Betting Business
-
22 బెట్టింగ్‌యాప్‌లు, వెబ్సైట్లను నిషేధిస్తూ కేంద్రం ఆదేశాలు
భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నవంబర్ 5న ‘మహదేవ్ బుక్’తో సహా 22 బెట్టింగ్ యాప్‌లు, వెబ్సైట్లను నిషేధిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. రానున్న ఛత్తీస్‌గఢ్ ఎన్నికల నేపథ్యంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం కొంత వివాదానికి దారితీసింది. చట్టవిరుద్ధమైన బెట్టింగ్ యాప్‌ల సిండికేట్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇటీవల దాడులు నిర్వహించింది. ఛత్తీస్‌గఢ్‌లోని ‘మహదేవ్ బుక్’యాప్‌తో పాటు ఇతర బెట్టింగ్‌యాప్‌లు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలిపింది. పీఎంఎల్ఏ చట్టం ప్రకారం మనీలాండరింగ్ ఆరోపణపై మహదేవ్ యాప్ యజమానులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పింది. ఈ యాప్ ప్రమోటర్ల ద్వారా ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌కు రూ.508 కోట్లు అందినట్లు తమకు సమాచారం ఉందని ఈడీ పేర్కొంది. అయితే బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లను అణిచివేయడంలో బఘేల్ నేతృత్వంలోని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం విఫలమైందని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. సెక్షన్ 69A ఐటీ చట్టం ప్రకారం వెబ్సైట్/ యాప్‌ను మూసివేయమని సిఫార్సు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. అయితే గత కొద్దికాలంగా ఈడీ దర్యాప్తు చేస్తున్నా బఘేల్ ప్రభుత్వం అలా చేయలేదని తప్పుపట్టారు. మరోవైపు యాప్‌ను నిషేధించాలన్న అభ్యర్థన వచ్చిన వెంటనే కేంద్రం చర్యలు తీసుకుందని మంత్రి వివరించారు. -
బెట్టింగ్ గేమ్‌లపై నిషేధం
న్యూఢిల్లీ: ఆన్లైన్ గేమింగ్ రంగ నియంత్రణకు సంబంధించి కేంద్రం గురువారం నిబంధనలను ప్రకటించింది. సిసలైన డబ్బులు పెట్టి ఆడేవి, బెట్టింగ్ చేసే గేమ్‌లను నిషేధించింది. అలాగే, ఆన్లైన్ గేమింగ్ రంగం స్వీయ నియంత్రణ విధానాన్ని పాటించాలని సూచించింది. ఈ దిశగా దేశీయంగా ఉపయోగించే గేమ్‌లను ఆమోదించేందుకు తొలుత మూడు స్వీయ నియంత్రణ సంస్థలను (ఎస్ఆర్వో) నోటిఫై చేయనుంది. 2021 ఐటీ చట్టాలకు సవరణగా ఈ నిబంధనలను చేర్చారు. సిసలైన డబ్బుతో పందేలు కాయనివి, వినియోగదారులకు హాని కలిగించే కంటెంట్ ఏదీ ఉండనివి, పిల్లలకు వ్యసనంగా మారని గేమ్స్‌కు అనుమతి ఉంటుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. ‘ఆన్లైన్ గేమింగ్ వృద్ధికి భారత్‌లో అపార అవకాశాలు ఉన్నాయి. అది గణనీయంగా విస్తరించేందుకు ఈ నిబంధనలు తోడ్పడగలవు‘ అని మంత్రి చెప్పారు. కొత్త నిబంధనలు నవకల్పనలకు ఊతమివ్వగలవని, ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంపొందించగలదని పరిశ్రమ వర్గాలు స్వాగతించాయి. గ్యాంబ్లింగ్ ప్లాట్‌ఫాంలను ఏరివేసి, అంతర్జాతీయంగా పరిశ్రమ పోటీపడేలా ప్రోత్సహించగలవని అభిప్రాయపడ్డాయి. నిబంధనల్లో మరిన్ని ముఖ్య అంశాలు.. ► ఆన్లైన్ గేమ్స్‌ను నియంత్రించే ఎస్ఆర్వోల్లో పరిశ్రమ ప్రతినిధులు, గేమర్లు, ఇతరత్రా సంబంధిత వర్గాలు ఉంటాయి. నిబంధనల ప్రకారం ఎస్ఆర్వోల్లో ఒక విద్యావేత్త, సైకాలజీ నిపుణులు, బాలల హక్కుల పరిరక్షణ కోసం పనిచేస్తున్న వ్యక్తి లేదా అధికారి ఉండాలి. నిబంధనలకు అనుగుణంగా నడుచుకోకపోతే ఎస్ఆర్వోలను డీనోటిఫై చేస్తారు. ► గేమింగ్ వ్యసనంగా మారకుండా, ఆర్థికంగా నష్టపోకుండా, మోసాల బారిన పడకుండా యూజర్లను కాపాడేందుకు తగు వ్యవస్థను ఎస్ఆర్వోలు రూపొందించాలి. ఒక గేమింగ్ సెషన్లో సముచిత సమయం దాటితే పదే పదే హెచ్చరిక మెసేజీలు కూడా పంపించే విధంగా అది ఉండాలి. -
వెనక్కి తగ్గిన షకీబ్.. బెట్విన్నర్ న్యూస్‌తో ఒప్పందం రద్దు!
