National Girl Child Day 2024: ఎదగాలి.. చదవాలి!
ప్రతీ ఏడాది జనవరి 24న జాతీయ బాలిక దినోత్సవాన్ని జరుపుకుంటాం. ప్రధానంగా దేశంలో బాలికలు ఎదుర్కొంటున్న అసమానతలపై మాట్లాడటం, ఆడపిల్లల హక్కులపై అవగాహన కల్పించడం, బాలికా విద్య, ఆరోగ్యం, పోషకాహారం ప్రాముఖ్యత గురించి చర్చించడం, వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయడం లాంటి ప్రధాన లక్ష్యాలుగా జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది.
జాతీయ బాలికా దినోత్సవ చరిత్ర:
మన దేశంలో తొలిసారిగా జాతీయ బాలికా దినోత్సవాన్ని 24 జనవరి 2008న జరుపుకున్నారు. జనవరి 24, 1966న ఇందిరా గాంధీ భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీనికి చిహ్నంగానే మహిళా సాధికారత, లింగ సమానత్వాన్ని ప్రో జాతీయ బాలికా దినోత్సవాన్ని మహిళా-శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. లింగ అసమానతతో పోరాడుతున్న సమాజంలో బాలికలు ఎదుర్కొంటున్న సవాళ్లను గుర్తించడంలో ఇది కీలకమైన అడుగు. ఆ తరువాత క్షీణిస్తున్న పిల్లల లింగ నిష్పత్తి ఇమేజ్(CSR) సమస్యను పరిష్కరించడం లక్ష్యంగా 2015లో బేటీ బచావో, బేటీ పఢావో పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే.
తరతరాలుగా వేళ్లూనుకొని ఉన్న ఆడపిల్లలపై వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది. అసలు తల్లి గర్భంలో ఉండగానే ఆడపిల్లల పట్ల వివక్ష ప్రారంభ మవుతుంది. ఇందుకు నిదర్శనమే ఆడ భ్రూణహత్యలు, శిశుహత్యలు. ఆడపిల్లను భారంగా, మగబిడ్డను ఉద్ధరించేవాడిగా పరిగణించే పరిస్థితి కుటుంబం నుంచే మొదలవుతుంది. నిర్లక్ష్యం, చిన్నచూపు బాలికల అభివృద్ధికి వారి సాంస్కృతిక సాంఘిక, ఆర్థిక, సామాజిక వికాసానికి గొడ్డలి పెట్టుగా పరిణమిస్తోంది.
లింగ అసమానతతోపాటు విద్య ,ఆరోగ్య సంరక్షణ వంటి అనేక అంశాల్లో వివక్ష, బాల్య వివాహాలు బాలికల పాలిట శాపంగా మారుతోంది. తరాలు మారుతున్నా ఈ పరిస్థితి ఇంకా సమసిపోలేదు. పైగా వెర్రితలలు వేస్తోంది.
పేదరికం, బాల్య వివాహాలు ,ఇతర సామాజిక కారణాల వల్ల అసలు విద్యకే నోచుకోవడం లేదు. మరికొంతమంది చదువును మధ్యలోనే వదిలేస్తున్నారు. ఫలితంగా అది బాల్య వివాహానికి దారి తీస్తోంది. ప్రపంచంలో అత్యధిక బాల్య వివాహాలు జరుగుతున్న దేశాల జాబితాలో మనది మూడోస్థానం.
బాలికల కల
ప్రతి అమ్మాయికి, ఆమె నేపథ్యం లేదా పరిస్థితితో సంబంధం లేకుండా, ఆరోగ్యసంరక్షణ, విద్య, ఉద్యోగ రంగాల్లో సమాన అవకాశాలుండాలి.బాలికలకు సాధికారత కల్పించాలి. తద్వారా సమాజానికి ఎంతో మేలు. ఈ ఆశయంతోనే ప్రభుత్వ రంగ సంస్థలు, సామాజిక సంస్థలు జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపు కుంటారు. సురక్షితమైన వాతావరణంలో స్వేచ్ఛగా, హాయిగా ఎదిగే అవకాశాలు, ఎలాంటి హింస, వివక్ష, వేధింపులు లేని సమాజమే నేటి ఆడపిల్లల కల. ఈ కల పండే రోజు త్వరలోనే రావాలని, ఆశల రెక్కలు విప్పుకొని మన ఆడబిడ్డలు హాయిగా ఎగరాలని అందరమూ కోరుకుందాం. మహిళలకు అవకాశం ఇవ్వాలేగానీ, కుటుంబం, సమాజం, సంస్థల్ని చివరికి దేశాలను కూడా విజయవంతంగా నడిపిస్తారనడంలో ఎలాంటి సందేహంలేదు. ఆడపిల్లలను పుట్టనిద్దాం, బతుకనిద్దాం, ఎదగనిద్దాం..చదవనిద్దాం!! ఇదే ప్రతి పౌరుడి నినాదం కావాలి.కుటుంబం, సమాజం, సంస్థల్ని దేశాలను కూడా విజయవంతంగా నడిపిస్తారనడంలో ఎలాంటి సందేహంలేదు.
మన జీవితాలకు అర్థం..పరమార్థం..శాంతి.. శ్రేయస్సుతోపాటు ఎనలేని ప్రేమను అందించే బంగారు తల్లులు మన ఆడబిడ్డలు.