు, ఏబీవీపీ జిల్లా కన్వీనర్
యువత ఆలోచనలు క్షీణిస్తున్నాయి..
ప్రస్తుతం కార్పొరేట్ విద్యాసంస్థలు అవలంబిస్తున్న విద్యావిధానం వల్ల యువతరం ఆలోచనలు క్షీణిస్తున్నాయి. సామాజిక అంశాలపై కనీసం అవగాహన ఉండడం లేదు. ఒకప్పుడు సామాజిక సమస్యలపై ఎక్కువగా యువతరం పోరాటం చేసేవారు. ఇప్పుడు కాలేజీలు బంద్ అంటే సినిమాలకు వెళ్లడం, లేదంటే పార్క్‌ల్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ విద్యాసంస్థల్లో ఒక్కో విద్యార్థిని ఒక్కోలా చూడడం..చేయడం ద్వారా ఎవరి వ్యక్తిగత విషయాలు వారే ఆలోచించుకుంటున్నారు. ఈ ధోరణి సమాజానికి మంచిది కాదు.
- నరవ ప్రకాశరావు, విశ్రాంత అధ్యాపకులు