ఢాకా: బంగ్లాదేశ్ టాప్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్‌కు వివాదాలు కొత్త కాదు. తాజాగా ఒక స్పాన్సర్షిప్ ఒప్పందానికి సంబంధించి షకీబ్ చర్య వివాదంగా మారింది. అయితే చివరి నిమిషంలో షకీబ్ దానిని సరిదిద్దుకోవడంతో అతను వేటు తప్పించుకున్నాడు. పది రోజుల క్రితం ‘బెట్విన్నర్ న్యూస్’తో తాను ఒప్పందం చేసుకున్న విషయాన్ని షకీబ్ ఇన్‌స్టగ్రామ్ ద్వారా ప్రకటించాడు. అయితే బెట్విన్నర్ అనేది బెట్టింగ్‌కు సంబంధించిన సంస్థ కావడంతో అతను ఒప్పందం చేసుకోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. నిబంధనల ప్రకారం ఏ బంగ్లా క్రికెటర్ అయినా బెట్టింగ్ సంస్థతో ఒప్పందాలు చేసుకోరాదు. దాంతో షకీబ్‌పై చర్య తీసుకునేందుకు బీసీబీ సిద్ధమైంది. చివరి హెచ్చరికగా గురువారంలోగా దానిని రద్దు చేసుకోకపోతే బోర్డు కాంట్రాక్ట్ రద్దు చేయడంతో పాటు నిషేధం విధిస్తామని హెచ్చరించింది. దాంతో షకీబ్ వెనక్కి తగ్గాడు. తన ఒప్పందాన్నివదిలేస్తున్నట్లు ప్రకటించాడు. చదవండి: AFG vs IRE: ఆఫ్ఘనిస్తాన్‌కు మరో షాకిచ్చిన ఐర్లాండ్.. వరుసగా రెండో విజయం! -
బెట్టింగ్, గ్యాబ్లింగ్ యాడ్స్‌పై కేంద్రం కన్నెర్ర
Online Betting Ads: మీడియా సంస్థలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. మీడియా ఫ్లాట్ ఫామ్‌లలో బెట్టింగ్ తరహా యాడ్స్ ను ప్రసారం చేయడం నిలిపివేయాలని యూనియన్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ మినిస్టీ వార్నింగ్ ఇచ్చింది. మనదేశంలో బెట్టింగ్, గ్యాబ్లింగ్‌లు చట్టరిత్యా నేరం. అయితే వాటిని ప్రోత్సహించడం వల్ల యువత తప్పుదారి పట్టడమే కాకుండా, సామాజిక ఆర్థిక ప్రమాదాలు తలెత్తే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని కేంద్ర ఐ అండ్ మినిస్ట్రీ అడ్వైజరీ తెలిపింది. అందుకే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా అండ్ ఆన్లైన్ మీడియా సంస్థలు సంబధిత యాడ్స్‌ను ప్రసారం చేయకూడదని స్పష్టం చేసింది. అంతేకాదు థర్డ్ పార్టీ ఆన్లైన్ అడ్వటైజ్మెంట్ సంస్థలు, పబ్లిషర్లు బెట్టింగ్, గ్యాబ్లింగ్ యాడ్స్‌తో ఇండియన్ యూజర్లను టార్గెట్ చేయడం నిలిపివేయాలని విడుదల చేసిన రిపోర్ట్‌లో తెలిపింది. 2025 నాటికి మార్కెట్ ఎంతంటే! ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్,ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫ్యాంటసీ స్పోర్ట్స్ (ఎఫ్ఐఎఫ్ఎస్) ప్రకారం..38శాతం వార్షిక వృద్ధితో 2025నాటికి ఈ ఫ్యాంటసీ స్పోర్ట్స్ మార్కెట్ విలువ రూ.1.5లక్షల కోట్లుగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. కేంద్రం తాజా నిర్ణయం త్వరలో పూర్తి స్థాయిలో అమలు కానుంది. దీంతో 4.5 బిలియన్ డాలర్ల మార్కెట్‌ను శాసిస్తున్న ఆన్లైన్ బెట్టింగ్‌ను ప్రమోట్ చేసే ఫ్యాంటసీ స్పోర్ట్స్ కంపెనీలకు భారీ నష్టం చేకూరనున్నట్లు మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
అంతటా బెట్టింగుల హోరు !
సాక్షి, గురజాల : మరో నాలుగు రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో అభ్యర్థుల గెలుపోటములపై బెట్టింగుల హోరు జోరుగా నడుస్తున్నాయి. రూ.కోట్లలో బెట్టింగ్‌లు పెట్టారని సమాచారం. గత నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ఫలితాలు వెలవడనున్నాయి. 2014 ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగింది. పెరిగిన ఓటింగ్ శాతం ఎవరికి లబ్ధిచేకూరుతుందోనని అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. ఎక్కడ విన్నా ఎన్నికల్లో నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారన్న చర్చే జరుగుతుంది. పోలింగ్ తర్వాత సుమారుగా నెల రోజులు పాటు స్తబ్ధత రాజ్యమేలింది. ఈ నెల 23వ తేదీన కౌంటింగ్ ప్రక్రియకు సమయం దగ్గర పడటంతో ఇటు రాజకీయ పక్షాలు, అటు ప్రజల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. గత ఐదేళ్ల పాలనతో ప్రజలు విసుగెత్తిపోయారని ప్రతి ఒక్కరు మార్పు కోరుకుంటున్నారని అన్ని సామాజిక వర్గాలు వైఎస్సార్ సీపీకి మొగ్గు చూపి ఓట్లు వేశారని తప్పనిసరిగా అధికారంలోకి వస్తామనే ధీమా వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తల్లో కనిపిస్తుంది. పలువురు రాజకీయ విశ్లేషకులు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. చేతులు మారిన రూ.కోట్ల నగదు పోలింగ్ పూర్తయిన తరువాత నియోజకవర్గంలో ఒక్కసారిగా బెట్టింగ్ బాబులు బరిలోకి దిగారు. వైఎస్సార్ సీపీ గెలుపు ఖాయమని కొందరు, టీడీపీ అధికారం ఖాయమని కొందరు ఈ విధంగా బెట్టింగ్‌లు కాస్తున్నారు. నియోజకవర్గంలో కోట్లాది రూపాయలు బెట్టింగ్‌లు కాసినట్లు తెలిసింది. ప్రస్తుతం కౌంటింగ్ తేదీ సమీపించడంతో బెట్టింగ్ పెట్టిన వారిలో ఆందోళన మొదలైంది. ప్రజలు ఏ విధంగా తీర్పునిస్తారో అని అలోచనలో ఉన్నారు. ఓటింగ్ జరిగిన మూడు రోజుల నుంచి వైఎస్సార్ సీపీ గెలుస్తుందని అధికంగా బెట్టింగ్‌లు వచ్చిన ఆ సమయంలో టీడీపీ నుండి బెట్టింగ్ పెట్టెందుకు ఎవరూ ముందుకు రాకపోవడంపై పలువురు విశ్లేషకులు తప్పనిసరిగా వైఎస్సార్ సీపీ గెలుపు ఖాయమని చెబుతున్నారు. పల్లెల్లో వేడెక్కిన రాజకీయం... సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డ నాటి నుంచి నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎండలు ముదరకముందే పోలింగ్ జరగ్గా ఓట్ల్ల లెక్కింపునకు సమయం ఎక్కువగా ఉండటంతో ఎండలు మండిపోతున్నా, రాజకీయ వాతావరణం కాస్త చల్లబడిందనే చెప్పాలి. లెక్కింపు గడువు సమీపిస్తుండటంతో మళ్లీ కొద్ది రోజుల నుంచి వాతావరణం వేడెక్కింది. ఎన్నికల ఫలితాలు ఏ విధంగా రాబోతున్నాయోనని గ్రామస్థాయి నాయకుల నుంచి కార్యకర్తల వరకు చర్చించుకుంటున్నారు. ఏ గ్రామంలో ఏ వర్గం ఓటర్లు ఏ పార్టీవైపు మొగ్గు చూపారో అన్న అంశాలపై రచ్చబండల వద్ద రోజూ చర్చకు వస్తుండటంతో పల్లెలో వాతావరణం వేడెక్కింది. ప్రజల తీర్పు ఎటు ఉందో తెలుసుకోవాలంటే మరో నాలుగు రోజులు వేచి చూడక తప్పదు. -
కాయ్‌రాజా కాయ్..!
మ్యాచ్ ప్రారంభమైతే చాలు ఆటగాళ్లు.. చూసే ప్రేక్షకుల కంటే హార్ట్బిట్ ఎక్కువగా పెరిగే మరో వర్గం ఉంది. భరించలేని టెన్షన్‌తో నరాలు తెగిపోయే ఉత్కంఠతో మద్యం, సిగరెట్లు తాగుతూ క్షణ క్షణం ఉత్కంఠంగా భరించలేని టెన్షన్లో కొనసాగుతున్న ఐపీఎల్ బెట్టింగ్ జోరుగా సాగుతోంది. చట్టం ఎంత పకడ్బందీగా ఉన్నా బెట్టింగ్ రాయుళ్లలో మార్పు కనిపించడం లేదు. బ్రోకర్ల మాయజాలంలో రాత్రికి రాత్రే లక్షల రూపాయలు ఆన్లైన్లో చేతులు మారుతున్నాయి. పలు జీవితాలు తలకిందులవుతున్నాయి. యాదాద్రిభువనగిరి జిల్లాలో బెట్టింగ్ ముఠాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. సాక్షి, యాదాద్రి : ఐపీఎల్–12 క్రికెట్ కోట్లు కురిపిస్తున్న వ్యాపార క్రీడా ఇప్పుడు యువత జేబుకు చిల్లుపెడుతోంది. క్రీడాభిమానులు కావాల్సినంత వినోదాన్ని పంచుతున్న ట్వంటీ, ట్వంటీ క్రికెట్ అంతే స్థాయిలో బెట్టింగ్ రాయుళ్ల జీవితాల్లో చీకట్లను నింపుతోంది. బెట్టింగ్ నేరమని చట్టపరమైన చర్యలు తీసుకుంటారని తెలిసినా యువత అటు వైపు పరుగులు తీస్తోంది. టాస్ వేయడానికి ముందు నుంచి ప్రారంభమయ్యే వరకు బెట్టింగ్ రాయుళ్లు సెల్ఫోన్లకు అంకితం అవుతున్నారు. ఆన్లైన్, మొబైల్ బ్యాంకింగ్ అందుబాటులోకి రావడంతో డబ్బు చాలా ఈజీగా చేతులు మారుతోంది. రూ.500 నుంచి లక్ష వరకు పందెంకాస్తున్నారు. ఒక్క భువనగిరి పట్టణంలో ప్రతి రోజు రూ.20 లక్షల వరకు బెట్టింగ్ జరుగుతుందంటే జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.30లక్షల నుంచి రూ.40లక్షల వరకు బెట్టింగ్ జరుగుతోందని అంచనా. బెట్టింగ్ డబ్బుల కోసం ఇల్లు, ఒంటిమీద ఉన్న బంగారు ఆభరణాలు, బైక్‌లు ఇలా అదీ ఇది అని కాకుండా అన్నింటినీ వాడుకుంటున్నారు. అయితే బెట్టింగ్‌లో లక్షల రూపాయలు ఆర్థికంగా నష్టపోతున్నారు. మ్యాచ్ ప్రారంభ కావడానికి ముందు ఆండ్రాయిడ్ ఫోన్లో భువనగిరిలోనే ఉన్న 10మందికిపైగా బ్రోకర్ల ద్వారా ఈ దందా సాగుతోంది. ఈబెట్టింగ్ మ్యాచ్ పూర్తి అయ్యే వరకు సాగుతోంది. గత సంవత్సరం భువనగిరిలో ఎస్ఓటీ పోలీసులు బెట్టింగ్ రాయుళ్లను పట్టుకున్నారు. అయితే పట్టణాల నుంచి పల్లెల వరకు బెట్టింగ్ వ్యసనం యువతతోపాటు అన్ని వయస్సుల అక్షరాస్యులు. నిరక్ష్యరాస్యులను పట్టి పీడిస్తోంది. బెట్టింగ్‌లే బెట్టింగ్‌లు ట్వంటీ ట్వంటీ క్రికెట్ జరుగుతున్న తరుణంలో జిల్లాలో బెట్టింగ్ జోరుగా పెరిగిపోతోంది. బెట్టింగ్‌పై పోలీస్ నిఘా పెట్టినప్పటికి యువత బెట్టింగ్ మత్తులో మునిగి తేలుతున్నారు. విద్యార్థులు ఈ బెట్టింగ్‌లో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. జిల్లా కేంద్రమైన భువనగిరి, యాదగిరిగుట్ట, ఆలేరు, బీబీనగర్, పోచంపల్లి, చౌటుప్పల్ అన్ని మండలాల్లో బెట్టింగ్ దందా కొనసాగుతోంది. ఐపీఎల్ లీగ్ టోర్నమెంట్ మధ్యలోకి చేరుకోవడంతో బెట్టింగ్‌లు మరింత తారాస్థాయికి చేరుకున్నాయి. అయితే ట్వంటీ ట్వంటి మ్యాచ్‌కు సంబంధించి టాస్‌తోనే బెట్టింగ్ దందా ప్రారంభం అవుతోంది. ఫెవరేట్ జట్టుకు నాన్ఫెవరేట్ జట్ల పేరుతో బెట్టింగ్‌కు దిగుతున్నారు. బెంగళూరు రాయల్ చాలెంజర్ జట్టు ఫెవరేట్‌గా బెట్టింగ్ కట్టి లక్షలాది రూపాయలు నష్టపోయారని సమాచారం. వరుసగా ఐదు మ్యాచ్‌లు ఓడిన చాలెంజర్స్ ఆరోమ్యాచ్లో ఢిల్లీపై అలవోకగా గెలుస్తారని ఫెవరేట్ జట్టుగా పెద్ద ఎత్తున బెట్టింగ్ కట్టారు. విరాట్ కోహ్లీ, డివిలియర్స్‌పై నమ్మకంతో బెట్టింగ్ రాయుళ్లు లక్షల్లో పెట్టుబడి పెట్టి ఆరో మ్యాచ్ కూడా ఓడిపోవడంతో భారీగా నష్టపోయారు. అయితే మ్యాచ్ జరుగుతున్నంత సమయంలో రన్లు సింగిల్, డబుల్, ఫోర్, సిక్స్, రనౌట్, స్టంపింగ్ ఇలా అన్ని కోణాల్లో బెట్టింగ్‌కు పాల్పడుతున్నారు. మ్యాచ్ జరుగుతున్నంత సేపు బెట్టింగ్ తారా స్థాయికి చేరి బెట్టింగ్ రాయుళ్లు ఎంత మొత్తంలోనైనా బెట్టింగ్‌లో పెట్టడానికి వెనుకాడటం లేదు. ఇప్పటికే భువనగిరి, యాదగిరిగుట్టల్లో పలువురు బెట్టింగ్‌లో లక్షలు నష్టపోయారు. బెట్టింగ్ కోసం ఆండ్రాయిడ్ ఫోన్లు వాడుతున్నారు. ఇంటర్నెట్ బ్రౌజింగ్ తెలిస్తే చాలు ఆన్లైన్లో బ్యాంకు లావాదేవీలను నిర్వహిస్తూ బెట్టింగ్ పాల్పడుతున్నారు. బెట్టింగ్‌లో బుకీలు తెలివిగా వారికి సంబంధం లేకుండా మరో వ్యక్తుల అకౌంట్లలోకి డబ్బులను ట్రాన్స్ఫర్ చేస్తూ బెట్టింగ్‌లో పాల్గొంటున్నారు. డబ్బు ట్రాన్స్ఫర్ చేయడానికి ఫోన్‌పే, తేజ్, పేటీఎం యాప్‌లను వాడుతున్నారు. ఈమ్యాచ్లకు బెట్టింగ్‌లో జమ చేసిన డబ్బులు మరుసటి రోజు తీసుకుంటారు. యాప్‌ల ద్వారా సులభంగా డబ్బులను బదిలీ చేస్తున్నారు. ఫెవరేట్–నాన్ ఫెవరేట్ పేరుతో రెండు జట్లపై బెట్టింగ్‌కు రూ.500 నుంచి లక్ష రూపాయల వరకు బెట్టింగ్‌కు పాల్పడుతున్నారు. ఇరు జట్ల కెప్టెన్లు టాస్ వేయడానికి వచ్చినప్పటి నుంచి బెట్టింగ్ ప్రారంభం అవుతోంది. బాల్ బాల్‌కు, ఓవర్ ఓవర్ నుంచి లాస్ట్ బాల్ వరకు బెట్టింగ్ నిరంతరాయంగా సాగుతుంది. ఫెవరేట్ జట్టు గెలిస్తే తక్కువ మొత్తం, నాన్ ఫెవరేట్ జట్టు గెలిస్తే ఎక్కువ మొత్తం డబ్బు చేతికందుతుంది. 1:2, 1:4, 1:6 వరకు బెట్టింగ్ చేస్తున్నారు. ఒక్క పరుగు, రెండుపరుగులు, నాలుగు పరుగులు, ఆరుపరుగులు ఇలా పరుగు పరుగుకు బెట్టింగ్ నడుస్తోంది. బిట్త్రీ సిక్స్టీఫై, డ్రీమ్లెవెన్ ఆన్లైన్ బెట్టింగ్ జరిగే వెబ్సైట్లు ఉన్నాయి. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండలాల్లో బెట్టింగ్ దందా విశృంఖలంగా తన పడగ విప్పి బుసలుకొడుతోంది. బెట్టింగ్‌తోపాటు పందేలు కాస్తూ తీవ్రంగా నష్టపోతున్నారు. స్థానిక బెట్టింగ్‌లతోపాటు ముంబయి, హైదరాబాద్ కేంద్రంగా బెట్టింగ్ జోరందుకుంది. ఇంజనీరింగ్ ఇతర ఉన్నత విద్యాసంస్థల్లో కొందరు విద్యార్థుల బెట్టింగ్ కోసం తమ వాహనాలను, బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు, ఇలా ఏది అందుబాటులో ఉంటే అది తాకట్టు పెట్టి బెట్టింగ్ కడుతున్నారు. -
తెలంగాణ ఎన్నికలపై బెట్టింగ్ రాయుళ్లు
నర్సంపేట నియోజకవర్గంలోని దుగ్గొండి మండలంలో మిత్ర బృందంతో ఓ వాట్సప్ గ్రూప్ ఉంది. అందులో ఇటీవల వర్తమాన రాజకీయాలపై జోరుగా చర్చ సాగుతోంది. ప్రస్తుత ఎన్నికల్లో గెలిచే అభ్యర్థుల గెలుపోటములపై జరిగిన చర్చ ఇటీవల తీవ్ర స్థాయికి చేరింది. ఫలానా పార్టీ అభ్యర్థి గెలుస్తాడంటే.. కాదు వేరే పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తాడని మిత్రుల మధ్య మెస్సేజ్ వార్ నడిచింది. చివరికి అది పందెం కాసే వరకు వెళ్లింది. ఇలాంటి ఘటనలు జిల్లాలోని ప్రతి గ్రామంలో అనేకం చోటుచేసు కుంటున్నాయి. నర్సంపేట: ఎన్నికల వేళ ఏ వాట్సప్ గ్రూప్ చూసినా.. ఏ పట్టణం చూసినా ఎవరు గెలుస్తారు.. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనేదే ప్రధాన చర్చ. మా పార్టీ నాయకుడు గెలుస్తాడంటే మా వాడే గెలుస్తాడని మరొకరు చర్చించుకోవడం పరిపాటిగా మారింది. కాని ఇప్పుడు ఈ చర్చ బెట్టింగ్‌ల స్థాయికి చేరుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా అభ్యర్థుల గెలుపుఓటములపై పందేలు జోరుగా సాగుతున్నాయి. గెలుపోటములతోపాటు మెజారిటీ ఫిగర్స్ మీద చర్చ సాగుతోంది. వరంగల్ రూరల్ జిల్లాలో కొందరు కార్యకర్తలు తమ పార్టీ నాయకుడి కోసం ప్రచారం చేసుకుంటూనే.. మరోవైపు ఎన్నికలను జూదంగా మారుస్తున్నారు. కొందరు వీటిని సరదాగా కాస్తే, మరికొందరు డబ్బే ధ్యేయంగా పందేలు కాస్తున్నారు. పార్టీపై ఉన్న మోజుతో మరికొందరు బెట్టింగ్ చేస్తున్నారు. దీంతో అంతిమంగా వారందరూ ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి నెలకొంది. క్రికెట్‌తో మొదలైన బెట్టింగ్ ఇప్పుడు అన్ని రంగాల్లోకి చాపకింద నీరులా విస్తరిస్తోంది. పందేలు ఇలా.. సాధారణంగా క్రికెట్లో ఎవరు టాస్ గెలుస్తారు నుంచి ఏ బాల్‌కు సిక్స్, ఫోర్ కొడుతారులాంటి పలు అంశాలపై బెట్టింగ్ కాస్తారు. ఎన్నికల సమయంలో అనేక రకాలైన అంశాలపై రూ.వేల నుంచి లక్షల్లో బెట్టింగ్ పెడుతున్నారు. అసెంబ్లీ రద్దు చేయకముందు కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేస్తాడా..? లేదా..? అన్న అంశం నుంచి మొదలుకొని, సిట్టింగ్‌లకు సీట్లపై, తర్వాత మహాకూటమిలో ఎన్ని పార్టీలు ఉంటాయి? ఏ నాయకుడికి టికెట్ వస్తుంది? రెబల్స్‌గా ఎవరు నామినేషన్లు వేస్తారు? నామినేషన్లు ఉపసంహరణ 19 వరకు ఉండడంతో అప్పటి వరకు ఉపసంహరించుకోకుండా బరిలో ఎవరు నిలుస్తారనే అంశాలపై పందేలు కాస్తున్నారు. తమ నియోజకవర్గంలో ఫలానా నాయకుడే గెలుస్తాడు. ఇంత మెజారిటీ వస్తుంది, రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే వాటిపై కాయ్ రాజా కాయ్ అంటూ పందేలు కాయడం గమనార్హం. నర్సంపేట, పరకాల నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థులే కాకుండా రాష్ట్రంలోని నాయకులు, పార్టీలు, వారి గెలుపోటములపై బెట్టింగ్‌లు కాయడం విశేషం. ముఖ్యంగా నర్సంపేట, పరకాల పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో కొంచెం పలుకుబడి ఉన్న ద్వితీయశ్రేణి నాయకులు, రాజకీయాలంటే ఎంతో ఆసక్తి చూపే ఉన్నత వర్గాలు, వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎక్కువగా వీటిపై ఆసక్తి చూపుతున్నారు. వీటిని పసిగట్టిన కొంతమంది బెట్టింగ్‌రాయుళ్లు రాజకీయాల మీద ఆసక్తి ఉన్నవారిని గమనించి వారిని బెట్టింగ్ ఊబిలోకి దించుతున్నారు. లక్షల్లో బెట్టింగ్.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎన్నికల సందడి కనిపిస్తోంది. వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఉదయం నుంచి పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని, సాయంత్రం విందుల్లో తేలుతున్నారు. ఆ సమయంలో రాజకీయాల గురించి చర్చించుకుంటూ బెట్టింగ్‌లు కాస్తున్నారు. కొందరు రూ. లక్షల్లో పందెం కాస్తే, మరికొందరు ఫలితం తెలిసిన తర్వాత ఓడిపోయిన వారు పార్టీ ఇవ్వాలనే షరతులు పెట్టుకుంటున్నారు. కొందరైతే మాట మీద నమ్మకం లేక బాండ్ పేపర్ల మీద అగ్రిమెంట్లు రాసుకుంటున్నారు. పోలీసులు, ఇతర ప్రభుత్వ యంత్రాంగం ఎన్నికల పనుల్లో బిజీగా ఉండడంతో వీటివైపు పోలీసులు దృష్టి సారించలేకపోతున్నారు. ఇదే అదనుగా బెట్టింగ్ రాయుళ్లు విజృంభిస్తున్నారు. బెట్టింగ్‌లపై కఠిన చర్యలు.. ఎన్నికలకు సంబంధించి బెట్టింగ్‌ల విషయం మా దృష్టికి రాలేదు. బెట్టింగ్‌లకు పాల్పడడం చట్టరీత్యా నేరమే. ఏదైనా వాట్సప్ గ్రూప్‌లో, లేదంటే ఇతర సోషల్ మీడియాలో బెట్టింగ్‌లకు పాల్పడినా, మరెవరైనా ఈ పందేలను నిర్వహించినా సమాచారం ఉన్నవారు పోలీసుల దృష్టికి తీసుకురావాలి. నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటాం. –సునీతామోహన్, ఏసీపీ, నర్సంపేట -
రేస్‌క్లబ్ సర్కారు నియంత్రణలోకి!
సాక్షి, హైదరాబాద్: కొందరు వ్యక్తుల ప్రైవేటు సామ్రాజ్యంగా మారిన హైదరాబాద్ రేస్ క్లబ్‌పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. బుకీల సహకారంతో ఏటా రూ. వందల కోట్ల వ్యాపారం చేస్తూ నామమాత్రంగా పన్ను చెల్లిస్తున్న రేస్‌క్లబ్‌ను తన నియంత్రణలోకి తీసుకోవాలని నిర్ణయించింది. రేస్‌క్లబ్ నిర్వాహకులు చేస్తున్న బెట్టింగ్ వ్యాపారాన్ని క్రమబద్ధీకరించేందుకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా ‘హైదరాబాద్ రేస్‌కోర్స్ అండ్ బెట్టింగ్ యాక్ట్- 1939’లోని లొసుగులను సరిదిద్ది.. ప్రభుత్వ ప్రత్యక్ష పర్యవేక్షణలో గుర్రపు పందాలు సాగేందుకు మార్గాలను అన్వేషిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం ఆర్థిక, హోం శాఖల కార్యదర్శులు, వాణిజ్యపన్నుల శాఖ డిప్యూటీ కార్యదర్శి, ఎన్ఫోర్స్మెంట్ అదనపు కమిషనర్లతో కూడిన ఓ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. హైదరాబాద్ రేస్క్లబ్తో పాటు ఇతర ప్రాంతాల్లో సాగుతున్న బెట్టింగ్‌ల తీరుతెన్నెలు, ముంబై, బెంగళూరు, పుణె, చెన్నైలోని రేస్కోర్సుల్లో ఉన్న పన్ను విధానాలను అధ్యయనం చేయనుంది. అలాగే ఆన్లైన్ బెట్టింగ్‌కు సంబంధించి కంప్యూటరైజేషన్ అవకాశాలపై కూడా ఈ కమిటీ వారంలోగా నివేదిక ఇవ్వనుంది. అనంతరం రేస్‌క్లబ్‌పై ప్రభుత్వ నియంత్రణ పెరిగే చర్యలను అధికారికంగా చేపట్టనున్నట్లు ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. బు‘కీ’లే కీలకం: ఏటా 300 రోజుల పాటు హైదరాబాద్ రేస్‌క్లబ్ ఆధ్వర్యంలో గుర్రపు పందాలు సాగుతాయి. మలక్‌పేట రేస్‌క్లబ్‌లో జరిగే పందాలతో పాటు బెంగళూరు, చెన్నై, ముంబై, మైసూర్, ఢిల్లీ, ఊటీ, కోల్‌కతా, పుణెల్లో జరిగే పందాలకు కూడా ఇంటర్వ్యూనర్ బెట్టింగ్ నిర్వహిస్తారు. హైదరాబాద్ రేస్‌క్లబ్ ద్వారా అధికారికంగా టికెట్లతో కూడిన బెట్టింగ్ జరుగుతుంది. అదే సమయంలో రేస్క్లబ్కు సమాంతరంగా 23 మంది బుకీలతో బెట్టింగ్ అసాధారణ రీతిలో సాగుతుంది. లెసైన్సుడ్ బుకీలుగా ఉన్న వీరి ద్వారా నల్లధనం చలామణి అవుతుంది. ఎలాంటి టికెట్లు లేకుండా కాగితం మీద రాసే అంకెల ఆధారంగా ఈ బెట్టింగ్ సాగుతుంది. రూ. 5వేలు బెట్టింగ్ కాసే వారికి రూ.500 అని రాసిన కాగితం ఇచ్చి వ్యాపారం నిర్వహిస్తారు. రోజు రూ.3 కోట్ల వరకు వ్యాపారం జరుగుతుంది. బెట్టింగ్ ద్వారా నిర్వాహకులు 12%పన్ను కింద వాణిజ్యపన్నుల శాఖకు నెలకు రూ. 5 కోట్ల వరకు చెల్లిస్తోంటే, 23 మంది బుకీలు సంవత్సరానికి రూ 5. కోట్ల వరకు చెల్లిస్తుండటం గమనార్హం. రేస్‌క్లబ్ అధికారికంగా చేసే వ్యాపారం కంప్యూటర్ బిల్లింగ్‌లో ఉండగా, బుకీల నల్ల వ్యాపారం మొత్తం చిత్తు కాగితాలపై సాగుతుంది. రెండు నెలల క్రితం అధికారులు రేస్‌క్లబ్‌పై దాడులు నిర్వహించగా, ఆరుగురు బుకీలురూ. 50 లక్షలు బెట్టింగ్ ద్వారా సమకూర్చుకొని రూ. 7 లక్షలకు అధికారికంగా లెక్కలు చూపించారు. ఈ నేపథ్యంలో బుకీలతో రేస్‌క్లబ్ పాలకమండలి కుమ్మక్కై బెట్టింగ్ దందా సాగిస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది.